సమర్థ, ప్రభావవంత సారథి
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక
(09-05-2020)
మేనేజిమెంట్
గురుగా పేరు ప్రఖ్యాతులు పొందిన పీటర్ డ్రకర్ రెండు ముఖ్యమైన పదాల గురించి
వివరించాడు. అవేమిటంfటే, ఒకటి ఎఫిషియన్సీ, అంటే పనులు సమర్థంగా చేయడం. మరో పదం ఎఫెక్టివ్ నెస్ అంటే
పనులు ప్రభావవంతంగా (ఫలితం స్పష్టంగా కనిపించేటట్టు) చేయడం. కాబట్టి ఎఫెక్టివ్
నేతలందరిలోను ఉండే సాధారణ లక్షణం వాళ్ళు పనులు సరియైన రీతిలో జరిగేలా చూస్తారు. ఈ
నేతల బలాబలాలు,
వ్యక్తిత్వాల్లో ఎంత తేడా ఉన్నప్పటికీ ఎఫెక్టివ్
నేతలందరిలోను సాధారణంగా కనిపించే ఉమ్మడి లక్షణం ఇది. డ్రకర్ చెప్పిన మరో మాట ఏమిటంటే, ఎఫెక్టివ్ నేతల పనితీరు
ఎలా ఉన్నప్పటికీ,
అంటే వారు పనిచేసే పద్ధతి ఎలాంటిదైనప్పటికీ వాళ్ళందరు
సాధారణంగా ప్రజలందరి పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తారు.
కాబట్టి సరయిన
పనులు చేయడం అంటే ఎఫెక్టివ్ నెస్ అనేది, పనులు సరిగా చేయడం అంటే ఎఫిషియన్సీ కన్నా
చాలా ముఖ్యమైనది. ఎఫెక్టివ్ నెస్ అనేది ఒక ఫలితాన్ని సాధించడం. ఈ ప్రయత్నానికి
దీర్ఘకాలం పట్టినా సరే ప్రయత్నం కొనసాగించడం. ఇది ఫలితాలను సాధించే కళ. ఎఫిషియన్సీ
అనేది ఫలితాన్ని త్వరగా సాధించే కళ. ఎఫెక్టివ్ నాయకులు ఒక సిద్ధాంతానికి అంకితమై
పనిచేస్తారు. తమ కన్నా తాము నమ్మిన సిద్ధాంతం చాలా విలువైనదిగా భావిస్తారు.
సమాజాన్ని మెరుగైన సమాజంగా మార్చే కలలు కనేవారు మాత్రమే ఎఫెక్టివ్ నాయకులుగా
ఉండగలరు. ఈ అంకితభావం,
నిబద్దత లేకపోతే నాయకుడు అవసరమైన సాహసోపేత నిర్ణయాలు
తీసుకుని వాటిని అమలు చేయడం సాధ్యం కాదు. డ్రకర్ మాటల్లో చెప్పాలంటే విజయం అనేది
ఎఫెక్టివ్ నెస్ ద్వారా ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలో కరోనా వైరస్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి కేసీఆర్ చేస్తున్నది ఇదే. ప్రస్తుతం మనం
ఉన్నపరిస్థితుల్లో పీటర్ డ్రకర్ సూత్రాలు చాలా ముఖ్యమైనవి. ఎఫెక్టివ్ నాయకత్వం
ఏమిటన్నది నిర్వచించాలంటే దేశంలో కరోనా వైరస్ కు ముందున్న వాతావరణం, పరిస్థితులు,
కరోనా వచ్చిన తర్వాతి పరిస్థితులను విశ్లేషించడం అవసరం.
అలాగే దేశం కరోనా వైరస్ సమస్యను ఎలా ఎదుర్కుంది? తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ ఈ సమస్యను ఎలా ఎదుర్కున్నారన్నది పరిశీలించడం
అవసరం. కరోనా వైరస్ ను అదుపు చేయడంలో కేసీఆర్ రాష్ట్రానికి ఒక ఎఫెక్టివ్ నాయకత్వం
అందించారన్నది నిర్వివాదాంశం. ప్రజల్లో భయాందోళనలు వ్యాపించకుండా తగిన
ధైర్యాన్నిస్తూ,
ప్రజల్లో నిరాశనిస్పృహలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ
కరోనాను కట్టడి చేశారు. కరీంనగర్ లో కరోనా పరిస్థితి చేయిదాటుతున్నప్పటికీ
చాకచక్యంగా నియంత్రించారు. కంటైన్మెంట్ ఏరియా అనే భావాన్ని ప్రవేశపెట్టడం కూడా
ఎఫెక్టివ్ నాయకత్వానికి గొప్ప ఉదాహరణ.
కరోనా వైరస్
మహమ్మారి వార్త వచ్చిన తర్వాత కేసీఆర్ కంగారు పడలేదు. హడావిడి నిర్ణయాలు
తీసుకోలేదు. మౌలికమైన వాస్తవాల అవగాహన ఉన్న నాయకుడిగా, ఆచరణాత్మకంగా వ్యవహరించారు. కరోనా వైరస్ ను అదుపు చేయడానికి అవసరమైన అనేక
చర్యలను వరుసగా ప్రకటించారు.
అనేక సందర్భాల్లో
కేసీఆర్ దార్శనికత,
దూరదృష్టి కలిగిన నాయకుడిగా నిరూపించుకున్నారు.
మౌలికవాస్తవాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగిన నేత. రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి
చేయడానికి ఆయన తీసుకున్న చర్యలు, అలాగే తెలంగాణా పరిపాలనలో
ఆయన తీసుకున్న అనేక విధానపరమైన నిర్ణయాలు, ప్రవేశపెట్టిన అనేక
కార్యక్రమాలు ఆయన్ను ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా
ఆయన్ను పరిచయం చేస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై
నిషేధం ఎత్తివేయడానికి అనుసరించిన పద్ధతి. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శక
సూత్రాల ప్రకారం మద్యం అమ్మకాలపై నిషేధం సడలించవలసి ఉంది. అలాగే పొరుగు
రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నప్పుడు ఇక్కడ నిషేధం అమలు చేయడం వల్ల
సమస్యలుంటాయి,
కాబట్టి నిషేధం తొలగించక తప్పదు. ఇంతకు ముందు లాక్ డౌన్
పొడిగించే ముందు ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి నిర్ణయం
తీసుకున్నారు. అదేమాదిరిగా మద్యం అమ్మకాలకు అనుమతి విషయంలోను రాష్ట్రాలతో
సంప్రదించి నిర్ణయం తీసుకుని వుంటే చాలా బాగుండేది. కాని అలా జరగలేదు.
మే 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో చెప్పిన మాటల విషయానికి వస్తే, ఈ మీడియా సమావేశం చివరిలో కేంద్రప్రభుత్వ వ్యవహారశైలిపై వ్యాఖ్యలున్నాయి.
కేంద్రం దేశంలోని ఫెడరల్ స్ఫూర్తిని తుంగల్లో తొక్కుతూ, రాష్ట్రాల అధికారాలను కబళిస్తున్న తీరును ఆయన విమర్శించారు. దేశంలోని
శక్తివనరుల రంగం మొత్తం తన గుప్పిట పెట్టుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. అందుకే
ఒక నిరంకుశ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ఈ
ప్రతిపాదిత కొత్త చట్టం ప్రకారం పవర్ సెక్టార్ కు సంబంధించిన అధికారాలన్నీ కేంద్రం
చేతుల్లోనే ఉంటాయి. నియంత్రణ మండలికి సభ్యులను నియమించడం మొదలు, సబ్సిడీలపై నిర్ణయాలు,
టారిఫ్, ప్రోత్సాహకాలు వగైరా
అన్ని నిర్ణయాల అధికారం కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఈ కొత్త ఆర్డినెన్సు కనుక వస్తే
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరంటు పథకం,
యస్సీ యస్టీ సముదాయాలకు ఇచ్చిన అనేక మినహాయింపులు
రద్దువుతాయి.
కరోనా వైరస్ కు
ముందు, కరోనా వైరస్ తర్వాత దేశంలో ఏర్పడిన ఆర్ధికపరిస్థితి, ఆర్థిక సంక్షోభాల తీవ్రతను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం
ఆర్థికవిధానాల్లో మొండిగా వ్యవహరిస్తున్న తీరును కేసీఆర్ ప్రస్తావించారు.
పరిమాణాత్మక సడలింపు లేదా క్వాంటిటేటవ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీలను
సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రస్తుత పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ప్రధానికి లేఖ
రాసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వినూత్న
ఆర్ధిక ప్రతిపాదనలు అవసరమని ఆయన అన్నారు.
లాక్ డౌన్
పొడిగించాలని వాదించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధాని కన్నా ముందే ఆయన ఈ మాట
చెప్పారు. అలాగే కేంద్రం కన్నా ఎక్కువ రోజులు లాక్ డౌన్ పొడిగించారు. మే 5వ తేదీన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏ మహమ్మారి అయినా 70 రోజుల కాలంలో బలహీనపడుతుందని యధాలాపంగా చెప్పిన మాటల్లో వైజ్ఞానిక వాస్తవం
ఉంది. ప్రొఫెసర్ ఇస్సాక్ బెన్ ఇస్రాయీల్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు
కూడా ఇదే మాటను చెప్పాయి. కరోనా వైరస్ 70 రోజుల కాలవ్యవధిలో
అంతరిస్తుందన్నారు. కేసీఆర్ పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో లాక్ డౌన్ మే 29 వరకు కొనసాగాలి. అంటే దాదాపు 70 రోజులు పూర్తవుతాయి. ఈ
సందర్భంగా జాతీయస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. మనకు అత్యంత
సమర్థుడైన ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్న
నాయకుడాయన. ప్రధాని మోడీ చెప్పిన మాటను మారు మాట్లాడకుండా దేశ ప్రజలు
పాటిస్తున్నారు. కరోనా సంక్షోభంలో ప్రధాని ఏది చెబితే ప్రజలు అది చేశారు. చప్పట్లు
కొట్టమంటే చప్పట్లు కొట్టారు. తప్పట్లు కొట్టారు. దీపాలు వెలగించారు. అయితే అంతకు
మించి మరేమీ జరగలేదు.
దేశంలో కరోనా వైరస్ పరిస్థితిని ఎదుర్కోడానికి కేంద్రప్రభుత్వం
ఒక పటిష్టమైన పథకంతో ముందుకు రావలసింది. ప్రధాని ఏం చేయమంటే అది చేయడానికి ప్రజలు
సిద్ధంగా ఉన్నారు. ఏం చేయమంటే అది చేశారు. లాక్ డౌన్ కు ముందు లేదా లాక్ డౌన్
ప్రకటించిన తర్వాత ప్రజలకు స్పష్టమైన ఒక పథకం ప్రకటించి ఉండవలసింది. ఇప్పుడైనా
లాక్ డౌన్ ను ఉపసంహరించడానికి సంబంధించి స్పష్టమైన ఒక పథకం ప్రకటించడం అవసరం.
కరోనా పరిస్థితిలో కేంద్రం వ్యవహరించిన తీరు అవగాహనారాహిత్యాన్ని, ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం సానుభూతి లేకపోవడాన్ని ప్రదర్శిస్తోంది. ఢిల్లీలోని
నిజాముద్దీన్ లో వేలాది మందితో ప్రార్థనలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి
ఇచ్చింది?
ఈ సంఘటన కూడా కరోనా విస్తరించడానికి కారణమైంది. వలసకూలీల
విషయంలో కేంద్రప్రభుత్వ వ్యవహారశైలి, స్వంత రాష్ట్రాలకు
వెళ్ళాలనుకుంటున్న వలసకూలీలకు ప్రత్యేక రైళ్ళలో టిక్కెట్టు వసూలు చేయడం చాలా
అన్యాయంగా ఉంది. కాబట్టి ఎఫిషియంట్ గా పనిచేయడం, ఇంకా, ఇంకా ఎఫీషియంట్ గా పనిచేయడం గురించి ఆలోచించే బదులు ఎఫెక్టివ్
గా ఎలా పనిచేయాలో ఆలోచించడం అవసరం.
Take credit for all good things and blame centre for all bad things.
ReplyDelete