సీతను చూసి సంతోషించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (04-12-2017)
హనుమంతుడు లంకలో ప్రవేశించి, సీతను
వెతకడం ఆరంభించినప్పటినుండి, ఆమె కనపడేవరకు, చంద్రుడు వెన్నెల కురిపిస్తూ సహాయంగా తోడున్నాడు ఆయనకు. తలపెట్టిన కార్యం నెరవేరిందికనుక, ఇకతానుండవలసిన
అవసరంలేదని వెళ్లిపోవడం మొదలెట్టాడు. ఆరోజు శుధ్ధ
త్రయోదశి....చంద్రాస్తమానం సుమారు నాలుగున్నర గంటలకు. అప్పుడు
సమయం మూడుగంటలై వుంటుంది. నిర్మలమైనకాంతితో ప్రకాశించి,
తోడుగా వుండి, హనుమంతుడి మనస్తాపాన్ని తగ్గించాడు
చంద్రుడు ఇంతవరకూ.
బరువెక్కిమునిగిపోతున్న పడవలా, కడు దుఃఖంలో బరువెక్కిన సీతను చూసాడు హనుమంతుడు. ఆమెసమీపంలోనే ఆమెకు దిగులు కలిగిస్తున్న వికార-ఆకారాల
రాక్షస స్త్రీలనెందరినో చూసాడు. ఒంటి కంటితో, ఒకేచెవితో, చెవులు లేకుండా, మేకుచెవులతో,
సన్నని నిడువైన మెడతో, పైకెగతీసుకునిపోయిన
ముక్కుబొక్కలతో, భుజాలపై వేలాడే చెవులతో, పొట్టి వెంట్రుకలతో, బోడితలతో, పెద్దతలకాయతో, గడ్డంతాకే పెదవితో, వేలాడుతున్న చెవులతో, వేలాడే నొసలుతో, వేలాడే చనులతో, కంబళివంటి వెంట్రుకలతో, వంగినమోకాళ్లతో, వేలాడే ముఖంతో, వేలాడే పొట్టతో, వేలాడే పెదవితో, రకరకాలుగా వున్నారా రాక్షస స్త్రీలు.
పెద్దపిక్కలతో, పొట్టిగా,
ముక్కులేకుండా, వికారముఖంతో, గోరోచనం వన్నెతో, కోపిష్టిగా, ఉక్కుశూలాలు
ధరించి, పులిముఖంలా, ఏనుగుకాళ్లతో,
గుంతపడినతలతో, ఒంటికాలుతో, గుర్రపు చెవులతో, గాడిద చెవులతో వున్న వారిని ఆ
రాక్షస స్త్రీలలో చూసాడు హనుమంతుడు. కడుపు నిండా కల్లుత్రాగి,
మాంసం తిని, వెర్రికూతలు కూస్తూ, ఒంటి నిండా నెత్తురు పూసుకుని, సీత చుట్టూ తిరుగుతూ,
అరుస్తూ, కేకలేస్తున్న రాక్షస స్త్రీలను చూసిన
హనుమంతుడి దేహం పులకరించింది. ఆయన కంటికి వారంత భయంకరంగా
వున్నారు.
పవిత్ర స్వభావం, చక్కని
నడవడిక కలదానిలా కనిపిస్తున్న, దుఃఖంతో తపిస్తున్న, మాసి, చిక్కుబడిన వెంట్రుకలున్న, కాంతితొలగిన, మగనిజాడ తెలియనిదానిలా, మంచిసొమ్ములు ధరించని-పతిభక్తే సొమ్ములా వున్న,
పుణ్యం తగ్గితే నేలపైబడ్డ నక్షత్రంలా వున్న, ఒంటరిగా
చిక్కిన ఆడ ఏనుగులా వున్న స్త్రీని ఆ చెట్టు కింద చూసాడు హనుమంతుడు. మాసిన వీణలా, అతిశయంతో మగడిని స్మరిస్తూ, రాక్షస స్త్రీల మాటలు లక్ష్య పెట్టకుండా, శరత్కాల
మేఘం చాటు పాడ్యమి చంద్రుడిలా, బుధ, అంగారకుల
బారినపడ్డ రోహిణిలా, పూలులేనితీగలా, దుమ్ముచాటున
కనిపించే కాంతిలా, బురదకప్పిన తామరతీగలా, పూర్తిగా మాసిన చీర ధరించి, జింకపిల్ల కళ్లలాంటి
కళ్లతో, చూడగానే కడుపులో కెలుకుతున్నట్లున్నది హనుమంతుడు
చూసిన ఆస్త్రీ.
దుఃఖంతో నిండి, కాంతి
తొలగిన ముఖమున్నప్పటికీ, భర్తపరాక్రమం తలచుకుంటూ, ఆయన తనను తప్పక రక్షిస్తాడన్న ధైర్యంతో కనిపించిందామె. మగడు వచ్చి రక్షించేంతవరకు తన పాతివ్రత్యంతోనే, తనను
రక్షించుకుంటున్నట్లు వుందామె. ఆమే సీతాదేవి. (దీనర్థం: భక్తులు,
ప్రపన్నులు, కష్టాలెన్నొచ్చినా, విశ్వాసం వొదలకుండా, భగవంతుడు రక్షించేదాకా, తమ భక్తి, ప్రపత్తులే తమకు రక్ష అని భావిస్తారు)
భయపడి వణకుతున్న ఆడలేడిలా, తన్ను
రక్షించేందుకు రాముడెటువైపునుండి వస్తున్నాడా అని దిక్కులు చూస్తున్నది సీత.
తనవేడి శ్వాసలతో చెట్ల చిగుళ్లను కాలుస్తున్నదా అన్నట్లు వుందామె. హృదయమ్లోంచి
వస్తున్న దుఃఖ సముద్రం పొంగి పొరలుతుంటే, అలల్లా
నిట్టూర్పులు విడుస్తోంది. శుష్కించి, ఆభరణాలు వేసుకోకపోయినా,
సహజకాంతితో వెలుగుతున్నది. మైమర్చిపోయే సౌందర్యమున్న సీతను చూసి,
కృతార్ధుడనైతినని, సంతోషంతో హనుమంతుడి
కళ్లల్లో నీరు ప్రవహించింది. ఇదంతా రామలక్ష్మణుల అనుగ్రహంతో లభించిందేకదా అని
వారికి నమస్కరించి, సీతతో మాట్లాడే సమయంకొరకు , చెట్టుకొమ్మపైనే వేచిచూడసాగాడు.
దాదాపు రాత్రంతా గడిచిపోయి, తెల్లవారుతున్న
సమయంలో, చల్లగాలికి కదుల్తున్న చిగుళ్లతో, పూలతో, ప్రకాశిస్తున్న అశోకవనాన్నంతా తేరిపార చూసిన
హనుమంతుడు. సీతనింకా దగ్గరనుండి చూడాలనుకుంటాడు. షడంగాల
వేదాలు తెల్సి, యజ్ఞకార్యాలపై మనసున్న బ్రహ్మరాక్షసులు (రాక్షసులే అయినా బ్రాహ్మణులవలె వేదాధ్యయన పరులన్నమాట) వేకువజామునే, బ్రాహ్మీముహూర్తంలో లేచి, శుచిగా, తప్పులొలకకుండా చదువుతున్న వేదఘోషలు,
వీనులకింపుగా వాయిస్తున్న వాద్యాల ధ్వనులు, ఆలోచిస్తున్న
హనుమంతుడి చెవిన బడ్డాయి ఆ సమయంలో.
రావణుడు ఆ మంగళధ్వనులు విని, మేల్కొని,
కట్టుకున్న పట్టువస్త్రాలు, ధరించిన పూలదండలు,
ఒంటి మీదనుండి జారిపోతుంటే, కామంతో సీతను
తలచుకుంటాడు. మనసంతా సీతపైనే నిలిపిన రావణుడు, అతిశయించిన కామమదంతో, తన హృదయంలో నిండిన కామాన్ని
కొంచెం కూడా అణచుకోలేక పోయాడు. సంతోషం కలిగిస్తున్న పండ్లచెట్లతో,
వికసించిన తామరపూల సరస్సులతో, ఇంపై ఒప్పుతున్న
పక్షుల కిలకిలారావాలతో, కృత్రిమ జింకలు, దుప్పుల సమూహాలతో, కంటికి ఇంపైన అశోకవనంలోకి,
భూషణాలు ధరించిన రావణుడు, తనకున్న మహాసంపదను
ప్రదర్శించుకుంటూ ప్రవేశించాడు. వందలమంది రాక్షస స్త్రీలు
చేతుల్లో కాగడాలు, చామరలు ధరించి, ఇంద్రుడి
వెంట పోయే దేవ-గంధర్వ స్త్రీలలా, రావణాసురుడిని
అనుసరించారు.
అందమైన
బంగారుబిందెల్లో నీళ్లు తీసుకుని కొందరు ముందు నడిచారు. కత్తులు, మణిమయమైన పీటలు పట్టుకుని
మరికొందరు స్త్రీలు వెనుక అనుసరించారు. రత్నపాత్రను నీటితో
నింపి, కుడిచేత్తో పట్టుకుని, ప్రక్కనే
నడిచిందో నేర్పరి. ఇంకోకామె రాజహంసను,
పూర్ణచంద్ర బింబాన్నీ పోలిన తెల్లటి గొడుగు పట్టుకుని ఆయన్ననుసరించింది. బంగారు దండం ఇంకొకరి చేతుల్లో వుంది. నిద్రమబ్బు
కళ్లతో తనభార్యలు, మబ్బువెంట పోయే మెరుపులా నడచి వస్తుంటే,
రావణుడు ప్రవేశిస్తాడు ఉద్యానవనంలోకి అప్పుడు.
No comments:
Post a Comment