బాల్యం నాటి జ్ఞాపకాలు
పాలు పితకడం, కాగబెట్టడం, చల్ల చేయడం
వనం జ్వాలా నరసింహారావు
లాక్
డౌన్ సందర్భంగా ఇంట్లో తీరికగా కూర్చుని ఆలోచిస్తుంటే, నా బాల్యం, యవ్వనం
తొలినాళ్లు, అలనాటి తీపి జ్ఞాపకాలు ఒకటి వెంట మరొకటి
గుర్తుకు వచ్చాయి.
మా వూరు వనంవారి కృష్ణాపురం, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చ
బండ), మా రెండంతస్తుల భవనం, ఆ
భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు శుభ్రం చేసి కలాపు
నీళ్లు చల్లడం, మా కచ్చడం (గుడిసె బండి) బండి, పెంట బండి,
మేనా, వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప-మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, మోటబావులలో దిగి ఈత కొట్టడం, జొన్న చేలు, చేలలోని
దోసకాయలు, మంచె గుర్తుకొచ్చాయి.
పది మంది పాలేర్లు, పది అరకలు, నాలుగైదు ఎద్దుల బండ్లు, చిన్న కచ్చడం బండి,
పది జతల ఎద్దులు, వాటికి పెద్ద కొష్టం,
పాడి గేదెలు, ఆవులు, వందల సంఖ్యలో మేకలు, ఇలా అంగరంగ వైభోగంగా
వుండేది చిన్నతనంలో. కాలికి మట్టి అంటకుండా పెంచారు
మమ్ములను.
వీటితోపాటు
వరి గడ్డి వాములు, మా ఇంట్లో బావి, బావి
పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, మా
ఇంటి వెనుక వంట ఇంటి పక్కన ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, అందులో
వచ్చిన వెన్న పూస తినడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం-మామిడి వూరగాయ కారం, మా ఎనిమిదిమంది అన్న
దమ్ములం-అక్క చెల్లెళ్లు కలిసి వెండి కంచాలలో భోజనాలు
చేయడం, సరదాగా కీచులాడు కోవడం, సాయంత్రం
ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేయడం,
వాటిపై పక్కలు వేయడం, మా పదిమంది కుటుంబ
సభ్యులు-అడపాదడపా వచ్చే బంధువులు కబుర్లు చెప్పుకుంటా
పడుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం, ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రాసాగాయి.
ఇంటి పని చూసుకునే వెంకులు అనే
పాలేరు గేదెల, ఆవుల పాలు పితకడం, కవ్వంతో
పెరుగు చిలికి మజ్జిగ చేయడం, అంట్లు తోమడం లాంటి పనులు
చేసేవాడు. ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో చిలికిన చల్లను తీసుకెళ్లేందుకు
కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు.
బదులుగా చల్ల (మజ్జిగ) తీసుకు
పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన మజ్జిగను కడుపు
నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం.
నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర,
సొంత వూళ్లోనే గడిచింది. ఆరవ తరగతి
నుంచి ఖమ్మంలో విద్యాభ్యాసం కొనసాగినప్పటికీ, తరచుగా
గ్రామానికి వెళ్లొస్తుండేవాడిని.
మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస
కుటుంబం. చిన్నతనంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లొచ్చిన
తరువాత, ఇంటికి రాగానే మేం పాఠశాలకు వేసుకెళ్లిన దుస్తులు
విడిపించేవారు మా పెద్దలు. స్కూల్లో మైల పడిపోయామని వాళ్ల భావన. స్నానం చేసిన
తరువాతే శుద్ధి ఐనట్లు పరిగణలోకి తీసుకునేవారు. మా బావి నీరు ఉప్పు నీరు.
మంచినీటిగా తాగడానికి ఉపయోగపడదు. మా జీతగాడు వెంకులు ప్రతిరోజు వాళ్లింటి బావి
నుంచి ఒక రెండు బిందెల మంచి నీళ్లు పట్టుకొచ్చేవాడు. అందులో మా అమ్మ కొద్దిగా చల్ల
చుక్క వేసేది. అలా చేయడంతో ఆ నీళ్లు చల్లతో సమానమని ఆమె నమ్మకం. ఇంట్లో వంట
మడి కట్టుకుని చేసేవారు. వంట చేయడానికి ఒక అయ్యగారుండేది. మామిడి కాయ వూరగాయలు కూడా మడితోనే పెట్టేవారు
మా అమ్మ. రోజువారీ ఉపయోగానికి కొంత మోతాదులో బయటుంచుకునేవాళ్లం. అవి అయిపోతే, మళ్లీ మడి కట్టుకునైనా తీసేవారు, లేదా,
పిల్లల్లో ఒకళ్లని "బరివాత" (వంటి మీద బట్టలేమీ
లేకుండా) తీయించేవారు. అలా చేయడం మాకెంతో ఇష్టం కూడా.
జీతగాళ్లు వంతులవారీగా రాత్రి వేళల్లో మా ఇంటి ముందు పడుకోవడానికి
వచ్చేవారు. రాత్రుళ్లు లేచి పశువులకు కావాల్సిన దానా వేయడం, నీళ్లు తాపించడం వారి బాధ్యత. ఇంకా తెలతెలవారుతుండగానే, పొద్దున్నే లేవడం, విశాలమైన మా ఇంటి వాకిలి
శుభ్రం చేయడం, ఇంటి ముందర కలాపి జల్లడం కూడా వాళ్ల
బాధ్యతే. వాకిలి శుభ్రం చేయడానికి పొడగాటి కందికట్టె చీపురు (పొలికట్టె)
ఉపయోగించేవారు. కలాపి జల్లే నీళ్లలో పశువుల పేడను కలిపేవారు. ఆ తతంగమంతా దాదాపు
గంట సేపు జరిగేది.
అలానే, ఉదయాన్నే కొందరు "జొన్న తొక్కు"
వంపడానికి వచ్చే వారు. బదులుగా "చల్ల" పోయించుకు పోయేవారు. వారొచ్చే వేళ
కల్లా, మరో జీతగాడు, ఇంటి వెనుక
వంట ఇంటి పక్కన "చల్ల” చిలికేవాడు. ఒక గుంజకు "కవ్వం" కట్టి తాడుతో
పెరుగు చిలికి చల్ల చేసేవాడు. పెద్ద బానెడు చల్ల, అందులో
పెద్ద "వెన్న ముద్ద", చల్లలో చాలా భాగం మునిగి
పోయి తయారయ్యేది. ఎండాకాలంలో మేం ఉదయాన్నుంచే చల్ల ముంచుకుని తాగే వాళ్లం. వెన్న
పూస కూడా తినే వాళ్లం. వెన్న పూస నుంచి "నెయ్యి" తయారు చేసేవారు. వెన్న
ముద్ద చల్లలో పూర్తిగా మునుగుతే, ఈ ప్రపంచం అంతమై పోతుందని
ఒక నమ్మకం వుండేది మా చిన్నతనంలో. క్రితం
రోజున పితికిన పాలను పిడకల మీద సన్నటి తెగమీద కాగబెట్టేవారు. ఇటీవలి
కాలంలో నేను పాలు అలా కాగాబెట్టడం కానీ, చల్ల
చిలకడం కానీ చూడలేదు. వెన్న మునగడం కూడా చూడలేదు, వినలేదు.
ఇక ఆవుల, బర్రెల, మేకల పాలు పితకడం ఒక అట్టహాసం. పాలు పితకడం
అందరికీ చేతకాదు. బర్రె (గేదె) పాలు పితకడం పెద్దగా కష్టం కాదు. అది కదలకుండా పాలు
పితికినంత సేపు తీసేవాడికి సహకరించేది. కొన్ని గడుసు బర్రెలు మాత్రం ఇబ్బంది
పెట్టేవి. వాటి పాలు పితకడానికి తీసేవాడికి మరొకడు తోడుగా నిలబడి దాన్ని అదుపులో
పెట్టేవాడు. కొన్ని సార్లు వాట్ కాళ్లకు తాడుతో బంధం వేసి మరీ పితకాల్సి వచ్చేది. ఇక
ఆవు పాలు పితకాలంటే, ముందుగా ఆవు కాళ్లకు “దాడి” అని పిలవబడే తాడుతో కట్టాలి.
కట్టకుండా పాలు పితకడం అనాచారం. తప్పుగా భావించేవారు. మేక పాలు పితకడం
అన్నిటికన్నా తేలిక. మేకపాలు, ఆవుపాలు పితికేటప్పుడు,
ఒక్కోసారి నేరుగా పిల్లలకు తాగించేవారు. వాటిని “క్షీర ధారలు” అని పిల్చేవారు. ఇలా
ఒక్కోటే జ్ఞప్తికి వచ్చాయి.
No comments:
Post a Comment