Saturday, June 5, 2021

మార్కండేయుడు చెప్పిన సర్వధర్మాలు క్షీణించే కలియుగ విశేషాలు ..... ఆస్వాదన-23 : వనం జ్వాలా నరసింహారావు

 మార్కండేయుడు చెప్పిన సర్వధర్మాలు క్షీణించే కలియుగ విశేషాలు

ఆస్వాదన-23

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (06-06-2021)

కలియుగంలో సర్వధర్మాలు క్షీణిస్తాయని పెద్దలు చెప్తారని, ఆ విషయాలను వివరించమని మార్కండేయుడిని ప్రార్థించాడు ధర్మరాజు. జవాబుగా ఆ వివరాలను చెప్పసాగాడు మార్కండేయుడు.    

ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతోను, త్రేతాయుగంలో మూడు పాదాలతోను, ద్వాపరయుగంలో రెండు పాదాలతోను, కలియుగంలో క్షీణించి ఒకే ఒక్క పాదంతోను వర్ధిల్లుతుంది. మనుష్యులలో సత్యం తరిగిపోతుంది. ఆయుర్దాయం తగ్గుతుంది. చదువులు తరిగిపోతాయి. మోహం ప్రబలుతుంది. లోభం పెరుగుతుంది. కామం అధికమవుతుంది. కోపం ఏర్పడుతుంది. పగలు, ద్వేషాలు కలుగుతాయి. భిన్న కులాలవారు అన్యోన్య హింసకు పాల్పడుతారు. ఎవరిహద్దుల్లో వారు ఇముడక పోవడం వల్ల వర్ణసాంకర్యం ఏర్పడుతుంది.

కలియుగంలో బ్రాహ్మణులు మంత్రాలను చదవడం మానేస్తారు. నిగ్రహాన్ని కోల్పోతారు. వేదాధ్యయనాన్ని వీడుతారు. వీరు-వారు అనే తేడా లేకుండా అందరూ తపస్సు చేస్తారు. భూమ్మీద ప్రతిచోటా ప్రజలు నివసించే పల్లెలు పాడైపోతాయి. అడవి జంతువులకు, పాములకు నిలయాలై భయంకరాలౌతాయి. అడవులు విస్తరించి పల్లెలను భయంకరంగా కమ్ముతాయి. అవి అరాజకాలౌతాయి. ప్రభుత్వాదికారం నశిస్తుంది. ధర్మాలు నిర్మూలించబడతాయి. దుష్టులు విజృంభిస్తారు. జనపదాలు సర్వనాశనమౌతాయి. పరాక్రమ ప్రాభవం వల్ల రాజ్యంలోని ప్రజలను రక్షించి పరిపాలించాల్సిన ప్రభువులు శౌర్యం, సంపద, తేజస్సు, మైత్రి లేకుండా దిగజారిపోయి సేవకవృత్తిని అవలంభించేవారిలాగా భూలోకంలో తిరుగాడుతారు.

భూలోకంలో పంటల దిగుబడి తగ్గిపోయి, సారం కోల్పోతాయి. ఆవులపాలు తరిగిపోతాయి. వృక్షాలు పూలను, పండ్లను తక్కువ మోతాదులో ఇస్తాయి. పాలకులు అధిక పన్నులు వసూలుచేసి మనుష్యులను పీడించి భయపెట్తారు. బ్రాహ్మణులు కూడా వర్తక వ్యాపారాలు, సేద్యం చేస్తారు. కలియుగంలో వర్ణాశ్రమాలు నాస్తిక వేదాంతంతో ప్రబలుతాయి. పుణ్యపాప ఫలాలు అబద్ధం అంటారు ప్రజలు. సకాలంలో వర్షాలు కురవవు. విత్తనాలు సారంలేనివిగా వుంటాయి. క్రయవిక్రయాలలో మోసం అధికమౌతుంది. తాకట్టు పెట్టుకున్న ఆభరణాలను అన్యాయంగా అమ్ముకుంటారు వర్తకులు. సాధుజనులు అష్టకష్టాలుపడుతారు. రోగాలతో బాధపడి అల్పాయుష్కులై మరణిస్తారు. పాపాత్ములు చిరాయువులుగా జీవిస్తారు, సిరిసంపదలు ఆనుభవిస్తారు.

కలియుంలో అరికె మొక్కల సేద్యం పెరుగుతుంది. గొర్రెల పాడి అభివృద్ధి చెందుతుంది. మగవారికి స్త్రీలు ఉంపుడుగత్తెలవుతారు. మనుష్యులు చాలామంది మాంసాహారులవుతారు. దైవ, పితృకార్యాలలో శ్రద్ధ లోపిస్తుంది. బ్రాహ్మణులు హేతువాదంలో విశ్వాసం పెంచుకుని చెడుతోవలు పట్టి, వేదాలను నిందిస్తూ, యజ్ఞయాగాలు చేయడం మానేస్తారు. దుర్మార్గులు స్వైరవిహారులై భూలోకంలో ప్రజల చేత పూజలందుకుంటారు. బ్రాహ్మణులు అలాంటి వారి దరికి చేరి వారికి దాసోహం అంటారు. భూమిని పాలించి, రక్షించాల్సిన ప్రభువులలో పలువురు బహిరంగంగా దోపిడీ చేసే దొంగలై ప్రవర్తిస్తారు. వారు సాధువులను దోచేస్తారు. వారి సంపదలను హరిస్తారు. రాజుల మధ్య యుద్ధాలు పెరుగుతాయి. ప్రపంచంలోని ప్రాణికోటి సర్వనాశనం అవుతుంది.

కుమారుడు తండ్రిని అవమానిస్తాడు. భార్య భర్తను కించపరుస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు లక్ష్యపెట్టరు. దేవాలయాలలో పూజాపునస్కారాలు జరగవు. వేదవేదాంత ప్రబోధం అంతరిస్తుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. భూలోకమంతా దుష్టులతో నిండిపోతుంది. కలియుగంలో ప్రజల ఆయుఃప్రమాణం ఎక్కువగా వుండదు. ఏడెనిమిది సంవత్సరాల వయస్సులోనే ఆడపిల్లలు సంతానవతులౌతారు. దానం చేసే దాతలు కరువౌవుతారు. ఒకరిసొత్తును ఇంకొకరు అపహరిస్తారు. ఆహారాన్ని ధనం కొరకు అమ్ముకుంటారు. బ్రాహ్మణోత్తములు విద్యను, విజ్ఞానాన్ని అమ్ముకుంటారు. అందమైన ఆడవారు మానాన్ని అమ్ముకునే దుర్భర పరిస్థితులు నెలకొంటాయి.

కొందరు మిక్కిలి భయంకరమైన పరాక్రమంతో విజృంభించి ఒకరొకరే వరుసగా పలువురు అమాయక ప్రజలను సంహరిస్తారు. బ్రాహ్మణులు తమను రక్షించేవారు ఎవ్వరూలేక, నలుదిక్కులా చెల్లాచెదరై పారిపోతారు. దొంగలు చెలరేగి ధనాన్ని, ప్రాణాలను హరిస్తారు. వేదార్థాలను బ్రాహ్మణేతరులు చెప్తుంటే బ్రాహ్మణులు వినాల్సి వస్తుంది. వారికి దాసులవుతారు కూడా. దేవాలయాలు, బ్రాహ్మణ గృహాలు, పవిత్రమైన ఆశ్రమాలు, పాడైపోతాయి. అడవులు ధ్వంసమైపోతాయి. మద్యపానం విపరీతంగా పెరుగుతుంది. శిష్యుడికి గురువు నచ్చడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. బంధువుల మధ్య అనురాగం వుండదు. తరచూ కరవుకాటకాలు ఏర్పడుతాయు. ప్రజలు భయాందోళనలకు గురవుతారు. ఇలా ధర్మాలన్నీ తలకిందులవుతాయి. పట్టణాలు, పల్లెలు నాశనమౌతాయి. ప్రజలకు శాంతి భద్రతలు లోపిస్తాయి.       

ఈ నేపధ్యంలో, కలియుగాంతంలో, శంబళ అనే గ్రామంలో కల్కి అవతారమైన విష్ణుయశుడు అనే పేరు కల బ్రాహ్మణుడు జన్మిస్తాడు. అతడికి సకల వేద శాస్త్రాలు అవలీలగా అవగతమౌతాయి. శస్త్రాస్త్ర విశేషాలు సులువుగా గ్రహించి సార్వభౌముడవుతాడు. విష్ణుయశుడు బ్రాహ్మణ బృందాలతో కూడి ఒక పధ్ధతి ప్రకారం అధర్మవర్తనులైన వారిని సంహరించి, ధర్మాన్ని తిరిగి నెలకొల్పుతాడు. తరువాత దీక్షగా అశ్వమేధయాగం చేస్తాడు. అశేషమైన పుణ్యాన్ని సంపాదించి, భూమిని విప్రులకు పంచిపెట్టి, ముసలితనంలో తపోవనంలో నివసిస్తాడు. అతడి వల్ల స్థాపించబడిన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, వారి-వారి మర్యాదలను పాటిస్తూ వుంటారు.

తదనంతరం కృతయుగం ప్రారంభమై ధర్మం నాలుగు పాదాలలో వర్ధిల్లుతుంది. విష్ణుయశుడు నెలకొల్పిన ధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, సంప్రదాయాలను అనుసరించి నడుచుకుంటారు. వానలు సకాలంలో కురుస్తాయి. ఈ విధంగా కాల చక్రం పలుమార్లు తిరుగుతూ వుంటుంది.              

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

                             

No comments:

Post a Comment