Sunday, December 2, 2018

సీత సందేశాన్ని శ్రీరాముడికి చెప్పిన హనుమంతుడు .... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


సీత సందేశాన్ని శ్రీరాముడికి చెప్పిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (03-12-2018)
శోకంతో కూడిన మాటలను, కళ్లల్లో నీరు కారుతుంటే, కలవరపడుతూ, అడుగుతున్న సీతాదేవిని చూసి, ఓదార్పు మాటలతో నేను, సీతకు కష్టకాలం పోయిందనీ, దుఃఖం అంతరిస్తుందనీ, లంకనెప్పుడు భస్మం చేయాల్నా అని రామలక్ష్మణులిద్దరూ ఎదురు చూస్తున్నారనీ, చెప్పానంటాడు హనుమంతుడు. సీతకు ద్రోహం చేసిన, రావణుడిని బంధువులతో సహా చంపి శీఘ్రంగా అయోధ్యకు రామచంద్రుడు తీసుకుపోయే సమయం వచ్చిందని కూడా చెప్పానంటాడు.

ఆమెకు ఓదార్పుమాటలతో చెప్పిన విషయాలను రాముడికి విన్నవించిన తర్వాత జరిగిన సంభాషణను కూడ చెప్పాడు.  అమ్మా! రాజపుత్రీ! రామచంద్రమూర్తి జ్ఞాపకం వుంచుకునే గుర్తు ఏదైనా ఇవ్వు, అంతమాత్రం చేస్తే చాలు అని తను చెప్పగానే, దగ్గరలో వున్న రాక్షసస్త్రీలెవరూ చూడకుండా, నలుదిక్కులా కలియ చూసి, రావణుడికి తెలియకుండా వుండాలనే వుద్దేశ్యంతో, తలలో ధరించాల్సిన చూడామణిని, చీరె కొంగు ముడిలోనుండి తీసి, తనపై వున్న ప్రేమతో, తన చేతుల్లో వుంచిందంటాడు. అది తీసుకుని ఆమెతో బయల్దేరుతానని చెప్పానన్నాడు.

"ఇలా చెప్పి నా తలను సీతాదేవి పాదాలపై వాల్చి లేచాను. నా ప్రయాణ సన్నాహాన్నీ, సముద్రం దాటడాన్నీ ప్రోత్సహించిన ఆ పుణ్యాత్మురాలిని చూసి, కళ్లవెంట నీళ్లుకారి, మాట తడబడింది. సీతాదేవి నాముఖం చూసి శోకంతో ఇలా పలికింది:"

"ఆంజనేయా! రామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడిని, మంత్రులతో సహా సుగ్రీవుడినీ, ఆక్కడున్న మిగతావారందరినీ, కుశలమడిగానని చెప్పు. నన్నీ ఆపత్సముద్రంలో మునగకుండా, ఎట్లా చెప్పితే రాముడు నన్ను రక్షిస్తాడో, అట్లానే చెప్పు. నేనుపడ్డ నానా కష్టాలనూ నా భర్తతో చెప్పు.  వెళ్లిరా! నీకు శుభం కలుగుకాక!"  అంటూ శలవు ఇచ్చింది నాకు.

"ఈ విధంగా మీ ఆర్యామణి, వరవర్ధిని, సీతాదేవి ఎంతో విషాదపడుతూ చెప్పిన మాటలివి. ఆమె జీవించివుందని నానమ్మకం" అంటాడు హనుమంతుడు.

ఈ రాముడి దూతనైనందువల్లా, తృప్తిలేని అనురాగంతో, నమ్మకంతో, తనతో సీతాదేవి సంభాషించిందనీ, ఆ వివరాలూ చెప్పాడీవిధంగా ఆమె మాటల్లోనూ, ఆమెకు తనిచ్చిన సమాధానంతోనూ:
"ఆంజనేయా! ఒకరోజు నువ్విక్కడుంటే, నాకొచ్చే లాభం ఏంటి? ఆ తర్వాతైనా ఎప్పడిలాగా ఏడ్వాల్సిందేకదా! నువ్వు మాత్రం ఎన్నాళ్లుంటావిక్కడ? నీకిక్కడ ఆలస్యమైతే, నీకోసం ఎదురుచూస్తున్న రామచంద్రమూర్తి, నాకంటే ఎక్కువగా పరితపిస్తాడుకదా! నువ్వు ఇక్కడుంటే జరగాల్సిన పనులెలా జరుగుతాయి? అందుకే శ్రీరాముడి దగ్గరకు పోదల్చుకుంటే పో! మళ్లీ ఎన్నాళ్లకొస్తావో, ఏంటో! అంతవరకు నా ప్రాణం వుంటుందో, లేదో? చెప్పలేను. ఎందుకంటున్నానంటే, నిన్ను చూడగానే పోయే ప్రాణాలు నిలబడ్డాయి. మరి నువ్వుకూడా పోతే ఆ ప్రాణాలుంటాయో, పోతాయో చెప్పలేను" అంటుంది.

"నువ్వెట్లాగూ సముద్రాన్ని దాటిపోతావు. రాముడికి నాసంగతులన్నీ చెప్తావు. ఆ అన్నదమ్ములిద్దరూ, వానరసేనతో సముద్రతీరానికి వస్తారు. ఆ తర్వాత ఏంరుగుతుందనేదే ప్రశ్న. ఎలుగుబంట్లు, వానరులు, రాజకుమారులు, అలవికాని ఆ సముద్రాన్ని ఎట్లా దాటుతారయ్యా? ఈ భూప్రపంచంలో, నువ్వూ, గరుత్మంతుడు, వాయుదేవుడు తప్ప ఇంక ఎవరూ ఈ సముద్రాన్ని దాటలేరని నా అభిప్రాయం. నేనాలోచిస్తున్న కొద్దీ, వారిక్కడకు రావడం, అసాధ్యమైనపనిలాగానే తోస్తున్నది. అయినా కార్యదక్షుడవైన నీకు చేయలేని పనేదీలేదు. దీనికి ఏమని సమాధానమిస్తావు? ఎలానెగ్గుకొస్తావో నాకు తెలియదుకాని, సాధించగలవాడివి మాత్రం నీవొక్కడివే! ఎవరూ చేయలేరు, కీర్తినీ పొందలేరు. కాని నీవిలాచేయడం నాకు కీర్తికరం కాదు"  ఇంకా ఇలా అంటుంది:

"రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుద్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, నన్ను అయోధ్యకు తీసుకొని పోతేనే అది నాకు కీర్తికరం. అప్పుడే నేను వీరపత్నినన్న బిరుదుకు కూడా అర్హురాలిని అవుతాను. ఇది రాముడికి సాధ్యపడుతుందా, పడదా అనేసంగతి వేరేవిషయం. కాని ఇంకే విధంగా జరిగినా నాకు కీర్తికరం కాదు. నేను చెప్పినట్లు చేసి, తన బలంతో, బాణాలతో లంకను భస్మం చేసి, నన్ను వెన్ట తీసుకునిపోతే, నాకేకాదు, శ్రీరాముడికీ కీర్తి. ఆయన వంశానికీ కీర్తి దక్కుతుంది. నాకోసం కాకపోయినా, తనకోసమైనా నేను చెప్పినట్లు చేయాల్సిందేనని నా కోరిక. ఆడదానినైన నా ఆలోచనావిధానమిది. యుద్ధంలో శూరుడైన రామచంద్రమూర్తికి తగినటువంటి చర్య ఏదో ఆలోచించి చెప్పు".

జవాబుగా హనుమంతుడు:
వానర, భల్లూకరాజైన సుగ్రీవుడు సీత నిమిత్తమై, గొప్ప సైన్యంతో రాముడికి సహాయపడేందుకు నిర్ణయించుకున్నాడనీ, ఆయనతో వచ్చేవారంతా అసమాన పరాక్రమవంతులనీ, దేవతలతో సమానులనీ, మనోవేగం కలవారనీ, దిక్కులలో, ఆకాశంలో సంచరించేవారనీ, వారంతా శీఘ్రంగా రాబోతున్నారనీ, ధైర్యం చెప్పాడు సీతకు హనుమంతుడు. వారెటువంటివారో చెప్తూ హనుమంతుడు:

"ఎంతటి కష్టకార్యమైనా ఏ మాత్రం అలసట పడకుండా చేయగలుగుతారు. పరాక్రమవంతులు. సముద్రంతో, పర్వతాలతో వ్యాపించివున్న భూమండలాన్ని ఆకాశమార్గాన చుట్టిరాగల సమర్ధులు. వారికీ సముద్రం దాటడం చాలా చిన్నపని. వానరులలో సముద్రాన్ని దాటగల నాలాంటివారు చాలామంది వున్నారు. సుగ్రీవుడి దగ్గరున్నవారందరూ నాకంటే గొప్పవారో, సమానులో కాని తక్కువైన వాడొక్కడు కూడలేడు. వారిటుపక్కకు రానందున నువ్వు వారిని చూడలేదు. నా పుణ్యంకొద్దీ నేను రాగలిగాను, నిన్ను చూడగలిగాను. అంతమాత్రాన వానరులందరిలో నేనేమొనగాడినని నీవెట్లా నిశ్చయించావు? వానరులందరిలో చిన్నవాడినీ, ఒక కోతినీ అయిన నేనే నిన్ను చూడగాలేంది, అసమాన బలవంతులైన ఇతరుల సంగతి చెప్పాల్నా? రాజు శత్రువుల దగ్గరకు పంపేటప్పుడు, అల్పులను మొదట పంపుతాడుకాని, మహాబలవంతులను పంపడు కద!. ఇది రాజనీతి. ఎందుకంటే బలవంతుడు శత్రువు దగ్గర చిక్కుపడితే తన బలం తగ్గుతుంది కాబట్టి".

  "రామలక్ష్మణులు ఎట్లా వస్తారా అనే సందేహం కానీ, రారని శోకించడం కానీ వదులుకో. నీవు దుఃఖించే కాలంపోయింది. నేనుపోయి చెప్పగానే ఒక్కగంతేసి, వానరులొస్తారిక్కడకు. రామలక్ష్మణులు, సూర్య, చంద్రుల్లాగా నావీపుపైకెక్కి, నీ ఎదుట నిలుస్తారు. వారి బాణాగ్నికి లంకంతా పాడైపోతుంది. రావణుడిని సేనలతో సహా చంపి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకుపోతాడు. మేమెప్పుడొస్తామా అని మా రాకకొరకు ఎదురుచూస్తుండు. ఏ సాహసం చేయొద్దీలోపల. మండుతున్న అగ్నిహోత్రం లాగా రామచంద్రమూర్తిని ఇక్కడ చూస్తావు. రాక్షసుడికేగతి పడ్తుందో చూడు. కొడుకులతో, చుట్టాలతో, మంత్రులతో చచ్చిపోయి రావణుడు నేలకూలగా చూసిన నీవు దుఃఖ సముద్రపు ఒడ్డుకు చేరుకుంటావు. రోహిణి చంద్రుడిని కలుసుకున్నట్లు, నీవూ నీ భర్తను కలుస్తావు".

"అమ్మా! విల్లు, బాణాలు ధరించిన రామలక్ష్మణులు, త్వరలోనే లంకవాకిట్లో నిలుస్తారు. వారివెంట గోళ్లు, కోరలు ఆయుధాలుగా వుండే, సమర్ధులైన, పర్వత సమానులైన వానరులుంటారు. రావణుడి భయం వదులు. ఏ విషయంలోనూ రామచంద్రమూర్తికంటే గొప్పవాడెవరు? లక్ష్మణుడికి సమానమైన వాడెవ్వడు? వారిరువురు అగ్ని, వాయువుల్లాంటివారు. ఈ రెండూ ఏకమైతే శత్రు నిశ్శేషం చేస్తాయి. వీళ్లిద్దరూ నీకు సహాయంగా వస్తుంటే, నీకొచ్చిన భయం లేదు. నేనుపోయి రామచంద్రమూర్తిని చూడటమే ఆలస్యం. ఆ వెంటనే భయంకర వానర సమూహంతో బయల్దేరి వచ్చి శత్రువులను సంహరిస్తాడు. రాక్షసులు కాపాడుకుంటున్న ఈ లంక శాశ్వతంగా దుఃఖాల పాలుకానున్నది. ఇంద్రుడిని శచీదేవి కలుసుకున్నట్లు, నీవూ రామచంద్రమూర్తిని కలుసుకోబోతున్నావు. ధైర్యంగా వుండు".

కోరలు, గోల్ళు ఆయుధాలుగాగల పరాక్రమవంతులైన వానరులు త్వరలోనే లంకకు రావడం, సీతాదేవే స్వయంగా చూడబోతున్నదనీ, వారి భయంకర సింహనాదాలు లంకలోని పర్వతాలలో వినపడే సమయం ఆసన్నమయిందనీ, తాను సీతాదేవికి చెప్పానన్నాడు హనుమంతుడు. నిబంధన ప్రకారం వనవాసాన్ని గడిపి, విరోధులందరినీ చంపి, సీతాదేవితో సహా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకుంటారనీ కూడా ఆమెతో చెప్పానన్నాడు. ఇలా ఎన్నోవిధాలుగా చెప్పి, ఆమెను నమ్మించి, దుఃఖపడకుండా చేసివచ్చానంటాడు.

(సీత శీలవతికదా! పరపురుషుడైన హనుమంతుడితో ఎలా చనువుగా మాట్లాడిందని అనుకోవచ్చు. ఆమె మాట్లాడటానికి కారణం, తన యోగ్యతకాదనీ, తనపైన శ్రీరాముడికిగల స్నేహభావమేననీ, ఆయన పంపిన దూతనుకనుకనే తనమాటలను నమ్మి, ఆమె మాటలు చెప్పిందనీ హనుమంతుడంటాడు. హనుమంతుడిపై శ్రీరాముడికి ప్రేమలేదనికానీ, ఏదో దూతగానే వచ్చాడనికానీ  అనుకుని వుంటే సీత మాట్లాడేది కాదేమో! హనుమంతుడిపై శ్రీరాముడికి ప్రేముందనుకున్నా, ఆయన పంపిన దూతేనన్న నమ్మకం కుదరకపోయినా మాట్లాడకపోయేదే! ఈరెండింటికీ హనుమంతుడు నిదర్శనాలు చూపించిన తర్వాతనే మనసు విప్పి మాట్లాడింది. అదే రావణాసురుడితో మాట్లాడినప్పుడు, గడ్డిపోచను అడ్డంవేసుకుని, వెనుక పక్కకు తిరిగి మాట్లాడిందికాని, హనుమంతుడితోలాగా ఎదురుగా వుండి మాట్లాడలేదు. దీనర్థం: భర్తకు అంతరంగిక స్నేహితులై, భర్త పంపినవారైతే, పతివ్రత కూడా పరపురుషుడితో మాట్లాడవచ్చని.

హనుమంతుడు రామచంద్రమూర్తికి సీతా వృత్తాంతమే చెప్పాడు కాని, తను పడ్డ కష్టాలను ఒక్కటైనా చెప్పలేదు. చెప్పితే ఆత్మ స్తుతవుతుందనుకుంటాడు. ఇంకో విషయం: శ్రీరామచంద్రుడికి చెప్పాల్సింది సీతా వృత్తాంతం కాని, హనుమంతుడు పడ్డ ప్రయాసకాదుకదా!)

No comments:

Post a Comment