జాతీయ రాజకీయాలలో
కీలకపాత్రకు కేసీఆర్ సంసిద్ధం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(14-12-2018)
“అఖండ విజయంతో వెల్లువెత్తుతున్న
ఉత్సాహం, బీజేపీ-కాంగ్రెస్ ముక్త భారత్‌కు సన్నద్ధం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు
దిశగా అడుగులు, రాజకీయ శూన్యత అధిగమించేందుకిదే తరుణం”.
తెలంగాణ రాష్ట్ర
సమితి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎంపికైన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.
నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం
ఎంతో ఉత్సాహంగా సాగింది. సీనియర్ అధికారులు, అనధికారులు ఈ
కార్యక్రమానికి హాజరయ్యారు. 51 నెలల పాలనలో కె.
చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వివిధ సంక్షేమ
కార్యక్రమాలనూ,
అభివృద్ధి పథకాలనూ విజయవంతంగా చేపట్టి అమలు చేసింది.
డిసెంబర్ ఏడో తేదీన నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని
సాధించింది.
కాంగ్రెస్
పార్టీతో జత కట్టి టీడీపీ ఏర్పాటుచేసిన ప్రజా కూటమి, దేశంలో అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కొద్దిపాటి
సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. జాతీయ రాజకీయ యవనికపై తామే ప్రత్యామ్నాయమని
చాటుకున్న ఈ పార్టీలు ఎన్నికలలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. కేసీఆర్
నాయకత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని చుట్టచుట్టేసి, అసెంబ్లీలో నాలుగింట మూడొంతుల మెజారిటీని సాధించింది. వరుసగా రెండోసారి
అధికారంలోకి దూసుకుని వచ్చింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ తప్పని టిఆర్‌ఎస్
చాటింది. ఒక్క ఇండియా టుడే,
ఆరా సర్వేలు మాత్రమే టీఆర్‌ఎస్ అప్రతిహత విజయాన్ని దగ్గరగా
ఊహించాయి. 119 నియోజకవర్గాలలో 88 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19 సీట్లకూ, టీడీపీ 2 స్థానాలకూ పరిమితమయ్యాయి. బీజేపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. సిపిఐ, సిపిఎం పార్టీలకు అసెంబ్లీలో చోటే దక్కలేదు. టీఆర్‌ఎస్‌తో స్నేహంగా మెలగుతున్న
ఏఐఎమ్‌ఐఎమ్ పార్టీ 7 స్థానాలలో విజయ దుందుభి మోగించింది. గెలిచిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ
టీఆర్‌ఎస్‌లో చేరి,
ఆ పార్టీ స్థానాలను 90కి పెంచారు.
సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ విజయాన్ని కట్టబెట్టాయని ఈ
ఎన్నికలు స్పష్టమైన సంకేతాలు పంపాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతుబీమా,
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు,
మహిళలకు, మైనారిటీలకూ, బిసీలకూ,
ఎస్సీ, ఎస్టీలకూ లబ్ధి చేకూర్చిన
వివిధ సంక్షేమ చర్యలు ఎంతో మేలు చేకూర్చాయనీ, అదే అత్యధిక ఓట్
బ్యాంకుగా రూపుదిద్దుకుందనీ తేలింది. అంచనాకు అందని ఈ విజయం పనిచేసే ప్రభుత్వానికి
రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్చిన మద్దతు కారణంగానే సాధ్యమైంది. ప్రతిపక్షం
సాగించిన నకారాత్మక రాజకీయాలకు వారు చెంపదెబ్బ కొట్టారు. కాంగ్రెస్, టీడీపీలకు ఇది ముఖ్యంగా కోలుకోలేని గుణపాఠం. రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధిని
పట్టాలు తప్పించాలని ప్రతిపక్షం చెమటోడ్చి పనిచేశాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేయడానికి
కోర్టులను ఆశ్రయించాయి. కేంద్ర ప్రభుత్వానికి మహజర్లు సమర్పించుకున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
చేపట్టిన అవిశ్రాంత ప్రచారం సైతం టీఆర్‌ఎస్ అద్భుత విజయాన్ని అడ్డుకోలేకపోయింది.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్
సింగ్, స్మృతీ ఇరానీ,
జెపి నడ్డా, ఉత్తర ప్రదేశ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌సహా డజన్ల సంఖ్యలో ఆ పార్టీ నాయకులు
ప్రచారానికొచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తదితర హేమాహేమీలు,
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన టీడీపీ కోటరీ ప్రజా కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఎన్నికలకు మూడు
వారాల సమయంలో ఈ హేమాహేమీలు జిల్లాలలో ఉద్ధృతంగా ప్రచారం చేసిన చోటే టిఆర్‌ఎస్
అత్యద్భుత ఫలితాలను సాధించింది.
ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరవాత, కేసీఆర్ ఇది ముమ్మాటికీ
తెలంగాణ ప్రజల విజయమని ప్రకటించారు. రైతులు, మహిళలు, దళితులు,
గిరిజనులు, వివిధ వర్గాల ప్రజలు మాకీ
విజయాన్ని సంప్రాప్తింపజేశారని వివరించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం
నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజా విజయం, దీని మేము వినమ్రంగా
అంగీకరిస్తున్నామని తెలిపారు. మేమిచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈ అత్యద్భుత విజయం
మా భుజస్కంధాలపై అతి పెద్ద బాధ్యతను మోపిందన్నారాయన. ఇదే సందర్భంలో తాను జాతీయ
రాజకీయ యవనికపై కీలక భూమిక పోషించబోతున్నట్లు తన కృతనిశ్చయాన్ని ప్రకటించారు. అతి
త్వరలో దేశంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించబోతోందన్నారు. ప్రాంతీయ పార్టీల
కూటమిగా ఇది ఉంటుందన్నారు. అదే సమయంలో ఇది కేవలం రాజకీయ పార్టీలను ఏకం చేయడానికి
చేసే ప్రయత్నం కాబోదన్నారు. భారత రాజ్య
పాలన పద్ధతినీ,
దేశ ప్రజలను ఏకం చేయనున్నామనీ చెప్పారు. టీఆరెస్‌కు లభించిన
అఖండ విజయం రాష్ట్రంలో చేపట్టిన సృజనాత్మక విధానాలు, కార్యక్రమాలకు ఆమోదమేనన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో తమ ప్రభుత్వం అనేక
పథకాలను ప్రారంభించిందన్నారు.
దేశంలో 15 కోట్ల మంది రైతులు నిరాశతో ఉన్నారనీ, అందుకే కొత్త జాతీయ
ఆర్థిక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందనీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో
చేపట్టిన ప్రయోగం రైతుల కష్టాలను తీర్చడానికి దారి చూపిందనీ, తమ విధానాన్ని డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ వంటి నిపుణులు ప్రశంసించారనీ
ఆయన వివరించారు. తాను ప్రతిపాదిస్తున్న కొత్త పార్టీ ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి
వస్తే రైతు బంధు పథకాన్ని అమలుచేస్తుందన్నారు. వ్యవసాయానికీ, రైతుకూ పెట్టుబడిని ఈ పథకం సమకూరుస్తుందన్నారు. ఇందుకు దేశ ఖజానాపై పడే భారం
కేవలం మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అనీ, కేంద్ర బడ్జెట్‌కు ఇది
బరువు కాబోదనీ వివరించారు. మైనారిటీ సంక్షేమం, వ్యవసాయోత్పత్తుల
మార్కెటింగ్,
అందుబాటులో ఉన్న 70 వేల టిఎమ్‌సిల నీటిని
సమర్థంగా వినియోగించుకోవడం,
తదితర పథకాలను కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. దేశంలో
అందరికీ ఇవి లబ్ధిని చేకూరుస్తాయంటున్నారు.
మనకి కాంగ్రెస్, బీజేపీ లేని భారత్ కావాలని కేసీఆర్ ప్రకటించారు. ఒక ఆలోచనతో ఉన్న
పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇలా ఆయా పార్టీలను ఏకం
చేసి, బీజేపీ,
కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తానని చెప్పారు.
భారతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పును తేవడానికి ప్రయత్నిస్తాననీ, జాతీయ రాజకీయాలకు కొంగ్రొత్త నిర్వచనాన్ని ఇస్తాననీ కేసీఆర్ ప్రకటించారు. దేశ
రాజకీయాలలో కీలక పాత్రను పోషించి, సాదాసీదా పరిపాలనకు
స్వస్తి చెప్పడానికి గట్టిగా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయాలలో మౌలికమైన
మార్పులను తేవడమే దీనివెనుక లక్ష్యమని తెలిపారు కేసీఆర్.
రాజకీయాలలో నెలకొన్న
సంక్షోభాన్ని అధిగమించడమే ప్రస్తుతం తక్షణావసరమని ప్రకటించారాయన. దేశ ఆర్థిక, రాజకీయ,
వ్యవసాయ రంగాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన
అవసరముందన్నారు. ఈ మూడు రంగాలలోనే భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. జాతీయ
ప్రత్యామ్నాయానికి సంబంధించిన విధివిధానాలను పది రోజులలోపే ఢిల్లీలో ప్రకటిస్తానని
కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందన్నారు.
కార్యాచరణ ముసాయిదా రూపొందించాల్సి ఉందన్నారు. ముసాయిదాను అన్ని భారతీయ భాషలలోనూ
విడుదలచేస్తామన్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అంటే కొన్ని
రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చడం కాదన్నారు. ప్రజలను ఐక్యపరచడమనీ, కొత్త ఆర్థిక,
వ్యవసాయ విధానాన్ని కొంగ్రొత్త రాజకీయ వ్యవస్థ ద్వారా
మాత్రమే దీనిని సాధించగలమని కేసీఆర్ తెలిపారు. రాజకీయ పార్టీలతో ఒక వ్యవస్థను ఎలా
ఏర్పాటుచేయాలనే అంశంపై ఇప్పటికే తాను రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు,
విశ్లేషకులు, వివిధ వర్గాల ప్రజలతో
చర్చించానని చెప్పారు. తాను నిర్మిస్తున్న వేదికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తప్ప అన్ని పార్టీలకూ చోటుంటుంన్నారు. రాష్ట్రంలో కొత్త
ప్రభుత్వం కొలువుదీరిన తరవాత తాను ఢిల్లీకి వెళ్ళి జాతీయ రాజకీయాలలో చురుగ్గా
పనిచేయడం ప్రారంభిస్తానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల
వైవిధ్య వైఖరినీ,
దృక్పథాన్నీ అదుపులోకి తెచ్చుకోవడం భారత్‌కు అత్యవసరమని
కేసీఆర్ చెప్పారు. సాధారణ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయముందనీ, ప్రత్యామ్నాయాన్ని రూపొందించడానికి ఈ మాత్రం సమయం సరిపోతుందనీ
అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్
ఒవైసీ తనతో కలిసి నడుస్తారని తెలిపారు.
వచ్చే సాధారణ ఎన్నికలలో బీజేపీ ఓటమిని చవిచూడడానికి సిద్ధంగా ఉంది. దాని
స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు కచ్చితంగా లేదు. ఈ క్రమంలో రాజకీయ
శూన్యత చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. భారత దేశానికి అవసరమైన కీలక మార్పును
తెచ్చే సత్తా ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గానీ, తనను తాను ప్రత్యామ్నాయంగా చూపించుకుంటున్న కాంగ్రెస్‌కు గానీ లేదు.
స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్ళయిన ఈ తరుణంలో దేశానికి కొత్త దిశ అవసరం. ఎందుకంటే మనం ఇప్పటికీ కనీస
అవసరాలకోసం పోరాడుతున్నాం. దేశానికి ఏది అవసరమో తమ గిరి దాటి ఆలోచించి, ఆచరింపజేసే పరిపక్వత బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు కానీ లేవు.
అందుకే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అనే కేసీఆర్ కార్యాచరణ ప్రస్తుతం
సందర్భోచితం. తెలంగాణ ఎన్నికలలో దిగ్విజయాన్ని సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో
చురుకైన పాత్ర పోషించాల్సిన తరుణం కూడా ఇదే.
ప్రస్తుతం కాంగ్రెస్-బీజేపీ రహితమైన జాతీయరాజకీయాలు అన్న మాట బాగుంది. రేపుమాపు టి-ఆర్-ఎస్ రహిత రాష్ట్రరాజకీయాలు అన్నది కూడా వినిపిస్తుంది. చూస్తూ ఉండండి! అఫ్ కోర్స్, యీలోగా కెసీఆర్ గారినీ వారి కుటుంబపార్టీనీ ఆకాశానికి ఎత్తుతూ వినోదం పంచే వ్యాసాలు క్రమంతప్పకుండా వ్రాస్తూ ఉండండి మర్చిపోక.
ReplyDelete