Saturday, December 15, 2018

శ్రీరాముడి పరాక్రమం వర్ణించి రావణుడికి చెప్పిన అకంపనుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-39 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి పరాక్రమం వర్ణించి రావణుడికి చెప్పిన అకంపనుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-39
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (16-12-2018)
         జనస్థానం నుండి అకంపనుడనే రాక్షసుడు, రావణుడి వేగులవాడు, శీఘ్రంగా బయల్దేరి లంకకు పోయి, లంకాసురుడైన రావణాసురుడితో ఇలా అన్నాడు. “రాజా! జనస్థానంలో వున్న ఖరుడుతో సహా రాక్షసులందరూ యుద్ధంలో చంపబడ్డారు. నేనెలాగో స్త్రీ వేషం వేసుకుని అతి కష్టం మీద ప్రాణాలను దక్కించుకుని ఈ వృత్తాంతాన్ని నీకు చెప్పడానికి వచ్చాను”. ఈ మాటలు విన్న రావణుడు అదిరిపడి, కళ్లల్లో నిప్పులు కురుస్తుంటే, “ఓరీ! నాకు మనోహరమైన జనస్థానాన్ని నాశనం చేసింది ఎవడురా? వాడీ లోకంలో ఇంక బతుకుతాడా? దిక్పాలురైన ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు కూడా నాకు ఏ కొంచెం అపకారం చేసినా సుఖంగా వుండలేరు. దండం ధరించి యముడు వచ్చినా దండిస్తాను. దహనుడిని దహిస్తాను. మృత్యువుకు నేనే మృత్యువునవుతాను. సూర్యచంద్రులను నేలబట్టి కాలరాస్తాను” అని అంటాడు.

         రావణుడిలా పలకగా అకంపనుడు చెడు వార్త చెప్తే తననేమి చేస్తాడో అన్న భయంతో చెప్పకపోతే ఇంకేం చేస్తాడోనని విధి లేకుండా ఇలా అన్నాడు. “ప్రభూ! నాకేం భయం లేదని, నన్నేం చేయనని అభయమిస్తే ఉన్నదున్నట్లు చెప్తాను”. తాను అభయమిస్తున్నానని, సందేహం లేకుండా వాస్తవం చెప్పమనీ, రావణుడు అనగానే రెండు చేతులు జోడించి భయభక్తులతో అకంపనుడు ఇలా అన్నాడు.

         “గౌరవించాల్సిన గుండ్రటి చేతులు కలవాడు, సమానంలేని బలం కలవాడు, ఆబోతు మూపురాలలాగా ఎత్తైన మూపురాలున్నవాడు, చంద్రబింబం లాంటి ముఖం కలవాడు, దశరథమహారాజు కుమారుడు, మంచి కీర్తికలవాడు, బాణాలనే జ్వాలలున్న అగ్నిహోత్రుడు, పరాజయం తెలియని పరాక్రమవంతుడు, ఒక్కడే, ఖరదూషణులతో సహా జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు”. ఇలా అకంనుడు చెప్పగా విన్న రావణాసురుడు పెద్ద పాములాగా శ్వాస విడుస్తూ, “ఓరీ! నిజం చెప్పు. రామచంద్రుడు యుద్ధానికి ఇంద్రాదులను తోడు తెచ్చుకున్నాడా? నువ్వు చెప్తున్న విషయం వింటుంటే ఇది ఒంటరిగా చేసే పనికాదని అనిపిస్తున్నది. వివరాలు చెప్పు” అని అడిగాడు.

         రావణుడు చెప్పమని అడగ్గానే, అకంపనుడు రామచంద్రమూర్తి తేజస్సు, బలం, పరాక్రమం తదితర అంశాలను వున్నదున్నట్లు చెప్పడిలా. “రాముడనే పేరుకలవాడు విల్లు, ఆయుధాలు ధరించేవారిలో చాలా గొప్పవాడు. అనేక దివ్యాస్త్రాలు, సుగుణ సంపత్తి కలవాడు. యుద్ధంలో ఇంద్రుడితో సమానుడు. దేవతలా పరాక్రమంలాంటి పరాక్రమం కలవాడు. ఆ రాముడికి ఒక తమ్ముడున్నాడు. వాడు శక్తిలో అన్నకు సమానుడు. ఎర్ర తామరలాంటి కళ్లున్నవాడు. ఆయన పేరు లక్ష్మణుడు. కమలాల లాంటి ముఖం కలవాడు. ఎప్పుడూ అన్నకు, అగ్నికి వాయువులాగా, తోడుంటాడు. అయినా  ఈ యుద్ధంలో ఆయన లేడు. ఒక్క రాముడివల్లే దండకలో మన ఉనికి పట్టు పాడైంది. నువ్వు సందేహించినట్లు రాముడికి దేవతలు సహాయం చేయలేదు. ఇంద్రుడు రాలేదు. రామచంద్రమూర్తి ఒక్కడే పదునైన బాణాలను ఆయుధాలుగా చేసుకుని రాక్షస సమూహాన్నంతా వధించాడు. ఆ బాణాలను ఆయన ప్రయోగించాడని అనలేం. బంగారు పిడుగులు కల ఆ బాణాలు తమంతట తామే అల్లెతాటి నుండి బయల్దేరి ఐదుతలల పాములై యుద్ధంలో రాక్షసులందరినీ మింగాయి. ఏఏ విధంగా, ఏఏ మార్గాలలో రాక్షసులు భయపడి పారిపోతారో, ఆయా మార్గాల్లో శత్రువులందరికీ రామచంద్రుడు యుద్ధంలో కనిపించాడు. ఈ విధంగా జనస్థానమంతా పాడైంది”.


         అకంపనుడు ఈ విధంగా చెప్పగానే విన్న రావణుడు ముఖం ఎర్రగా చేసి తక్షణమే ఆ మనుష్యులను చంపుతానంటూ బయల్దేరడానికి సిద్ధమౌతాడు. అప్పుడు అకంపనుడు రామభద్రుడి బలపరాక్రమాలను మరింత వివరంగా చెప్పడిలా.

         “రాక్షసరాజా! నువ్వాయన మీదికి యుద్ధానికి పోతే లాభం లేదు. ఆయనకే కోపం వస్తే నువ్వే కాదు...బ్రహ్మేంద్రాదులు కూడా ఆయన్ను గెలవలేరు. పొంగి పొరలి వచ్చే సంపూర్ణ ప్రవాహాన్నైనా తన బాణాలతో రాకుండా ఆపగలడాయన. గ్రహాలతో, నక్షత్రాలతో నిండిన ఆకాశాన్నైనా బాణాలతో చీల్చకలడు. శ్రీమంతుడైన రామచంద్రమూర్తి భూమిని ఉద్ధరించగలడు. అవలీలగా సముద్రం చెలియలికట్ట దాటి రారాదనే నియమాన్ని అణచి భూమినంతా సముద్రంతో ముంచగల శక్తికలవాడు. సముద్ర గర్వాన్ని మొదటంతా నాశనం చేయగలడు. బాణాలతో వాయువునైనా ఆపగలడు. తన పరాక్రమంతో రామచంద్రుడు సమస్త లోకాలనూ సంహరించి మళ్లీ సృష్టించగలడు. రామచంద్రమూర్తిని నువ్వు గెలవడం సాధ్యం కాదని నా అభిప్రాయం. రామచంద్రమూర్తిని గెలవలేని వాడివి నువ్వొక్కడివే కాదు. లోకంలో వున్న రాక్షస శ్రేష్టులందరూ, మనుష్యులతో సహా ఏకమైనా, ఆయన సమీపానికైనా పోలేరు. ఆయన ఒక్కడే...మేమందరం గుమికూడితే ఆయన్ను గెల్వలేమా? అని అంటావేమో? ఎంతమంది పాపాత్ములు కలిసినా స్వర్గానికి పోగలరా? (పాపాత్ములకు స్వర్గ ప్రాప్తి లేనట్లే పాపాత్ముడవైన నీకు రామ సాలోక్య ప్రాప్తి లేదని భావం) కాబట్టి రామచంద్రమూర్తిని నువ్వు చంపాలనుకుంటే (లేదా చచ్చిన వాడితో సమానంగా చేయాలనుకుంటే) నేనొక ఉపాయం చెప్తా ఏకాగ్రచిత్తంతో విను”.

No comments:

Post a Comment