లాక్ డౌన్ అనంతర జీవిక!
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (09-05-2020)
అలా...అలా.. ఊహల్లో కాసేపు విహరిస్తే, బహుశా ఇలా జరగచ్చునేమో??
జరగక పోవచ్చు కూడా! లాక్ డౌన్ అనంతరం మాత్రం జీవితం, జీవిక ఇదివరకటిలా, లాక్ డౌన్ ముందటి రోజుల్లాగా ఉండకపోవచ్చు. వుంటే ఆశ్చర్యమే!
లాక్ డౌన్ అనంతరం కాలంలో సంభవించబోయే పరిణామాలు,
స్వయంగా విధించుకోబోయే స్వీయ సామాజిక కట్టుడులు ఏ విధంగా మనగలుగుతాయో? ఏ విధంగా సగటు మనిషి జీవికలో మమేకం అవుతాయో? అన్నది
ఇప్పుడిప్పుడే ఎవరూ సమాధానం చెప్పలేని వింత ప్రశ్న. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో
సమాధానం వూహించడం, ఆశించడం కూడా అతి కష్టమే!
ఒకనాడు అంతరాలు
కొంతమేరకు పాటించినప్పటికీ, భౌతిక-సామాజిక దూరం పాటించటం భారతదేశానికి, దేశ ప్రజలకు, వివిధ సామాజిక వర్గాలకు బొత్తిగా మింగుడుపడని విషయం. అనాదిగా భారతీయులు అవలంభిస్తూ వచ్చిన సామాజిక పరిస్థితులు సామాజిక దూరాన్ని
అంగీకరించడం కష్టం. ఇది స్వీకరణకు తగనిదని ఎందుకనాలంటే, మన సంప్రదాయాలకు, కట్టుబాట్లకు, నమ్మకాలకు,
పాటింపులకు, దినచర్యకు, రోజువారి కార్యక్రమాలకు ఇది బహుదూరం. అను నిత్యం ఒకరితో
మరొకరు మమేకమై, పక్కపక్కన తిరిగుతూ,
ఆలోచనలను పంచుకుంటూ, కలసిమెలసి సహపంక్తి భోజనాలు చేస్తూ, కలగోపుగా వుండే భారతీయులకు భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశం వున్న శాశ్వత
సామాజిక దూరం చాలా ఇబ్బందికరమైన విషయమే.
ఉదాహరణకు, మనవాళ్లు ఎవరయినా పన్నెండు సంవత్సరాలకు ఓసారి వచ్చే
కుంభమేళాలాంటి సందర్భంలో, లేదా అనేక జీవనదులకు పుష్కరాలు
జరిగే సందర్భాల్లో నదుల పరిసరాలలో ఇటువంటి భౌతిక దూరాన్ని పాటించటం జరిగే పనేనా? అలాగే మనవాళ్లు ఎప్పుడైనా బజారుకెళ్లినప్పుడు గానీ, పెళ్లిల్లకెళ్లినప్పుడుగానీ, గుళ్లు, గోపురాలుకు వెళ్లినప్పుడు గానీ, కులాలకు సంబంధించిన సమావేశాలకు
వెళ్లినప్పుడు కానీ, రాజకీయపార్టీల ర్యాలీలు జరిగేట్పపుడు కానీ, ధర్నాలు,
గుళ్లు, పుట్టుక, చావు సందర్భాలు,
వివిధ సమ్మేళన స్థలాలు, పండుగులు, వ్యవసాయ పనులు,
మాల్స్, సినిమా హాళ్లు, హాస్టల్స్,
కాలేజీలు, విశ్వవిద్యాలయాలు చిన్న
చిన్న సమావేశాలకు వెళ్లినప్పుడు కానీ, సామాజిక
దూరం పాటించేవారేనా? ఇలా వేటినుంచైనా విడదీయగలమా? ఇది సంభవమేనా? మున్ముందు సంభవం కాక తప్పదేమో!
ఏ ఒక్కరోజు కూడా
నలుగురితో కలవందే,
సాయంత్రం విందు, మందు, వినోదం లేనిదే ఆడవారికయినా మగవారికయినా కబుర్లు, సరదాలు లేనిదే కనీసం కొందరకి మద్యం పుచ్చుకోవటమో, పేకాట ఆడుకోవటమో జరగనిదే, భారతీయులకు కాలం గడవటం దుర్లభమే. గతంలో లాగా, ఆడవారు నలుగురు కలిసి ఏ విష్ణు సహస్ర నామమో, లక్ష్మీ సహస్రనామాలో, లలితా సహస్ర నామమో పారాయణం చేయడం అన్నది మున్ముందు బహుశా
జరగని పనే. ఇలా అంతులేని సందర్భాలు అలాగే అనంతమయిన ప్రదేశాలు. అనేకమయిన
సందర్భానుసారవేదికలు,
వీటిన్నింటిలోనూ భౌతిక దూరం అన్నది అసాధ్యం. ఇవి న్యాయపరంగా తప్పని సరి అన్నా కూడా మనుగడ
సాధ్యం కాని చర్యలుగానే మిగిలిపోతాయి. కొత్తగా పెళ్లయిన జంటని భౌతిక దూరం అంటూ
విడదీయటం సాధ్యమేనా?
అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇందుకు సహకరించటం జరిగే పనేనా??
ప్రపంచాన్నంతటినీ
ఒక్కసారిగా ఒక్క కుదుపు కుదిపేసిన మహమ్మారి, దీనంతంటికీ మూలకారణం
మాత్రం ఒక చిన్న వ్యాధిని వ్యాప్తి చేసే కరోనా అన్న సూక్ష్మాతి సూక్ష్మ జీవి. ఈ
శక్తికి గల కారణాల నెరిగిన వైద్య నిపుణులు, వైరాలజిస్టులు, యావత్ ప్రపంచంలోని నిష్ణాతులు ఏ రకమైన మందుని, టీకానీ,
విరుగుడునీ ఈరోజు వరకు కనిపెట్టలేకపోగా దీని విస్త్రుతి, విజృంభణ భయం యావత్ ప్రపంచాన్నీ లాక్ డౌన్ పేరుతో కట్టిపడేయటం జరిగింది.
భారత ఉపఖండంలో
జీవిస్తున్న మనకు మాత్రం ఇటువంటి దుర్లభమయిన కట్టుబాట్లన్నవి అతిపెద్ద శిక్షగా
పరిగణించవచ్చు. మన న్యాయ వ్యవస్థలో
మనందరికి ఊహ తెలిసిన నాటి నుండి
జ్ఞాపకమున్న కఠినాతి కఠిన శిక్ష జీవితఖైదు.
బహుశా ఏ నేరం చేయకపోయినా, మనిషిగా పుట్టిన నేరానికి, ఓ రకంగా కొంత కాలంగా
మనమంతా అనుభవిస్తున్నది అదే రకమయిన శిక్షా జీవితం అని అనుకోవచ్చునేమో. ఇది ఒక
రకంగా మనం తెలిసోతెలియకో చేసిన పాపం, దాని పర్యవసానం అవ్వచ్చు.
ఒక రకమయిన మంచి జరగాలి అని అంటే బహుశా దీనిని స్వీకరించి, అనుభవించి తీరాలేమో. లేని పక్షంలో ఇంతకంటే విపత్కర పరిస్థితుల్ని చూడాలేమో.
ఏమో!
ఇప్పుడు మనం
పాటిస్తున్న వ్యాధి నిరోధక చర్యలు, వ్యాధి నియంత్రణ
ప్రయత్నాలు, నివారణ కార్యక్రమాలు తప్పని సరి అయి జీవిత పర్యంతం పాటించాల్సి వస్తే,
అలాంటిదాన్ని ఒక్కసారి తలుచుకుంటే, ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలా జరుగుతే, మనం ఎలా ఆలోచించుకోవాలి? ఇది తప్ప ఇంకేలేదు అనే కదా? ఇంకో గత్యంతరం కానరాదు అన్నది నిర్ణయించుకోవాలి. ఇందుకోసం లాక్ డౌన్
అనంతరం అన్న దానికి సిద్దపడాలి. ఇప్పటి
నుంచే ఈ కోణంలో ఆలోచించాలి. మనరోజు వారి జీవితం ఎలా ఉండబోతుంది అన్నది
ఊహించుకుని తీరాలి. మనం రోజూ చేసుకునే
పూజా పునస్కారం మనకు మనమే స్వీయ నియంత్రణలో నిర్వర్తించుకోవాలి. తీర్థ ప్రసాదాలను బహుశా శుధ్ది చేసుకుని
స్వీకరించాలేమో! తీర్థ ప్రసాదాలు
అందించేవారు ఆమడ దూరంలో నిలబడి అందించాలేమో?
అలా గౌరవప్రదమైన భౌతిక దూరం పాటించి అందించిందే స్వీకరించాలి.
ఎంతమంది నిజంగా ఆఫీసులకు
వెళ్లి పనులు నిర్వర్తిస్తారో, ఎంతమంది ఇళ్ల నుండే పనులు
చేస్తారో,
ఆ సర్వేశ్వరుడికే తెలియాలి. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి
చదువుకునే పిల్లలు బహుశా ఆన్ లైన్ తరగతులకు, పరీక్షలకు సిద్ధపడి
ఉండాలేమో. ఆ రకంగా అలవాట్లను అలవరచుకోవాలేమో. వాళ్లకు ఇక సామాజిక కలయిక అందని ద్రాక్షేమో! ఇంట్లో
ఆడవారు ఏ పనిమనిషి సహాయం లేకుండా స్వయంగా పనులు చేసుకోవటం అలవరచుకోవాలేమో. ఇతర
కుటుంబ సభ్యులూ తమవంతు సహాయ సహకారాలందించాలేమో. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు ఇళ్ల
నుంచే చేయాలేమో. మరి వీటిన్నింటికీ తప్పని సరి అయింది భౌతిక దూరం. పనిమనిషి వ్యవస్థ
కనుమరుగవుతుందేమో?
అవసరార్థం కూరలు, కిరాణా సామాగ్రి కొనుగోలు చేయాల్సి వస్తే వాటన్నింటికీ నూటికి తొంబై వంతులు ఆన్
లైన్ సదుపాయం అందుబాటులోనే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఏదైనా కొనాల్సి
అత్యవసరం వచ్చి బైటకి వెళ్ళి రావాలంటే ఫేస్ మాస్క్, గ్లవ్స్,
శానిటైజర్, యాప్రాన్ వంటివి
వ్యక్తిగత మొబైల్,
కళ్ళజోడు తోడు తీసుకెళ్లినట్లే తప్పని సరిగా ఇవి కూడా వెంట తీసుకొని
వెళ్ళాలి. చీటికి మాటికి బజారుకు పరిగెత్తే చిన్నచిన్న పనులు ఇక
కట్టిపెట్టుకోవాలేమో. ఒక్క సారే అన్నీ సమకూర్చుకోవాలి. అలాగే బస్సు, రైలు,
విమాన ప్రయాణం చేయాలంటే,
ప్రత్యేకమయిన శుద్ధి చేయబడిన వస్త్రధారణ సిద్ధం చేసుకోవటం అనివార్యం. ఆప్యాయంగా
పిల్లల్ని దగ్గరకి తీసుకుని మాద్దాడటం, శరీరానికి శరీరం, చర్మాణికి చర్మం తాకటం నేరంగా పరిగణించాలి.
ఇళ్లలో
కుటుంబసభ్యలంతా కలిసి విందు చేసుకోవటం, మల్టీ ప్లెక్సుల్లో
సినిమాలకు వెళ్ళటం,
షాపింగులు చేయటం, పబ్బులను సందర్శించటం, క్లబ్బుల్లో విహరించటం,
బ్యూటీ పార్లర్లకు అదే పనిగా పోవడం, సరదాగా పేకాట ఆడుకోవటం, మనకి నచ్చిన స్నేహితులు, చుట్టాలు, ప్రియమైన వారితో గడపటం వంటివన్నీ కూడా చరిత్రగానే మిగిలిపోవాలి. వాటిని ఊహల్లో
నెమరేసుకోవటానికి మాత్రమే వినియోగించుకోవాలి. టీవీలో ఇకపై లైవ్ డిస్కషన్ల స్థానే స్కైప్
ద్వారా ఫ్రీ ఛాటింగ్ చెయ్యాల్సిందే. ఇకపై న్యూస్ పేపర్ల స్థానే ఆన్ లైన్ పత్రికలు
పూర్తి స్థాయిలో
రావచ్చు. పాలు కూడా పైప్ లైన్ ల ద్వారా, గ్యాస్ కూడా పైప్ లైన్ ద్వారా జరగచ్చు. ఆ మాటకొస్తే నిత్యావసర ద్రవ
పదార్థాలన్నీ పైప్ లైన్ ద్వారానే సరఫరా చేసుకోవాలేమో? చెప్పలేం!!
నేటి తరానికి
గ్రామీణ జీవితం అంటే ఏమిటో తెలియని నేపధ్యం. ఎద్దుల బండి మీద ప్రయాణం, చల్ల చిలకటం,
పిడకలు చేయటం వంటివి వింతలు సంభ్రమాశ్చర్యానికి లోనుచేసే
చర్యలు. ఇవన్నీ ఈ తరం వారు పుస్తకాలలోనో, గూగుల్
సర్చ్ లోనో చూస్తున్నారు. ఇక వచ్చే రోజులలో లాక్ డౌన్ అనంతరం అంతకు ముందు
జరిగినవన్నీ వింత అనుభూతులే అవుతాయి. కొంత కాలానికి మనకే అనిపిస్తుంది. లాక్ డౌన్
పూర్వం మనం ఇలా జీవించి ఉన్నామా అని, ఇంత స్వేచ్ఛ మనకు ఉండిందా
అని. మనుషులకి ఇంత స్వాతంత్ర్యం ఉండేదా అనీ. వచ్చే తరానికి సాంఘిక జీవనం అనుభూతి
కూడా ఉండకపోవచ్చు నేమో. అది తెలిసే, చవిచూసే ఆస్కారం
లభించకపోవచ్చు నేమో.
అయితే, ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే తరం భౌతిక దూరం పాటిస్తూ ఎలా జీవిక
సాగించబోతోంది అన్నది ఒక రకంగా చర్చనీయాంశమే. చరిత్రకారులు, పరిశోధకులు,
వ్యవహారిక శాస్త్రజ్ఞులు రాబోయే రోజుల్లో అసలు గతంలో భౌతిక
దూరం పాటించకుండా ప్రజలు ఎలా జీవించి ఉన్నారు అనే అంశంపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు,
పుస్తకాలు, పరిశోధనాత్మక గ్రంథాలు (అవీ డిజిటల్
పద్ధతిలోనే) రాస్తారేమో? ఏ విధమైన మాస్కులు, శానిటైజర్లు,
వ్యక్తిగత శుభ్రత అన్నది లేకుండా ఎలా జీవించగలిగారు గతంలో అన్నది
పరిశోధకులు శోధిస్తారు. ఇన్ని సంవత్సరాల జీవితం ఎలా సాగించబడింది అన్నది చేదిస్తారు.
వారి జీవిత కాలంలో వైరస్,
బ్యాక్టీరియా వంటి బాదరబందీ లేకుండా ఎలా నెట్టుకు రాగలిగారు
అన్నదీ పరిశీలిస్తారు. వారికి ఇన్ని రకాల సూక్ష్మజీవుల గురించి తెలిసినా ‘‘కరోనా’’ రాకమునుపు ఎలా ప్రశాంతంగా గడపగలిగారు
అన్నది వెలికితీస్తారేమో!
ఇంకో విధంగా
చెప్పాలంటే లాక్ డౌన్ అనంతరం మునపటిలా కాక
జీవితఖైదు అనుభవించే వ్యక్తిగా మనం మనుగడ సాగించాలి. లేదంటే మనం పుట్టమునగక తప్పదు. లేదా భౌతిక
దూరం అవసరం లేదన్న తీపికబురు సరికొత్త పరిశోధనలు చెప్పాల్సిందే.
భౌతిక దూరం
పాటించమని కార్ల్ మార్క్స్ చెప్పకపోయినా ఆయన సిద్ధాంతాలు భవిష్యత్ లాక్ డౌన్ అనంతర
జీవిక కాలానికి సరిగ్గా సరిపోతాయేమో! భవిష్యత్ లో వున్న వారనీ లేనివారినీ; ధనికుడనీ,
పేదనీ; ఉన్నత వర్గమనీ, తక్కువ కులమనీ; ఉన్నత
స్థాయనీ,
దిగువ స్థాయనీ; ఒక ప్రధాని అని ఒక సామాన్యుడనీ బేధాలు
భౌతిక దూరానికి అబ్బవు. దానికి
తెలిసిందల్లా మూసలోపడి కొట్టుకుపోవడమే. భవిష్యత్ సమాజం ముందర అంతా సమానమే ఇక! వసుదైక
కుటుంబం ఇక అదేనేమో!
ఎక్కడ భౌతిక దూరం. అందరూ సుబ్బరంగా కలిసిపోయి తిరిగేస్తున్నారు.
ReplyDelete