Sunday, December 2, 2018

శ్రీరాముడితో యుద్ధం చేసిన ఖరుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-37 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడితో యుద్ధం చేసిన ఖరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-37
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (02-12-2018)
         యుద్ధంలో దూషణుడు, త్రిశిరుడు చావడం చూసి ఖరుడు తన గుండె ఝల్లుమనగా ఇలా అనుకున్నాడు. “ఆహా! ఇదేమి విక్రమం? ఔరా! ప్రసిద్ధికెక్కిన బలశాలులను పద్నాలుగు వేలమందిని, దూషణుడుని, త్రిశిరుడుని ఒక్కడిని కూడా వదలకుండా ఒంటరిగానే రాముడు చంపాడు. ఏమి భయంకర బలం? నేనొక్కడినీ వీడికి లక్ష్యమా? అయినా కానిమ్ము. చూస్తాను” అనుకుంటూ, ఇంద్రుడిమీదకు నముచి పోయిన విధంగా క్రూరమైన బాణాలను కుప్పలు-కుప్పలుగా ప్రయోగించి తన అస్త్ర-శస్త్ర విద్యాపాండిత్యాన్ని ఆసాంతం వెల్లడయ్యేలా ఖరుడు యుద్ధం చేసాడు. ఖరుడి అస్త్రాలను, శస్త్రాలను రామభద్రుడు ఏమాత్రం లెక్కచేయకుండా, మనస్సు చెదరనీకుండా, తన భుజపరాక్రమం ప్రకాశించేట్లు మహావేగంగా పోయే బాణాలను ఆకాసంలో సందులేనట్లు వేయడంతో ఆ బాణాల సమూహం ఆవరించిన సూర్యుడు కనిపించలేదు. ఆ ప్రకారం ఖరుడు, రాముడు యుద్ధం చేశారు. ఖరుడు కూడా పదునైన బాణాలతో రాముడుని నొప్పించాడు.

         ఇలా రాముడుని నొప్పించిన ఖరుడు, ఇంత యుద్ధం చేసినా, ఇంతమంది రాక్షసులను వధించినా, ఈ సింహవిక్రముడు అలసి పోలేదేంటని ఆలోచించాడు. ఇక రామభద్రుడు , ఖరుడుని ఒక సింహం అల్ప మృగాన్ని చూసినట్లు చూసాడేకాని, వాడొక బలవంతుడైన రాక్షసుడని అనుకోలేదు. అల్పుడైన ఖరుడు సూర్యుడులాగా ప్రకాశించే బంగారు రథం మీద నుండి, గిర-గిరా విల్లును తిప్పుతూ పాశాన్ని చేతిలో వుంచుకున్న యముడిలాగా రామభాద్రుడిని సమీపించాడు.

         కార్చిచ్చు సమీపించే మిడతలాగా రాముడిని తాకి తన హస్త లాఘవం మెరిసేట్లు రామభద్రుడు పట్టుకున్న విల్లు, విల్లును పట్టుకున్న పిడికిలి చీలేట్లు కరకుములుకులను ప్రయోగించి, సూర్యుడితో సమానమైన ఏడు బాణాలను రామభద్రుడి కవచం నేలమీద పడేట్లు వేగంగా కొట్టాడు. ఇలా తన కవచాన్ని నేలబడగొట్టడం సహించని రామభద్రుడు రోషంతో భయంకరమైన యుద్ధ భూమిలో ప్రకాశించాడు. కోపం రూపం ధరించినట్లై ఖరుడుని చంపడానికి అగస్త్యుడు ఇచ్చిన వైష్ణవ ధనస్సును తీసికొని ఖరుడి ధ్వజం విరిగి నేలబడేట్లు కొత్తగా అది పడిపోయింది. యుద్ధ రహస్యం తెలిసిన ఖరుడు నాలుగు పదునైన బాణాలతో రామభద్రుడి ఆయువుపట్టువు మీద వేసి నెత్తుటి దేహంగల వాడిగా రాముడిని చేశాడు. రాముడు కూడా ఒక బానాని ఖరుడి శిరస్సుమీద, రెండు బాణాలు చేతులపైనా, మూడు బాణాలు పోత్తమీడా నాటేట్లు వేశాడు. ఖరుడు ప్రతిగా వేసే బాణాలను లక్ష్యపెట్టక రామభద్రుడు పదమూడు బాణాలు సంధించి, ఒకదానితో కాడిని, నాలుగు బాణాలతో గుర్రాలను, ఒక బాణంతో సారథిని, మూడు బాణాలతో నోగాను, రెండింటితో ఇరుసును, పన్నెండో బాణంతో విల్లును తుంచాడు. పదమూడో బాణంతో ఖరుడి దేహాన్ని చీల్చేట్లు వేయగా అతడు గుర్రాలు, సారథి లేకపోవడంతో, గద తీసుకొని భూమ్మీదకు దిగాడు.

         చేతిలో గద పట్టుకొని నిలిచి వున్న ఖరుడిని చూసి సీతాపతి మెత్తటి మాటలతో, హృదయాన్ని పుండులాగా తగిలే కఠినవాక్కులతో ఇలా అన్నాడు. “ఓరీ! నీచ రాక్షసుడా! విస్తారంగా రథాలు, గుర్రాలు, ఏనుగులు, వుండబట్టి గర్వంతో, దయలేకుండా లోకులు నిందించే చెడ్డ పనులు చేశావు. ప్రజలకు కీడు, బాధ కలిగించే పాపకార్యాలు చేసేవాడు పరమేశ్వరుడైనా కీడు పాల్పడుతాడు. పాపీ! ఇక నువ్వెంత? ఇంట్లో చేరిన పామును చంపడానికి ఎలా జనాలు ప్రయత్నం చేస్తారో, అలాగే, లోకంలో కీడు కలిగించే పనులు చేసేవారిని, దుష్టులను, వారి గర్వం అణిగే విధంగా సాధువులు, సాధువులు కానివారు కూడా ప్రయత్నం చేస్తారు. దుష్టుడు నల్లికంటి పాము వడగళ్ళను తిని చచ్చినట్లు చస్తాడు. నేనేం పాపం చేశాను? నేను పాపం చేస్తే నాకీ సంపద వచ్చేదా? అంటావేమో? ఓరీ! నీచ రాక్షసా! దండకారణ్యంలో తిరిగే మునిశ్రేష్టులను, ధర్మబద్ధులను, పరులకెవ్వరికీ బాధ కలిగించని సాధువులను, నీ ఇష్ట ప్రకారం గర్వంతో చంపావు కదా? దానివల్ల ఏం మేలుకలుగుతుందని భావించావు?

“సాధారణంగా ఈ జన్మలో చేసిన పుణ్య-పాప ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి రావు. పోయిన జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో సంపద వస్తుంది. అయినా ఏం లాభం? పుణ్యం వల్ల కదా మనకు ఐశ్వర్యం కలిగిందన్న జ్ఞానం లేకుండా మదమెక్కి పాపాలు చేసేవారి సంపద వేరుతేగిన చెట్టులాగా దీర్ఘకాలం నిలవదు. త్వరలోనే నశిస్తుంది. అలాగే పోయిన జన్మలో నువ్వు చేసిన పుణ్యఫలం తీరింది. పాప ఫలం అనుభవించే సమయం ఆసన్నమైంది. విత్తనం నాటగానే పూలు, పళ్ళు చేతికి రానట్లే పాపం చేసిన వెంటనే పాపఫలం రాదు. చెట్లు ఋతువులు వచ్చినప్పుడే కదా పూలు పూస్తాయి. అలాగే మనిషి తాను చేసిన పాపఫలం సమయం వచ్చినప్పుడు తప్పక అనుభవిస్తాడు. విషంతో కలిసిన అన్నం తింటే, ఎలా తప్పకుండా కీడు కలుగుతుందో, అలాగే పాపఫలమైన కీడులను శీఘ్రంగా ఏ విధంగానైనా అనుభవించక తప్పదు”.

“పాపకార్యాలు చేసే పాపాత్ములను, లోకంలో కీడు చేసే దుష్టులను చంపడానికి రాజాజ్ఞ తీసుకొని వచ్చాను రాక్షసుడా! పుట్టలోకి పాములు పోయే విధంగా నా బాణాలు నీ శరీరంలో దూరి నిన్ను నీ సైనికులతో, మిత్రులతో సహా, నువ్వు ఇంతకు ముందు చంపిన మునుల దగ్గరకు పంపుతాయి. నీ దేహంలో ఎంత గర్వముందో ఇప్పుడే చూపించు...చూస్తా. యుద్ధరంగంలో నా బాణాలతో నేలకూలి బాధపడుతున్న నిన్ను, నువ్వు వధించిన మునులు ఆకాశంలో విమానాల నుండి చూసి సంతోషిస్తారు. తాటి పండు నేలపడగొట్టినట్లు నీ శరీరాన్ని నేలబడగొట్టుతాను. కాబట్టి నీ బలమెంతో దాన్నంతా చూపించు. నీ బలమంతా నువ్వు చూపించిన తర్వాతే నిన్ను చంపుతాను. నీ బలమంతా చూపిస్తే రాముడేమై వుండేవాడో అన్న కొరత నీకు-నీవారికి అక్కరలేదు”.

2 comments:

  1. రాముడుని?
    రాముడిని, రాముని లేదా రాముణ్ణి అనే రూపాలు ప్రసిధ్ధం.
    రాముడుని అని అనటం అంత ఉచితమూ కాదు, బాగోలేదు కూడా.
    ముద్రారాక్షసం కాదు, మీరు రాముడుని అని రెండుసార్లు వాడారు!

    ReplyDelete