Wednesday, March 9, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-73 : దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు - సీతా కల్యాణ ఘట్టం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-73
దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు
సీతా కల్యాణ ఘట్టం
వనం జ్వాలా నరసింహారావు

            గోదానం జరిగిన రోజునే, కేకయ రాజకుమారుడు మేనల్లుడు భరతుడిని, బావగారు దశరథుడినీ చూడడానికొచ్చాడు. తండ్రి పంపగా వచ్చిన కేకయ రాజకుమారుడు యుధాజిత్తు, భరతుడిని తీసుకుపోయేందుకు తాను అయోధ్యకు పోయానని, వారంతా పెళ్లికై మిథిలకొచ్చారని విని, ఇక్కడకొచ్చానని, ఉభయ కుశలోపరి దశరథుడితో అంటాడు. సంతోషించిన దశరథుడు బావగారిని తగిన మర్యాదలతో గౌరవించాడు. ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించాడు దశరథుడు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్ఠుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్ఠుడు జనకుడికి తెలియచేశాడు.

          జవాబుగా " మునీంద్రా, ఇక్కడ కొత్తవారెవ్వరు? ఎందుకంత ఆలస్యం చేసారు? ఇంతకు ముందే కార్యం ఆరంభం చేయకుండా మీకెవరైనా అడ్డమొచ్చారా? కార్యం జరిపించేందుకు ఎవరి ఆజ్ఞకొరకు వేచి వున్నారు? నా రాజ్యమంతా మీదేనని ముందే చెప్పానుకదా. అలాంటప్పుడు ఈ ఇల్లు కూడా మీదేకదా. అలంకరించుకొని పెళ్లికూతుళ్ల వేషాల్లో, నా నలుగురు కుమార్తెలు సంతోషంగా వేదిలోని అగ్నివలె వెలుగుతూ, మండపం దగ్గరే వున్నారు. సర్వం సిద్ధంగా వుంది. మీరింకా రాలేదని మీరాక కొరకే ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నేను చేయాల్సిన కార్యమంతా చేసాను. మిగిలిన కార్యం చేయాల్సినవారు మీరే" అని జనకుడు వశిష్ఠుడికి చెప్పగానే, ఆ విషయాన్నే దశరథుడికి చెప్పేందుకు దూతలను పంపాడాయన. అది విన్న దశరథుడు, తన కొడుకులను, మహర్షులను యజ్ఞశాలకు పంపాడు.

వశిష్ఠుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తానన్న వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం

" సీతను సర్వాభరణోపేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస
ల్యా తనయున  కభిముఖముగక్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "
          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు. సంతోషాతిషయంతో దేవతలు పూలవాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు,తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సులనుండి తొలగించుకున్నారు.

ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో-గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా-గుంపులు, గుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.


          (సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.

"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-శౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరిని అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది. రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువకాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.


ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురు" అంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మంమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం). 

No comments:

Post a Comment