Sunday, March 13, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-77 : పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-77
పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి
ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

            పరశురాముడు వెళ్లిపోగానే, ధనుస్సును-బాణాన్ని అదృశ్యుడై వచ్చి వున్న వరుణుడిచేతికిచ్చి, వశిష్ఠాదులకు మొక్కి, భయంతో అవయవాలు స్వాధీనం తప్పిన తండ్రిని సమీపించాడు శ్రీరామచంద్రుడు. పరశురాముడు పోయాడని, సుఖంగా అందరం అయోధ్యకు పోవచ్చని, సేనంతా బయల్దేరడానికి సిద్ధమై, ఆయన ఆజ్ఞకొరకు ఎదురుచూస్తున్నదని అంటాడు తండ్రితో. శ్రీరాముడు చెప్పిన వార్తతో ఉప్పొంగి పోయిన దశరథుడు, కొడుకును దగ్గరకు తీసుకొని, రెండు చేతులతో రొమ్ముకు హత్తుకొని, శిరస్సు వాసన చూసి, సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు.

అయోధ్య ప్రవేశించిన దశరథుడు

          రాజు కొడుకులతో, కోడళ్లతో వస్తున్నాడని విన్న అయోధ్యా నగర వాసులు, రంగు రంగుల పూల తోరణాలు కట్టి, మంగళ వాద్య ధ్వనులు మారుమోగించుకుంటూ, దారంతా నీళ్లతో తడిపి, ఆ స్థలంలో పుష్పాలు వెదజల్లి, చూడగానే మనస్సుకు సంతోషం కలిగే రీతిలో తోరణాలు కట్టి, రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్ది, పౌరులందరు బంగారు ఆభరణాలు ధరించి, మంగళ వాయిద్యాలతో తమకు ఎదుర్కోలుపల్కి-వెంట వస్తుంటే, కొడుకులు-కోడళ్ళతో దశరథుడు తన మేడలో సంతోషంతో ప్రవేశించాడు. కౌసల్య-సుమిత్ర-కైక, మొదలైన రాజ భార్యలు, మహానుభావ గు సీతను-యశోవతైన ఊర్మిళను-మాండవీ, శృతకీర్తులను, మంగళ వాద్య ధ్వనులు మోగుతుంటే, అంతఃపురంలో ప్రవేశ పెట్టారు. తెల్లటి వస్త్రాలతో అలంకరించారు. మంచిగందం పూసుకొని, సుందరమైన దేహాలు రమ్యంగా అవుతుంటే, శుభ వాక్యాలు పలుకుతూ, తమ ఇలవేల్పు మందిరాలకు అర్చనలు చేసి, పెద్దలకు మొక్కారు కోడళ్లు. ధనధాన్యాలతో-ఆవులతో బ్రాహ్మణులను తృప్తి పరిచారు. ఆతర్వాత భర్తలతో సౌధాంతరాలలో కొత్త-కొత్త సంతోషాలు కలిగే విధంగా సుఖపడ్డారు.

          వీరులు-భార్యలుగలవారు-సుకుమారులు-సౌందర్యంతో మన్మథుడునే అపహసించగలవారు-హితమైన నడవడిగలవారు-మనోహరులైన దశరథుడి కుమారులు, తండ్రికి ఇష్టమైన రీతిలో తిరుగుతూ అందరినీ ఒప్పించారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, దశరథుడు , భరతుడితో ఆయన మేనమామ అతడిని తీసుకొని పోయేందికొచ్చి పెళ్లినాటినుండి వేచివున్నాడని అంటాడు. మేనమామ ఇంటికి వెళ్లమని చెప్పగా, తండ్రి ఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి, తండ్రికి-తల్లులకు నమస్కారం చేసి అనుమతి తీసుకుని పోయాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతా నాధుడైన శ్రీరామచంద్రమూర్తి, తమ్ముడు లక్ష్మణుడు, మంచి గుణాలలో ఆసక్తి కలిగి, జనకుడే దేవుడని తలుస్తూ, ఆయనకు సంతోషాన్ని భక్తితో కలిగించారు. తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు మేలైన, సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. తల్లికి, తండ్రికి, గురువులకు ఏ వేళ-ఎలా నడచుకుంటే వారికి సంతోషంగా వుంటుందో అలానే నడుచుకుంటూ, సంతోషం కలిగిస్తుండేవాడు. సమస్త గుణాలలో రమించేవాడై, మంచి నడవడితో అభిరాముడై, మంచి బలంతో అధికుడై, కీర్తి స్థానాన్ని పొందిన రామచంద్రమూర్తిని చూసి, బ్రాహ్మణులు-వైశ్యులు, అన్నిజాతులవారు, చాలా సంతోషించారు.

స్వపురంలో సుఖాలనుభవించిన శ్రీ సీతారాములు

          శ్రీరామచంద్రుడు సీతతో కలిసి, అనేక ఋతువులు, మనోహరమైన విహార క్రీడల్లో ప్రియంగా గడిపారు. సర్వదా మనస్సును ఆ స్త్రీ రత్నం మీదే కొరతలేని ప్రేమతో నిలిపాడు. ఆమె కూడా సర్వదా, కూరిమి అతిశయంతో, మనస్సును హృదయేశ్వరుడైన రామచంద్రుడిపైనే నిలిపింది. దేవతల నమస్కారాలందుకునే శ్రీరామచంద్రమూర్తికి, స్త్రీ రత్నమైన సీతను, తండ్రి మెచ్చి భార్యగా ఇచ్చాడు కాబట్టి, ఆయన మనస్సులో ఆమె మిక్కిలి ప్రియురాలైంది. రాముడిలో ఏ మంచి గుణాలు వున్నాయో, అలాంటి గుణాలే సీతలో కుప్పలుగా వున్నాయి. ఇంకా చెప్పాలంటే, రామచంద్రుడికున్న సద్గుణాలకంటే, సీతలో ఎక్కువగానే వున్నాయి. ఆమెలో సౌందర్య, సౌశీల్య, సౌజన్య, సౌభాగ్యాది గుణాలున్నాయి. అందుకే ప్రీతికి మిక్కిలి పాత్రురాలైంది. రామచంద్రమూర్తికి సీతమీద మనస్సులో ఎంత ప్రేమ వుందో, అంతకు ఇబ్బడి ప్రేమ రామచంద్రుడిమీద సీత హృదయంలో దాగి వుంది. సీత అభిప్రాయం ఎంత కొంచమైనా, దానిని రామచంద్రుడు, ఆమె మనస్సులో కలిగీ-కలగక ముందే పసిగట్టి స్పష్టంగా తెలుసుకునేవాడు.


          ప్రత్యక్ష లక్ష్మి అయి, సౌందర్యంలో దేవతా స్త్రీవలె అందమైన సీతాదేవి, తన భర్త హృదయాన్ని, తన హృదయాన్ని భర్త తెలుసుకున్నదానికంటే ఎక్కువగా తెలుసుకునేది. సీత హృదయంలో అభిప్రాయం పుట్టిన తర్వాత, తెలుసుకునేవాడు శ్రీరాముడు. రామచంద్రుడు ఫలానా కోరిక కోరబోతున్నాడని ముందే పసిగట్టేది సీత.

దశరథ రాజకుమారుడు రామచంద్రమూర్తి, రాజితకాముడై, మహాయోగి-మహాజ్ఞాని-జీవన్ముక్తుడని ప్రసిద్ధికెక్కడంవల్ల, రాజులందరిలో ఉత్తముడైన జనకరాజు కూతురిని-తనకంటే ఎక్కువగా రమింప చేయగలది-తనకంటె అత్యధిక ప్రీతికలదైన సీతతో, ఆలింగనంలో ఏక భావం పొందినవాడై-స్వయం గ్రహ శ్లేషానికి విషయభూతుడై కలిసి, ప్రత్యాలింగన సమర్థుడై, విష్ణువు, చంద్ర సోదరైన లక్ష్మితో కలిసి అనురాగంతో ప్రకాశించే విధంగా రంజిలుతుండేవాడు.

            (అయోధ్యా నగరంలో శ్రీ సీతా రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే, సీత దగ్గరలేని సమయం దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని భావం. అయితే, సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారై వున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో అలానే సుఖపడ్డారని.


            రామచంద్రమూర్తి కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత శక్తెలా వచ్చిందంటే, ఆమె మైథిలికన్య-మహా జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి అవకాశం లేదు). 

1 comment:

  1. .... పరశురాముడు పోయిన సంగతి .....
    జ్వాలావారూ,
    ఇలా వ్రాయటం సంప్రదాయం‌ కాదు కదా. ఫలనావారు పోయిన అన్న మాటను మంచి అర్ధంలో వాడమని మీకు సువిదితమైన విషయమే అనుకుంటాను. కాబట్టి పరశురాముడు వెడలిపోయిన సంగతి అని దయచేసి సవరించ ప్రార్థన.

    ReplyDelete