రామావతార ప్రయోజన అంకురార్పణ!
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక,
చింతన (14-05-2020)
శ్రీరామ లక్ష్మణ, భరత
శత్రుఘ్నుల జననం ద్వారా భగవదవతారాన్ని గురించే చెప్పబడింది. ఆ తరువాత భగవదవతార
ప్రయోజనం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది.
ఆ ప్రయోజనాల్లో, శిష్ట
రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన ముఖ్యమయినవి.
ఒకనాడు తన మంత్రులతో దశరథుడు ఆలోచన చేసే సమయంలో,
జగత్ప్రసిద్ధిగాంచిన విశ్వామిత్ర మహర్షి ఆయనను చూడడానికి వచ్చాడు. ఆయన
వచ్చిన వార్త విన్న దశరథుడు విశ్వామిత్రుడిని సమీపించి, అర్ఘ్యపాద్యాదులతో
పూజించి, గౌరవించి, సంతోషింపచేసి,
రెండు చేతులు జోడించి నిలబడ్డాడు. ఉభయకుశలోపరి ముగిసిన పిదప, విశ్వామిత్రుడు,
వశిష్ఠ, వామదేవాది ఋషుల వద్దకు వెళ్ళి, వారిని
కూడా కుశలప్రశ్నలడిగి, సభా భవనంలోకి ప్రవేశించి,
వారివారి ఆసనాలపై కూర్చున్న తర్వాత, విశ్వామిత్రుడు
తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పబోయే ముందర దశరథుడు ఆయన వచ్చిన కారణం
అడిగాడు. తనను మన్నించి ఆయన వచ్చిన పని తెలియచేస్తే దానిని
నెరవేరుస్తానన్నాడు.
"మహానుభావా!
నీవు ఇతర సామాన్య ఋషులలాంటివాడివి కావు. నువ్వు క్షత్రియుడివిగా
పుట్టి, క్షాత్రంలో పెరిగి పెద్దై, రాజర్షివై, సుకుమారుడివై వున్నప్పటికీ,
క్షణంలో రాజ్యం, భోగం, సర్వం త్యజించి, గొప్పతపస్సుచేసి,
సత్త్వాతిశయంగల బ్రాహ్మణ్యాన్ని సంపాదించి, బ్రహ్మర్షివయ్యావు.
ఇలా చేసినవాడు లోకంలో ఇంకెవరూ లేరు. మహానుభావుడివైన నువ్వు అవాస్తసమస్తకాముడవు.
అఘటనాఘటన ధురీణుడవైన నువ్వు నా దగ్గరకు కార్యార్థివై రావడమంటే,
నా జన్మ సఫలమైనట్లే. నా జన్మ ఫలం నాకివ్వాళ లభించింది. నా జన్మ
సార్థకమయింది. నీ దర్శనం, దివ్య
క్షేత్రాలలోని దేవతల దర్శనంలాంటిదే కనుక, నువ్వు
నన్ననుగ్రహించి నీకోరికేదో తెలియచేయాలి. సందేహించ వద్దు. నీవు నా పాలిట దేవుడవు.
దేవుడే పని చెప్తే చేయని మనిషి వుంటాడా? నువ్వేదిచెప్పినా
నెరవేరుస్తాను. ఏది ధర్మం అని నువ్వు భావిస్తావో, దాన్నే
చెప్తావుకాని, అధర్మాన్ని చెప్పవు కదా! నువ్వు ధర్మమని చెప్పింది చేయడం వల్ల,
నాకెంతో ధర్మాభివృద్ధి కలుగుతుంది." అని విన్నవించుకుంటాడు
దశరథుడు విశ్వామిత్రుడితో.
ఇలా తనను ప్రార్థించిన దశరథుడిని సంతోషంతో చూసి అంటాడీవిధంగా:
"ఓ రాజేంద్రా! రఘువంశం సత్యసంధతకు, దాన
మహిమకు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. నేనేదికోరినా తప్పక ఇస్తానంటున్నావు.
నా మనసులో వున్నదాన్నే నేనడుగుతాను. నేనిప్పుడొక యజ్ఞం చేద్దామని
సంకల్పించుకొని, దీక్ష పూనాను. దాన్ని ఏవిధంగానైనా విఘ్నం చేయాలని మారీచ, సుబాహువులు
అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారు. వాళ్ళిదరూ మహా బలవంతులు. వాళ్ళీవిధంగా
యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నందువల్ల, నువ్వు సహాయం చేస్తావేమోనని అడుగుదామని ఆశతో
వచ్చాను. యజ్ఞ సమయంలోనే వారిని దండించాలి".
"నాకు కావాల్సిన సహాయం ఏంటంటావా? నీ
గారాల కొడుకు శ్రీరామచంద్రమూర్తిని, సత్యపరాక్రముడిని నాతో యజ్ఞాన్ని
రక్షించడానికి పంపు. వాళ్ళతో యుద్ధంచేసేందుకు, జానెడు
పిల్లవాడిని తీసుకొనిపోతే ప్రయోజనమేంటని నీకు అనుమానం రావచ్చు. నేను కాపాడుతున్నంతవరకూ,
నీ కొడుకు, మారీచాది
రాక్షసుల సమూహాన్ని సులభంగా చంపగలడు. వారిని చంపగల బలశాలి, ఒక్కశ్రీరాముడేకాని
మరెవ్వరూలేరు. నా యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడైన శ్రీరాముడిని నావెంటపంపు.
నువ్వీకార్యాన్ని నెరవేరుస్తే, నీ
కొడుకుకు నేనెన్నో శుభాలు కలిగిస్తాను. రాముడు లోకంలో విశేషమైన కీర్తిమంతుడిగా
ప్రకాశిస్తాడు" అని అంటాడు.
సంసారిగా వున్న దశరథుడికి పుత్రుడిపై మోహమెందుకుండదు?
ఆయనకొడొకు బలాబలాలు, ఆయనకన్నా
ఎక్కువగా విశ్వామిత్రుడికెట్లా తెలుసును అన్న సందేహం కలగొచ్చు. శ్రీరాముడు పేరుకే
దశరథుడి కొడుకు. నిజానికి లోకాలకెల్ల తండ్రి. ఆవిషయాన్నే చెప్తూ,
శ్రీరాముడు లోకాన్ని ఉద్ధరించడానికై పుట్టాడు కాని,
దశరథుడి ఇంట్లో సుఖపడడానికి కాదంటాడు విశ్వామిత్రుడు. శ్రీరాముడు తన
కొడుకని దశరథుడికెంత ప్రేముందో, జగజ్జనకుడైన
ఆయనకు అంతకన్నా ఎక్కువ ప్రేమ లోకంమీదుంది. సత్య మెరుగని దశరథుడు శ్రీరాముడిని
తనకుమారుడనే తలబోస్తున్నాడనీ, సత్యమెరిగిన
తనలాంటివారు, ఆయనను భగవంతుడిగా చూస్తున్నారనికూడా అంటాడు. ఆయన అందరి సొత్తుకాని,
కేవలం దశరథుడొక్కడి సొత్తుకాదని విశ్వామిత్రుడు స్పష్ఠంచేస్తాడు.
"రాజేంద్రా! శ్రీరాముడి సత్య పరాక్రమం నాకు తెలుసు. కావాలంటే
వశిష్ఠుడిని అడుగు. అంతటితో తృప్తికలగపోతే ఇక్కడున్న తపస్వులనందరినీ అడుగు. వీరందరికీ
శ్రీరాముడి మహిమ తెలుసు. శ్రీరామచంద్రుడిని నాతో పంపు. పనికిమాలిన సందేహాలన్నీ
వదిలిపెట్టు. ఈ యజ్ఞం రాక్షసులవల్ల విఘ్నం కాకుండా కాపాడబడాలి. దీక్షా కాలం
మించిపోక ముందే నీ కొడుకును నా వెంట పంపు" అని తాను చెప్పదల్చుకొన్నది
పూర్తిగా చెప్పి, యజ్ఞం పేరుతో శ్రీరాముడిని తన వెంట
తీసుకొనిపోయి, వారితో మారీచ - సుబాహులను చంపించి, వారికి
శ్రేయస్సు కలిగించాలని తాను తలంచిన విషయాన్నంతా చెప్పి, దశరథుడి
సమాధానం కొరకు మౌనం దాల్చాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే
దశరథుడి ముఖం విలవిల బోయింది. స్మృతి తప్పి పడిపోయాడు దశరథుడు. అలా కొంత సేపు
స్మృతి తప్పిన దశరథుడు, కోలుకొని,
ధైర్యం తెచ్చుకొని, కొడుకుమీదుండే
మోహంతో, పామరత్వంతో, శ్రీరాముడి మూల్యాన్నే ఎంచుతూ, ఆయన
మహాత్మ్యాన్ని గురించి విశ్వామిత్రుడు చెప్పిన మాటలన్నీ మరచిపోయి,
రామచంద్రమూర్తిని పంపలేనని చెప్పాడు స్పష్టంగా.
"అయ్యా! విశ్వామిత్ర మహామునీ! ’మా రాముడు’ ఇంకా
బాలక్రీడలలోనే వినోదం పొందుతున్నాడు. పదహారు
సంవత్సరాలింకా నిండలేదు. అందుకే యుద్ధయోగ్యుడుకాదు. బలవంతులైన రాక్షసులతో యుద్ధం
ఎలా చేస్తాడు? విశ్వామిత్రా! యజ్ఞం రక్షించబడడమే కదా నీకు కావాల్సింది. దానిని నేను
నెరవేరుస్తాను” అంటాడు దశరథుడు. ఇంకా ఇలా అంటాడు.
“కౌశికనందనా!
పుట్టు వెంట్రుకలు కూడా ఇంకా తీయని పసిబాలుడు రాముడు, సమర్థుడని,
గొప్పమనస్సున్న ఆలోచనాపరుడివైన నువ్వెట్లా అనుకున్నావయ్యా?
వాడు నాప్రాణం. వాడు కష్ఠపడితే నాప్రాణం పోయినట్లే. వాడికి,
నాకు ఎడబాటు కలిగిస్తే నాప్రాణం ఈ దేహంలో వుండదు. ఈవయస్సులో మమ్మల్ని
వాడితో వేరుచేయవద్దు. వాడినెట్లా పంపిస్తా? పంపితే
ఎట్లా జీవిస్తా?".
శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మహాత్మ్యాన్ని
విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ, దశరథుడింకా
"మారాముడు", "పసిబాలుడు",
"బాలక్రీడారాముడు" అనే అంటాడు. పామరత్వంతో, పుత్రవ్యామోహాన్ని
వదలలేకపోతాడు. పదహారేళ్ళుకూడా నిండనివాడు రాముడంటాడు. మైనారిటీ తీరలేదనే అర్థం స్ఫురిస్తుందాయన
మాటల్లో. యుద్ధార్హుడు కాకపోవడానికి కారణం కేవలం వయసు తక్కువగా వుండడమే కాదు, రాక్షసుల
స్వభావం తెలియనివాడైనందున యుద్ధంచేయలేడని దశరథుడి ఉద్దేశం.
దశరథుడి మాటల ప్రకారం, శ్రీరాముడి
కప్పుడు పదహారో సంవత్సరం నడుస్తున్నదనుకోవాలి. ఆ వయస్సులోనే కొన్నిరోజులతర్వాత
వివాహం జరిగింది. ఆ తర్వాత పన్నెండేళ్లు అయోధ్యలో గడిపాడు. అయోధ్యకాండలో ఒకానొక
చోట సీతాదేవి చెప్పిందాన్ని బట్టి, శ్రీరాముడు
అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. అయితే,
రావణుడితో భర్తవయసెంతో చెప్తూ, వనప్రవేశసమయంలో
రాముడికి 25 సంవత్సరాలనీ, తనకు 18 సంవత్సరాలనీ అంటుంది. మరో సందర్భంలో
అరణ్యానికి పోయే ముందర తనను చూడడానికి వచ్చిన శ్రీరాముడితో కౌసల్య అన్న మాటల
ప్రకారం, ఆయన కప్పుడు 17 సంవత్సరాల వయస్సుండాలి. ఇదే నిజమైతే,
శ్రీరాముడికి ఐదవ ఏటనే పెళ్ళి జరిగుండాలి. విశ్వామిత్రుడి వెంట
వెళ్ళే సమయంలో ఆయనకు ఉపనయనమయినట్లు చెప్పబడింది. ఐదో సంవత్సరంలో ఉపనయనం జరగడం
శాస్త్రవిరుద్ధం కాబట్టి, శ్రీరాముడు
అరణ్యానికి పోయేటప్పుడు 8+17=25 సంవత్సరాల వయస్సని గ్రహించాలి.
వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని
వాల్మీకి రాశాడు. వనవాసం వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలనీ,
విశ్వామిత్రుడివెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండో
నెలలో శ్రీరాముడి జననం, పన్నెండో ఏట విశ్వామిత్రుడితో వెళ్ళడం, పన్నెండేళ్లు
అయోధ్యా వాసం, పన్నెండేళ్లు అరణ్యవాసం, పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో
నివాసం. ఈ విచిత్రం తత్త్వ వేత్తలకే తెలవాలి.
పామరత్వంతో దశరథుడు మాట్లాడిన మాటలను విన్న విశ్వామిత్రుడు,
కోపం తెచ్చుకొని, కనుబొమల్ని
భయంకరంగా ముడిచి, ప్రళయకాల రుద్రుడిలాగా భయంకరుడై,
మండుటెండలో నేయివేస్తే ధగ్గుమని విజృంభించే అగ్నిలాగా,
అసలే స్వభావరీత్యా కోపిష్ఠైనందున, దశరథుడిని
ఏంచేయబోతున్నాడోననేవిధంగా, దేవతా
సమూహాలు భయపడుతుంటే, భూమి గడగడలాడుతుంటే రాజును దూశించాడు తీవ్రంగా. ఇలా ఎప్పుడైతే
విశ్వామిత్రుడు పలుకుతుంటే చూశాడో, దశరథుడితో
శ్రీరాముడిని విశ్వామిత్రుడితో పంపమని నచ్చచెప్తాడు వశిష్ఠుడు.
"రాజేంద్రా! విశ్వామిత్రుడితో నువ్వు తొందరపడి,
ఆయనేదికోరినా ఇస్తానన్నావు. ఆతర్వాతనే ఆయన తనకోరికను బయటపెట్టాడు. చెప్పిన
తర్వాత నువ్వు ఆడినమాట తప్పడం న్యాయమా? అందుచేత,
శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడివెంట పంపడమే నీకు మేలైన కార్యం.
విశ్వామిత్రుడి రక్షణలో వున్న రాముడిని ఎంతటి బలవంతులైనా, రాక్షసులైనా ఏం చేయలేరు.
కాబట్టి శ్రీరాముడికి ఏ అపాయం జరుగుతుందన్న భయం లేదు. భయకారణమూలేదు.
విశ్వామిత్రుడంటే అందరిలాంటి మునీశ్వరుడు కానేకాదు. ఇవి ఇలాంటివని పరీక్షించి
తెలుసుకోడానికి సాధ్యపడని మహాస్త్రాలు ఈయన వశంలో వున్నాయి" అని దశరథుడితో
అంటూ, శ్రీరామ మహాత్మ్యం చెప్పినా తెలుసుకోలేని అతడిని చూసి,
ఇంకా నమ్మకం కలిగేలా విశ్వామిత్రుడి అస్త్ర సంపత్తిని గురించి వివరంగా
చెప్పాడు వశిష్ఠుడు.
వశిష్ఠుడు చెప్పిందంతా విన్న దశరథుడు, సంతోషించి,
మునివెంట పంపేందుకై, లక్ష్మణుడితో
సహా రామచంద్రుడిని నిండు మనస్సుతో పిలిచాడు. వచ్చిన కొడుకులకు తొలుత తల్లితండ్రులు
మంగళా శాసనం కావించారు. తరువాత పురోహితుడు శుభమైన మాటలతో వారి హితం కోరి, వారికి
రాక్షసులవల్ల బాధలుకలుగకుండా మంత్రించారు. దశరథుడు శ్రీరామచంద్రుడిని తన దగ్గరకు
పిల్చి, శిరస్సు వాసనచూచి, మీద చేయి
వేసి, మహా ప్రీతితో అంతరాత్మ సంతోషిస్తుండగా, బ్రహ్మ
సమానుడైన విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను అప్పగించాడు.
’కౌసల్యా నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి అవతార ప్రయోజనానికి
అంకురార్పణ చేయబోతున్నాడు కాబట్టి, దేవతలు
శుభశకునాలను ప్రదర్శించారు. భవిష్యత్ లో ఈయనను ఆశ్రయించి, తన
కుమారుడైన హనుమంతుడు ధన్యుడై తనకూ కీర్తికలిగించబోతున్నాడన్న సంతోషంతో వాయుదేవుడు
రాముడికి మార్గంలో ఆయాసం కలగకుండా, సువాసనలతో
మెల్లమెల్లగా సుఖం కలిగేటట్లు వీచాడు. ఇక తమకు రాక్షసులవల్ల భయం లేదనీ, జయమేనని,
ధైర్యంతో, దేవతలు
బహిరంగంగా దుందుభులు మోగించారు. వృక్షాలు తలంబ్రాలు పోయబోతున్నట్లుగా పూలవాన
కురిపించాయి. సూర్యకిరణాలు వేడి సోకకుండా సన్న తుంపర వాన కురిసింది. దేవతలు
కనబర్చిన శుభశకునాలను చూసిన అయోధ్యాపురవాసులు, విశ్వామిత్రుడివెంట
శుభంగా శ్రీరామచంద్రుడు వెళుతుంటే, శంఖాలను, నగారాలను
సంకులంగా మోగించారు.
ముందు తోవ చూపిస్తూ విశ్వామిత్రుడు పోతుంటే, తన
వెనుక లక్ష్మణుడు నడుస్తుంటే, ఎడమచేతితో
విల్లు ధరించి, శ్రీరామచంద్రమూర్తి
వెళ్తున్నాడు. బ్రహ్మదేవుడి వెంటపోయే అశ్వినీ దేవతలలాగా, శివుడి
వెనుక వెళ్ళే కుమారస్వామిలాగా, శ్రీరామ
లక్ష్మణులను విశ్వామిత్రుడు తోడుకొని పోయాడు. (వాసుదాసు ఆంధ్రవాల్మీకి
రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment