అక్షర వైభవానికి అంకురార్పణ
ప్రపంచ తెలుగుమహాసభల
ఆలోచన, కార్యాచరణ,
పరిణామక్రమం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం
ప్రత్యేక సంచిక (10-12-2017)
ప్రపంచ
తెలుగుమహాసభలను చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో అత్యద్భుతంగా, అంగరంగవైభోగంగా, కనీ-వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలన్న
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనకు అంకురార్పణ జరిగింది
మొట్టమొదటిసారిగా మె నెల 2, 2017 న. ఈ సభలను జూన్ నెల 2
నుండి 10 వరకు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించాలని సీఎం
తొలుత భావించారు. ఆ రోజునే ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని
సిధారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు
జరుగుతాయని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగు మహాసభల నిర్వహణకు సంబంధించి
ప్రగతి భవన్లో ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మొదటి సమీక్షా సమావేశంలో, ఆ తరువాత ఈ అంశం మీద జరిగిన పలు సమీక్షా సమావేశాలలో పాల్గొనే అవకాశం నాకు
కూడా దక్కింది. తెలుగు మహాసభల
సందర్భంగా తెలంగాణ సాహితీ వైభవాన్ని చాటే విధంగా హైదరాబాద్ నగరాన్ని
తీర్చిదిద్దాలనీ, మహాసభలకు దేశ, విదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులను, తెలుగు భాష అభిమానులను
ఆహ్వానించాలనీ, అవదానాలు, కవి సమ్మేళనాలు,
వివిధ సాహిత్య ప్రక్రియలపై సదస్సులు నిర్వహించాలనీ, తెలంగాణ కవుల అముద్రిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలనీ...ఇలా పలు ఆలోచనలకు
అంకురార్పణ జరిగింది కూడా ఆరోజునే.
ఆ తరువాత మూడు
రోజులకు 05
మే, 2017 న మలి సమీక్షా సమావేశం, ఒక విధంగా
చెప్పుకోవాలంటే, మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం జరిగింది. తెలుగు
భాష-సాహిత్యాభివృద్ధి వ్యాప్తిలో తెలంగాణలో జరిగిన కృషి
ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ఆ సమావేశంలో ముఖ్యమంత్రి
కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా,
న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా,
గల్ఫ్ తదితర దేశాల్లో కూడా తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలున్నాయని, అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో
పాటు దేశంలోని ముంబాయి,
సూరత్, బీవండి, ఢిల్లీ,
చెన్నై, బెంగుళూరు, షోలాపూర్,
ఒరిస్సా తదితర ప్రాంతాల్లో కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి
చేస్తున్న వారున్నారని వారందరినీ తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. తెలుగు
మహాసభల నిర్వహణకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మహాసభల
ఆవిర్భావ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు పండిట్లను సహితం ఆహ్వానించాలని
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
‘‘తెలుగు భాషాభివృద్దికి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు.
అన్ని సాహిత్య ప్రక్రియల్లో తెలంగాణ వారు విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.
పోతన నుంచి మొదలుకుంటే ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు చేసిన వారున్నారు. ఎన్నో
సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారున్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన
అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు
నిర్వహించాలి. సినీరంగం,
పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన,
కవిత్వం, హరికథ, బుర్రకథ,
యక్షగాణం, చందోబద్ధమైన ప్రక్రియలు.....తదితర
అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానాంశాలుగా
తెలుగు మహాసభలు జరగాలి’’
అని సిఎం ఈ సమావేశంలో చెప్పారు. మహాసభల్లో భాగంగా కవి
సమ్మేళనాలు,
సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని
సిఎం సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవితా పోటీలు
నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖుల రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని సూచించారు.
మూడో
సమీక్షా-సన్నాహక సమావేశం 17 మే, 2017 న
జరిగింది. మహాసభల నిర్వహణపై చర్చించారు. దేశ, విదేశాల నుంచి
తెలుగు సాహితీరంగ ప్రముఖులను ఆహ్వానించడంతో పాటు ఏర్పాట్లు కూడా ఘనంగా చేయాల్సి
ఉన్నందున కొంత సమయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. జూన్ నెలలో కాకుండా అక్టోబర్ నెలలో
నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వెలువడింది.
ఆ తరువాత
సమీక్షా-సన్నాహక సమావేశం 12 సెప్టెంబర్, 2017 న జరిగింది. డిసెంబర్ 15 నుంచి 19, 2017 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న
నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సమావేశంలోనే తీసుకున్నారు.
తదనుగుణంగానే పూర్తి స్థాయిలో మహాసభల నిర్వహణకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను
వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నవంబర్ 28 నుంచి
హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ ఔత్సాహిక
పారిశ్రామిక వేత్తల సదస్సు కారణంగా అధికార యంత్రాంగమంతా తలమునకలై వుంటే తెలుగు
మహాసభలకు ఎదురయ్యే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ మూడోవారంలో
నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. తేదీల నిర్ణయంతో పాటు మహాసభల నిర్వహణ ఖర్చులకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల
నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది.
తెలంగాణలో
తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని
తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. మొదటిది: వచ్చే విద్యా సంవత్సరం నుంచి
తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ
తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సిఎం కేసీఆర్ విద్యా
సంస్థలను కోరారు. తెలుగును ఖచ్చితంగా
బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాథమిక,
మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్
తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా
సాహిత్య అకాడమీని సిఎం ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్ నే
అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు
పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా సిఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో
తెలుగు సబ్జెక్టు బోధించడం, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో
ప్రభుత్వం రూపొందించిన సిలబస్ నే బోధించడం విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా,
ఖచ్చితంగా వ్యవహరిస్తుందని సిఎం స్పష్టం చేశారు. ఇక రెండవది: తెలంగాణలో
నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ
బోర్డులను ఖచ్చితంగా తెలుగులో రాయాలని సిఎం పిలుపునిచ్చారు.
ప్రపంచ తెలుగు
మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి
జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహించాలనీ, తెలంగాణలో
వర్థిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనీ, గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయాలనీ, తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో వుండాలనీ
సమీక్షా సమావేశం నిర్ణయించింది.
ఎల్.బి.
స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. ఇతర వేదికల్లో పలు
సాహితీ సంబంధమైన కార్యక్రమాలు జరగాలనీ; ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనీ; బతుకమ్మ, గోండు
నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు,
కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ
లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో వుండాలనీ; తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ
ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలనీ; పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహించాలనీ; చుక్క పొడుగు
నుంచి పొద్దు గూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద
గేయాలు లాంటి అంశాలు ప్రదర్శించాలనీ సీఎం సూచించారు. ఇవి కాక, వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసి, గిరిజన,
శాస్రీకుయ, జానపద నృత్యాలు లాంటివి
ప్రదర్శించాలనీ; మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ
ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో తరానికి ఎలా
అందజేయబడ్డాయో కళ్లకు కట్టినట్లు చూపించాలనీ సీఎం చెప్పారు.
దేశ, విదేశాల్లో
ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు,
కవులు, కళాకారులు, రచయితలు,
కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానించాలనీ; దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు
నిర్వహించాలనీ; అమెరికా, యూరప్,
గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్,
మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక
సమావేశాలు నిర్వహించాలనీ; ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ
నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిమ్చాలనీ; తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరగాలనీ
సమావేశంలో సీఎం నిర్ణయించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగానే సన్నాహక కమిటీ సభ్యులు
పలువురు పలు ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించారు.
ఐదో
సమీక్షా-సన్నాహక సమావేశం 15 నవంబర్, 2017 న జరిగింది. గతంలో తీసుకున్న నిర్ణయాలను పునరుద్ఘాటించారు.
మహాసభల నిర్వహణకు సంబంధించి పురోగతిని సమీక్షించారు. తెలంగాణలో వెలుగొందిన తెలుగు
వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ
తెలుగు మహాసభలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
చెప్పారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికీ సంబంధించిన ప్రదర్శనలు
జరగాలని అన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచ
నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల
ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం
సూచించారు.
‘‘పద్యసాహిత్యం,
గద్య సాహిత్యం, అవధానం, జానపదం,
సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర
అంశాల్లో ఉద్దండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్దికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు
భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా
ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు
భాష వర్థిల్లుతూ వస్తున్నది. అనేక మంది పండితులు, కవులు,
రచయితే కాకుండా నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ లాంటి పాటల ద్వారా,
జానపద పరంపరను కొనసాగించారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు
తెలుగు మహాసభలు ఉపయోగపడాలి. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు
సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. ప్రతీ రోజు సాయంత్రం
ఎల్.బి. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని
సిఎం ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
‘‘మహాసభల
సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలి. స్వాగత తోరణాలు ఏర్పాటు
చేయాలి. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ
ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలి. ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు
వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలి. ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలియడానికి విస్తృత
ప్రచారం కల్పించాలి. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు,
బస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్ లు ఏర్పాటు చేయాలి. విదేశాలు,
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస, రవాణా,
భోజన సదుపాయాలు కల్పించాలి. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని
ప్రభుత్వ శాఖలు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ,
హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. పూర్తి సమన్వయంతో పనిచేయాలి. పాఠశాలలు,
కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్ డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి,
బాధ్యతలు అప్పగించాలి’’ అని ముఖ్యమంత్రి
చెప్పారు.
ఆరవ
సమీక్షా-సన్నాహక సమావేశం 20
నవంబర్, 2017 న జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై
సాహితీవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న
సమావేశం ఇది. దాదాపు ఐదుగంటలకు పైగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రతీ సాహితీ
వేత్త చెప్పిన అభిప్రాయాలను సీఎం ఓపిగ్గా విన్నారు. సభల నిర్వహణపై వారు చేసిన
సూచనలకు సిఎం స్పందించారు. తెలంగాణలో
జరిగిన సాహిత్య సృజన ప్రస్ఫుటమయ్యే విధంగా... తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా
పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే
గట్టి సంకేతాలు పంపే విధంగా... అత్యంత జనరంజకంగా... భాగ్యనగరం భాసిల్లేలా...
స్వాభిమానాన్ని ఘనంగా చాటిచెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ జరగాలని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణలో
జరిగిన సాహిత్య సృజన,
తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలని, అన్ని సాహిత్య ప్రక్రియలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు కూడా తగు ప్రాధాన్యత ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
సమావేశానికి వచ్చిన సాహితీ వేత్తలందరితో సీఎం విస్తృతంగా చర్చించారు. వారి నుంచి
సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతా కలిసి
స్వరాష్ట్రం కోసం ఎట్ల పనిచేశారో, తెలుగు మహాసభలను విజయవంతం
చేయడం కోసం కూడా అంతే పట్టుదలతో, సమన్వయంతో ముందుకుపోవాలని సమావేశంలో
సిఎం పిలుపునిచ్చారు.
‘‘తెలంగాణ
ప్రాంతంలో ఎంతో సాహిత్య సృజన జరిగింది. తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రతిభావంతులు
తెలంగాణలో ఉన్నారు. ప్రతిభా పాటవాలకు కొదవలేదు. కానీ తెలంగాణ వారి ప్రతిభ
రావాల్సినంతగా వెలుగులోకి రాలేదు. భాషాభివృద్ధి కోసం ఇక్కడ జరిగిన కృషి వెలుగులోకి
రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రపంచానికి చాటాలి. ఎవరినో
నిందించడానికి కాకుండా, తెలంగాణ స్వాభిమానాన్ని ఘనంగా
చాటుకునేలా సభల నిర్వహణ ఉండాలి. అన్ని భాషా ప్ర్రక్రియలపై ప్రత్యేక
కార్యక్రమాలుండాలి. చిత్ర లేఖనంతో పాటు ఇతర కళలకు ప్రాధాన్యత ఉండాలి. మన ప్రతిభ,
గొప్పతనం వెలుగులోకి రావాలి. అముద్రిత గ్రంథాలను ముద్రించాలి. అత్యంత
అట్టహాసంగా, కోలాహలంగా మహాసభలు జరగాలి. మహాసభల సందర్భంగా
హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలి. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలి. భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లుండాలి.’’
అని ముఖ్యమంత్రి సూచించారు.
‘‘తెలుగు
మహాసభల సందర్భంగా తెలుగుకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే విశ్వాసం కలిగించాలి. తెలంగాణ
ప్రభుత్వం 12వ తరగతి వరకు (ఇంటర్మీడియట్) తెలుగు సబ్జెక్టును
ఖచ్చితంగా బోధించాలనే నిబంధన పెట్టింది. దీనికి సర్వత్రా ఆమోదం లభిస్తున్నది.
తెలుగు భాషను అభ్యసించిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా
దొరికే విధానం అమలు చేస్తాం. అమ్మను కాపాడుకున్నట్లే తెలుగును కాపాడుకోవాలి.
తెలుగులో విద్యార్థులకు సామాజిక అవగాహన, నైతిక విలువలు,
పెద్దల పట్ల గౌరవం పెంచే పాఠ్యాంశాలను బోధించాలి. కేవలం మహాసభలు
నిర్వహించడమే కాకుండా, తెలుగు భవిష్యత్ కు సంబంధించిన
సంకేతాలు కూడా మనం పంపించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ సమావేశం
జరగడానికి ముందు నవంబర్ 17, 2017 న సీఎం శాసనసభలో మహాసభల గురించి ఒక ప్రకటన చేసారు. మహాసభల
విశిష్టతను సోదాహరణంగా విశదీకరించారు.
ఒకటివెంట మరొకటి
అన్నట్లుగా సమీక్షలు, సన్నాహక సమావేశాలు నిత్యం జరిగాయి.
No comments:
Post a Comment