Wednesday, May 27, 2020

వాల్మీకంలో గంగావతరణం : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకంలో గంగావతరణం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక చింతన (28-05-2020)

విశ్వామిత్రుడి యాగరక్షణ పూర్తైన తరువాత ఆయన ఆజ్ఞానుసారం ఆయన వెంట మిథిలా నగరానికి బయల్దేరి పోతూ మధ్యలో ఒకనాడు మనస్సుకింపైన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారు రామలక్ష్మణులు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ, అది ఎలా మూడు మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి వీలైందని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు జవాబుగా విశ్వామిత్రుడు గంగానదీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు.

"హిమవత్పర్వతం గురించి తెలియనివారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది ’గంగ”, చిన్నది ’ఉమ’. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు, దేవతలు ఆయన్ను కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు, మూడు లోకాలను పావనం చేసేదై, స్వేఛ్చగా చరించేదై, ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను, వారికి వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు" అని పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియచెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు.

గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు, గంగ దేవలోకంలో, మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణమేంటని, ఏ పని చేయడంవల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైందిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా, గంగా చరిత్రను పూర్తిగా చెప్పాడు విశ్వామిత్రుడు.

"పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని, సంతోషంగా ఆమెతో నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు. రేతస్ఖ్సలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖ్సలనం కాకపోతే, అయినప్పుడు ఎంత బలిష్ఠమైనవాడు పుడతాడోననీ, వాడెలాంటివాడవుతాడోననీ, వాడిని భరించడమెట్లాననీ దేవతలు భయపడి, తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి, నమస్కరించి, తమ మ్రొక్కులను గ్రహించి తమననుగ్రహించమని వేడుకుంటూ, ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని-పార్వతిని, వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ, ఆయన నుండి వెలువడే కాంతి పూరితమైన తన రేతస్సును పార్వతిలో విడువకుండా తనలోనే వుంచుకొమ్మని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్ని సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు".

దీన్నే "మహా మైథునం" అని వాడుకలో పిలుస్తారు. పంచమ కారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం.

"ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు, వారి కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని, పార్వతి శోణితాన్ని తమలోనే ధరించెదమని, రెంటినీ కలవనీయమని, వేర్వేరుగా వుంచుతామని అంటూ, మనుష్యులు, దేవతలు సుఖంగా వుండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా, ఆయన తేజం జారితే, దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకి వదిలాడు. అది, అడవులు-కొండలు తో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి, అగ్నిహోత్రుడిని, వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా, అగ్నిహోత్రుడందులో ప్రవేశించాడు. ఆకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా యింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమయింది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు".

"ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి, వారుచేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. పార్వతీదేవి శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు" ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు.

         "పార్వతితో శివుడు తపస్సు చేసేందుకు హిమవత్పర్వతానికి పోవడంతో దేవతలందరూ ఋషీశ్వరులతో కలిసి, బ్రహ్మ దగ్గరకు పోయి, రాక్షసులతో యుద్ధం చేసేందుకు తగిన బలవంతుడైన సేనానాయకుడు కావాలనీ అడిగారు. జవాబుగా, బ్రహ్మ, గంగ ద్వారా అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలగనున్నాడని, వాడు దేవతలకు సేనానాయకుడై వాళ్లను రక్షిస్తాడని చెప్తాడు. గంగకు పుట్టిన కొడుకును ఆమెవలనే, పార్వతికూడా తన కుమారుడిగానే అంగీకరిస్తుందని అన్నాడు. ఆ తరువాత అగ్నిదేవుడిని కలిసారు దేవతలు. ఆయన ధరించిన ఈశ్వర తేజాన్ని గంగలో విడిచి కుమారుడిని కనమని, లోకాలకెల్ల ఇది హితమైన కార్యమని వేడుకుంటారు. అంగీకరించిన అగ్ని గంగను చేరగా, ఆమెకూడా అయన కోరికను ఒప్పుకుంటుంది. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపించగా, అగ్నిహోత్రుడు తన సర్వావయాలనుండి తనలో వున్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది".

"తానీ గర్భ వేదనను సహించలేక పోతున్నాననీ, తేజస్సును భరించలేక పోతున్నాననీ, అవయవాలు దుర్బలమై తెగిపోతున్నాయని, మండిపోతున్నాయని నిట్టూర్పులిడిచింది గంగ. దిగాలుపడిన గంగను చూసిన అగ్నిహోత్రుడు, ఆమె తన గర్భాన్ని హిమవంతం కిందిభాగంలోని నేలపై విడవమని చెప్పాడు. ఆ ప్రకారమే గంగ దాన్ని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి-బంగారం అయింది. దానివేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి, ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం-తగరం అయింది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారు మయమయింది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు-తీగలు-పొదలు-పచ్చిక బంగారమయింది. అప్పటినుంచి బంగారం అగ్ని వర్ణంలో వుండడంతో జాత రూపం అనే పేరొచ్చింది".


"శరవణంలో పుట్టిన కొడుకును చూసిన ఇంద్రాది దేవతలు, ఆయన తమ సేనాపతి అవుతాడని బ్రహ్మ చెప్పడంవల్ల, దేవతలు ఆయనను తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు" అని విశ్వామిత్రుడు గంగాదేవి చరిత్రమంతా రామ లక్ష్మణులకు చెప్పి, పుణ్యాత్ముడైన కుమారస్వామి చరిత్రను వినినందున ఆయనకెప్పుడు శుభాలు కలుగుతాయని అంటాడు.

ఇక ఆ తరువాత సగరుడి చరిత్ర చెప్పి గంగావతరణం గురించి వివరించాడు. "సగరుడి మరణం తర్వాత ఆయన మనుమడు అంశుమంతుడు తన కొడుకైన దిలీపుడిపై రాజ్యభారం మోపి, హిమవత్పర్వతానికి పోయి సగరకుమారులందరికి తర్పణాలు విడవడం కోసం గంగకొరకు ముప్పైరెండు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరకు గంగను తేలేక మరణించాడు. తదనంతరం, దిలీపుడు తన కొడుకైన భగీరథుడిని రాజుగా చేసి మరణించాడు. భగీరథుడు రాజర్షిగా వుండి, పిల్లలులేనివాడైనందున, రాజ్యాన్ని మంత్రుల పరంచేసి, గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని, అలా వరమివ్వమనీ, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమనీ బ్రహ్మనడిగాడు భగీరథుడు. ఆయన కోరినట్లే జరుగుతుందనీ, అయితే, ఆకాశగంగ భూమిపై పడితే ఆ వేగాన్ని, భారాన్ని భూమి భరించలేదుకాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు. భగీరథుడికలా చెప్పి, తన మాట ప్రకారం ఆ పుణ్య చరితుడి కోరిక తీర్చేందుకు భూలోకానికి పొమ్మని గంగకు కూడా చెప్పి అంతర్థానమయ్యాడు ".

"భగీరథుడు ఏడాదిపాటు శివుడి కొరకు తపస్సు చేశాడు. ఆయన కోరిక ప్రకారమే గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని శివుడు మాటిస్తాడు. శివుడిలా చెప్పగానే, గర్వాతిశయంలో వున్న ఆకాశ గంగ, ఎలా శివుడు తనను సహించగలుగాతాడో పరీక్షించాలని, ఆయన్నెత్తుకుని పాతాళంలో పడేయాలని నిశ్చయించుకుంటుంది. భయంకరమైన ఆకారంతో, సహించరాని అధికమైన వేగంతో వస్తున్న ఆకాశ గంగ పొగరు చూసిన శివుడు, రోషంతో విజృంభించి గంగ ఉనికి లేకుండా చేయాలనుకుంటాడు. హిమవత్పర్వతంతో సమానమైన గుహలాంటి రుద్రుడి జడలో భయంకరంగా ప్రవేశించిన ఆకాశ గంగ, వెలుపలకి రాలేక, అందులోనే తిరుగుతూ, చాలా సంవత్సరాలు సుళ్లు తిరుగుతూ బాధననుభవించింది”.

“శివుడు, తన జడల గుంపును కొంత సడలించి, ఆ సందులోంచి కొంచం పరిమాణంలో గంగను బిందు సరోవరంలో విడిచాడు. అక్కడినుంచి ఏడు పాయలుగా గంగా నది పారింది. హ్లాదిని, పావని, నళిని అనే మూడు పాయలు తూర్పు ముఖంగా-సుచక్షువు, సీత, సింధు అనే మూడు పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన ఏడో పాయ భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడు ఆకాశ గమనం గల దివ్యరథాన్నెక్కి, ఆకాశ మార్గంలో పయనం చేస్తుంటే, దేవతల పొగడ్తల మధ్య గంగ భూమ్మీదగా భగీరథుడి వెంట పోయింది. అప్పటి నళిని పాయనే ఇప్పుడు బ్రహ్మపుత్రి నదని అంటున్నారు".

"అలా ఆకాశాన్నుండి చీలిపోయి, శివుడి జటాజూటంలోకి చొరబడి, అక్కడినుంచి భూమి పైకొచ్చి, భూమిపై ప్రవహించ సాగింది గంగ. పవిత్రమైన గంగా జలం శివుడి శిరస్సునుండి పడిందని భావించిన దేవతలు, దేవర్షులు, భూమిపైనున్నవారందరు అందులో స్నానం చేశారు. శాప కారణంగా భూమ్మీదనున్న దేవతలు కూడా గంగా స్నానం చేసి, పాపరహితులై తిరిగి దేవత్వాన్ని పొందారు. భూమ్మీదున్న ప్రజలు కూడా గంగలో స్నానం చేసి తరించారు. ఇలా గంగ భగీరథుడి రథం వెంట పోతుంటే, దాని వెంబడి దేవతల, రాక్షసుల, కిన్నరుల, యక్షుల గుంపులు పోతుండగా, మార్గమధ్యంలో, జహ్నుడు అనే ముని యజ్ఞం చేస్తున్న ప్రదేశాన్ని గంగ నీటితో ముంచింది".

"ఎప్పుడైతే నీటితో గంగ తన యజ్ఞ వాటికను ముంచేసిందో, జహ్నుడు కోపించి, గంగ గర్వం అణచాలనుకొని, నిమిషంలో గంగా జలాన్నంతా తాగేశాడు. అప్పుడు దాని వెంట వస్తున్న మునీంద్రులు, ఇతర దేవతా గణం ఆయన్ను ప్రార్థించి, గంగ ఆయన కూతురుగా ప్రఖ్యాతి వహిస్తుందని చెప్పి, ఆమెను వదిలిపెట్టమని కోరుతారు. వారి మాటలకు సంతోషించిన జహ్నుడు, గంగను తన చెవులలో నుండి బయటకొదిలాడు. గంగ అందువల్ల జాహ్నవిగా పిలువబడుతుంది. గంగ ఆ పిమ్మట భగీరథుడి రథం వెంట పోయి, సముద్రంలో ప్రవేశించి, ఆయన కోరిక నెరవేర్చేందుకు పాతాళానికి పోయి, భగీరథుడి తాతల బూడిదమీద దండిగా ప్రవహించడంతో, సగర పుత్రులంతా దోషరహితులై, స్వర్గానికి పోయారు".

శంకరుడి శిరస్సులో పడినందున-పాపాలను పోగెట్టేదైనందున పావనమైంది గంగంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు ధరించాడు. అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు పావనులై, గంగనూ పావనం చేసారు. శివుడి శిరస్సునుండి గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణు పాదంలో పుట్టడమే. హరుడి శిరస్సునందుండి పడడం వల్ల గంగ పుణ్య నదైందని శైవులు వాదిస్తారు. గంగ పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవ వాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడిందనుంది. గంగాశివులకు పరస్పర సంబంధం లేనప్పుడు కూడ ఇద్దరూ పుణ్యులనే అర్థం. అయోధ్యా కాండలో వశిష్ఠ వాక్యంగా కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాదతీర్థం ధరించి పార్వతీ పతి ధన్యుడయ్యాడు అని చెప్పబడుతుంది ఒకానొక చోట. 
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment