Sunday, December 31, 2017

రావణుడికి కర్తవ్యబోధ చేసిన సీతాదేవి ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రావణుడికి కర్తవ్యబోధ చేసిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-01-2018)

సీత రావణుడికి ఇంకా ఇలా కర్తవ్యబోధ చేస్తుంది:
"రావణా! నీవు మూఢుడివిరా! రామచంద్రమూర్తి నుండి నన్ను వేరుచేయడం నీకు చేతనవుతుందా? సూర్యుడికి ఎండలా, నేను శ్రీరామచంద్రుడికి "అనన్య"ను. నన్నాయన నుండి వేరుచేయలేవు. భోగభాగ్యాలను ఎరబెట్టి నన్ను మోసగించాలని చూస్తున్నావు. నీవు అవివేకివి. ఎండ సూర్యుడిపైన ఆధారపడ్డప్పటికీ, ఆ ఎండ మూలాన్నే, ఆయన ఉనికి తెలిసి, ఆయన్ను పూజిస్తున్నారు. అట్లే నేనూ రాముడి దానినైనా, ఆయన మీద ఆధారపడ్డ పరతంత్రనైనా, నేనే ఆయన్ను లోకానికెక్కువగా వుపయోగపడేటట్లు చేస్తున్నాను. ఆయన మహిమ లోకమంతా తెలవడం నావల్లనే. నేనులేకపోతే, ఆయన ఉనికేలేదని చెప్పాలి".

(మారీచుడు రావణుడితో "జనకాత్మజ సంబంధంబున రాముండప్రమేయ పురుతేజుండయ్యె" నని చెప్పాడు. అవివేకైన రావణుడికి అది అర్థం కాలేదని సీత గుర్తుచేస్తుందిక్కడ. యాచకులు లేని దాతలు, రోగులు లేని వైద్యులు లేనట్లే, ప్రపంచం లేకపొతే భగవంతుడు లేనేలేడు. ప్రకృతిమూలాన్న తప్ప, భగవంతుడిని తెల్సుకునే మార్గమే లేదు. ఆ భగవంతుడి శక్తే "లక్ష్మి". ఆమే "మాయ". ఆమే "ప్రకృతి". ఆమె ’చిద్విలాసమే’ ప్రపంచం. ప్రపంచం, భగవంతుడు వేరు-వేరు కాదు.  లక్ష్మి అనుగ్రహిస్తేనే ప్రపంచాన్ని దాటుతాం. భగవదనుగ్రహానికి నోచుకుంటాం. ఆమెను వశపర్చుకోవడానికి, నమస్కారమే సాధనం కాని, బలాత్కారం, ధన, విద్యాబలం మాత్రం కానేకాదు. ఎప్పుడెప్పుడు విష్ణువు అవతారమెత్తుతాడో, అప్పుడన్ని సమయాల్లో శ్రీదేవి ఆయనకు సహాయంగా రావాల్సిందే. ఆయన దేవతలందు అవతారమెత్తితే, ఈమె దేవత్వాన్ని ధరిస్తుంది. మనుష్యుల్లో అవతారం ఎత్తితే మనుష్య  స్త్రీగా అవతరిస్తుంది. విష్ణు దేహానికి అనురూపమైన దేహాన్ని ధరిస్తుంది. ఆమె "అనన్య". అంటే, చీకటి-వెలుతురు లాగా అన్యం కాకున్డా వుంటుంది. సూర్యుడు, ఎండ, చంద్రుడు, వెన్నెల, సముద్రం అలల్లా. ఇంతే "జీవాత్మ-పరమాత్మ"ల అనన్యత్వం. జీవుడు "పరమాత్మ" అంశ. ముముక్షువగు బధ్ధ జీవుడు సీతాదేవి శ్రీరాముడి పట్ల ఎటువంటి అభిప్రాయం కల్గి, ప్రవర్తించి, లంకనుండి విముక్తు రాలైందో, అలాగే పరమాత్మ విషయంలో విశ్వాసం వుంచి, ప్రవర్తించి విముక్తుడు కావాలి. కాకపోతే ఎక్కడాకూడా, సీతాదేవి, తానే రాముడనలేదు-రాముడూ సీత తానే అనలేదు.)

“సర్వలోక ప్రసిధ్ధుడు, జగన్నాధుడూ అయిన నాభర్త భుజాన్నే తలదిండుగా చేసుకుని పడుకున్న నేను, పేరూ-ప్రతిష్టాలేని, ఓ అనామకుడిని చేత్తోకూడా తాకను. ఆరంగాలతో వేదం చదివి, సత్యం, సదాచారం కలిగి, సాధుసాంగత్యం చేసి, జీవాత్మ, పరమాత్మ సంబంధం తెల్సిన, బ్రాహ్మణోత్తముడికి, సకల గుణాభిరాముడికి, భూపతికి, తగిన భార్యను నేను. దీంట్లో ఒక్క గుణంకూడా లేనినిన్ను చేత్తో కాదు, కాలితోకూడా తాకను. ఎందుకు భ్రాంతితో నన్ను ఆశిస్తావు? కనీసం నీయోగ్యతెంతో తెలుసుకునే శక్తికూడా నీకులేదే!

(ఆరంగాల వేదం చదవగానే లాభంలేదనే అర్థం వచ్చేటట్లు చెపుతుంది సీత రావణుడికి. సత్యం, శీలం, కలవాడై వుండాలి. రావణుడు వేదాలు చదివినా, సత్య-శీలాలు లేవు. ఆయన శుధ్ధ బ్రాహ్మణుడు కాడు, శుధ్ధ క్షత్రియుడూ కాడు. హనుమంతుడు లంకనుండి తిరిగొచ్చిన తర్వాత, "క్ష్మా విభుదేశుడు"-భూదేవికి, దేవతలకు ఈశుడు-రాముడు, ఆయన్ను రాక్షస బలా-బలాలను గురించి అడిగాడట. జవాబు విన్న రాముడు: "అగ్నిహోత్రాలు-వేదాలూ వున్న వారిని జయించడమెట్లాగా" అని అడుగుతాడు. "దయ, సత్యం, శౌచం" వారికి లేవని చెప్పాడు బదులుగా అంజనేయుడు. "సాధుసాంగత్యం" కూడా లేదన్నాడు. ఇదిలేకపోతే, మిగిలనివన్నీ వృధానే! దుర్జనసాంగత్యం కూడా మానాలి. అప్పుడు ఇదివిన్న రాముడికి ధైర్యం కలిగిందట)

"నీకర్తవయం ఏంటో చెప్తావిను. అడవిలో ఒంటరిగా చిక్కి ఏడుస్తున్న, ఆడ ఏనుగు దగ్గర మగ ఏనుగును విడిచినట్లే, నాభర్తను ఎడబాసి వగస్తున్న నాదగ్గరకు, నామగడిని తెచ్చి విడువు. (తనను తీసుకొనిపోయి రాముడిదగ్గర దింపమని అడగలేదు). అలాచేస్తే నిన్ను "నయమతి" అంటారు, దుర్నీతిపరుడన్న చెడ్డపేరు కూడా పోతుంది. ఇదివరకులా ముందు, ముందు కూడా సుఖంగా రాజ్యం చేయదల్చు కుంటే, క్షణమైనా ఆలస్యం చేయకుండా, శరణాగత వత్సలుడైన శ్రీరాముడికి నన్ను అర్పించు. జీవించి ఈలోకంలో సుఖపడాలన్నా, మరణించి యమకింకరుల చేతిలో నరక బాధలు అనుభవించ వద్దనుకున్నా, నేనుచెప్పినట్లు చేయి. చేయకపోతే రాముడు నిన్ను చంపడం ఖాయం. ఇహ-పర సుఖాలు కావాలనుకున్టే రాముడికి అనుకూలంగా వుండాల్సిందే. నీకు మంచిమాటలు చెప్పేవారెవరూ లంకలోలేరు. నీమేలుకోరి, నీపైనజాలికలిగి, నీవుచెడిపోవడం ఇష్టంలేక నేనేచెప్తున్నాను, విను. రాముడికి అనుకూలుడనై ప్రవర్తిస్తానని మనసులో అనుకున్నా చాలు...వెంటనే నిన్నాయన రక్షిస్తాడు. నీవెంత ఘోరపాపం చేసినా క్షమిస్తాడు. ఆయనకు శత్రువులందూ వాత్సల్యమే....పురుషోత్తముడు. నీతో ఆయన్ను పోల్చుకోకు. ధర్మమే, ధర్మగుణమే భూషణం కలవాడాయన. ధర్మాత్ముడు. నీముఖం చూడగానే నువ్వు క్రూరుడవని ఎట్లా గురుపట్టవచ్చో, ఆయన్ను చూస్తే ధర్మాత్ముడని గుర్తించవచ్చు".


"నిష్ప్రయోజనమైన నీ చెడుబుధ్ధి వదులుకో. రాముడు దయాస్వరూపుడు. మానమే ఆయన ధనం. ఆలస్యం చేయకుండా నన్నాయనకు సమర్పించుకో. నీవూ సేవించు. నీకుమేలుకలుగుతుంది. యముడి ప్రేరణతో నీవు నామాట వినకపోతే, యుద్ధంలో నీచావు ఆయన చేతుల్లో తప్పదు. బ్రహ్మ, శివుడి వరాలు పొందిన నీమీద ఇంద్రుడి వజ్రాయుదం పనిచేయకపోవచ్చు. యమధర్మరాజు కళ్లుకప్పొచ్చు. ఉదాసీనత మాని నామాటలను జాగ్రత్తగా విను. రామచంద్రమూర్తికే కోపం వస్తే, నిన్ను, బ్రహ్మ, రుద్రాదుల వరాలు కాపాడలేవు. ఆయన బాణాలు నిన్ను, నీవంటి వారినందరినీ, క్షణకాలంలో ముక్కలు-ముక్కలు చేసి చీలుస్తాయి. ఆయనకు కోపం రానంతవరకూ, బాణమ్ తీయనంతవరకే నీబ్రతుకు".

"నామాటవినకపోతే, ఇంద్రుడు విడిచిన పిడుగుల్లా, భయంకర ధ్వనితో రామబాణాలు నిన్ను తాకుతాయి. అవి వినకముందే  తెలివితెచ్చుకో. ఓసారి ఆ శబ్దం విని శరణుకోరవచ్చులే అనుకోవద్దు. ఆ శబ్దం నీచెవినపడకముందే, బాణం నీరొమ్ములోకి పోతుంది. నేలకూల్తావు. ఆయన బాణాలెట్లా వస్తాయో తెలియదుకనుక నిన్ను నీవు గొప్పవాడివిగా చెప్పుకుంటున్నావు. మారీచుడికీ, శూర్ఫణకూ తెలుసు వాటిసంగతి. వాళ్లుచెప్పేవుంటారు. నీశరప్రయోగాలు నీటిబిందువులలాంటివి. రాముడివి పిడుగుల్లాంటివి. ఈ తారతమ్యాన్ని అనుభవపూర్వకంగా మున్ముందు తెలుసుకుంటావు. పిడుగులు, ఒకటో రెండో పడి ఆగిపోయినట్లు, రాముడు వూరిబయటనుండి ఒకటో రెండో బాణాలను విడిచి పోతాడనుకోకు. వేగంలో, శక్తిలో పిడుగుల్లాంటివేకాని సంఖ్యలో కాదు. క్రూరసర్పాలు విశాగ్నిని కక్కుతూ, కోరలూడిస్తూ, గుంపులుగా దూరినట్లే, రామలక్ష్మణుల పేర్లు చెక్కబడిన భయంకర బాణాలు లంకలో చొచ్చి రాక్షసులపైన పడితే, చచ్చినవారితో, భయపడి పరిగెత్తేవారితో, లంకంతా అల్లకల్లోలమై పోతుందన్న సంగతి ఆలోచించుకో. "

"రామలక్ష్మణులు విడిచే గ్రద్ద ఈకల బాణాలు, ఈ పట్టణమంతా వ్యాపించి, పీనుగులపెంటలు పెరిగిపోతే, రాక్షసుల ఇళ్లల్లోని స్త్రీల ఏడ్పులు ఆకాశన్నంటుతాయి. కోట్లాది రాక్షస మూకలు గరుత్మంతుడి నోట చిక్కిన పాములసమూహాల్లా మారుతారు. రాముడనే గరుత్మంతుడు, బాణాలనే ముక్కుతో, రాక్షసులనే సర్పాలను చీల్చి చెండాడుతాడు. పాములెన్ని వున్నా గరుత్మంతుడి ముందు గెలవలేవుకదా!".

"ఇంద్రవిరోధైన బలిచక్రవర్తినుండి విష్ణుమూర్తి ఇంద్రస్థానాన్ని వశపర్చుకున్నట్లే, శ్రీరాముడు నీస్వాధీనంలో వున్న నన్ను తీసుకునిపోతాడు. రాముడు ఒంటరివాడుకదా, ఏంచేస్తాడని అనుకోవద్దు. వామనుడూ ఒంటరివాడే. బలపరాక్రమాలు ముఖ్యం కాని, ఒంటరితనం  కాదు. యుద్ధంలో రాముడు నీకు సాటికాదంటివికదా! అట్టహాసంతో వచ్చిన రాక్షసులందరినీ రాముడు చంపిన తర్వాత, ఆయనను ఎదిరించే ధైర్యం లేక, ఒంటరిగా వున్న నన్ను, వంచనతో రామలక్ష్మణులిద్దరూ లేనిసమయంలో ఎత్తుకొచ్చావు. ఇది దొంగ చేసే పని, శూరుడుచేసేది కాదు. ఇట్లాచేసి కూడా ఇంకా శూరుడవని చెప్పుకోవడానికి సిగ్గులేదా? పులులవాసన తగిలి కుక్కలు పరిగెత్తినట్లుగానే, నువ్వూ యుధ్దభూమిలో నిలువలేక పారిపోతావు."

"నీశక్తి, రామలక్ష్మణుల శక్తి బేరీజు వేసుకోకుండా, విరోధం కొనితెచ్చుకున్నావు. నీవు బలహీనుడవు. యుద్ధంలో వాళ్లను ఎదిరించలేవు. ఎదిరిస్తే వాళ్లబాణాల తాకిడికి చస్తావు. నా భర్త త్వరలోనే తనతమ్ముడితో ఇక్కడకు రావడం తధ్యం. నీమీద కోప్పడటమూ తధ్యమే. ఎండాకాలంలోని సూర్యుడు చిన్న గుంటలోని నీళ్లను కిరణాలతో పీల్చివేసినట్లే, నిన్ను ఊర్ధ్వలోకమైన కైలాసంలో దాక్కున్నా, అధోలోకమైన వరుణుడి నగరంలో దాక్కున్నా, పిడుగు చెట్టును పడగొట్టిన రీతిలో పడేయడం కూడా తధ్యం." 

No comments:

Post a Comment