Monday, December 25, 2017

తెలుగు భాష అజరామరం : వనం జ్వాలా నరసింహారావు

తెలుగు భాష అజరామరం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (22-12-2017)

ఎవరెన్ని చెప్పినా, ఎంతమంది పెద్దలకు ఎన్నిఅనుమానాలున్నా, తెలుగు అజరామరంగా బతికి తీరుతుంది.  బతుకుతుంది. బతుకనివ్వాలి. నన్నయ, తిక్కన, పాల్కురికి సోమన, బమ్మెర పోతన కాలం నాటి తెలుగు ఇపుడుందో లేదో కానీ, తెలుగు మటుకు ఉంది. సజీవంగా ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం కేజీ నుంచి 12వ తరగతి వరకు తెలుగు భాషను నిర్బంధంగా నేర్పాలని. ఆ నిర్ణయం నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచనల మేరకు, సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, తెలంగాణ సాహిత్య పరిషత్, మీడియా అకాడమీ, అధికార భాషా సంఘం తెలుగు భాష అభివృద్ధికి చేస్తున్న కృషి నేపథ్యంలో తెలుగుకు ఎట్టి బాధ లేదు-రాదు. తెలుగుకు ఏమీ జరగదు. తెలుగు సజీవంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎంత మేరకు ఉంటుందనేది మన ఆలోచనా ధోరణి మీద ఆధారపడి వుంది.

          పూర్వం “రామాయణము” అని వ్రాసేవాళ్లు. ఇపుడు “రామాయణం” అని రాస్తున్నారు. రెండూ ఒకటే. అది ఒప్పే, ఇది ఒప్పే. అంతర్జాతీయంగా ఆలోచిస్తే, ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ ఉంది. అమెరికాలో కూడా ఇంగ్లీష్ ఉంది. అమెరికా ఇంగ్లీష్ ను న్యూ ఇంగ్లీష్ అంటాం. దాన్ని న్యూ ఇంగ్లాండ్ అని కూడా అంటాం. వాళ్లు గర్ల్ ని “జీఏఎల్” అని రాస్తున్నారు. మనం కూడా ఒకప్పుడు కడపను “సీయూడీడీఏపీఏ” అని రాసే వాళ్లం. ఇవాళ “కేఏడీఏపీఏ” అని రాస్తున్నారు.

భాషలో మార్పులొస్తుంటాయి. ఆ మార్పులెలా వస్తున్నాయంటే, సామాజిక అవసరాల దృష్ట్యా మార్పులొస్తుంటాయి. నేను నా స్వానుభవంతో చెబుతున్నాను. నేను వృత్తి రీత్యా లైబ్రేరియన్ ని.  లైబ్రరీలో ఉండే పుస్తకాలను చదువుతూ, రాయాలనే కోరిక కలిగింది. అలనాటి ఒకరిద్దరు ప్రముఖ జర్నలిస్టుల దగ్గరకు పోవడం జరిగింది. వాళ్లేమన్నారంటే, పత్రికల్లో రాయడం అంటే వడ్రంగి పని కాదన్నారు. నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ. అలా మహానుభావుడు లేడు ఇప్పుడు. అంటే, భాషా పరంగా రాయడం కష్టమేమో అనుకున్నాను. నేను చిన్నతనంలో పెరిగిన భౌగోళిక వాతావరణం నేపధ్యంలో, ఎదవ తరగతి వరకే చదువుకున్న మా నాన్నగారు నేర్పించిన గ్రాంధికమైన తెలుగు నేపధ్యంలో, ఆ గ్రాంధిక భాష కొంత అలవాటు అయింది. మా నాన్నగారు రామాయణ, భారత, భాగవతాలన్నీ క్షుణ్ణంగా చదివే వారు. ఆ నేపథ్యంలో అయితేనేమి, చుట్టుపక్కల కొంతమంది కమ్యూనిస్టు మిత్రులతో తిరగటం వల్ల వాడుక భాషలో కొంత ప్రవేశం రావడం వల్ల అయితేనేమి, నాకు మొదటి నుంచీ కూడా నా భాష అటు గ్రాంధికం, ఇటు కొంత వాడుక భాష కల్గినటువంటి భాషలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తున్నాను.

పత్రికల్లో వ్యాసాలు రాయాలి అనుకుంటున్న రోజుల్లో మహానుభావుడు స్వర్గీయ జి.కృష్ణ గారు రాయటం చాలా తేలిక అని చెప్పారు. రాయటం కంటే తేలికైన విషయం ఏదీ లేదన్నారు. అందులో మన భాషలో రాయడం మరింత తేలికన్నాడు. ఎలాగండీ అంటే నన్ను ముందు రాయమన్నాడు. రాసి ఇస్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఆయనేం చేశాడంటే, అలా ఇలా కొన్ని మార్పులు చేశారు. మార్పులు చేసి ప్రోత్సహించారు. ప్రోత్సహించే వాళ్ల నేపథ్యం ఒకటైతే, రాయటం వడ్రంగి పని లాంటిది కాదన్న వాళ్ల నేపథ్యం మరోటి. ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే, రాయటం కష్టం కాదు. అయితే రాయడానికి హద్దులు గీసుకోకూడదు.

భాష కాలానుగుణంగా పరిణామం చెందుతూ వస్తున్నది. ఇదే ఉండాలి, ఇదే విధంగా ఉండాలని కాదు. భాష ఎలా ఉండాలంటే మనం చెప్పే మాట ఇతరులకు అర్ధమవుతుందా, కావట్లేదా? మన మనసులో మాట వాళ్ల మనసులోకి ఎక్కుతుందా లేదా? అదే ఆలోచించాలి తప్ప, గిరి గీసుకొని ఇలానే  ఉండాలె, ఇలా ఉంటేనే ఇది భాషవుతుంది. ఇదే పత్రికల్లో ఉండాలె. ఇదే టీవీల్లో ఉండాలె. ఇదే సోషల్ మీడియాలో ఉండాలె అని కాదు. ఈ ఉండేదాంట్లో కొంత అన్ పార్లమెంటరీ థింగ్ అనేటువంటి దాన్ని తీసేసి, పార్లమెంటరీ అనేటువంటిది ఏ విధమైన భాషైనా భాషే.

రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు చెప్పినట్లు, వొచ్చిండ్రు, పోయిండ్రు, వెళ్లిండ్రు లాంటివి వాడుకలో బాగుంటాయి గానీ, పత్రికల్లో రాయడానికి గానీ, టీవీల్లో చెప్పడానికి కొంత బాగుండవేమో. నేను కూడా అలా ఆలోచిస్తున్న వాళ్లలో ఒకడినే. వాడుక భాష వాడుక భాషే. అందుకే దాన్ని వాడుక భాష అన్నారు. వ్రాత భాష వ్రాత భాషే. వాడుక భాషకూ, వ్రాత భాషకూ ఎక్కడో అక్కడ తేడా ఉండాలె. కాకపోతే మాండలికం వేరుకావచ్చు.


          తెలుగుకు సంబంధించినంత వరకు ముఖ్యంగా మూడు ప్రాంతాలున్నాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర. ఇవాళ వస్తున్న పత్రికలన్నీ కూడా ఫలానా ప్రాంతానికి లిమిట్ అయి లేవు. హైదరాబాద్ నుంచి వస్తున్న పేపర్లు, విజయవాడ నుంచి వస్తున్న పేపర్లు మూడు ప్రాంతాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నాయి. పేపర్లు స్ప్రెడ్ అయి ఉన్నాయి. స్కాటర్ అయ్యాయి. పేపర్లో వచ్చేటువంటి వార్తలు మూడు ప్రాంతాలకు చెందినటువంటివి ఉన్నపుడు, కొంత ప్రత్యేకత ఉన్నప్పటికీ కూడా భాషా విషయంగా ఆలోచిస్తే మూడు ప్రాంతాలకు చెందినటువంటి భాష తప్పనిసరిగా ఉంటుంది. ఉండి తీరుతుంది. దాన్ని మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అయితే, మనం తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణలో పుట్టిన వాళ్లుగా, తెలంగాణలో పెరిగిన వాళ్లుగా, తెలంగాణ మాండలికం మీద మనకు అభిమానం ఉన్న వాళ్లుగా తప్పకుండా మన భాషకు ఎక్కువ ప్రాధాన్యత లభించాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ, సరిహద్దులు గిరిగీసుకోవద్దని చెబుతున్నాను నేను. గిరిగీసుకోకుండా అర్ధమయ్యే భాషలో ఉండాలి.

పదిమందికీ అర్ధమయ్యే భాష వాడినంతకాలం ఏ ప్రమాదం లేదు. నా వ్యాసాలు దాదాపు అన్ని పేపర్లలో వస్తూనే ఉన్నాయి. నేను, నాదైన ఒక శైలి భాషలో దాన్ని శిష్ట వ్యవహారిక భాష అని నాకు నేనే చెప్పుకొంటూ రాస్తున్నాను. అది శిష్ట వ్యవహారిక భాష అవునో కాదో నాకు తెలియదు. అదే విధంగా నేను శిష్ట వ్యవహారిక భాషలోనే ఎప్పుడో ఒక వంద సంవత్సరాల క్రితం సంస్కృతంలోని వాల్మీకి రామాయణాన్ని శిష్ట వ్యవహారిక భాషలో అనువక్తగా-వాచవిగా రాశాను. వావిలికొలను సుబ్బారావు గారనే ఒక మహానుభావుడు కడప జిల్లా వాసి ఆంధ్ర వాల్మీకి అను బిరుదాంకితుడు, తెలుగులో దాన్ని ఆంధ్రీకరించాడు.  అందుకే ఆయన బిరుదు కూడా ఆంధ్ర వాల్మీకి అని వచ్చింది. ఆయన గారు రాసినటువంటి రామాయణాన్ని వాసుదాసు గారి రామాయణం అని కూడా అంటారు. వావిలికొలనులోని “వా”, సుబ్బారావులోని “సు” కలసి వాసుదాసు గారయ్యారు. బహుషా ఇప్పటివరకు వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా తెలుగులో అనువాదించిన ఏకైక వ్యక్తి ఆయనే. పూర్వకాండతో సహా, ఉత్తరకాండను కూడా యథాతథంగా తెనిగంచిన ఏకైక వ్యక్తి అని నేను సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. ఇతరులెవరైనా వాల్మీకి రామాయణాన్ని అనువదిస్తే, అది స్వేచ్చానువాదం తప్ప, యథాతథంగా చేసినోళ్లెవరూ లేరు.

వాసుదాసు గారు 24 వేల సంస్కృత శ్లోకాలకు 24 వేల పద్యాలు రాశారు. రాసిన తర్వాత ఎవరో అడిగారు.....ఇది ఎందుకు రాశావయ్యా అని. సంస్కృతంలో ఉన్న రామాయణం ఎవరికీ అర్ధం కావటంలేదని రాశాను అని జవాబిచ్చారు. మరి నువు రాసిన రామాయణం ఎవరికైనా అర్ధం అవుతుందా అని ప్రశ్నించారు. ఆయనేం రాశాడూ? సంస్కృతాన్ని దాదాపు తెలుగులో రాశాడు.  అంటే సంస్కృత భాష ఎలా ఉంటుందో తెలుగులో అంత గ్రాంధికంగా వచ్చేట్టు రాశాడు. ఈ పద్యాలు ఎవరికి అర్ధం కావంటే, నిర్వచనోత్తరంగా రాసినటువంటి రామాయణాన్ని మళ్లీ ఓ పది సంవత్సరాలు కూర్చొని, అహో రాత్రులు శ్రమించి, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యాన సహితంగా మందరంఅనే పేరుతో వాటిని రామాయణంగా తీసుకొచ్చాడాయన. ఒక్కొక్క వ్యాల్యూమ్ 700 పేజీలు, 800 పేజీలు,900 పేజీలుంటాయి. మొత్తం పూర్వకాండతో సహా, ఉత్తరకాండ కూడా పూర్తిగా రాశాడు. అందులో వ్యాఖ్యానాలుంటాయి. వాసుదాసు గారి మందరాలన్నీ ఒక విధంగా విజ్ఞాన సర్వస్వాలు. ఎవరైనా గనక కోరిక ఉండి పరిశోధన చేయగలిగితే ఒకటి కాదు, 100 పీహెచ్ డీలు చేసుకోవచ్చు ఆ రామాయణం మీద.

అయితే నేను చెప్పొచ్చేదేమిటంటే ఆ మందరం రామాయణం కూడా చదివిన తర్వాత, అది కూడా భాష క్లిష్టంగా ఉంటే, నా కెందుకో చదివిన తర్వాత, చిన్నపుడు మా నాన్నగారు ఆ పుస్తకాన్ని నన్ను చదివించిన తర్వాత, నేను తిరిగి చదివిన తర్వాత వీటిని శిష్ట వ్యవహారిక భాషలో రాస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. మరి ఏమిటీ ఆ శిష్ట వ్యవహారిక భాష? ఎవరికి తెలియాలి. అంటే నేను మాట్లాడే భాషే నా శిష్ట వ్యవహారిక భాష అనుకున్నాను. అంతే కదా. మనం మాట్లాడే భాషే, మనకు అర్ధమయ్యే భాషే, మనం ఇతరులకు అర్ధం అయిందనుకుంటాం గానీ, మనకు అర్ధం కాని భాషలో మనం ఏదో రాయాలనీ ఇదే ఉండాలనీ, గిరిగీసుకొని ఇలానే ఉండాలని ప్రయత్నాలు చేయవద్దు.

పత్రికలున్నంతకాలం తెలుగు ఉంటుంది. తెలుగు అజరామరం. ఇన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న తెలుగు కొన్ని ఆటు పోట్లు ఎదుర్కొని ఉండవచ్చు. భాషలో మార్పులు రావొచ్చు. ఒకప్పడు లేని పదాలు ఎన్నో భాషలో ఉన్నాయి. కొత్త కొత్త పదాలు చేరుతుంటాయి. కొత్త కొత్త మాటలు వస్తుంటాయి. కాలానుగుణంగా ఆ మాటలను వాడుకుంటూ, మన భాషను బతికించుకుంటూ, మనదైన స్టైల్లో వాటిని రాసుకుంటూ, ఇతర ప్రాంతాల్లోని భాషను కూడా ఏమాత్రం మనం అగౌరవ పరచకుండా ముందుకు సాగితే తెలుగు భాష వందేళ్లుకాదు.. వెయ్యేళ్లు కాదు.. లక్షల ఏళ్లు సజీవంగా ఉంటుంది. ఉండి తీరుతుంది.


(ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా, రవీంద్రభారతి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘‘పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో తెలుగు’’ చర్చాగోష్ఠిలో వ్యాస రచయిత ప్రసంగం).  

No comments:

Post a Comment