Sunday, December 23, 2018

సీతాపహరణం చేయమన్న అకంపనుడు, వద్దన్న మారీచుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-40 : వనం జ్వాలా నరసింహారావు


సీతాపహరణం చేయమన్న అకంపనుడు, వద్దన్న మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-40
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-12-2018)
         అకంపనుడు శ్రీరాముడి వధోపాయంగా సీతాపహరణం చేయమని ఇలా చెప్పాడు రావణుడితో. “ఓ అసురరాజా! రామచంద్రుడి భార్యైన సీత గురించి నేనేం చెప్పగలను? రాముడి గురించి వృత్తబాహుడని, వృషాంసుడని చెప్పాను కాని సీతాదేవి విషయం చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆమె అందం లాంటి అందం ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఆమె నడక ఏనుగు నడకలా వుంటుంది. నడి వయస్సులో వుంది. దేవతా స్త్రీలలో కాని, గంధర్వ స్త్రీలలో కాని, అప్సరసలలో కాని, రాక్షస స్త్రీలలో కాని, జానకితో సమానమైన స్త్రీ లేనేలేదు. ఇక మనుష్య స్త్రీలలో లేదని చెప్పాల్నా? ఆమెను నువ్విక్కడికి తెస్తే, ఆమె మీద ప్రేమ కల రాముడు, ప్రియురాలి ఎడబాటుతో కలిగే తాపం అనే అగ్నిలో పడి చస్తాడు” అని అకంపనుడు చెప్పగా రావణుడు ఆ ఆలోచన బాగుందని ఆమోదించాడు. యుద్ధం లేకుండా శత్రువు చనిపోతున్నాడనే ఆలోచన రావణుడికి రుచించింది.

         అకంపనుడు చెప్పినట్లే చేస్తానని, ఉదయాన్నే పోయి సీతాదేవిని తెస్తానని అంటూ, వాడిని వెళ్ళమంటాడు రావణుడు. అలా చెప్పి సూర్యకాంతితో సమానమైన కంచరగాదిడలు కట్టిన తెల్లటి రథం మీద సారథితో ఒక్కడే బయల్దేరి పోయాడు. ఆకాశమార్గంలో పోతున్న ఆ రథం ఆ సమయంలో మేఘాల మధ్యనుండే చంద్ర మండలంలాగా కనిపించింది. అలా పోయి మారీచుడి ఆశ్రమంలో దిగాడు రావణుడు. మారీచుడు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఆసనం చూపించి, భక్ష్య భోజ్యాలిచ్చి తృప్తి పరిచాడు. ఆ తరువాత రావణుడితో “రాక్షసరాజా! నీకు, రాక్షసులకందరికీ క్షేమమేకదా? ఉపద్రవం ఏదీ జరగలేదు కదా? ఇలా ఒంటరిగా, తోడు ఎవరూ లేకుండా, సరాసరి ఇక్కడికి వచ్చావంటే ఏదో గొప్ప పని పడిందని సందేహం కలుగుతున్నది” అని అన్నాడు మారీచుడు. ఆ మాటలు విన్న రావణాసురుడు “తండ్రీ! రాముడనే ఒక్క మానవుడు రాక్షసులందరినీ యుద్ధ సామర్థ్యంతో వధించి జనస్థానాన్ని పాడుచేశాడు. అతడి భార్యను నేను అపహరించాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. ఆ విధంగా నేను నా పగ తీర్చుకుంటాను” అని అంటాడు.

         రావణుడు ఈ విధంగా చెప్పగా విన్న మారీచుడు, సీతాదేవి గురించి లోపల శత్రుత్వం, బయటికి స్నేహం కలవాడెవడో, ఎప్పుడు రావణుడు చెడిపోవాలో అని ఎదురు చూస్తున్నవాడు ఇలా చెప్పాడని అంటాడు. “సీతను తెమ్మని చెప్పినవాడు నీ మేలుకోరేవాడు కాదు. ఇప్పుడు ముల్లోకాలను పాలించే నీ గొప్పదనం చూసి ఓర్వలేనివాడెవడోఅది భగ్నమైపోవడానికి ప్రయత్నించాడు. ప్రసిద్ధమైన విషసర్పం కోర పీకమని నీకెవడు చెప్పాడు? ఏమరుపాటుతో వాస్తవం తెలియకుండా నిద్రపోతున్నవాడిలాగా వున్న నీతలను తన్నింది ఎవరు? రాక్షసరాజా! జగత్ప్రసిద్ధమైన గొప్పవంశంలో పుట్టటమనే తొండం కొన, గొప్ప పరాక్రమమనే మదపు నీళ్లు, గడియమాకుల లాంటి చేతులనే దంతాలు, శత్రువులకు భయం కలిగించే రాముడనే మదపుటేనుగును, ఇప్పుడు కనురెప్పలు ఎత్తైనా చూడడానికి ప్రయత్నం చేయవద్దు. యుద్ధ ముఖంలో నిలబడడం అనే పైకెత్తబడిన తోక కలిగి, రాక్షస సమూహాలను మృగాలలాగా సంహరించ కలిగి, గొప్ప బాణాలనే వాడి గోళ్లు కలిగి, వాడిగల కత్తులను కోరలుగా కలిగి, బలిష్టమైన నరరూపం ధరించిన రాముడనే సింహాన్ని, ఎక్కడో ఒకచోట ఎవర్నీ బాధించకుండానిద్రిస్తుంటే, దాన్ని లేపవచ్చా? చక్కగా ఆలోచించు”. అని అంటాడు మారీచుడు.


ఇంకా ఇలా అంటాడు మారీచుడు. “పాతాళంలో పడి అక్కడి నుండి మళ్లీ పైకి రాలేనట్లు రామపాతాళంలో నువ్వు పడ్డావా మళ్లా ఊపిరితో వెలుపలికి రాలేవు. రామపాతాళం ఎలాంటిది అంటావా? విల్లే మొసలి...అది నీళ్లలో అడుగు పెట్టీ పెట్టకముందే వాతవేస్తుంది. అది దాటిపోతే భుజ వేగమనే పెద్ద బురద వుంటుంది. దాంట్లో దిగబడితే అంతే సంగతి ఇక. అదీ దాటిపోగలిగితే, బాణపరంపరలనే అలలు మీదమీద వచ్చిపడి లోపలి ఈడ్చుకు పోయి చంపుతాయి. ఇలాంటి యుద్ధ ప్రవాహంకల రామపాతాళంలో పడితే ఇక జీవితాశ లేదు. లంకాధిపతీ! నేను పరుషంగా చెప్పానని కోప్పడవద్దు. క్షమించు. వాస్తవంగా నీ మేలు కోరి చెప్పాను. కోపం తగ్గించుకొని లంకకు వెళ్లు. నీ భార్యలతో సంతోషంగా జీవించు. ఆడవిలో ఆయన భార్యతో రాముడు వుంటాడు. ఆయన భార్యతో ఆయన లేకుండా చేశావా....నీ భార్యలతో నువ్వు సుఖంగా వుండవు”.

ఇలా మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు, అలాగే ఆయన చెప్పినట్లే చేస్తానని జవాబిచ్చి, లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు. రాముడితో బలవద్విరోధం ఎందుకు? నేనొక్కడినే పొతే, అందర్నీ చంపిన రాముడిని తానొక్కడినే జయించగలనని నమ్మకం ఏమిటి? అని ఆలోచించి సంతుష్టుడై ఇంటికి పోయాడు రావణాసురుడు.

(ఇప్పటికింకా రావణుడికి శూర్పనఖ ముక్కు-చెవులు కోసిన సంగతి తెలియదు. అకంపనుడు తెలిసినా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఖరుడికి, రాముడికి యుద్ధం ఎందుకు జరిగిందని రావణాసురుడు అడగలేదు. అందరు ఋషులను చంపినట్లే రాముడిని కూడా చంపడానికి పోయి చచ్చారేమో అనుకున్నాడు. తనంతట తానుగా అకంపనుడు చెప్పలేదు. అసలు శూర్పనఖ రాముడి దగ్గరకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రావణుడు అడుగుతాడని భావించి అకంపనుడు ఆ విషయాన్ని దాటేశాడు. అదే వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే, మనకెందుకీ బాధ? అనుకున్నాడు).

No comments:

Post a Comment