Monday, December 25, 2017

రావణుడిని తృణప్రాయంగా చూసిన సీతాదేవి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రావణుడిని తృణప్రాయంగా చూసిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (25-12-2017)

దుష్ట రావణుడిద్వారా ఇలాంటి మాటలు వినాల్సివచ్చెకదా అని, కళ్లల్లో నీరు కారుతుంటే, ఏడుపుగొంతుతో, వణకుతూ, మనసులోనే దిగులుపడుతుంది పతివ్రతా శిరోమణి సీత. అసహాయ కావడంతో, తొందరపడి వీడు తన్ను తాకుతాడేమోనని భయంతో వణకిందికూడా. వాడిని దహించగల శక్తి తనకున్నా, సాధ్వి అయినందున, సహించి వూరుకుంది. ఆపత్కాలంలో దేవుడిని ప్రార్థించినట్లే, పతివ్రతలకు భర్తే దైవం కనుక, శ్రీరాముడిని తలచుకుంది. తనను వీడేమీ చేయలేడన్న ధైర్యం తెచ్చుకుని, తన కోసం ఏడవకుండా, భర్తకు తనవల్ల దుఃఖం వచ్చింది కదా అని బాధపడింది. చెప్పినా వినకుండా, తనకారణాన రావణుడు సర్వనాశనమైపోతున్నాడే అని, వాడికొరకూ కన్నీరు కార్చింది. ఇలా అనుకుంటూ, పరిశుధ్ధమైన చిరునవ్వుముఖంతో ఒక "గడ్డిపోచ"ను తనకడ్డంగా రావణుడి ముందు పడేసింది సీత.



(రావణుడు దుష్టుడైనా ప్రభువు, క్షత్రియుడు. పైగా తన దగ్గరకొస్తున్నాడు కాబట్టి వాడు అతిథే. అతిథిని సత్కరించాలని శాస్త్రాలు చెప్పుతున్నందువల్ల తనకు లభించిన "తృణం" వాడివైపుకు వేసిందని ఒక భావన. "నిన్ను నేను తృణప్రాప్రాయంగా చూస్తున్నాను. ఈ తృణం నన్నేమి చేయగలదో నువ్వూ అంతే" అనేది మరో అర్థం. రావణుడు పశువుతో సమానమనే అర్ధమొచ్చే రీతిలో వాడి భోగ్యవస్తువైన గడ్డిపోచ వేసింది సీత. ఇలా ఎన్నో అర్ధాలను, విశేషాలనూ సెలవిస్తారు మన పెద్దలు  గడ్డిపోచను మధ్యలో వేయడంలో)

తన్నుపొగడుకుని, రాముడిని దూషించిన రావణుడికి బుధ్ధి చెప్తూ సీత ఇలా అంటుంది వాడితో:
"అందని పండుకై అర్రులుచాచినట్లు నాపైమనస్సు పోనీయకు. పాపాత్ముడికి ముక్తి ఎట్లా లభించదో, నీకు నేనట్లే. నువ్వెంత వేడుకున్నా లాభం లేదు. నామీదుంచానంటున్న నీ మనస్సును, నీ భార్యలపై మరల్చు. అలా చేయకపోతే కీడుకలుగుతుంది. నిష్కారణంగా నువ్వు నీ భార్యలను అవమానించవద్దు. వారిని ఉపేక్షించవద్దు, నన్ను అపేక్షించవద్దు. నేను పుట్టింది పుణ్యాత్ముల వంశంలో. మెట్టింది అంతకంటే పూజ్యులైన వారింట్లో. పతివ్రతా నియమాన్ని స్వీకరించినదాననైన నేను చేయరాని చెడుపనెలా చేస్తాను? అలాచేస్తే ఇరువంశాలవారిని నరకం పాలుచేసినట్లేకదా! ఇదంతా ఆలోచించకుండా, శాస్త్ర, లోక, ఆత్మవిరుధ్ధమైన వాగుడు మాటలనెందుకు వినిపిస్తున్నావు రాక్షసుడా?". ఇలా అంటూనే, ఆపాపాత్ముడెదురుగా ముఖముంచడం దోషమనుకుంటుంది సీత. వాడిని లక్ష్యపెట్టకుండా వెనక్కుతిరిగి, వాడికి బుధ్ధివచ్చి బాగుపడుగాక అనుకుని వాడితో ఇలా అంటుంది మళ్లా:

"ఓరీ రాక్షసుడా! నేనుపతివ్రతను. ఇతరుడి భార్యను, నీభార్యను కాదు. పరస్త్రీల విషయంలో పరపురుషుడెట్లా వ్యవహరించాలో ఆ సాధుమార్గం తెలుసుకో...తెల్సుకుని ఆమార్గంలో నడువు. నిష్కారణంగా ఎందుకు పాపం మూటకట్టుకుంటున్నావు? నీవు, నీ భార్యల పాతివ్రత్యాన్ని ఎట్లా రక్షించాలనుకుంటున్నావో, అలానే ఇతరుల పాతివ్రత్యాన్ని కూడా కాపాడు. పాతివ్రత్య  నియమం మంచిదికాబట్టి అదెక్కడున్నా రక్షించాల్సిందే. కాదంటావా? నీ భార్యలు రంకుతనం చేస్తే ఏంతప్పు? ఇతరుల భార్యలను నీవు ఆశిస్తున్నావంటే, నీభార్యల వ్యభిచారాన్ని ఒప్పుకుంటున్నట్లేకదా! కాబట్టి నిన్ను ఉపమానంగా తీసుకుని, నీవు ఇతరుల భార్యలను ఆశిస్తే, నీభార్యను ఇతరులు ఆశించినా తప్పులేదని తెలుసుకో. నన్ను ఆశించకు."

"బాహ్య ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేకుండా, తనభార్యతోనే తృప్తిపడని మూఢుడి బుధ్ధి, పూర్వపుణ్యం, ఐశ్వర్యం, సంతానం, ఆయుషులన్నింటినీ, పరస్త్రీలు నాశనం చేస్తారు. కాబట్టి జారత్వమెంత కీడో తెల్సుకుని బుధ్ధికలగి ప్రవర్తించు. నీవు చేస్తున్న పని చేయతగనిది అయినప్పుడు, ఇదితప్పు, తగదు, హానికరం, అని నీ మేలుకోరి చెప్పేవారు, నీ వూళ్లో ఎవరూ లేరా? విభీషణుడి లాంటివారున్నారు కదా! కాని ఏమి లాభం? ధర్మా-ధర్మాలు తెలుసుకునేందుకు నీవు వాళ్లదగ్గరకు పోతున్నావా? వాళ్లను చెప్పనిస్తున్నావా? నువ్వెళ్లి నమస్కరించి అడిగితే కదా మంచిచెప్పేది. నీ దుష్ప్రవర్తన, పాపకార్యాలు చేయడం, చూస్తుంటే, నీకూ, సాధువులకూ చాలా దూరమనిపిస్తున్నది. అట్లా కాకపోతే నీవిట్లా విపరీతంగా మాట్లాడలేవు."

"నీవడక్కపోయినా, నీమేలుకోరేవారు నీకు మంచిమాటలు చెప్పేవుంటారు. కాని నువ్వు వింటేగా? నీమూలాన రాక్షసులందరూ చావాల్సొస్తున్నదిప్పుడు. వీళ్ళంతా ఇంతవరకూ నీవేదో గొప్పవాడవనుకుని, నీ ఆశ్రయంలో వుంటే మేలనుకుంటున్నారు. నీతో స్నేహంగాకూడా వున్నారు. వాళ్లు నీ మంచి కోరుకుంటున్నట్లు, నీవు వారి మంచి కోరుకోవడంలేదని అనిపిస్తోంది. నీ స్నేహం అబద్దం. నీవు చెడి వారందరినీ చెడగొడుతున్నావు. నీది మిధ్యా స్నేహం. పుణ్యాత్ములవల్ల చక్కదిద్దబడని మనస్సు, స్వభావం నీది. నీలాంటి చెడునడవడి వున్న రాజు కారణాన, పట్టణాలు, సంపద, రాజ్యం, నాశనం అవుతాయి. నీ ఒక్కడిపాపం వల్ల, అందమైన ఈ లంకంతా నాశనం కాబోతున్నది. ఓడనడిపేవాడు, చిత్తుగా త్రాగి, సుడిగుండంలోకి నడిపితే, వాడిని నమ్మి అందులో వున్నవారంతా చస్తారుకదా!"


"దూరపు చూపులేక, ఎప్పుడు ఏం తోస్తుందో అప్పుడది చేసుకుంటూ పోతూ, ధర్మాధర్మ విచక్షణ చేయక, పాపకార్యాలందు మనస్సు పోనిచ్చే వున్మాది, వాడి పాపాలకు వాడే బలై చస్తే, ప్రజలంతా నిర్భయంగా, సుఖంగా నిద్రపోతారు. స్నేహం నటిస్తూ, కీడుకలిగిస్తున్న నీలాంటి మోసగాడు కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు, ఈ దుష్టుడు, కర్మకొద్దీ చిక్కుల్లో పడ్డాడనీ, వీడు నాశనమైపోతే మంచిదనీ నిన్ను తిడ్తారు. సంతోషిస్తారు. ఎందుకు నిందల పాలై రెండులోకాల్లో చెడిపోతావు?" (ఎవరికీర్తి ఎంతవరకు లోకంలో వుంటుందో, అంతకాలం వాడు స్వర్గంలోనూ, అపకీర్తి వున్నంత వరకూ నరకంలోనూ వుంటాడు).

No comments:

Post a Comment