Wednesday, December 20, 2017

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా! ..... వనం జ్వాలా నరసింహారావు

కృత్రిమ వైరుధ్యాలతో కుమ్ములాటలా!
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (21-12-2017)

బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో, బీసీ వర్గాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో రెండు వారాల క్రితం, శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రధాన అంశం మీద మాట్లాడే ముందర, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు ఆవశ్యకత, అమెరికా-చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్ధిక రంగంలో పోటీ పడుతున్న వ్యవహారం, ఇటీవలే ముగిసిన అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు, తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక పురోగతి లాంటి అంశాలపై తన విలువైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తన అభిప్రాయాల నేపధ్యంలో, బీసీల అభ్యున్నతికోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంలో, రాజకీయాలకు అతీతంగా ఆ వర్గాల ప్రజాప్రతినిధులందరూ కలిసి కూలంకశంగా చర్చించి, ప్రభుత్వానికి సిఫారసు చేయాలనీ, వాటిని ప్రభుత్వ ఉత్తర్వులుగా ఆదేశాలిస్తామనీ, ముఖ్యమంత్రి అన్నారు.  

ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి ఏ రాజకీయ పార్టీ వచ్చినా, కొన్ని విధానాల కొనసాగింపు అవసరమని అంటూ సీఎం, వాస్తవాల అవగాహన జరిగితేనే ప్రజలకు లాభం చేకూరే అవకాశం వుందని చెప్పారు. “పార్టీలకతీతంగా, ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎంతైనా నేర్చుకోవాలి. పరిణామక్రమంలో సంస్కరణ వుంది. మానవజాతి పరిణామక్రమంలో నిరంతరం మార్పు చోటుచేసుకుంటుంది. మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పాటిస్తుంది. ఆ వ్యవస్థలోనే అభివృద్ధి చెందుతున్నాం, ముందుకు పయనిస్తున్నాం. మనకంటే మరికొన్ని దేశాలు ముందుకు సాగుతుంటే, ఇంకొన్ని వెనుకబడి వున్నాయి. ఏదేమైనా, ప్రభుత్వాల పయనమేదైనా, ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు మాత్రం అతి ముఖ్యం” అని సీఎం చెప్పారు.

ఈ అంశం మీద మరింత లోతుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, “ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిర్దుష్ట కాలపరిమితి తరువాత ప్రభుత్వాలు మారుతుంటాయి.  ఒక రాజకీయ పార్టీ స్థానంలో మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. అలా జరిగినప్పుడు ఆ పార్టీ ప్రాధాన్యతలకు అనుగుణంగా, లక్ష్యాలు మారవచ్చు. అంతమాత్రాన విదానాలన్నీ మారాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు విదేశాంగ విధానం కానీ, దేశ రక్షణ సంబంధమైన విధానం కానీ, పెద్దగా మార్పులకు గురికావాల్సిన అవసరం లేదు. మరొక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇటీవల హైదరాబాద్ లోముగిసిన అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు (జీ.ఈ.ఎస్) విషయం. అమెరికా మాజీ అధ్యక్షుడుమ, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఒబామా పాలనాకాలంలో అమల్లోకి వచ్చిన జీ.ఈ.ఎస్ కార్యక్రమాన్ని-విధానాన్ని, ఆయన వారసుడు, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ కొనసాగించాడు”.

ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో అత్యద్భుతంగా జరిగిన జీ.ఈ.ఎస్ ఎనిమిదవ సదస్సు విషయం ప్రస్తావించి, సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదన్నారు సీఎం. అసలీ సదస్సు పూర్వాపరాలు చాలామందికి తెలియదనీ, అయినా తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిందని కొందరు విమర్శలు చేశారనీ, అదంతా అబద్ధం అనీ ఆయన అన్నారు.


“బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా వున్నప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోటీగా, జీ.ఈ.ఎస్ ను నెలకొల్పాడు. అప్పటినుండి ఏడుసార్లు వివిధ దేశాల్లో గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించింది ఆదేశం. ఎనిమిదవ సదస్సును భారతదేశంలో నిర్వహించమని ట్రంప్ భారత ప్రధానమంత్రి మోడీని కోరారు. అంగీకరించిన మోడీ నీతీ ఆయోగ్ కు ఆపనిని అప్పగించారు. తెలంగాణాతో సహా సదస్సు నిర్వహించడానికి ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడ్డాయి. చివరకు హైదరాబాద్ కు నిర్వహణ బాధ్యత దక్కింది. మన భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా సదస్సును నిర్వహించాం. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా కాలేదు. ఇది తెలయక దురదృష్టవశాత్తు ‘ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు కొందరు. ఫలక్ నూమా పాలెస్ లో డిన్నర్ ఖర్చంతా నీతీ ఆయోగ్-కేంద్ర ప్రభుత్వమే భరించింది. దానికి కారణం అమెరికా ప్రభుత్వ సలహాదారైన ఇవాంకా గౌరవార్థం అనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చల్లా, గోల్కొండలో సదస్సుకు హాజరైన దేశ-విదేశ ప్రతినిధులకు ఇచ్చిన డిన్నర్ ఆతిథ్యానికి మాత్రమే! అది కూడా నామమాత్రమే. అంతకు మించి ఏ ఖర్చూ లేదు. దీన్ని బహిరంగంగా మాట్లాడితే మన పరువు మనమే తీసుకున్నట్లవుతుంది కదా?”. అని అన్నారు సీఎం కేసీఆర్.

చైనాలో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు-వరల్డ్ ఎకనామిక్ ఫోరం-విషయాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి, ఈ సదస్సులు చైనాలో సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయని అన్నారు. “అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం. ఆ దేశానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే గిట్టదు. జర్మనీలో పుట్టిన ప్రొఫెసర్ స్ఖ్వాబ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపక కార్యనిర్వాహక అధ్యక్షుడు. 1971 లో కొందరు స్నేహితులతో కలిసి ఆయన దాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి సంబంధించిన ఆర్ధిక అంశాలమీద ఆలోచించే ఈ వేదిక, అనతికాలంలోనే, గొప్ప రూపాన్ని సంతరించుకుంది. ప్రొఫెసర్ స్ఖ్వాబ్ ను కలవడానికి, ఆయనతో కరచాలనం చేయడానికి, ప్రపంచ నేతలు బారులు తీరుతారు. ఇక ఈ ఫోరం నిర్వహణలో అమెరికా పాత్ర కించిత్తయినా లేదు”. అని చెప్పారు సీఎం.

           సంఘటిత, భాగస్వామ్య అభివృద్ధి ప్రక్రియ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణా ఉద్యమ స్ఫూర్తిని పేర్కొన్నారు. “తెలంగాణా ఉద్యమంలో మనం అందరం భాగాస్వాములం. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్థికంగా అద్భుతంగా వున్నాం. ఎలాంటి లోటూ లేదు. ప్రభుత్వ బడ్జెట్ కూ, ప్రయివేట్ బడ్జెట్ కూ చాలా తేడా వుంది. ప్రభుత్వ బడ్జెట్ అంటే ముందు ఒక ప్రణాళిక వేసుకుంటాం...దానికి అనుగుణంగా నిధులను సేకరిస్తాం. ప్రయివేట్ బడ్జెట్ అంటే, మన దగ్గర వున్న డబ్బుతో ఎలా ఖర్చు చేయాలో ఆలోచించుకుంటాం. ప్రభుత్వ బడ్జెట్ లో అంచనా బడ్జెట్ అనీ, సవరించిన బడ్జెట్ అనీ, వాస్తవ బడ్జెట్ అనీ, ఒక విధమైన గాఢమైన వాంఛతో-అత్యాశతో కూడిన బడ్జెట్ వుంటుంది” అని అన్నారు సీఎం.

         రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొన్నాళ్ళు ప్రభుత్వం ఎదుర్కున్న అనేక సమస్యలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. “23 జిల్లాల ఉమ్మడి ఏపీ రాష్ట్రం వున్నప్పుడు కూడా బడ్జెట్ అంచనాలను చేరుకోలేకపోయాం. మన బడ్జెట్ ఇప్పుడు రు. 1,49,000 కోట్లు. మనం తప్పకుండా రు. 1,25,000 కోట్లకు చేరుకుంటాం. అందులో సందేహం లేనేలేదు. మరో విధంగా చెప్పాలంటే, ఒకనాటి పది జిల్లాల (నేటి 31 జిల్లాల) తెలంగాణ, అలనాటి 23 జిల్లాల ఏపీ వ్యయానికి చేరుకుంది. జూన్ 2014 లో అధికారంలోకి వచ్చిన కొత్తలో, పరిస్థితి అంతా అస్తవ్యస్తమే! పొరుగు రాష్ట్రం సహకారం అసలే లేదు. దాదాపు ఏడు నెలలు అఖిల భారత సర్వీసు అధికారులు కానీ, రాష్ట్ర సేవల అధికారులు కానీ, సరైన సంఖ్యలో లేరు. ఇప్పుడున్న తెలంగాణ, ముఖ్యంగా ఆర్థికంగా ఆలోచిస్తే, గతంలో ఎన్నడూ లేదు. అప్పట్లో అది హైదరాబాద్ రాష్ట్రమే! ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం ఫజలాలీ జవహార్లాల్ నెహ్రూకు చేసిన సిఫార్సులకు అనుగుణంగా వున్న తెలంగాణానే! ఇప్పుడున్న తెలంగాణ గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి ఆర్ధిక ప్రాతిపదిక అర్థం చేసుకోవడం కష్టమైంది. అధికారంలోకి వచ్చిన మొదటి పదినెలలు పరిస్థితి అంతా గందరగోలంగా, అస్తవ్యస్తంగా వుండేది. ఆ తరువాత రెండవ ఆర్ధిక సంవత్సరంలో కొంతమేరకు అర్థమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచి-చెడులు అవగతమయ్యాయి. క్రమేపీ ఆర్థికంగా పురోగమించాం. ఎఫ్.ఆర్.బీ.ఎం 0.5% అధికంగా సాధించాం. ఈ సంవత్సరం కూడా అది కొనసాగుతుంది”.

         కొత్తగా 21 జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడుతూ, సీఎం, పేదరికం పోవడానికి, చిన్న జిల్లాలను, ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు. చిన్న జిల్లాల వల్ల, ఆయా జిల్లాలలోని కుటుంబాల వివరాలన్నీ కలెక్టర్ల వేళ్ళ మీద లెక్కించే విధంగా వుంటాయనీ, పేదరికం పూర్తిగా పోతుందనీ ఆయన చెప్పారు.

         ఇదంతా చెప్పడానికి కారణం వివరిస్తూ, సీఎం, బీసీ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి లాంటి పథకాలు భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా అమలు చేయక తప్పదనీ, అలాంటివే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి సంక్షేమం కొరకు అమలు చేస్తామనీ ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాస్వామ్యంలో విధానాల కొనసాగింపు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment