Sunday, May 31, 2020

వాల్మీకిదొక విలక్షణమైన శైలి .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-10 : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకిదొక విలక్షణమైన శైలి
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-10
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-06-2020)
వాల్మీకిదొక విలక్షణమైన శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒక విషయాన్నే రెండు-మూడు సందర్భాల్లో చెప్పాల్సి వస్తే, అక్కడ కొంచెం-అక్కడ కొంచెం చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు. మోసగాడని తలంపక, తనను ఎత్తుకుపోవడానికి వచ్చిన రావణుడిని నిజమైన బ్రాహ్మణుడిగానే భావించిన సీతాదేవి, సత్యం చెప్పకపోతే శపిస్తాడేమోనని భయపడింది. వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పింది. అంటే: వనవాసం వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలనీ, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండో నెలలో శ్రీరాముడి జననం - పన్నెండో ఏట విశ్వామిత్రుడితో వెళ్ళడం - పన్నెండేళ్లు అయోధ్యా వాసం - పన్నెండేళ్లు అరణ్యవాసం - పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం. ఈ విచిత్రం తత్త్వ వేత్తలకే తెలవాలి - పామరుల ప్రశ్నోత్తరాలు కేవలం యాధృచ్ఛికాలే. పదహారవ సంఖ్య గురించి వాల్మీకి వేసిన ప్రశ్నలోనే వుంది కూడా.

తన వెంట తనయాగాన్ని రక్షించడానికి వస్తున్న రాముడిని ఉద్దేశించి, ఒక పర్యాయం, " కౌసల్యా సుప్రజ! రా, మా! సరసిజనయన లెమ్ము- కౌసల్యా నందనా, రామా, కమలలోచనా, తొలి సంధ్య వస్తోంది. దేవత కార్యం, సంధ్యావందనం చేయాలి లెమ్ము" అంటాడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజ అంటే: ఎటువంటి మంచి బిడ్డను కనడం వల్ల కౌసల్య గొప్పదయిందోనని అర్థం. ఇలానేచెప్పుకోవాలికాని, కౌసల్యయొక్క మంచి కుమారుడు శ్రీరాముడు అని అర్థమొచ్చేటట్లు చెప్పుకోకూడదు. రామచంద్రమూర్తిని కనినందువల్ల కౌసల్య ప్రసిద్ధికెక్కి ధన్యురాలైందికాని, కౌసల్యకు పుట్టినందువల్ల రాముడు ధన్యుడుకాలేదు. వాల్మీకి ఈ అర్థం వచ్చేటట్లే రెండుమూడు సందర్భాల్లో చెప్తాడీవిషయాన్ని. తండ్రి పేరు చెప్పకుండా తల్లిపేరెందుకు చెప్పాడంటే: శ్రీరామచంద్రమూర్తి నిద్రిస్తున్నప్పుడు భక్తులకు శ్రీమంతుడు గానూ-శత్రువులకు సంహరించేవాడు గానూ కనిపిస్తాడు. కాబట్టి సుఖంగా నిద్రిస్తున్న శ్రీరాముడిని లేపబోయిన విశ్వామిత్రుడు ఆయన నిద్రాకాలికసౌభాగ్యసంపత్తి ని చూసి, తానొచ్చిన పని మర్చిపోయి, నివ్వెరపొంది, ఆహా! ఇలాంటి శ్రీమంతుడికి తల్లి కావడానికి కౌసల్యా దేవి ఎంత తపస్సు చేసిందోకదా అని విస్మయంతో కౌసల్య సుప్రజ అని సంబోధించాడు. మరో విషయం: వశిష్ఠుడు చెప్పిన తర్వాతే రాముడిని పంపేందుకొప్పుకున్నాడు. కౌసల్యేమో, ఎంతపుత్రవాత్సల్యం వున్నా, సాదరంగా ఆలస్యం చేయకుండా అంగీకరించింది. ఆమేం చిక్కులుపెట్టుతుందోనని సందేహించిన విశ్వామిత్రుడికి కౌసల్య గుణ మహిమ చూసి అబ్బురపడ్డాడు. అది జ్ఞప్తి కొచ్చి ఆమె పేరు స్మరించాడిప్పుడు. దాశరథీ అనికానీ, కౌసలేయ అనికానీ, రాఘవా అనికానీ పిలువలేదు. "రామా" అనడానికి కారణం: అతడి సౌందర్యానికి అచ్చెరువందడమే.

రాముడు తన బాణంతో తాటక రొమ్ములో నాటుకునే ట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది. శ్రీరామచంద్రమూర్తి అవతార కార్య ధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభం అవుతుంది. స్త్రీ వధ పాపం అని రామాయణమే చెపుతుంది. భరత వాక్యం - హనుమంతుడి వాక్యం అదే విషయం తెలియచేస్తుంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? భగవద్గీత పుట్టింది ఇలాంటి సంశయ నివృత్తికే. అర్జునుడు, శ్రీరాముడు - ఇరువురు క్షత్రియులే. స్వధర్మమని, బంధువులను చంపితే పాపం వస్తుందని, భయపడ్డాడు అర్జునుడు. స్వధర్మమని, స్త్రీ ని చంపవచ్చానని, శంకించాడు రాముడు. కృష్ణుడు అర్జునుడికి ఏం ఉపదేశించాడో - విశ్వామిత్రుడు అదే చేశాడు రాముడికి. స్వధర్మ నిర్వహణ తన విధి అని శ్రీరామచంద్రమూర్తి ఆసక్తి లేకపోయినా చేశాడు. అందుకే శ్రీరాముడు తాటకను చంపడం దోషం కాదు.


విశ్వామిత్రుడి వెంట పోతున్న రామలక్ష్మణులు అడవిలో కనిపించిన సిద్ధా శ్రమ వృత్తాంతాన్ని అడిగినప్పుడు ఆ విషయం చెప్తూ, బలిచక్రవర్తి కథ, వామనావతార విశేషం గురించి కూడా చెప్పాడు. విష్ణుమూర్తి, అదితి గర్భంలో వామనుడిగా పుట్టి, బలి చక్రవర్తిని చూసేందుకు అతడి యజ్ఞ శాలకు పోయి, త్రిలోక రక్షకుడైనందున దేవతలకు కీడుచేయతలపెట్టిన బలి చక్రవర్తి దురహంకారాన్ని నాశనం చేసే కార్యక్రమం చేపట్తాడు. తన కాలి కొలత ప్రకారం, దానవ రాజును ఒకటి-రెండడుగుల భూమిని యాచించి, ఆయన వద్దనుండి దాన్ని పొంది, లోకమంతా వ్యాపించి తన శక్తితో బలిని బంధించాడు.

ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. బలి చక్రవర్తి ఇంద్రుడిని-ఇతర దేవతలను తృప్తి పరిచేందుకు యజ్ఞం చేయలేదు. ఆయన విష్ణు భక్తుడు - విష్ణు భక్తుడు విష్ణువును తప్ప ఇతర దేవతలను ఫలం కోరి పూజించడు. కాబట్టి, బలి చేసింది, విష్ణ్వారాధన రూపమైన యజ్ఞం. యజ్ఞమంటే దేవ పూజ-ఇక్కడ ఆయన పూజించిన దేవత విష్ణువు. ఆయా దేవతలను ప్రీతి పరిచేందుకు, వారినుద్దేశించి, ఆయా మంత్రాలతో చేసే హోమాన్ని యాగం అంటారు. బలి యజ్ఞం చేయడం సమ్మతమే. ఇంద్రాయ స్వాహా - వరుణాయ స్వాహా అన్నప్పటికీ, విష్ణు భక్తుడైన వాడు ఆ దేవతల పేర్లు చెప్పినప్పుడు తన ఇష్టదేవతైన నారాయణుడినే ఆ పదంతో పూజిస్తున్నాడని భావించాలి. అయితే, తనమీద అనన్య భక్తిగల బలిని ఎందుకు విష్ణువు అణచదల్చుకున్నాడన్న సందేహం రావచ్చు. తనమీద భక్తి వున్నవాడికంటే, తన భక్తులమీద భక్తి వున్నవాడిని చూసి సంతోషిస్తాడు భగవంతుడు. భక్త విరోధైన మరో భక్తుడిని చూసి సంతోషించడు. వాడిని శిక్షించైనా మంచి మార్గంలోకి తెస్తాడు. అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే, విష్ణు భక్తులను సంతోషపెట్టాలి. తనను ఆరాధించకపోయినా, తన భక్తులను ఆరాధించేవారిని భగవంతుడు అనుగ్రహించి, వారికి ఇష్ట సిద్ధిని కలిగిస్తాడు. బలి చక్రవర్తి, దేవతలను బాధించినందువల్ల, తన భక్తుడైనా, దండించాల్సి వచ్చింది. భక్తుడైన వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఇతర భక్తులను బాధించకూడదు.

ప్రపంచ సృష్టి విషయంలో పరిణామ వాదం అని, వివర్త వాదం అని రెండు రకాలున్నాయి. మట్టి ముద్దే కుండయినట్లు, సూక్ష్మాలైన చిదచిత్తులలో వుండే భగవంతుడే, స్థూల చిదచిద్విష్టుడై, ప్రపంచాకారంగా పరిణమించాడని - సూక్ష్మానికి, స్థూలానికి అణుత్వ బృహత్త్వ భేదం తప్ప, మరే భేదం లేదని - రెండూ సత్యమని చెప్పేదే "పరిణామ వాదం". ప్రపంచం మిధ్య - బ్రహ్మమే సత్యం, అనడం "వివర్త వాదం". బాలుడు యౌవనవంతుడైనట్లు, సూక్ష్మంగా వున్న వామనుడే ముల్లోకాలను ఆక్రమించి, త్రివిక్రముడైనందువల్ల, ఇరువురికీ భేదం లేదని - రెండూ సత్యమని, తేలడంతో, వామనావతారం పరిణామవాదాన్ని స్థిర పరుస్తున్నది. దీనికే "వామన త్రివిక్రమ న్యాయం" అని పేరుంది. వామనావతారానికి యాచనే ఉద్దేశమని, ఆ కారణం తోనే, యాచన వృత్తిగా గల కశ్యపుడికి పుట్టాడని, ఇదే వామనావతార తత్త్వమని కొందరు చేసే వాదన తుఛ్చాతి తుచ్చమైన ఆలోచన. వామనుడు యాచించింది తన భార్య సొమ్ములకొరకు కాదు - తను బ్రతక లేక కాదు. యాచనా దోషం అందులోలేదు. గుర్వర్థమై - దేవతార్థమై - లోకోపకారార్థమై చేసే యాచన, యాచన కాదు.

No comments:

Post a Comment