అశోకవనానికి వచ్చి సీతను చేరబోయిన రావణుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (11-12-2017)
వీడినకొప్పులు, రాలిన గంధపు పూలు, నిద్దురమబ్బులు,
మద్యం వాసన, చెమటగారే ముఖాలు, చెమట నీళ్లతో తడిసిన పూదండలు, పూదండల్లో చిక్కుపడ్డ
వెంట్రుకలు, ఎర్రనికళ్లు, అందమైన
సొగసులు, మేలైన కాంతులున్న స్త్రీలు అనురాగంతో తనవెంట
వస్తుంటే, రావణుడు సీతను తల్చుకున్నాడు. కామాతిశయంతో
కన్నుమిన్ను కానని రావణుడు, సీత తనకు వశపడుతుందని, మూఢుడై భావిస్తూ, పరస్త్రీల విషయంలో పాటించాల్సిన
కనీస మర్యాదను కూడా మరచి అశోకవనంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి సీతాదేవిని
సమీపించాలని అనుకుంటాడు.
అదే సమయంలో రావణుడి వెంట వున్న స్త్రీల ఒడ్డాణాల లోని
గజ్జెల ధ్వనులు, ఇంపైన అందెల నాదం వినపడింది. వీరుడు,
సుందరుడైన రావణుడు, విశాలమైన వంకరకళ్లతో,
అపరమన్మధుడిలా, కామాతిశయంతో, సువాసనల తైలంతో తడిసిన దివిటీలు పట్టుకున్న స్త్రీలు వెంటరాగా, తోట వాకిట్లోకి వచ్చాడు. భుజబలంలో ఇంతటి గొప్పవాడని చెప్పలేని ఆరాక్షస
వీరుడు తెల్లటి వస్త్రాలు సవరించుకుంటూ వస్తుంటే, చూద్దామని
తలెత్తాడు హనుమంతుడు. ఆయన వెంటే వున్న, బంగారు ఒడ్డాణాలు,
రత్నాల గజ్జెలు ధరించిన సుందరీమణులైన వయస్సున్న స్త్రీలను చెట్టు
చాటునుండే చూశాడు హనుమంతుడు.
తనచుట్టూ వున్న స్త్రీలనడుమ నక్షత్రాల మధ్యనున్న చంద్రుడిలా
భావిస్తూ వస్తున్న వాడినీ, హారాలు, ఆభరణాలతో
సుందరంగా వున్నవాడినీ, మహాబలవంతుడినీ, కామానికి
దాసుడైనవాడినీ, మనోహర శరీరం కలవాడినీ, విశ్రవసుకుమారుడినీ,
చూసిన హనుమంతుడు, తను చూస్తున్నది
రావణుడినేనని అనుకుంటాడు. వాడిని పూర్తిగా చూసేందుకు, అనువైన
స్థలంచేరి , వాడెదురుగా కనిపించేవిధంగా, బలవంతుడు అయినప్పటికీ, వాడి తేజస్సు ముందర
తేజోహీనుడై కొమ్మల నడుమ దాగాడు.
యవ్వన, సౌందర్య సంపత్తిగల
రావణాసురుడు, ఆభరణాలతో అలంకరించుకుని, రాక్షసస్త్రీలను
కూడి తనవైపు రావడం, దూరాన్నుండే చూసిన సీత, ఈదురుగాలికి వూగే అరటి చెట్టులా
వణకసాగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తొడలతో కడుపును,
చేతులతో స్తనాలను, భయంతో కప్పుకుంటుంది. (సొమ్ములుమూట
కట్టడానికి ఉత్తరీయం వాడింది కాబట్టి, పైటకూడా
లేనందున, కడుపు కనపడకుండా తొడలను, రొమ్ములు
కనపడకుండా మోకాళ్లను అడ్డంపెట్టుకుని, రెండుచేతులు కట్టుకుని
బిగించిందని అర్థం. రావణుడిని చూసినప్పటి సీత పరిస్థితి
దారుణంగా వుందనుకుంటాడు హనుమంతుడు.
రాక్షస స్త్రీలగుంపు రక్షణలో దుఃఖిస్తూంది. సముద్రం మధ్యలో
విరిగిన ఓడలా, తీరంకొరకు వెతుకుతున్నదానిలా వుంది.
కటికనేలపై కూర్చుని, తెగనరికిన పూతీగలా, నిద్రాహారాలు మాని, వ్రతదీక్ష పూనిన దానిలా వుంది.
ఒంటరిగా దుఃఖిస్తూ, దుమ్ముపట్టిన దేహంతో, బురడంటిన తామరపూవులా వుంది. ఆభరణాలు ధరించే యోగ్యత వుండికూడా, అలాచేయలేని పరిస్థితిలో, దేహం శుష్కించిపోయింది. తన
దుఃఖం ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితిలో పొరలుతున్న "ఆడుపాము"లా
వుంది. గుణాలలో, నడవడిలో, ధర్మంలో,
సదాచారంలో, ప్రసిధ్ధికెక్కిన వంశంలో
పుట్టికూడా, నీచుడికి చిక్కిన దానిలా వుంది. కళంకరహితుడు,
తల్లికంటే తనపైనే ఎక్కువ ప్రేమున్నవాడు, తనదోషాలను
హరించి స్వీకరించే నిత్యనిర్దోషైన శ్రీరాముడి దగ్గరకు, సంకల్పమనే
గుర్రాలు నడుపుతున్న హృదయ రధంలో కూర్చుండిపోతున్న పతివ్రతా రత్నంలా వుంది.
నిష్కారణంగా నిందపడి చెడిపోయిన కీర్తిలా వుంది. ధనంపైనే
దృష్టి నిలిపి, లోభిగా, గురువుకేమన్నా
ఇవ్వాల్సివస్తుందేమోనన్న భయంతో, సరీగ్గా విద్యనేర్వనిదానిలా
వుంది. నశించిన కీర్తిని, ఆదరించబడని శ్రధ్ధను, పూజాద్రవ్యాలు లేనిపూజను, చెడిపోయిన ఆశను, చెదిరిపోయిన లాభాన్ని, వాడినపద్మాన్ని, కాలుతున్న దిక్కులను, విఘ్నమైన పూజను, చీకటితోకూడిన వెలుతురును, ఎండాకాలపు ఏరును
పోలివుందామె. శూరులందరూ చచ్చిన సైన్యంలా, వ్యర్ధమైన ఆజ్ఞలా,
రాహువు మింగిన చంద్రుడి కాంతిలా, చల్లారిన
అగ్నిలా కనిపించిందామె. మైలపడ్డ యజ్ఞవేదికలా వుంది. తామరపూలను, ఆకులను పీకేసి, అక్కడున్న పక్షులను పారత్రోలి,
ఏనుగుతొక్కిడికి బురదమయమైన తామరకొలనులా వుంది. మగడినే తలస్తూ,
అదేపనిగా సుకుమార నిర్మలదేహంతో అందగత్తెలలో శ్రేష్ఠురాలిగా వుందామె.
అప్పుడే ఎండలో పడేసిన తామరతూడులా వాడిపోయివుంది. యోధుడిని వదిలి, స్తంబానికి కట్టేయగా, తపించిపోతున్న ఆడ ఏనుగునుబోలి, ఒంటిజడతో, చూడడానికి దిగులుపుట్టేలా, సొమ్ముల్లేక, శరత్కాలంలోని నల్లనివన భూమిలా వుందామె.
భయంతో, దిగులుతో, ఆహారంలేకపోవడంతో, చింతతో, తపస్సుచేసేరీతిలో, శోకిస్తున్న సీత రావణుడిని చూసి తెల్లబోయింది. తనపతి పరాక్రమం
అతిశయించేట్లు చేసి, రావణుడికి అపజయం కలిగించి, రాముడు గెలిచేట్లు చేయమని రెండుచేతులూ జోడించి, భక్తితో
సమస్తదేవతలకు నమస్కరిస్తుంది. అన్ని దిక్కులు చూస్తూ ఏడుస్తున్న ఆ పవిత్రురాలైన
సీతను, పాపాత్ముడైన రావణుడు, తన మరణదశ
దగ్గరపడడంతో, ఆమెను సమీపించాడు (సీతను ఆడపామని చెప్పడం
అంటే, దానిని తాకినవారికి మరణం తప్పదని భావన. హృదయమనే
శరీరం కల ప్రాణాలు, అతివేగంగా పోతున్నాయని చెప్పడం జరిగింది.
అంటే సీతాదేవి శరీరమందున్నదేకాని, ఆమె హృదయం, ప్రాణం, భావం, సర్వం, శ్రీరాముడివద్దకు పోయిందని భావం. భక్తులు, పతివ్రతలు, ఇట్లా వుంటారని అర్థం)
No comments:
Post a Comment