శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-38
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి
ఆదివారం సంచిక (09-12-2018)
ఇలా తనను నిష్టూరాలు ఆడుతున్న రామభద్రుడిని
చూసి, అవి తన మేలుకోరకై చెప్పబడుతున్న మాటలని
తెలుసుకోలేని ఆ ఖరుడు, ఇవన్నీ యుద్ధంలో సాధారణంగా చెప్పే బెదిరింపు
మాటలని భావించి, కోపంతో కళ్ళు ఎర్రచేసి నవ్వుతూ ఇలా అన్నాడు.
“ఓరీ! నిస్సారమైన ఈ గుంపును చంపినంత మాత్రాన,
గర్వంతో కళ్ళు కనపడకుండా మహా శూరుడనని నిన్ను నువ్వు మెచ్చుకోగానే గౌరవం వస్తుందా?
బలవంతుడు తనను తాను మెచ్చుకుంటాడా? మగతనం కల బలశాలి తాను చేసే పనులను తానే
చెప్పుకోడు. నీచులైన రాజులే నీలాగా నిష్ప్రయోజనంగా వ్యర్థ భాషణలు చెప్తారు. తాను
గొప్ప వంశంలో పుట్టానని ప్రకటించుకుంటూ అసమర్థంగా నీలాగ మరణం దగ్గరపడుతుంటే తన్ను
తాను పొగడుకోవడం జరుగుతుంది. నిన్ను నువ్వు పొగుడుకోవడం అంటే,
దర్భ కొనలోని అగ్నిలాగా నువ్వెంతటి నీచుడివో తెలుస్తున్నది. చేతిలో గద పట్టుకొని
ధాతువులతో కూడి కదిలించలేని పర్వతంలాగా వున్నా నేను నీకు కనబడలేదా?
ప్రళయకాలంలో యముడు ఒక్క పాశంతోనే లోకాలన్నింటినీ హింసించినట్లు నేను ఈ ఒక్క గదతోనే
నిన్ను చంపుతాను చూడు. బలహీనుడా చూడు. నిన్ను ఎన్నో అనాలని వుంది. కాని అనడానికి
ఇష్టం లేదు. ఎందుకంటే సాయంకాలమవుతున్నది. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపాలి.
రాత్రి మీకు అనుకూలమే కదా? ఎందుకు ఆపాలి అని అంటావా?
నువ్వు మనుష్యుడివి. చీకట్లో యుద్ధం చేయలేవు. అలాంటి ప్రతికూల సమయంలో నిన్ను చంపడం
నా పౌరుషానికి తగింది కాదు. అదీ కాకుండా నిన్ను పొద్దు కుంకే సమయంలోపుల చంపి నీ
చేతుల్లో చనిపోయిన వారికై ఏడ్చే వారి బంధువులకు నేను కన్నీళ్లు తుడిచి సమాధాన
పెట్టాల్సిన పని మిగిలింది. నీతో ముచ్చటలాడితే అదెలా సాధ్యం?”
ఇలా చెప్పి గదను చేత్తో తిప్పి విసిరి,
పిడుగులాగా రామభద్రుడిమీద వేశాడు. దాన్ని ఆకాశంలోనే రాముడు గొప్ప బాణ సమూహంతో,
మహామంత్రంతో తునుకలు చేశాడు. దాంతో దిక్కుతోచక నిలబడ్డ ఖరుడిని చూసి ఇలా అన్నాడు.
“ఓరీ! ఏమేమో వాగావు కదా?
నీ బలమంతా చూపావు కదా? చెప్పినా అర్థం కాని మూర్ఖుడా?
వ్యర్థపు మాటలు మాని యుద్ధానికి రా. చనిపోయిన వారికొరకు కన్నీళ్లు తుడిచే పని
వున్నదన్నావు కదా? నీచుడా! నీ మాటలు ఎలా అబద్ధం అయ్యాయో చూసావు
కదా? నా బాణాలతో నీ ప్రాణాలు తీయడానికి భూమి ఎదురు
చూస్తున్నది. బోర్లపడి భూమిని కౌగలించుకొని చావబోతున్నావు. అప్పుడు,
నీ బాధ తొలగినందుకు నిర్భయంగా మునులంతా నిర్విచారంగా,
సుఖంగా, నిద్రపోతారు. ఓరీ! రాక్షసుడా! నా బాణాలతో
జనస్థానం ప్రేతస్థానం అయిపోయి, ఇక మునులంతా నిర్భయంగా ఈ దండకలో సంకోచం
లేకుండా సంచరిస్తారు. ఇప్పటిదాకా మునులను భయపెట్టుతున్న రాక్షస స్త్రీలు,
వాళ్లను కూడా నేను చంపుతానేమో అన్న భయంతో, దిక్కులేనివారిలాగా దిక్కులవెంట
పరుగెత్తుతారు. నీ భార్యలు వెల-వెల పోయిన ముఖాలతో నీలాంటి వాడిని కట్టుకున్నందుకు,
బతికీ ప్రయోజనం లేని విధంగా బతుకుతారు”.
“ఓరీ ఘాతకుడా! నీచుడా! పాపాత్ముడా! బ్రాహ్మణ
ద్వేషీ! నిర్దయమైన మనస్సు కలవాడా! మీ వల్ల కలిగిన భయం వల్ల మునిశ్రేష్టులు
హోమసమయంలో తాము హవిస్సును అగ్నిలో వేసేంతదాకా ఎక్కడ రాక్షసులు వస్తారో,
ఎవడెప్పుడు విఘ్నం చేస్తారో అన్న సందేహంతో గడగడలాడే వారు. ఇలా అలాంటి చేష్టలు
జరగవు”.
రామభద్రుడి మాటలకు మరింత కఠినమైన మాటలతో
ఖరుడిలా అన్నాడు. “ఓరీ! నీచమనుష్యుడా! నువ్వెలాంటి మనుష్యుడివిరా?
ప్రాణం పోవడానికి సిద్ధంగా వుండి కూడా పొగరుగా మాట్లాడుతున్నావు?
మృత్యువు ఆసన్నమై వచ్చినవాడు ఇది మాట్లాడవచ్చు,
ఇది మాట్లాడ కూడదు అనికాని, ఇది చేయవచ్చు,
ఇది చేయకూడదని కాని, బుద్దిబలం పోయి,
జ్ఞానం తొలగి, తెలుసుకోలేడు. నీ వ్యవహారం కూడా అలాగే వుంది”.
ఇలా చెప్పి,
నాలుగు దిక్కులా తేరిపార చూసి, దూరంగా వున్నా పెద్ద వృక్షాన్ని వేళ్లతో సహా
పీకి, కనుబొమ్మలు కదులుతుంటే,
రివ్వు-రివ్వున వేగంగా తిప్పి రాముడి మీదకు విసిరాడు. అలా తనమీదకు
విసిరిన వృక్షాన్ని చూసి రామభద్రుడు వాడి బాణాలతో దాన్ని చిన్న-చిన్న తునుకలై
పడేట్లు నరికాడు. ఈ దుష్టుడు కొంచెంతొ పోయేవాడు కాదని, వీడిమీద దయ
చూపడం నిరర్థకమని, నిశ్చయించుకున్నాడు. భీతి కలిగించే బాణాలతో ఖరుడి దేహమంతా
రంధ్రాలు పడేట్లు కొట్టాడు. ఖరుడి దేహం నుండి కొండవంకలాగా రక్తం కారసాగింది. ఆ బాధ
సహించలేక అవయవాలు విల-విలా పోతుంటే రామభద్రుడి మీద పడడానికి మొండి ధైర్యంతో
ముందుకు వచ్చాడు. అప్పుడు వాడిమీద బ్రహ్మ దండానికంటే ఎక్కువ కాంతి కలిగి,
అగ్నిహోత్రంలాగా జ్వలించే, ఇంద్రుడిచ్చిన అమోఘ బాణం శీఘ్రంగా వేశాడు
రాముడు. అది పిడుగులాగా దిక్కులు పిక్కటిల్లేట్లు ధ్వని చేస్తూ, ఖరుడి
వక్షంలో నాటుకోగా, దేహమంతా దగ్ధమై పడిపోయాడు. ఆ విధంగా శ్రీరాముడి బాణానికి
భస్మమై ఖరుడు చనిపోయాడు.
ఖరుడు చావగానే ఆత్మసాక్షాత్కారంకల
రాజఋషులు, మునులు, ఒక గుంపుగా
వచ్చి శ్రీరామచంద్రమూర్తితో గౌరవంగా ఇలా అన్నారు. “మహాత్మా! నిన్ను ఈ ప్రదేశానికి
పంపమని కోరడానికే ఇంద్రుడు ఆనాడు శరభంగుడి ఆశ్రమానికి వచ్చాడు. శరభంగ, సుతీక్ష్ణ, అగస్త్యాది
మహర్షులు ఉపాయం చేసి నిన్ను ఇక్కడికి చేర్చారు. పాప స్వభావం కల రాక్షస సమూహాన్ని
చంపించడానికి నిన్ను ఇక్కడికి వచ్చేట్లు చేశారు. మా పనులు చక్కబడ్డాయి. నీ పేరు
చెప్పుకుంటూ సుఖంగా, మునులు దండకారణ్యంలో అన్ని వేళలా భయం వదిలి వారివారి ధర్మం
నెరవేర్చుకుంటూ తురగ గలరు తండ్రీ!”. వీళ్లిలా అంటున్న సమయంలోనే ఆకాశం నుండి
చారణులతో కూడి దేవతలు శ్రీరాముడి మీద పుష్ప వర్షం కురిపించారు. ఆకాశమార్గాన
దేవదుందుభి ధ్వనులు నిండాయి.
“ఆహా! ఏం పరాక్రమం? ఏమి
కార్యసాధనా సామర్థ్యం? ఔరా! బలం ఏమని చెప్పవచ్చు? ఒంటరిగా
కాళ్లమీద నిలబడి పద్నాలుగు వేల రాక్షసులను మూడు గడియల్లో సంహరించాడే! ఇది ఇతరులకు
సాధ్యమా? కాదు కాబట్టే
ఈయన ప్రత్యక్ష విష్ణువే” అని దేవతలు పొగిడారు.
ఇలా పొగిడిన దేవతలు తమ మనోవేదన
తగ్గిపోవడంతో తమతమ స్థానాలకు పోయారు. అదే సమయంలో లక్ష్మణుడు సీతాదేవితో సహా
వచ్చాడక్కడికి. యుద్ధంలో గెలిచి అపరాజితుడైన
శ్రీరాముడు, మునులు పూజిస్తుండగా,
సీతాలక్ష్మణులు తన తోడు వస్తుంటే, విలాసంగా తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడికి
చేరిన తరువాత సీతాదేవి శత్రుసంహారుకుడు, ఋషులకు సంతోషం
కలిగించిన వాడు, తన భర్త అయిన
శ్రీరామచంద్రమూర్తిని గట్టిగా కౌగలించుకుంది. బలవంతులైన రాక్షసులను వధించి, మునీశ్వరుల
ప్రశంసలు అందుకొని వచ్చిన రామచంద్రమూర్తిని చంద్రవదనైన సీత రొమ్ములను హత్తుకుంది.
(దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
నిమిత్తమై శ్రీరాముడు దండకకు వచ్చాడు. దుష్టులను శిక్షించడం ప్రథమ కార్యం. ఖరాది
వధకు కారణం, దానివలన
ప్రయోజనం ఋషి సంరక్షణేకదా? శ్రీమహాలక్ష్మీదేవి స్త్రీలను బాధించే
రాక్షసులను సమూలంగా నాశనం చేయడానికే భర్తను భూమిమీద అవతరించాలని కోరి, తానూ
అవతరించింది. తన కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది కదా అన్న సంతోషంతో, తన
కార్యాన్ని స్వకార్యంగా భావించిన భర్తకు తన సంతోషం వ్యక్తం చేయడానికి ఆయన్ను
కౌగలించుకున్నది. రామచంద్రమూర్తి లేని సీత గుహనుండి వచ్చి రాముడిని
కౌగలించుకున్నది అంటే, హృదయమనే గుహలో వుండే జీవుడు పరతంత్రుడై ఆచార్యులవలన
సర్వస్వామిని దర్శించి దానితో సర్వ విరోధి వర్గం నశించగా, అందులోంచి
వెలువడిన స్వామిని దర్శించాడని అర్థం. శ్రీరామచంద్రమూర్తి జయం విన్నవారు పాపబందాల
వల్ల, కారాగార గృహ
బంధాల వల్ల, ఋణబాధల వల్ల, ఎదుర్కొన్న
ఇబ్బందులను విడవబడుతారు).
No comments:
Post a Comment