Thursday, March 10, 2016

కంటోన్మెంట్ భూములపై కొత్త వెలుగు : వనం జ్వాలా నరసింహారావు

కంటోన్మెంట్ భూములపై కొత్త వెలుగు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-03-2016)

            సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో వున్న గఫ్ రోడ్ నుండి రాకపోకలు నిలుపుదల చేయాలని ఏవోసీ అధికారులు నిర్ణయం తీసుకున్నప్పుడు, దాని వల్ల అక్కడ నివసిస్తున్న సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతారని, ఆ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేంద్ర రక్షణ మంత్రికి లేఖ రాశారు. నిర్ణయం తాత్కాలికంగా నిలుపుదల చేసినా సమస్య అంతే వుందింకా. అలానే, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు, ముఖ్యంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన సచివాలయానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బైసన్ పోలో గ్రౌండ్స్ అనువుగా ఉంటుందని భావించి కేంద్రంతో పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ప్రత్యామ్నాయంగా గోల్కొండ ఖిల్లా వద్ద తగినంత స్థలం కేటాయిస్తామని కూడా చెప్పింది. అయితే రక్షణశాఖ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. వాస్తవానికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన సమయంలో అప్పటి అవసరార్థం కంటోన్మెంట్ ఏర్పాటైంది. ఇపుడు ఈ కంటోన్మెంట్ అవసరం కూడా లేదన్న చర్చ ఉంది. ఒకవేళ దేశ రక్షణ రంగానికి భాగ్యనగరం ఒక వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తే దాన్ని మరో శివారు ప్రాంతానికి తరలించవచ్చనే వాదనలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో, అక్టోబర్ 10, 1926 , సికిందరాబాద్ కంటోన్మెంట్ భూములకు సంబంధించిన పలు అంశాలను, హైదరాబాద్ మాజీ రెసిడెంట్ సిర్ విలియం బార్టన్, లండన్ లోని ఇండియా ఆఫీస్ లైబ్రరీలో నమోదు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. బహుశా ఈ వ్యవహారంతో అంతో-ఇంతో సంబంధం వున్నవారికి ఇవన్నీ ఆసక్తికరంగా వుండవచ్చేమో! ఈ వివరాల వల్ల ఒక విషయం చాలా స్పష్టంగా బయట పడింది....భారత ప్రభుత్వం, ఏనాడు కూడా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాని, పూర్వపు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం నుంచి కాని, ఏ రకమైన భూమిని సికిందరాబాద్ కంటోన్మెంట్ స్థాపించడానికి, కొనుగోలు చేయడం కాని, మరే రూపంలోనైనా స్వంతం చేసుకోవడం కాని అసలే జరగ లేదనేది దాని సారాంశం. దీనర్థం...సికిందరాబాద్ లోని సైనిక అవసరాలకుపయోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల భూములు, సరైన యాజమాన్య హక్కులు లేకుండా, వారి అధీనంలో వున్నాయని. నిజాం నుంచి సహితం, ఏ విధమైన యాజమాన్య హక్కులను, అలనాటి బ్రిటీష్ ప్రభుత్వానికి బదలాయించలేదని కూడా, బార్టన్ నివేదిక స్పష్టం చేసింది. ఈ వివరాలన్నీ అంతర్ జాలంలో చాలా స్పష్టంగా లభ్యమవుతాయి.  

సంపూర్ణ హక్కులతో చెందిన భూమి అనేదేదీ సికిందరాబాద్ లో భారత ప్రభుత్వానికి లేనే లేదు. మిలిటరీ తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఉపయోగ పడేందుకు, అప్పట్లో నెలకొన్న భౌగోళిక హద్దుల ఆధారంగా రూపొందించిన బాహ్య సరిహద్దుల పరిధిలోకి వచ్చే, సరిపడిన భూమిని నిజాం ప్రభుత్వం ఇచ్చింది. మిలిటరీ అధీనంలో వున్న బారక్స్, పరేడ్ గ్రౌండ్స్ కూడా, తాత్కాలిక అవసరాలకు బ్రిటీష్ ప్రభుత్వానికి నిజాం ఇచ్చినప్పటికీ, ఆ అవసరాలు తీరిన మరు క్షణమే నిజాం స్వాధీనంలోకి వస్తాయని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. భూమికి చెందిన హక్కు అధికారిక పత్రం నిజాం పేరు మీదే వుండిపోతుంది.


1806 వ సంవత్సరంలో రూపు దిద్దుకున్న సికిందరాబాద్ లో, బ్రిటీష్ కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు, హుస్సేన్ సాగర్ కు ఉత్తర దిక్కున తాత్కాలిక ప్రాతిపదికపై నిజం నవాబు కొంత భూమిని కేటాయించారు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధంలో రెండవ నిజాం ఆసఫ్ ఝా ఓటమి పాలైన దరిమిలా, ఇరు పక్షాల మధ్య 1798 లో కుదిరిన సబ్సిడియరీ ఒప్పందానికి అనుగుణంగా బ్రిటీష్ కంటోన్మెంట్ స్థాపన జరిగింది. క్రమేపీ, రెజిమెంటల్ బజార్, జనరల్ బజార్ లాంటి మార్కెట్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాష్ట్రపతి నిలయంగా పిలువబడుతున్న రెసిడెన్సీ హౌజ్ నిర్మాణం 1860 లో జరిగింది. భారత దేశంలోనే అత్యంత పెద్దదైన కంటోన్మెంట్ గా ప్రసిద్ధికెక్కిన సికిందరాబాద్ స్థావరంలో భారీ సంఖ్యలో సైనిక, వాయు సేనకు చెందిన సిబ్బంది వుంటుంది. సికిందరాబాద్ పరిసరాల్లో వున్న ప్రాంతమంతా వివిధ పాలకుల చేతుల్లోకి మారుతూ పోయి, 18 వ శతాబ్దంలో, నిజాంకు చెందిన హైదరాబాద్ లో అంతర్భాగమైంది.

భారత దేశం నలుమూలలా, సామ్రాజ్యవాద అధికారం సుదీర్ఘంగా మనుగడ సాగించిందనడానికి బలీయమైన గుర్తులుగా, బ్రిటీష్ కంటోన్మెంట్ స్థావరాలు రూపొందాయని, ప్రముఖ రచయిత నరేంద్ర లూథర్ తన గ్రంథం "లష్కర్" (అంటే ఆర్మీ కాంప్) లో పేర్కొన్నారు. అసలా మాట కొస్తే, కంటోన్మెంటులను నెలకొల్పిన స్థలాలన్నీ ఒక రకమైన మినీ కోట బురుజుల్లాగా, బ్రిటీష్ అధికారులు దేశంలోని స్థానికులకు దూరంగా, దాదాపు సాంఘిక వేర్పాటు ధోరణిలో వుంటూ వచ్చాయి. సికిందరాబాద్ కంటోన్మెంట్ కూడా ఆ కోవకు చెందినదే. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా వారి ధోరణిలో, ఆలోచనా విధానంలో మార్పు రాలేదు. అదే వైఖరి కొనసాగింది. కాల క్రమేణ, ఒకప్పుడు కేవలం ఒక కాంపుగానే వుండే ఆ ప్రాంతం, విస్తరించుకుంటూ పోయి, ఒక భారీ స్థాయి కంటోన్మెంటుగా రూపాంతరం చెంది, దక్షిణాదిలో బ్రిటీష్ సైనికుల నివాస-కార్యాలయ వసతిగా మారిపోయింది. అధికారులకోసం నిర్మించిన ఇళ్లు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటైన "ద రిట్రీట్" అనే ఓ పెద్ద అధికారిక నివాసంలో, కొన్నాళ్లు మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్ స్టన్ చర్చిల్, 1896 లో, అక్కడ సెకండ్ లెఫ్టినెంటుగా పని చేస్తున్న రోజుల్లో నివసించాడట. ఇప్పటికీ చెక్కు చెదరకుండా వున్న ఆ ఇంట్లో ఒక కల్నల్ స్థాయి అధికారి వుంటున్నట్లు సమాచారం.

1945 లో ఏర్పాటైన సికిందరాబాద్ మునిసిపాలిటీ, హైదరాబాద్ మునిసిపాలిటీలో కలిపి, 1960 లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను నెలకొల్పింది నాటి ప్రభుత్వం. ప్రస్తుతం సికిందరాబాద్ కూడా హైదరాబాద్ జిల్లాలో అంతర్భాగం. దరిమిలా 2007 లో ఏర్పాటైన హైదరాబాద్ మహా నగర మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచెంసీ) సికిందరాబాద్ ప్రాంత పాలనను కూడా నిర్వహిస్తుంది. ఇదే కాకుండా, స్వతంత్రం వచ్చిన తరువాత, సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, భారత సైన్య అధికార పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం సికిందరాబాద్, హైదరాబాద్ లలో వున్న సైనిక స్థావరాలు, ఇళ్లు సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పాలనా పరిధిలోకి వస్తాయి. ఇక్కడున్న మౌలిక సదుపాయాల యాజమాన్యం, పౌర పరిపాలన కూడా కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో వున్న ఈ బోర్డే నిర్వహిస్తుంది.

1768 లో కుదిరిన ఒప్పందం దరిమిలా, బ్రిటీష్ ప్రభుత్వం, రెండు బెటాలియన్ల (పటాలాలు) సిపాయులను నిజాంకు సమకూర్చడానికి అంగీకరించింది. ఆ తరువాత హైదరాబాద్ లో ఒక రెసిడెంటును నియమించింది. బెటాలియన్ల సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ ఎనిమిదికి చేసింది. 1806 కల్లా, పటాలాల స్థానంలో దళాలను (ట్రూప్స్) ఏర్పాటుచేయడానికి నిశ్చయించింది. 1903 లో బొలారం కంటోన్మెంటును రద్దు చేసి, సికిందరాబాద్ లో విలీనం చేసింది. బొలారం కంటోన్మెంట్ అధీనంలో వున్న భూమిని కూడా కొనుగోలు చేయకుండా ఉచితంగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. నిజాం నుంచి ఆ భూముల చట్టబద్ధ హక్కులను మిలిటరీ అధికారులకు ధారాదత్తం చేస్తూ ఎలాంటి పత్రం రాసుకోలేదు. 1806 నుంచి మొదలు పెట్టి, వివిధ సందర్భాలలో, మిలిటరీ అధికారుల అవసరాల కోసం, చాలా మొత్తంలో భూమిని నిజాం వారికి అవసరార్థం ఇవ్వడం జరిగింది. బ్రిటీష్-భారత ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వం భూమి హక్కులను మాత్రం బదలాయించ లేదనే విషయాన్ని బార్టన్ నివేదిక స్పష్టం చేసింది. అలాగే, పదమూడు మొఘలాయీ గ్రామాలైన చిన్న తోకట్ట, పెద్ద తోకట్ట, సీతారాంపూర్, బోయినపల్లి, బాలంరాయ్, కాకాగూడ, సిక్ విలేజ్, ఆల్వాల్, మారేడ్ పల్లి, రసూల్ పూర, బూసారెడ్డి గూడ, బొలారం, ట్రిమల్ ఘిరి, లాలాపేట్ కూడా మిలిటరీకి చెందినవి కావంటాడాయన. నిజాం నుంచి ఎప్పుడు కూడా భూ బదలాయింపు చట్టబద్ధంగా జరగలేదు.

వాస్తవానికి తాత్కాలిక ప్రాతిపదికపై నిజాం ప్రభుత్వం నుంచి, రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాల నేపధ్యంలో, ఒక ఆరు నెలల కాలం పాటు అవసరమని చెప్పి, బ్రిటీష్ సైన్యం కొరకు ఈ భూములను తీసుకోవడం జరిగింది. ఇదిలా వుండగా, 21, జూన్ 1968 న జరిగిన సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సమావేశంలో భూములకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఆ సమావేశానికి రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పాటు, సికిందరాబాద్ సబ్ ఏరియా అధికారులు కూడా హాజరై దాంట్లో చేసిన తీర్మానంపై సంతకాలు కూడా చేశారు. డిఫెన్స్ అధికారులేనాడూ సికిందరాబాద్ కంటోన్మెంట్ భూములపై హక్కు కలిగి వుండ లేదనీ, తాత్కాలికంగా వారికిచ్చిన భూములన్నీ వారి అవసరాలు తీరిన తరువాత, డిసెంబర్ 1, 1945 న నిజాం ప్రభుత్వానికి అప్ప చెప్పారని, ఆ తీర్మానం సారాంశం. ఆ తీర్మానంలోనే మరో ప్రధానమైన అంశం కూడా పేర్కొనడం జరిగింది. సికిందరాబాద్ కంటోన్మెంటుకు, దేశంలోని ఇతర కంటోన్మెంటులకు చాలా భేదం వుందని, సికిందరాబాద్ కంటోన్మెంటుకు బ్రిటీష్ చట్టాలు వర్తించవని, అవి నిజాం ప్రభుత్వ చట్టాలు, జాగీరు చట్టాలకు లోబడి వుంటాయని తీర్మానంలో వుంది. ఆ క్రమంలోనే కంటోన్మెంటులో భాగమైన సికిందరాబాద్ పట్టణం నిజాం ప్రభుత్వ ఆధీనంలోకి తేవడం జరిగింది.


హైదరాబాద్ నిజాం సార్వభౌమాధికార తీరుతెన్నులను ఉటంకిస్తూ, అమీరున్నిస్సా బేగం-మహబూబ్ బేగంల కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారత యూనియన్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కాక పూర్వం, భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి పూర్వ రంగంలో, హైదరాబాద్ నిజాంకున్న అధికారాలకు హద్దుల్లేవంది. నిజాం నవాబ్, చట్ట సభలకు, న్యాయ స్థానాలకు, కార్య నిర్వహణకు సర్వోత్తమ అధికారి. ఆయనపై రాజ్యాంగపరమైన పరిమితులు లేవు. తనకున్న అధికారాలను వాడుకోవడంలో ఆయనకు తిరుగు లేదు. ఆయన ఫర్మానాలంటే నిజాం సార్వభౌమాధికార వ్యక్తీకరణ అనాల్సిందే. ఆదే చట్టం...అదే న్యాయం...ఆ ఫర్మానాలకు విరుద్ధంగా వున్న చట్టాలన్నీ వీటి ముందు దిగదుడుపే. ఒక సారి ఒక ఫర్మానా జారీ అయిందంటే, అది అమల్లో వున్నంతవరకు, దానికి సంబంధించిన వారందరూ దానికి లోబడి వ్యవహరించాల్సిందే. ఆ ఫర్మానా సవరించేంత వరకు అదే చట్టం...దానిని మించింది ఏదీ లేదు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనం అయిన తరువాత, మిలిటరీ అవసరాలకు నిజాం నవాబు ఇచ్చి, ఆ అవసరాలు తీరిన తరువాత తన ప్రభుత్వ పరం చేసుకున్న భూములన్నీ, రాష్ట్ర ప్రభుత్వ హక్కు భుక్తంలోకి, పరిపూర్ణంగా వచ్చినట్లే. సికిందరాబాద్ - హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో వున్న భూములన్నీ, ఆ విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానివే. ఆ భూములను ఎలా ఉపయోగించుకోవాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అలాంటప్పుడు....మిలిటరీ అధికారులకు కాని, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు కాని, అన్ని భూములు కాకపోయినా, అవసరం కోసం అడిగిన కొంత భూమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకుండాలి? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సరైన ఆలోచన చేయడం ఉభయ తారక మేమో! End

No comments:

Post a Comment