బాలకాండ
మందరమకరందం
సర్గ-75
పరశురాముడిని శాంతించమని ప్రార్థించిన దశరథుడు
వనం
జ్వాలా నరసింహారావు
"రామా, దశరథ రామా! అద్భుతమైన నీ గొప్పబలాన్ని గురించి విన్నాను. నువ్వు
శివుడి ధనుస్సును విరచడం గురించి కూడా లోకులందరు చెప్పుకుంటుంటే విన్నాను. శివుడి
విల్లు విరచడం ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత గొప్పదని చెప్పలేందది. ఇదివిన్న నేను, ఆ విల్లుకంటే గొప్పదైన మరోదాన్ని, నీ బలం పరీక్షించేందుకు తీసుకొచ్చాను. ఇదిగో-ఇదే పరశురాముడి విల్లు.
దీన్ని చూస్తుంటేనే గుండెలు ఝల్లుమంటాయి. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి, భయపడకుండా, నీబలమెంతో-వీర్యమెంతో
చూపించు. ఈ విల్లు నువ్వు ఎక్కుబెట్టితే, నీ పరాక్రమం ఎంతో చూసి, నీతో ద్వంద్వ యుద్ధంచేస్తాను" అని శ్రీరాముడితో అంటాడు
పరశురాముడు.
పరశురాముడి మాటలు
విన్న దశరథుడు, వెలవెలబోయిన ముఖంతో-దీనంగా, కాళ్లల్లో వణుకుపుట్తుంటే, మాటలు తడబడుతుంటే పరశురాముడిని ప్రార్థించాడీవిధంగా: "అయ్యా, మహాత్మా. నువ్వు జాతిబ్రాహ్మణుడివి. రాచజాతిమీద కోపం మాని శాంతించావు. అస్త్రం పట్టనని ఇంద్రుడికి మాటిచ్చావు. ఇప్పుడిలా అనడం న్యాయమేనా? ఈ నా కొడుకులు బాలులు. ఇంకా ఆటలాడడంలోనే ఆసక్తిగలవారు. ఏదో
పిల్లతనంతో శివుడి విల్లు విరిచాడు. నువ్వా తప్పును క్షమించు. భృగువంశంలో పుట్టి, వేదాధ్యయన వ్రతంబూని, శీలంగలిగిన నీలాంటివారు శాంతం వహించాలి గాని కోపబడవచ్చా? భూమంతా కశ్యప మహర్షికి ధర్మ మార్గంలో దానం చేసి, ఈ దేశంలోనే వుండకుండా, మహేంద్ర పర్వతాన్ని నివాసంగా చేసుకొని వుంటున్న నీవు కోపించవచ్చా? ఓ మునీశ్వరా, నా గొప్ప పురుషార్థాలన్నీ
నాశనం చేయడానికి వచ్చావా? రామచంద్రుడిని ఒక్కడిని
చంపితే, మేమందరం అతడితో
పోవాల్సినవాళ్లమే". ఇలా అంటున్న దశరథుడి మాటలు వినిపించుకోకుండా-పెడచెవిన
పెట్టిన పరశురాముడు, శ్రీరామచంద్రమూర్తికి
ధనుస్సుల వృత్తాంతాన్ని చెప్పసాగాడు.
శైవ
వైష్ణవ ధనుస్సుల వృత్తాంతం
"నీవు విరిచిన
విల్లు, ఇప్పుడు నాచేతిలో వున్న
విల్లు-రెండు కూడా- మిక్కిలి బలిష్ఠమైనవి. దేవతలు చెప్పి చేయించినవి. మిగుల
శ్రేష్ఠమైనవి. మిక్కిలి దృఢమైనవి. గొప్ప ప్రయత్నంతో విశ్వకర్మ వీటిని తయారుచేశాడు.
అందులో ఒకదాన్ని, త్రిపుర సంహార సమయంలో
శివుడికి దేవతలిచ్చారు. నువ్వు విరిచింది దాన్నే. ఇది రెండోది. దీన్ని దేవతలు
విష్ణువుకిచ్చారు. ఇదీ మిక్కిలి బలిష్ఠమైనదే. బలంలో శైవచాపంతో సమానమైంది. ఇలా
కొంతకాలం జరిగింతర్వాత దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయి, శివకేశవులలో ఎవరు బలవంతులని ప్రశ్నించారు. వారి అభిప్రాయం
తెలుసుకున్న బ్రహ్మ, క్రియా రూపంలో వారి
సందేహం తీరుస్తానని చెప్పి, శివుడికి, విష్ణువుకు విరోధం కలిగించాడు. శివుడు దగ్గరకు పోయి, త్రిపురాలను నాశనం చేసిందెవరని అడిగాడు బ్రహ్మ. తానేనని జవాబిచ్చిన
శివుడితో, చేతగాని ప్రగల్భాలు
పలకొద్దని, విష్ణువు బాణమై పోయినందున
కదా త్రిపురాలను కాల్చిందని అంటాడు. ఆయన చేసిందేమీ లేదని-త్రిపురాలను కాల్చి బూడిద
చేసింది తానేనని-శివుడు నిమిత్తమాత్రుడేనని విష్ణువంటున్నాడని రెచ్చగొట్టాడు
శివుడిని బ్రహ్మ. కార్యం చేసేవాడిని కర్తని చెప్పాలా?-లేక-సాధనాన్ని చెప్పాలా? అని అడిగిన శివుడు, విష్ణువుకు ఆ శక్తి వుంటే
తనకు బాణంగా ఎందుకు నిలిచాడు? అని, శివుడు ఎదురు ప్రశ్న వేశాడు బ్రహ్మను. శివుడన్న మాటలను విష్ణువుకు
చెప్పి, పరస్పర ద్వేషం కలిగించి, ఇరువురినీ యుద్ధానికి సిద్ధంచేశాడు బ్రహ్మ. ఒకరిపై మరొకరు కోపించి, వారిద్దరూ భయంకరమైన యుద్ధంచేశారు. ఆ యుద్ధంలో శివుడికి నువ్వు
విరిచిన వింటిని, విష్ణువుకు నాదగ్గరున్న
వింటిని ఇచ్చారు దేవతలు. ఆయుధాలలో తేడాలుంటే, ఇరువురి బలాబలాలు నిర్ణయించడం సాధ్యంకాదని, సరిసమానమైన ధనుస్సులను ఇచ్చారిద్దరికి. ఇద్దరూ జయించాలనే
యుద్ధంచేశారు. యుద్ధంలో విష్ణువు హుంకరించగానే, ఆగాలి దెబ్బకు, శివిడివిల్లు
పెట్లిపోయింది. ముక్కంటి-మహా దేవుడైన శివుడు పౌరుషం చెడి స్తబ్దుడయ్యాడు. ఇదంతా
చూస్తున్న దేవతలు-మునులు-చారణులు, వృథా కలహం మాని, హరిహరులిద్దరు యుద్ధం ఆపు చేయమని ప్రార్థించారు. వారుకూడా
శాంతించారు. విష్ణువు బల వేగంతో శివుడి విల్లు పెట్లిపోవడం చూసిన దేవతలు-మునులు, విష్ణువే శివుడికంటే బలవంతుడని తమ మనస్సులో అనుకున్నారు".
"దేవతల అభిప్రాయాన్ని గ్రహించిన రుద్రుడు, ధనుస్సుపై కోపంతో, బాణాలతో సహా దాన్ని
దేవరాతుడికిచ్చాడు. విష్ణువు ధరించిన వింటిని ఆయన, భృగువంశభవుడైన ఋచీకుడికిచ్చాడు. ఋచీకుడు తన కొడుకైన జమదగ్నికి
ఇచ్చాడు. ఆ జమదగ్ని నా తండ్రి. జమదగ్ని శస్త్ర సన్యాసం తీసుకొని తపస్సు
చేస్తున్నప్పుడు, గర్విష్ఠుడైన
కార్త్యవీర్యార్జునుడు, నీచ బుద్ధితో, నా తండ్రిని చంపాడు. దారుణమైన పితృమరణవార్త విన్న నేను క్రూరుడనై, రాజులను పలుమార్లు వధించాను. రాజులందరినీ చంపి, యజ్ఞం చేసి, యజ్ఞాంతంలో భూమినంతా
కశ్యపుడికి దానం చేసి, మహేంద్ర పర్వతం నా
నివాసంగా చేసుకొని, తపస్సు చేసుకుంటూ సుఖంగా
దేవతా సంఘసేవితుడనై వున్నాను. నువ్వు, నీ మహాబలంతో, శివుడి విల్లు విరిచావని
విని పరుగెత్తుకుంటూ వచ్చాను. ఆ వైష్ణవ చాపం ఇదే. నువ్వు క్షత్రియ వంశంలో
పుట్టినవాడివైతే, నీ తండ్రి-తాతల క్షాత్రం
స్మరించి, ఈ విల్లు ఎక్కుపెట్టి నీ
భుజబలం చూపించు. నువ్వు విల్లెక్కుబెట్టి, బాణం సంధించగలిగితే, నీతో ద్వంద్వ యుద్ధం
నేనొక్కడినే చేస్తాను. త్వరగా కానివ్వు" అని పరశురాముడన్న మాటలకు శ్రీరాముడు
కోపించాడు.
No comments:
Post a Comment