బాలకాండ
మందరమకరందం
సర్గ-69
దశరథుడిని
కుశల ప్రశ్నలు వేసిన జనకుడు
వనం
జ్వాలా నరసింహారావు
ఉదయం కాగానే దశరథుడు, రాజసభలో, బంధువులు మౌనులు
కొలుస్తుండగా మంత్రి సుమంత్రుడిని పిలుస్తాడు. రాజబొక్కసాన్ని పర్యవేక్షించే
అధికారులు విశేష ధనాన్ని తీసుకొని తక్షణమే మిథిలకు బయలుదేరాలనీ, వారివెంట చతురంగ బలాలు కూడా ప్రయాణమవ్వాలని, తక్షణం పల్లకిని కూడా సిద్ధంచేయాలనీ, వాసుదేవుడు-వశిష్ఠుడు-జాబాలి-కాశ్యపుడు-దీర్ఘాయువైన
మార్కండేయుడు-కాత్యాయనుడు ముందుగా వెళ్లాలి కనుక వారికొక ప్రత్యేకమైన రథాన్ని
ఏర్పాటుచేయాలనీ, సుమంత్రుడితో అంటూ
దశరథుడు అందరినీ ప్రయాణానికి త్వరపెట్టాడు. ఇలా రాజేంద్రుడైన దశరథుడు, మునిరాజులగుంపు తనను కొలుస్తూ-తన వెంట వస్తుంటే, సేనా సమూహాలతో కూడిన
ఇంద్రుడివలె, మిక్కిలి సంతోషంగా ఐదవ
రోజు పగటిపూటకల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు, మిక్కిలి సంతుష్టిగల మనస్సుతో దశరథుడి వద్ద కొచ్చి, ముసలి రాజును పూజించి ఇలా అంటాడు:
"రాజసత్తమా, నీకు స్వాగతం. నా భాగ్యం ఫలించినందునే నా పట్టణానికి వచ్చావు. నీ
కొడుకుల శౌర్యంవల్ల కలిగిన సంతోషాన్ని మనసార అనుభవించు. దశరథరాజ చంద్రా, నా అదృష్టంవల్ల నిన్ను ఈ రోజు దర్శించుకొనే పుణ్యం కలిగింది. నా
భాగ్యంవల్ల బ్రాహ్మణులతో కలిసి వచ్చిన వశిశ్ఠుడిని చూడగలిగాను. నా పుణ్య
పరిపాకంవల్ల విఘ్న సమూహాలన్నీ నాశనమై పోయాయి. నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన
మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది. నీ దయవల్ల నా కోరికలన్నీ
నెరవేరుతున్నాయి. రేపు ప్రాతః కాలం యజ్ఞం అయింతర్వాత, శాస్త్ర సమ్మతమైన రీతిలో, పరమర్షులకి ఇష్టమైన
విధంగా పరిణయం చేయండి". సమాధానంగా సంతోషంతో దశరథుడు ఇలా చెప్పాడు:
"దానం దాత వశమని
పూర్వం పెద్దలంటుంటే విన్నాను. దాతవు నీవే. నువ్వెలా చెపుతే అలాగే ప్రవర్తిస్తాను.
నీకు నేను కొత్తవాడినికాదుకదా?". దశరథుడు గొప్ప రాజైనందున, ఎంత రాజసంగా మాట్లాడుతాడోనని తలచిన జనకుడు, వినయంగా ఆయనిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. దశరథుడి వెంట వచ్చిన
ముని సమూహమంతా అక్కడే సుఖంగా వున్నారు. దశరథుడు తన కొడుకులను చూసి, సంతోషంగా వారితో ముచ్చటలాడుకుంటూ గడిపాడు. జనకుడు యజ్ఞం పూర్తిచేసి
కూతురిని పెళ్లికూతురుగా తయారుచేశాడు.
No comments:
Post a Comment