Saturday, December 29, 2018

లంకకు పోయి రావణుడిని కలిసిన శూర్పనఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-41 : వనం జ్వాలా నరసింహారావు


లంకకు పోయి రావణుడిని కలిసిన శూర్పనఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-41
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (30-12-2018)

         పద్నాలుగు వేలమంది క్రూరులైన రాక్షస శ్రేష్టులు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు, ఒంటరిగా యుద్ధం చేసిన శ్రీరాముడి చేతిలో చావడం చూసిన శూర్పనఖ, ఇతరులకు సాధ్యంకాని రాముడి పరాక్రమం స్వయంగా చూసి భయపడి, బొబ్బలు పెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, శీఘ్రంగా రావణుడు పాలించే లంకకు పోయింది. అక్కడ దేవతలతో కూడిన ఇంద్రుడిలాగా, పుష్పక విమానంలో మంత్రులతో, సూర్యుడిని పోలిన బంగారు పీఠంమీద తన ఇష్టప్రకారం, బంగారు ఇటికలతో కట్టబడిన వేదిలో హోమం చేయడం వల్ల మండుతున్న అగ్నిహోత్రుడిలా, సమస్త భూతకోటిని, గంధర్వులను జయించగలవాడిని, యముడిలాంటి వాడిని, రావణుడిని చూసింది శూర్పనఖ.

దేవాసురులకు మధ్య జరిగిన ఘోర యుద్ధంలో అసమానమైన వజ్రాయుధం దెబ్బ వల్ల గాయం మాత్రం పడ్డ వక్షం కల రావణుడిని; ఐరావతం కొమ్ములతో పొడవగా కాయలు కాచిన రొమ్ముకల రావణుడిని; దీర్ఘమైన ఇరవై చేతులు, పది తలలు, తెల్లని చామరాలు, తెల్ల గొడుగు, విశాలమైన ఎత్తైన రొమ్ము, రాజచిహ్నాలు కల రావణుడిని; వైడూర్యంలాగా మిస-మిస మెరిసే రావణుడిని; నిగనిగలాడే రత్నాలు చెక్కిన బంగారు కుండలాలు కల రావణుడిని; పెద్ద ముఖం కల రావణుడిని; తెల్లని దంతాలు కల రావణుడిని; విష్ణు చక్రం లాంటి అనేక ఆయుధాలతో కొట్టబడి గాయపడ్డ సకలావయవములు కల రావణుడిని; ఇతరుల భార్యలను అపహరించే రావణుడిని; సమస్తమైన దివ్యాయుధాలు కల రావణుడిని; ఋషుల యజ్ఞాలు విఘ్నం చేసే రావణుడిని; భోగవతీపురంలో సర్పరాజైన వాసుకిని యుద్ధంలో ఓడించి, తక్షకుడిని గెలిచి, అతడి భార్యను అపహరించిన రావణుడిని; కైలాసంలో కుబేరుడిని గెలిచి పుష్పక విమానాన్ని తెచ్చిన రావణుడిని; ఇంద్రుడి ఉద్యానవనాన్ని, కుబేరుడి ఉద్యానవనంలో వున్న నలిని అనే సరస్సును కోపంతో నాశనం చేసిన బలిష్టుడైన రావణుడిని; ఉదయించే సూర్యుడిని చేతులతో అడ్డగించగల శక్తిమంతుడైన రావణుడిని; సమస్త ప్రాణులను మొర్రో అని ఏడిపించే రావణుడిని; దేవతలను పారతోలిన రావణుడిని; పెద్దనవ్వుతో దేవతా స్త్రీలకు గర్భస్రావం అయ్యేట్లు చేసిన రావణుడిని; భుజ శౌర్యంతో విరవబడిన ఐరావతం దంతాలుగల రావణుడిని; జనులను బాధించడంలోనే పరమాసక్తికల రావణుడిని; కుచ్చితపు ఆలోచనలు చేయడంలో తొందరపడే రావణుడిని; ఇంతదాకా రాక్షస వంశాన్ని వృద్ధి చేసిన రావణుడిని; కళ్లకు కనబడడం ప్రళయకాలమని ఆభరణాలతో అలంకరించుకునే రావణుడిని; తన అన్నాను చూసి శూర్పనఖ రాముడి భయంతో ఇలా అంది.

         తనకు కలిగిన అవమానం, తన దుఃఖం చూసి కూడా ఆదరించకుండా వూరికే చూస్తున్న రావణుడిని చూసి మంత్రులు వింటుంటే, వాళ్ళుండగా అలా మాట్లాడడం మంచిదికాదని కూడా భావించకుందా, దురాగ్రహంతో శూర్పనఖ ఇలా అంది.


“ఓరీ! కండ కొవ్వుతో మదించి ఒళ్లు మరిచినవాడా! ఎప్పుడూ కామ సుఖాలలో ఆసక్తికలిగి హద్దో-అదుపూ లేకుండా, దండించే వాడు లేకుండా మూర్ఖుడవై, నీ పక్కనే నిన్ను వాత వేసేందుకు కాచుకున్న మృత్యుదేవతను కనుక్కోలేక పోతున్నావుకదా! ఎప్పుడూ స్త్రీలతో రతిక్రీడల్లో మునిగి, వాట్లోనే ప్రీతికలిగి తన ఇష్టం వచ్చినట్లు సంచరించే రాజును ప్రజలు స్మశానాగ్నిలాగా గౌరవిస్తారా? నీలో అలంతో దోషం వుంది. కాబట్టే నిన్ను లోకులు గౌరవించరు. స్త్రీలతో విశేషంగా సంభోగించడం వల్ల బుద్ధి బలం చెడి కార్యాకార్యాలు ఆలోచించే శక్తి లేక రాజకార్యాలు తానై చేయని రాజు చెడిపోతాడు. వాడు తలపెట్టిన పనులు చెడి పోతాయి. వాడి రాజ్యం చెడుతుంది. నువ్వు ఆ గతికి చేరనున్నావు”.

         “వేగులవాళ్ళను ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలుసుకోకుండా, ఆలోచన చేయకుండా, ప్రజలకు అవసరమైనప్పుడు దర్శనం ఇవ్వకుండా, అంతఃపురంలో కాంతాలోలుడై చాటున వుంటూ, స్వయంగా పనులు చేయాల్సి వచ్చినప్పుడు సంబంధం లేనివాళ్లు, స్వార్థపరులు చెప్పిన మాటలు నమ్ముతూ, భార్యలు, మంత్రులు, తోవన పోయేవారి చెప్పిన మాటలు నమ్మి పరాధీనుడైన రాజును తొలగిపోతారు ప్రజలు. అన్ని పనుల్లోనూ తానే పెద్దగా వుంటూ, తన ఇష్టప్రకారం స్వతంత్రించి పనులు నెరవేర్చక ఇతరులకు పెత్తనం ఇచ్చి, వారితో పనులు చేయించే రాజులు సముద్రంలో పర్వతాలు మునిగినట్లు వాళ్ల వల్లే చెడిపోతారు. వారి ప్రభుత్వం, అధికారం, సంపద వాళ్లకంటే ముందుగానే నశిస్తుంది. నీకెప్పుడు కీడు చేద్దామా అని ఎదురుచూస్తున్న దేవతలు, దానవులు సమయం కోసం కాచుకున్నారు. అది కనుక్కోలేక కార్యాలోచనపరత్వం లేకుండా, స్థిరబుద్ధి లేకుండా, చపలుడవై వుండే నువ్వు ఎలా ప్రాణాలతో వుండగలవు?”. 

No comments:

Post a Comment