Thursday, December 27, 2018

రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల : వనం జ్వాలా నరసింహారావు



రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-12-2018)
         రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజనీతిజ్ఞుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని  తెలంగాణ రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన నాటినుండి అధికారంలో వున్న కాంగ్రెస్, తెలుగుదేశం చేయలేని అభివృద్ధిని, అమలుపర్చలేని సంక్షేమ పథకాలను, తన ఏబై ఒక్క నెలల పాలనలో చేసి చూపించి మరీ ప్రజలను ఓట్లు అడిగారు సీఎం, తెరాస అధినేత చంద్రశేఖర్ రావు. తన అభ్యర్థనకు మద్దతుగా, ఏబై ఒక్క నెలల కాలంలో తన సారధ్యంలోని ప్రభుత్వం రూపకల్పన చేసి, కార్యాచరణ పథకం తయారుచేసి, చేపట్టి, విజయవంతంగా అమలుచేసిన అభివృద్ధి-సంక్షేమ పథకాలను-కార్యక్రమాలను ఓటర్లకు గణాంకాలతో సహా వివరించారు కేసీఆర్. ప్రగతి నివేదికను ప్రస్ఫుటంగా ప్రకటించారు. తన పథకాలను విశ్లేషించి మరీ చెప్పారు ఓటర్లకు. ఒక నాయకుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకర్తగా, ఒక దార్శనికుడిగా, ఒక యదార్థవాదిగా, ఒక మేథావిగా ప్రజల మనసు చూరగొన్నాడు. ఫలితంగా లభించిందే అఖండ విజయం.

         వాస్తవానికి, అందుబాటులో వున్న, పదిమంది అంగీకరించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు, వర్తమాన-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, అందునా ఒక క్రమ పద్ధతిలో వాటిని అన్వయించుకుంటూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే పథకాల రూపకల్పన-అమలు జరుగుతేనే అది అసలు-సిసలైన అభివృద్ధి అనడానికి వీలవుతుంది. ప్రజల మనసులు చూరగోనడానికి వీలవుతుంది. అదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నెలనుండి. అదే భవిష్యత్ లొ కొనసాగనుంది. అమలు చేయడానికి అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ, సైద్ధాంతిక భావజాలాన్ని ప్రదర్శించుకుంటూ, "ప్రాక్టికల్" అవగాహనతో కాకుండా "థియరీ" తో సరిపుచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చడం అభివృద్ధిని సాధించడం అనరు. అవన్నీ తాత్కాలిక రాజకీయ అవసరాలకు పనికి రావచ్చునేమో కాని ప్రజల విశ్వసనీయతకు నోచుకోవు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం చెయ్యాలనేది ఆలోచన చేసి, దానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి, అమలుకు పటిష్ఠమైన కార్యాచరణ పథకాన్ని తయారుచేసి, ఒక నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది.

ఈ మొత్తం ప్రక్రియలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంప్రదాయక, సహజసిద్ధమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది కేసీఆర్ మొదటి విడత అధికారంలో వున్న ఏబైఒక్క నెలల కాలంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో-ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా జరగడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, నిబద్ధత, ప్రతి అంశాన్నీ పదిమందితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధానం, దేన్నైనా ఒకటికి పది సార్లు సమీక్షించిన తదుపరే నిర్ణయం చేసే సుగుణం...ఇలా మరెన్నో. వీటన్నిటి ఫలితమే అనేక పథకాల రూపకల్పన-అమలు. అభివృద్ధిని సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యం లీడర్షిప్.

         విశ్వవిఖ్యాత మేనేజ్‌మెంట్ రంగ నిపుణుడు జిమ్ కాలిన్స్, "గుడ్ టు గ్రేట్" అనే మహత్తరమైన పుస్తకాన్ని రాశాడు. అందులో ప్రధానంగా ఆయన లీడర్షిప్ లక్షణాలను, లీడర్ నాయకత్వంలో నడుస్తున్న సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన పద్ధతులను, మేనేజర్ కు లీడర్ కు, అందునా ఉన్నత స్థాయి లీడర్ కు వుండే వ్యత్యాసాన్ని వివరిస్తాడు. ఆయన తన సిద్ధాంతంలో "గుడ్", "గ్రేట్" అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవులని,  "గుడ్ టు గ్రేట్" ఎదగడానికి ఒకే ఒక దూకుడుతో జరిగే మార్పు కాదు-కానే కాదు అని, సంస్థను "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా....ఐదో (ఉన్నత) స్థాయి నాయకత్వమని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని సోదాహరణంగా వివరిస్తాడు. లీడర్ అనే వాడు మొట్ట మొదలు తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకుంటాడని, వారిలో ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేసి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో నిర్ణయిస్తాడని, నగ్న సత్యాల లాంటి పాశవిక వాస్తవాలను ధైర్యంగా విశ్లేషణ చేసుకుంటూ ఆ వాస్తవాలను వున్నదున్నట్లు పది మందికి తెలియచేస్తాడని, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతాన్ని తుచ తప్పకుండా పాటిస్తాడని, నిరంతరం సత్ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని, సంస్కృతిని అలవరచుకుంటాడని, ఐటీ లాంటి సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకుంటాడని.....ఇవన్నీ చేసేవాడు ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకుడనిపించుకుంటాడని జిమ్ కాలిన్స్ అంటాడు.


         అరుదైన ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకత్వ లక్షణాలున్న వారు, ఆ స్థాయికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అంచలంచలుగా ఎదుగుతారు. అలా ఎదిగే నేపధ్యంలో వివిధ రంగాలలో వారు పొందిన అనుభవం, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితంలో ఎదురైన ఆటుపోటులు, అనుభం నేర్పిన గుణపాఠాలు, సహచరుల తోడ్పాటు....ఇలా ఎన్నో వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అందరికీ ఇలా ఎదగడం కుదరదు. అతికొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకో గలరు. మరో విధంగా అలా ఎదిగినవారు, ఆ ప్రక్రియలో వివిధ స్థాయిలలో నాయకత్వ-యాజమాన్య (మేనెజీరియల్) లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి.

వివరాల్లోకి పోతే: వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి అలవాట్లతో, ఫలవంతమైన తోడ్పాటును సంస్థకు అందించగల వారే మొదటి స్థాయి "స్వయం సాధకులు". ఇక రెండో స్థాయికి చెందిన వారు, నలుగురున్న బృందంలోని "భాగస్వామ్య సభ్యులు". వీరు సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. మూడో స్థాయికి చెందిన "మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. నాలుగవ స్థాయి "సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరందరిని, ఏఏ పనికి ఉపయోగించుకోవాలో, సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన స్థానంలో ఎవరెవర్ని నియమించాలో నిర్ణయించగలిగేది ఐదో స్థాయి "కార్య నిర్వహణాధికారి" మాత్రమే . వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని వృత్తి పరమైన కార్య సాధనతో రంగరించి, ఒక అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచెలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

         వృత్తి పరమైన కార్య సాధన, వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్న ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వ తీరుతెన్నులను అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే తప్ప ఇతరులకు అంత త్వరగా అర్థంకాదు. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు ఆ నాయకుడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. నమ్రత-అణకువలను కార్య సాధనలో అడుగడుగునా ప్రదర్శించుకుంటూ, వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. సంస్థలో పనిచేసే వారిలో మంచి ఫలితాలను సాధించాలనే ప్రగాఢ వాంఛను కలిగించి, తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో-రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు. సాధించిన ఫలితాలన్నీ తన వల్లనే జరిగాయని అద్దంలో చూసుకుని మురిసిపోకుండా, ఆ పేరు-ప్రతిష్ఠలను ఇతరులతో పంచుకునేందుకు, తనకు తోడ్పడిన వ్యక్తులను గుర్తించేందుకు నాలుగు గోడల అవతల దృష్టి సారించుతాడు.

         సంస్థలో పనిచేసే ప్రతివారు ముఖ్యులని అనేకన్నా, వారిలోని సరైన వ్యక్తులే ముఖ్యులని భావించడం మంచిది. సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి సంస్థను తీసుకెళ్లాలంటే, అందుకు తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కార్య నిర్వాహకులు మొట్టమొదట చేసే పని. ముఖ్యంగా తన సహచర "నాయకత్వ బృందం" విషయంలో మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను "సంస్థ వాహనం" నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరి తనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

         "గుడ్ టు గ్రేట్" నాయకత్వ సిద్ధాంతం కేవలం ప్రయివేట్ సంస్థలకు మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్వహణకు కూడా అన్వయించుకోవచ్చు. ప్రభుత్వంలో, రాజకీయాలలో ఐదో స్థాయి "కార్యనిర్వహణాధికారి" నాయకత్వమంటే, "రాజనీతిజ్ఞుడు" అని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు "పరిపాలన" గురించి విన్నాం...ఆ తరువాత కాలంలో "సుపరిపాలన" అనేది పాపులర్ అయింది. అంతకంటే మెరుగైన పాలన కోరుకుంటున్నారు ప్రజలు. రాజనీతిజ్ఞతతో కూడిన సుపరిపాలన" కావాలంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల వర్తమాన అవసరాలను మాత్రమే తీరుస్తే సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. భవిష్యత్ కు బంగారు బాటలు (బంగారు తెలంగాణ) వేయాలి. కేసీఆర్ మొదటి విడత ఏబై నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్ లో జరగబోయేది అదే. రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు సార్వజనీనమైన పథకాలే! పది కాలాల పాటు మనుగడ సాగించి ప్రజల అవసరాలను తీర్చే పథకాలే! ఈ పథకాలన్నీ ముఖ్య మంత్రి "రాజనీతిజ్ఞత" కు నిదర్శనాలే! జిమ్ కాలిన్స్ సిద్ధాంతంలోని సమున్నత స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుని పోవడానికి వేస్తున్న బంగరు బాటలే! ఉదాహరణలు కోకొల్లలు.

         అభివృద్ధి అంటే ఇలా వుంటుంది అని ప్రజలు అనుకునేలా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది, పరుస్తున్నది ఈ ప్రభుత్వం. అందుకే...ఇప్పుడున్నది కేవలం "పరిపాలనో", లేక "సుపరిపాలనో" కాదు..."పరిపాలనలో రాజనీతిజ్ఞత". అదే అభివృద్ధికి పునాది. అందుకే...ఇందుకే...రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.


No comments:

Post a Comment