Tuesday, March 1, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-65 : ఘోర తపస్సు చేసిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-65
ఘోర తపస్సు చేసిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

          "ఉత్తర దిక్కు వదిలి తూర్పు దిశగా పోయిన విశ్వామిత్రుడు, మాటలు చాలించి, వెయ్యేళ్లు విశేష నియమంతో తపస్సు చేశాడు. ఎన్ని విఘ్నాలొచ్చినా-ఎవరు కలిపించ తలపెట్టినా కోపం తెచ్చుకోలేదు. విజృంభించిన విశ్వామిత్రుడు, తన సంకల్పం ప్రకారం, వేయి సంవత్సరాలు పరిపూర్ణంగా తపస్సు చేసిన పిదప, భోజనం చేద్దామని విస్తరిముందు కూర్చున్నాడు ఒకరోజు. ఆయనింకా భోజనం చేయడం మొదలుపెట్టక ముందే, బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడు, తాను ఆకలితో వున్న బ్రాహ్మణుడనని, ప్రాణంపోతున్నదని, అన్నం పెట్టమని అడిగాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా, ఎంతమాత్రం కోపం తెచ్చుకోకుండా, తాను తిందామనుకున్న అన్నమంతా బ్రాహ్మణుడి వేషంలో వున్న ఇంద్రుడికి పెట్టాడు.

తదనంతరం, శుష్క ఉపవాసంతో నేలపై నిలబడి, శ్వాస విడవకుండా మరో వెయ్యేళ్లు, మునుపటివలెనే ఘోరమైన తపస్సుచేశాడు.అప్పడాయన శిరస్సునుండి భయంకరమైన పొగ వచ్చి లోకాలను గందరగోళంలో పడేసింది. దేవతలు, గంధర్వులు, అసురులు, పన్నగులు, వారిసంబందులు కలవరపడి బ్రహ్మ వద్దకు పోయారు. విశ్వామిత్రుడి మూలాన జగత్తుకు కీడు కలగకుండా కాపాడమని, ఆయన్లో కామ క్రోధాలున్నాయేమోనని ఎన్ని విధాల పరీక్షించినా అవి మచ్చుకు కూడా కనిపించలేదని, ఆయన మనస్సు ఎంతో నిర్మలంగా మెరుగుపెట్టిన బంగారంలా వుందని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా-ఆయన తపస్సుతో లోకాలన్నీ ధ్వంసంకాక ముందే అతడి కోరిక నెరవేర్చమని బ్రహ్మను ప్రార్తించారు వారంతా. లోకమంతా కీడును శంకించి హాహాకారాలు చేస్తున్నదని, దిక్కులన్నీ వ్యాకులపడి తపిస్తున్నాయని, సముద్రం కాగి పొంగుతున్నదని, కొండలు కరిగిపోతున్నాయని, భూమి వణుకుతున్నదని, పెనుగాలి జగత్తునంతా పీడిస్తున్నదని, లోకులందరూ నాస్తికుల మాదిరిగా ఉపాసనం చేయడం మానుకున్నారని, సూర్యకాంతి చెడిపోయిందని, జగాలన్నీ ఎంతో కష్టపడుతున్నాయని అంటూ, వీటన్నిటికీ విశ్వామిత్రుడు ఉపవాసంతో తపస్సు చేయడమే కారణమని వివరిస్తారు. విశ్వామిత్రుడి తపస్సువలన పుట్టిన వేడి, ప్రళయకాలంలో పుట్టిన అగ్నిలాగా లోకాలన్నిటినీ అడ్డం లేకుండా కాల్చివేస్తున్నదని, వెంటనే ఆయనకు ఇంద్రుడి పదవినైనా ఇచ్చి లోకాలను కాపాడమని వేడుకుంటారు. ఇలా ప్రార్థించిన వారందరినీ తన వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గర కొచ్చిన బ్రహ్మ, అతడి తపస్సు ఫలించిందని చెప్పి, అతడికి బ్రాహ్మణత్వం లభించిందంటాడు. తపస్సు చాలించి లెమ్మంటాడు".

విశ్వామిత్రుడికి బ్రహ్మర్షిత్వాన్ని ఇచ్చిన బ్రహ్మ

          "తనకు దీర్ఘాయువునిచ్చానని, అనేకమైన మేలు తనకు జరుగుతుందని, తనను తపస్సునుంచి లేచి యథా సుఖాన్ని పొందమని చెప్పిన బ్రహ్మతో విశ్వామిత్రుడు తన కోరిక వివరించాడు. తనకు బ్రాహ్మణత్వం లభిస్తే, వాళ్ల లాగే తనకూ ఓంకారం-వేదాధ్యయన అధ్యాపనాధికారం-యాచనాధికారం కలగాలని అడుగుతాడు. తనకు మరో కోరికుందంటాడు విశ్వామిత్రుడు. బ్రాహ్మణుల వేదాలు, క్షత్రియుల వేదాలు అందరికంటే మొదలు తెలిసిన వశిష్ఠుడు వచ్చి, తనకు బ్రాహ్మణ్యం లభించిందని అంగీకరించాలని, అంతవరకు తాను బ్రాహ్మణుడనేనన్న నమ్మకం తనకు కలగదని అంటాడు. ఆయన కోరిక మేరకు దేవతలు వశిష్ఠుడి వద్దకు పోయి, అది నెరవేర్చమని ఆయన్ను ప్రార్థించారు. ఆ మహా తపస్వి వచ్చి, విశ్వామిత్రుడితో స్నేహం చేసి, అతడు బ్రహ్మర్షి అయ్యాడని చెప్పాడు. విశ్వామిత్రుడు నిజమైన బ్రహ్మర్షి అయ్యాడని, బ్రాహ్మణులకు అధికారమున్న కార్యాలన్నీ ఆయనా చేయవచ్చని-ఆ అధికారం ఆయనకు లభించిందని దేవతలు చెప్పి వెళ్లిపోయారు. విశ్వామిత్రుడు కూడా వశిషిష్ఠుడితో స్నేహం చేశాడు".


          ఇలా బ్రహ్మతో సమానుడైన విశ్వామిత్రుడు బ్రాహ్మణ్యాన్ని సంపాదించాడని, సంపాదించిన బ్రాహ్మణ్యంతో- ఆ బలంతో, తన ఇష్టమొచ్చిన రీతిలో ప్రపంచమంతా తిరుగుతున్నాడని శ్రీరాముడికి చెప్పిన శతానందుడు, ఆయన గురువైన విశ్వామిత్రుడంతటి గొప్పవాడు ఎవరూ లేరంటాడు. ఆ ముని శ్రేష్ఠుడు చేసిన తపస్సు, ఆయనకు ధర్మమందున్న ఆసక్తి, ఆయన చరిత్రమంతా చెప్పి శతానందుడు మౌనం దాల్చాడు. శ్రీరామ లక్ష్మణులతో శతానందుడు చెప్పిన దంతా విన్న జనక మహారాజు, చేతులు జోడించి, విశ్వామిత్రుడితో, ఆయన రాజకుమారులతో తన దేశానికి రావడంవల్ల తన జన్మ ధన్యమైందని-పావనమైందని అంటూ, ఆయన తపోమహిమ-గుణాలు ఎంతవిన్నా తృప్తి తీరదని చెప్పాడు. సూర్యుడు పశ్చిమానికి చేరుకుంటున్నాడని, సంధ్యావందనాది కర్మలకు సమయమైందని, తనకు శలవిస్తే వెళ్లి మర్నాడు ఉదయం వచ్చి కలుస్తానని చెప్పి, విశ్వామిత్రుడికి ప్రదక్షిణ చేసి వెళ్లిపోయాడు జనకుడు. విశ్వామిత్రుడు కూడా, శ్రీరామ లక్ష్మణులతో, మునీశ్వరులతో తాను దిగిన ప్రదేశానికి సంతోషంగా పోయాడు.

          (విశ్వామిత్రుడి తపస్సువలన, సర్వం అనర్థకమైన కోపాన్ని జయించినవాడికే తపస్సిద్ధి కలుగుతుందనీ, బ్రాహ్మణ్యానికి కామ-క్రోధాలను జయించడం ఆవశ్యమని అర్థమవుతున్నది. కామ క్రోధాలు రెండూ, రజోగుణం వల్ల కలుగుతాయి. వీటికెంత ఆహారమైనా సరిపోదు. ఇవి మహా పాపాలు-శత్రువులు. తపస్సిద్ధికి జితేంద్రియత్వం అవశ్యం. ఏం తిన్నా, తాకినా, చూసినా, విన్నా సంతోషంగాని-అసంతుష్టిగాని పడడో వాడే జితేంద్రియుడు. కామ క్రోధాలను విశ్వామిత్రుడు జయిస్తే దశరథుడిపై కోపం ఎందుకొచ్చిందని సందేహం కలగొచ్చు. ఆయన మునుపటి విశ్వామిత్రుడయివుంటే వాస్తవానికి శపించాలి. అలా చేయలేదు. ఆ కోపం ఆయన కార్యసాధనకు తెచ్చుకున్న కోపంకాని, ఇంతకుముందు లాగా మనస్సులో కాపురముంటున్న కోపం కాదు.


          విశ్వామిత్రుడు తొలుత రాజు. గృహస్థుడు. భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. అడవిలో దొరికే పళ్లుమాత్రమే తిని తపస్సు చేసి, తర్వాత, ఋషి అయ్యాడు. అప్పటిదాకా భార్యా పిల్లలు ఆయన వెంటే వున్నారు. తర్వాత ఒంటరిగా వుండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు. మహర్షులంతా జితేంద్రియులు కారు. కాబట్టి, జితేంద్రియుడు కావడానికి, పంచాగ్నుల మధ్య నిలిచి-ఆహారం మాని-వాయువే ఆహారంగా తపస్సు చేశాడు. ఇంతచేసినా కామాన్ని జయించగలిగాడుగాని, కోపాన్ని జయించలేకపోయాడు. అదికూడా జయించేందుకు, మౌనంగా-కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు. జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు. విశ్వామిత్రుడికి వచ్చిందంటే దానికొక ప్రత్యేకమైన కారణముందనే అనాలి. ఎవరికైనా-ఎంత చేసినా కామ క్రోధాలు అనివార్యం. వాటిని తనకు వశపడేటట్లు చేసుకున్నవాడే బ్రాహ్మణోత్తముడు. అందుకే బ్రాహ్మణ్యం సులభమైంది కాదు).

No comments:

Post a Comment