అమృతంలాగా మోక్షానందం
కలిగించేది రామాయణం
శ్రీ మదాంధ్ర వాల్మీకి
రామాయణం బాలకాండ మందర మకరందం-8
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక
(18-05-2020)
తేనెలొలికే అందం
తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం
తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు రామాయణ గానం
చేస్తున్నారని తమ్ముళ్లతో అంటాడు శ్రీరామచంద్రుడు వారు తన ముందర గానం
చేస్తున్నప్పుడు. రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై,
కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా
వస్తుంటాయో,
అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం
కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో
వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ
పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం
ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం.
బాల కాండతో రామాయణ
కథ ప్రారంభమవుతుంది. అయోధ్యా పుర వర్ణనతో మొదలవుతుంది. భగవంతుడు అక్కడ
పుట్టినందువల్లే,
ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది.
భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే
మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే
మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు.
అయోధ్యా పుర
జనులను గురించి రాస్తూ,
అక్కడి బ్రాహ్మణులను గురించి చెప్పబడింది. వారు ఆరంగాల
వేదాధ్యయనం (శిక్ష – వ్యాకరణం – ఛందస్సు – నిరుక్తం – జ్యోతిష్యం - కల్పం)
చేసినవారు. బ్రాహ్మణులను ద్విజాతులని - వేదషడంగ
పారగోత్తములని–అహితాగ్నులని–సహస్రదులని–మహామతులని – సత్యవచస్కులని - హిమకరమిత్ర
తేజులని – ఋషులని - హృష్ఠ మానసులని - శాస్త్ర చింతన పరాయణులని – స్వస్వతుష్టులని –
త్యాగశీలురని - భూరి సంచయులని పోలుస్తూ వర్ణించబడింది.
అదేవిధంగా పూర్వ
కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం అయోధ్య నగర
వాసుల గురించి వర్ణించినప్పుడు చెప్పబడింది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే
వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేనని స్పష్ఠంగా
చెప్పబడింది.
సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా,
కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని బాధపడిన దశరథుడి
విషయాన్ని ప్రస్తావిస్తూ,
బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం,
బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడనీ, సుతులు లేనివారికి గతులు లేవంటాయని, కొడుకులవల్ల జయం-మనుమల
వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయని, ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనేననీ, ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుందనీ, అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారని చెప్పబడిందిందులో.
దశరథుడి
పుత్రకామేష్టి యాగానికి వచ్చిన విష్ణుమూర్తి, శరణాగతులైన బ్రహ్మాది
దేవతలందరికీ అభయహస్తమిచ్చి,
తాను మనుష్యుడిగా ఎవరికి జన్మించాలనీ-ఆ యోగ్యత ఎవరికున్నదనీ
ఆలోచించాడు. తామరాకులలాంటి విశాలమైన నేత్రములున్న వాడు, పాప సంహారుడు,
నమస్కారం చేసే ప్రజలను రక్షించాలన్న ఆసక్తిగలవాడు, వంచన లేనివాడైన భగవంతుడు తనకు తండ్రి కాగల అర్హుడు అయోధ్యాపురాధిపతైన
దశరథుడేనని తలచాడు. దీనికి కారణముంది. స్వాయంభువ మనువు, పూర్వం గోమతీ తీరాన వున్న నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ
మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన
భగవంతుడు,
ఆయన దశరథుడిగా పుట్టినప్పుడు "శ్రీరాముడు" గా
పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు
"శ్రీకృష్ణుడు" గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడోజన్మలో "శంబళ
గ్రామం" లో-కలియుగంలో-నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణుడికి
"కల్కి" గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా వుండి, మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది. శంబళ-సంబళ-శంభళ-సంభల అనే
రూపాంతరాలు కూడా శంబళ గ్రామానికున్నాయి. భారతంలో హరివ్రతుడికి విష్ణుశర్మ అన్న
పేరుంది.
దేవతల ప్రార్థన
ప్రకారం దశరథ పుత్రుడై వున్నప్పుడు, దైవం లాగా
వుండాల్నా-మనుష్యరూపంలో వుండాల్నా అన్న ప్రశ్నను దేవతలనే అడిగాడు నారాయణుడు. అది
వారికి ఆయన ఇచ్చిన గౌరవం. వారు చెప్పబోయేది తాను అప్పటికే నిశ్చయించుకున్నప్పటికీ, ఎదుటివారి గౌరవార్థం,
వారి మనస్సును పరీక్షించేందుకు, ఆవిధంగా ప్రశ్నించడం రామావతారంలో ఒక విశేష గుణం. ఇదే లక్ష్మణ-భరత-విభీషణుల
రక్షా విషయంలో కనిపిస్తుంది. లోకులందరూ ఈవిషయాలు తెలుసుకోవాలి. నారాయణుడు
సర్వాంతర్యామి-సర్వాధారుడు. ఇంతటి గొప్పవాడు దేవతల ఇష్టానుసారం చేయడమంటే, ఆశ్రిత పారతంత్ర్య గుణం అర్థమవుతోందిక్కడ. అదేవిధంగా, తమనొక పెద్దను చేసి,
అడిగినపుడు, తగిన రీతి తమకు తోచినది
తప్పో-ఒప్పో చెప్పకపోతే,
ఆదరించినవారిని నిరాకరించినట్లవుతుంది కాబట్టి, తమకు తోచింది చెప్పదలచారు-చెప్పారు.
కొడుకులకోసం యజ్ఞం
చేస్తున్న దశరథుడికి ప్రాజాపత్య పురుషుడిచ్చిన పాయసం, క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఇంద్రుడి స్వాధీనంలో వున్నటువంటి అమృతం కాదు.
భగవంతుడి తేజస్సు మనుష్య స్త్రీ గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి
- నిమిత్తమాత్రమైన పదార్థం ఒకటి కావాలి. అదే, భగవత్తేజః పూరితమైన
పాయసాన్నం. అదే అమృతమైతే,
తాగిన స్త్రీలకు మరణం రాదు కదా! అందుకే, శ్రీరామాది జననములు "రేతస్సర్గం" కారణం కాదనీ-వారి దేహాలు
అప్రాకృతాలనీ తెలుసుకోవాలి. అదే దశరథుడు కనుక తాగుంటే, వచ్చిన గర్భాలకు రేతస్సంబంధం కలపొచ్చు. అలాంటిది జరగలేదు. శుక్ల రక్త
సంయోగాలవలన ఏర్పడే దేహాలకు స్త్రీ గర్భవసతి అవశ్యంకాని, దివ్య తేజస్సుతో ఏర్పడేవాటికి స్త్ర్రీ గర్భవసతితో పనిలేదు. దీనికి ఉదాహరణలుగా, మాంధాతృ జననం,
కుంభజులైన అగస్త్య-వశిష్ఠ-ద్రోణాచార్య జననం, ధృష్ట్యద్యుమ్న-ద్రౌపది జననం చెప్పుకోవాలి. ఇందు క్షేత్రం ప్రధానం
కాదు-గర్భస్థజీవుడే తన తపో బలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు.
వీరి దేహాలు తల్లి తినే ఆహారంతో కాని-తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు. అంటే, తల్లిదండ్రుల జాతికి,
బిడ్డల జాతికి సంబంధం లేదిక్కడ. కట్టెల్లో పుట్టిన
అగ్నిహోత్రుడిది ఏజాతి?
తాను లోగడ ఇచ్చిన వరం తీర్చేందుకు-కౌసల్యా దశరథులకు
పుత్రమోహం కలిగించేందుకు,
భగవంతుడు పన్నిన పన్నాగమే ఇది. అందుకే, ఈ రహస్యాన్ని తెలిసిన విశ్వామిత్రుడు శ్రీరాముడిని సంబోధిస్తూ, "దశరథ పుత్రా" అని కాని-"కౌసల్యా పుత్రా" అనికాని అనకుండా, "కౌసల్యా సుప్రజారామ" అన్నాడు.
స్వేచ్చానుసారం-స్వతంత్రంగా-కారణాంతరాలవల్ల, తపోబలంతో కారణజన్ములైన మహాత్ముల జన్మలకు, పామరుల జన్మలకు
పోలికేలేదు. వాల్మీకి చెప్పినట్లు, శ్రీరాముడిని
"సాక్షాత్తు విష్ణువు" అని మునులందరు నమస్కరించారు కాని, క్షత్రియుడని జాతి వివక్షత చూపినట్లైతే నమస్కరించక పోయేవారు.
No comments:
Post a Comment