Monday, May 4, 2020

కేంద్ర రాష్ట్ర బంధాలు--సమూహాలోచన : వనం జ్వాలా నరసింహారావు


కేంద్ర రాష్ట్ర బంధాలు--సమూహాలోచన
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (05-05-2020)  
ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆసక్తికరమైన ఒక గందరగోళంలో, సందిగ్ధంలో పడిపోయారా? అలాగే కనిపిస్తున్నది. కరోనా వైరస్ పూర్తిగా కట్టడికాని నేపధ్యంలో లాక్ డౌన్ ను మరి కొంతకాలం పొడిగించి తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలా? లేక, ఎత్తేసి, తద్వారా కొందరు మరణించినప్పటికీ,  ఆర్థికంగా నిలదోక్కుకోవాలా? అన్న ఆలోచనలో పడిపోవాల్సిన ఆగత్యం, పరిస్థితులు దురదృష్టవశాత్తూ నెలకొన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇదే అంశంపై తరచూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో సమావేశాలు నిర్వహించి, సమూహాలోచన (గ్రూప్ థింక్) భావన పద్ధతిన, తనదైన శైలిలో, తన అభిప్రాయాలతో, ఆలోచనలతో పరోక్షంగా వారిని ప్రభావితం చేసే ప్రయత్నంలో వున్నాడు.

అయినప్పటికీ, కొందరు ముఖ్యమంత్రులు ఆయనతో అన్ని విషయాలలో పూర్తిగా ఏకీభవించకుండా, విభేదించకుండా, తమ రాష్ట్రావసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం గమనించాం. ప్రధాని చెప్పినట్లు మే నెల 3 వరకు కాకుండా మే నెల 7 వరకు తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా లాక్ డౌన్ వుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ అసలు వీడియో సమావేశానికే హాజరవ్వలేదు. ఇదిలా వుండగానే, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే నెల 17 వరకు పొడిగించి, దేశంలోని పలు ప్రాంతాలను రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించింది.     

ప్రస్తుతం నెలకొన్న గందరగోళ, సందిగ్ధ పరిస్థితులలో, అదే విధంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఎవరిది విజయం, ఎవరిది ఓటమి అనే వేర్వేరు, విరుద్ధ అభిప్రాయాల (పారడాక్స్) నేపధ్యం, ఒక విధంగా, పురాతన గ్రీస్ లో ఆవిర్భవించిన “ప్రోటాగోరాస్ పారడాక్స్” భావన సంక్షిప్తంగా సంగ్రహిస్తుందనాలి. అప్పట్లో గ్రీస్ లో, ప్రోటాగోరాస్ అనే న్యాయ శాస్త్ర అధ్యాపకుడు యూథాలాస్ అనే విద్యార్థిని తన దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి చేర్చుకున్నాడు. వారిరువిరి మధ్యన కుదిరిన అంగీకారం ప్రకారం, విద్యార్ధి కట్టాల్సిన ట్యూషన్ ఫీజ్, యూథాలాస్ ప్రాక్టీసు చేయడం ప్రారంభించిన తరువాత, అతడు గెలిచిన మొదటి కేసు వల్ల లభించే ఆదాయంతో చెల్లించాలి.

యూథాలాస్ ఇంటర్న్షిప్ అయిపోయి, ప్రాక్టీసు చేయడం మొదలెట్టినప్పటికీ, ఎంతకాలానికీ తన ఫీజు చెల్లించక పోవడంతో న్యాయస్థానంలో కేసు వేయడానికి నిర్ణయించుకున్నాడు ప్రోటాగోరాస్. తాను కేసు గెలిచినా, ఓడినా తన ఫీజు తనకేలాగైనా వస్తుందని అతడి ధైర్యం. విద్యార్ధి మరోలా ఆలోచించాడు. తాను గెలిస్తే తన ఉపాధ్యాయుడికి ఆయన పిటీషన్లో కోరినట్లు ఫీజు ఇవ్వనక్కర లేదు. ఓడితే, ఇంకా కేసు గెలవలేదు కాబట్టి అప్పుడూ ఇవ్వక్కర లేదు. అంటే, ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇద్దరూ గెలిచినట్లే, ఇద్దరూ ఒడినట్లే అనేది “ప్రోటాగోరాస్ పారడాక్స్” సందేశం. ఇరు పక్షాలకూ అందరినీ ఒప్పించే, మెప్పించే వాదనలు వున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంతవరకూ ఆ కేసు తేలలేదు. మన ఘనత వహించిన సహకార సమాఖ్యలో, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు కూడా, ముఖ్యంగా, కరోనా వైరస్ లాక్ డౌన్  పూర్వ, ప్రస్తుత, భవిష్యత్ నేపధ్యంలో గెలుపెవరిదో, ఓటమెవరిదో తేలకుండా వుంది.     

భారత దేశానిది ఒక ప్రత్యేకమైన సహకార సమాఖ్య నిర్మాణం. మన రాజ్యంగ నిర్మాతలు ఒక రకమైన పరిపూర్ణ, సమగ్ర ఆలోచనతో మన సమాఖ్య విధానాన్ని రూపొందించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన స్థూల ఆర్ధిక నిర్వహణ, రక్షణ వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాలు లాంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, ఆధ్వర్యంలో, నిర్వహణలో వున్నాయి. ప్రజల దైనందిన జీవికకు సంబంధించిన వ్యవహారలైన శాంతి-భద్రతలు, విద్య, వైద్యం, వ్యవసాయం కొంత మేరకు ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, మొత్తం మీద రాష్ట్ర ఆధీనంలోనే వున్నాయనాలి. వాస్తవానికి చాలా విషయాలలో, పథకాలలో, కార్యక్రమాలలో విధాన రూపకల్పన కేంద్ర స్థాయిలోనే జరిగినప్పటికీ, రాష్ట్రాలే వాటిని అమలు చేయాలి. ఉదాహరణకు పరిశ్రమల స్థాపన, ప్రోత్సాహమే (ప్రమోషన్) తీసుకుంటే, కేంద్ర కొంతమేరకు విధానాన్ని నిర్ణయించినప్పటికీ, పెట్టుబడులను సులభతరం చేయడానికి, సమకూర్చుకోవడానికి, సొంత విధానాన్ని రూపొందించుకోవదానికీ పని చేసేది రాష్ట్రాల యంత్రాంగమే.   

అందుకే యావత్ ప్రజానీకం, ముఖ్యంగా, బీద-సాద-పేద-దళిత-వెనుకబడిన-సామాన్య వర్గాల ప్రజలు తమ తమ అవసరాల కోసం సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందన కోసం, నిర్ణయం ఆసక్తిగా ఎదురు చూస్తారు కానీ, ప్రధాని వైపు చూడరు. కరోనా లాంటి సంక్షోభ సమయంలో అసలే చూడరు. ప్రజల సాధారణ, దైనందిన అవసరాలను తీర్చేది ముఖ్యమంత్రులే కాని ప్రధాని కాదని వారి భావన, ఆలోచన కావచ్చు. వాస్తవానికి అది నూటికి నూరు పాళ్ళు నిజం కూడా.      


ప్రజల జీవనోపాధికి సంబంధించిన అనేకానేక అంశాల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే అయినప్పటికీ, వారు తమ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించడం కోసం కావాల్సిన నిధులు అనుకున్న స్థాయిలో రాష్ట్రాల వద్ద వుండవు. రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మేరకు పన్నులు వసూలు చేసినప్పటికీ, వాటి బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడానికి ఆ నిధులు సరిపోవు. అందుకే, రాష్ట్రాల అవసరాలకు, ఐదేళ్ళ కోసారి నియమించబడే ఆర్ధిక సంఘం (ఫైనాన్స్ కమీషన్) ఒక నిర్దుష్టమైన ఫార్ములా ప్రకారం చేసే సూచన మేరకు, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటాగా కొంత ఇవ్వాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదనంగా, మార్కెట్ నుండి రాష్ట్రాలు అప్పు తెచ్చుకోవచ్చని చెప్తున్నప్పటికీ, తన ఇష్టం వచ్చినట్లు తెచ్చుకోవడానికి వీల్లేదని నిబంధనలున్నాయి. ఎఫ్ఆర్బీఎం అడ్డు పడుతుంది. కేంద్రం అనుమతి మేరకే అప్పులు తెచ్చుకోవాలని రాజ్యాంగం నిర్దేశించింది.

పరిపాలనా, ఆర్ధికపరమైన వ్యవహారాలలో కేంద్ర-రాష్ట్ర సంబంధాల సవాళ్లకు సంబంధించి కొత్త-కొత్త విషయాలు కరోనా వైరస్ సంక్షోమ నేపధ్యంలో వెలుగులోకి వస్తున్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. వైద్యం-ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో, పరిస్థితులను సమీక్షించడంలో, బాధ్యతలు నిర్వహించడంలో రాష్ట్రాలు ముందు వరుసలో వున్నాయి. కాకపోతే రాష్ట్రాలకు నిధుల కొరత విపరీతంగా వున్నది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని, అటు కేంద్ర దగ్గరా, ఇటు రాష్ట్రాల దగ్గరా నిధుల కొరతతో ఆర్ధిక సంక్షోభం నెలకొన్నప్పటికీ, వాస్తవానికి, రాష్ట్రాల సంక్షోభం కేంద్రం కంటే మరింత లోతుగా ఉందనాలి. జీఎస్టే వసూళ్లు అటు రాష్ట్రాలకు, ఇటు కేంద్రానికి గణనీయంగా పడిపోయినప్పటికీ, కేంద్రానికి అదనంగా ఆదాయపు పన్ను వసూళ్ల రూపేణా, కార్పోరేట్ పన్నుల రూపేణా, కస్టమ్స్ సుంకం రూపేణా నిధుల సమీకరణ చేసుకునే వెసలుబాటు వుంది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే, జీఎస్టే కాకుండా గణనీయమైన ఆదాయ వనరు మద్యం అమ్మకాల ద్వారా ఆబ్కారీ పన్ను రూపేణా వచ్చేదే. లాక్ డౌన్ పుణ్యమా అని మద్యం దుకాణాలు మూసేయడంతో ఆ ద్వారం పూర్తిగా మూసుకుపోయింది. ఇక రాష్ట్రాలకు మిగిలిందల్లా రుణాలు తెచ్చుకోవడం. అయితే ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాలు రుణాలు తెచ్చుకోలేవు. కారణం, పరిమితి మించిన రుణాలకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాబట్టి.              

సమూహాలోచన అనే భావన, సమూహంగా ఆలోచించడం కోసమో, లేదా, నిర్ణయాలు తీసుకోవడానికో, కొందరు వ్యక్తులతో ఏర్పాటు చేయబడ్డ ఒక బృందం, సవాళ్ల రహిత, నాణ్యతా రహిత, నిర్ణయాలకు దారితీసే ఒక ఆచరణాత్మక విధానం. భౌతికంగానైనా, లేదా, వీడియో ఆన్లైన్లోనైనా, కొందరు వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి ఉమ్మడిగా, సామూహికంగా, సాధ్యమైనంతగా ఒకే భావనతో ఆలోచించడం అనే ప్రక్రియను సమూహాలోచన అంటారు. వ్యక్తిగతంగా ఆలోచన చేయడానికి అవకాశాలు సన్నగిల్లినప్పుడు కానీ, ఏ కారణానైనా వ్యక్తిగత సృజనాత్మకత లోపించినప్పుడు కాని, లేదా, ఏకాభిప్రాయ సేకరణకు అనువైన ప్రదేశ పరిధిలో వుండడానికి ఒక రకమైన ఉపశమనం లభించినప్పుడు కానీ, వ్యక్తుల బృందాల ఏర్పాటుతో సమూహాలోచన చోటుచేసుకుంటుంది. “బే ఆఫ్ పిగ్స్ ఇన్వేషణ్” నేపధ్యంలో నాటి క్యూబన్ అధ్యక్షుడు ఫేడల్ కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయడానికి అమెరికన్ పాలనా యంత్రాంగం పన్నాగం పన్నుతున్న ఒకానొక సందర్భంలో చోటు చేసుకున్న నిర్ణయాత్మక ప్రక్రియలో భాగంగా జరిగిన సమూహాలోచన చక్కటి ఉదాహరణగా చెప్పుకోవాలి. అదే విధంగా వియత్నాం యుద్ధం సందర్భంగా, వాటర్ గేట్ కుంభకోణం సందర్భంగా జరిగిన ప్రక్రియలను మరికొన్ని సమూహాలోచన ఉదాహరణలుగా చెప్పుకోవాలి. బహుశా, భవిష్యత్ లో, కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిణామాల నేపధ్యంలో చోటుచేసుకున్న చర్చల ప్రక్రియ కూడా మరో మంచి సమూహాలోచన ఉదాహరణ అవుతుందేమో? ఎవరికీ తెలసు. ఈ సమూహాలోచన భావనను 1972 లో కనుక్కున్న ఇర్వింగ్ జైన్స్, సామూహికంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కోసారి తప్పులు దొర్లే అవకాశాలను వివరించాడు. దీనికి కారణం ఆ సమూహాన్ని ఏర్పాటు చేసి, కలిపిన శక్తులు, లేదా సమూహ సమన్వయ లోపాలు కావచ్చునని అంటాడు.      

సమూహాలోచన ఒక్కోసారి చెడు నిర్ణయాలకు దారితీయవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. సమూహాలోచనలో పాల్గొన్న వ్యక్తులు, సభ్యులు,  అసలు సిసలైన సమస్యలను చెప్పకుండా, చెప్పలేకుండా, బృందం తీసుకునే నిర్ణయాలకే కట్టుబడాల్సి వుండడం. నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితమైన, ఇతమిద్ధమైన నిబంధనలు లేకపోతే, సమూహంలో తీసుకునే నిర్ణయాలు సమూహాలోచనలో పాల్గొన్న వ్యక్తులను ప్రభావితం చేస్తాయి.

  సమూహాలోచన ఉచ్చులో పడకుండా, చాకచక్యంగా, తనదైన శైలిలో, తన ఆలోచనా సరళిని బహిర్గతం చేసిన చక్కటి ఉదాహరణగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పుకోవాలి. కరోనా సంక్షోభాన్ని నిర్వహించే విషయంలో, అధిగమించే విషయంలో, కేసీఆర్, సమూహాలోచన ప్రాతిపదికగా, సామూహిక ఆధిపత్య దృక్ఫదం నుండి విభేదించే చొరవ, ధైర్యం ప్రస్ఫుటంగా కనపర్చాడు. ఉదాహరణకు: అప్పట్లో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రులలో పలువురు, మూడువారాల తరువాత లాక్ డౌన్ ను ఎత్తేయాలని అంటున్నప్పటికీ, ఆ ఆభిప్రాయంతో విభేదించి, తెలంగాణాలో మే నెల 7 వరకు లాక్ డౌన్ వుండబోతున్నట్లు ప్రకటించారు, చివరకు జరిగిందేమిటి? గతంలో కేంద్రం ప్రకటించిన మే నెల 3 వరకూ వున్న లాక్ డౌన్ ను మే నెల 17 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. పరోక్షంగా కేసీఆర్ సూచనకు ఇది ఆమోదమే కదా?         

ప్రధాన మంత్రో మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సమూహాలోచనలో, దాని పరిధిని విస్తృత పరుస్తూ,  మరింత ముందు చూపుతో, ఆలోచనతో, సీఎం కేసీఆర్, వినూత్న, వ్యూహాత్మక భావనలను ప్రదర్శించారు. రాష్ట్రాలకు కేవలం అదనపు నిధులు సమకూర్చాలని మాత్రమే అని వూరుకోకుండా, అవెలా సమకూర్చవచ్చో సోదాహరణంగా వివరించారు. పరిమాణాత్మక సడలింపు (క్వాంటిటేటివ్ ఈజింగ్) ప్రక్రియ ద్వారా, హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ట్రాలకు నిధులు సమకూర్చాలన్న సూచన చేశారు. అలాంటప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయన ఆలోచనలను, సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రాలకు మేలు చేయవచ్చు కదా?    

No comments:

Post a Comment