వేదాలలోనుండి వచ్చినవే ఉపనిషత్తులు
వనం
జ్వాలా నరసింహారావు
మనకున్న ప్రాచీన పరంపర సంబంధాన్ని బట్టి మనల్ని భారతీయులుగా
గుర్తించారు. భారతీయులందరికి ప్రమాణం వేదం. వేదాన్ని ప్రమాణంగా భావించే వారిని
ఆస్తికులు అని,
వేదాన్ని ప్రమాణంగా భావించని వారిని నాస్తికులని అంటారు. భగవంతుడు
ఉన్నాడు, లేడు అనే భావనలతో ఆస్తిక-నాస్తిక అనేవి ఏర్పడలేదు. కారణం, భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ వేదాన్ని నమ్మని వాళ్ళూ ఉన్నారు కనుక వారిని
కూడా నాస్తికులు అనే అంటారు తప్ప ఆస్తికులు అని అనబడరు. భగవంతుడిని అంగీకరించకపోయినా
వేదాన్ని అంగీకరించేవారిని ఆస్తికులు అనే అంటారు. కారణం, వేదంలో
కొంత భాగాన్నైనా ప్రమాణంగా గుర్తించి జీవనాన్ని గడపాలనే కోరిక ఎవరిలో ఉన్నా వారిని
ఆస్తికులు అనడంలో తప్పు లేదన్నమాట. మనం భారతీయులం కనుక వేదాన్ని ప్రమాణంగా
గుర్తిస్తాం.
వేదం "అపౌరుషేయం", అంటే ఒకరిద్వారా
నిర్మింపజేసినవి కాదు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పలేం. లక్షల సంవత్సరాలుగా
వస్తున్న పరంపర ఇది. ఆది లేనిది కనుక "అనాది" అని పేరు పెట్టారు. మార్పు
చెందనిది కనుక దాన్ని "నిత్యం" అంటారు. ఇది ప్రమాణం కనుక
"వేదం" అని అంటారు. ఎప్పటినుండో ఉన్న మానవసామాన్యానికి అంతటికీ
ఆమోదయోగ్యమై, విశ్వజనీనమైనదై ఉండగలిగేదేదో అది నిర్ణయించి చెప్పాలి. ఇలాంటి ఆచరణని
చెప్పినది ఒకటే. అది వేదం. అందుకే మనకి వేదం చెప్పింది ధర్మం ఆయ్యింది.
మనలో ఏర్పడే రకరకాలైన
సంశయాలని,
తెలుసుకోవాలనే జిజ్ఞాసలని తీర్చగలిగేది వేదం ఒక్కటే. అందుకే దాన్ని
మన పెద్దలు ప్రమాణము అని చెప్పారు. అందుకే వేదం ఆధరణీయమైనదే కాదు ఆరాధించ తగినది
అని స్వీకరించారు. అది మనకు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి సంచరించాలి అని
నిర్ణయం చేసుకున్నారు మన పెద్దలు. వేదాల్లో కేవలం మనిషిని గురించి మాత్రమే కాదు,
చేతనాలని అంటే చైతన్యం కల జీవరాశిని, అచేతనాలని
అంటే చైతన్యం లేనటువంటి వాటిని రెంటినీ నియంత్రించగలిగిన శక్తి తత్త్వమైన దైవాన్ని
గురించి కూడా వివరించింది. వేదం విశ్వవ్యాప్తమైన అన్నింటిని గురించి కనుక
బాగుపడగోరిన ఎవ్వరికైనా మార్గనిర్దేశం చేయగలిగిన ఏకైక ప్రమాణం వేదం. దాన్ని అనుసరించడం బుద్ధిమంతుడి
లక్షణం.
వాస్తవాలని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తెలుసుకోవాలంటే
వేదాన్నే ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే మనం ఈ నాడు ఏదో ప్రశ్న వేయాలని అర్థం
కాదు, ఆ వేదమే ప్రశ్న వేస్తూ సమాధాన రూపంలో తత్త్వ రహస్యాలని తెలుపుతుంది. అసలు
వేదం అంటేనే తెలిపేది అని అర్థం. వేదం తెలియజేసేది అపారము, అంతా
తెలుసుకోవడం కన్నా ఏది మన జీవితానికి లక్ష్యము అనే దాన్ని తెలుసుకుంటూ
ముందుకుపోవడం ఉత్తమము.
మన
ఋషులు. భగవంతుణ్ణి చూడాలి అనే ఆరాటంలో అడవులని చేరి కోరికతో తిండి, నిద్రలు మాని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సుని చేసి ఒక దివ్య అనుభూతిని పొందారు.
దాన్ని లోపల ఇమడ్చుకోలేక మనందరితో పంచుకున్నారు. పరతత్వాన్ని దర్శించిన ఋషుల
ప్రేమతో అప్రయత్నంగా, అసంకల్పితంగా దివ్య వాక్కు ఏర్పడింది.
ఇలా ఒకరి నుండి మరొకరు ఆ దివ్య తత్వాన్ని దర్శించగలిగారు దానికి ఉప-నిషద్ అని పేరు
పెట్టారు. ఉపనిషత్తులు వేదాలలోంచి వచ్చాయి. వేదాలు అపౌరుషేయాలు. ఎవరో కూర్చోని
రచించినది కాదు. వేదాన్ని ఎవ్వరూ వ్రాయలేదు. ఆది అఖండమైన అనంతమైన విజ్ఞాన రాశి,
అలౌఖికమైన వాంగ్మయం వేదం. దోషాలు లేనివి. పౌరుషేయ గ్రంథాల్లో వలె
దోషం లేని దాన్ని వేదం అని అంటారు. అది ఎప్పుడో వ్రాసినది కాదు కనుక ఎప్పటికీ
ఉంటుంది అందుకే నిత్యం అంటారు.
వేదాలు
మన తత్త్వాన్ని గురించి, పరమాత్మ తత్త్వాన్ని గురించి,
ప్రకృతి తత్త్వాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు చెబుతాయి. వేదాలు మనకు
ఇతరత్ర తెలియాల్సిన విషయాలని తెలిపే విజ్ఞాన గనులు.
శరీరానికి
సుఖాన్ని కలిగించేవి రకరకాలుగా ఉన్నాయి వాటిని రకరకాలుగా సంపాధించే ప్రయత్నం
చేసినా ఈ లోపల ఉండే మనల్ని గురించి తెలిస్తే తప్ప వీటిని ఎట్లా వాడుకోవాలో తెలియదు
కనుక ముందు దాన్ని తెలుసుకోమని ఉపనిషత్తులు మనకి ఉపదేశం చేస్తాయి. మనిషి దేన్ని
లక్ష్యంగా తీసుకుంటాడో ఆ జ్ఞానం కావాలి దానికి ఆటంకంగా ఉండే ఇతర జ్ఞానరాహిత్యం
అంతా తొలగిపోవాలి, అలా చేసేదానికి ఉపనిషద్ అని
పేరు. ఉపనిషత్తులకి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి, మనలో
నింపాల్సిన జ్ఞానాన్ని నింపే సామర్థ్యం ఉంటుంది కనుక ఆ పేరు వచ్చింది. ఇవి
వేదంలోని ప్రధాన ప్రతిపాద అంశాలు, వేదం యొక్క లక్ష్యం ఇదే
కనుక వీటికి వేదాంతం అని కూడా అంటారు.
ఉపనిషత్తులు
ఆరణ్యకాలలోని భాగాలు. ఉపనిషత్తులను బ్రహ్మభాగము అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా
జ్ఞానాన్ని గురించి చెబుతాయి. మిగతా
భాగాన్ని ధర్మ భాగము అని అంటారు. అంటే మనం ఆచరించాల్సిన కర్మ గురించి
చెబుతాయి. కొందరు ఉపనిషత్తులకు ప్రత్యేకించి శృతి లేదు అని ఇది వేదంలోనిది కాదు అని
సందేహిస్తారు కానీ అది తప్పు. ఉపనిషత్తులని వేదంలోంచి తీసి వేస్తే వేదాలు అర్థ
రహితం అవుతాయి. ఉపనిషత్తులు పరమాత్మ ఏమిటో, మనం ఉండే
ప్రకృతి ఏమితో, అత్మ ఏమిటో, ఆత్మకు
ప్రకృతికి ఉన్న సంబంధం ఏమిటో, ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం
ఏమిటో, మనిషిగా అత్మ యొక్క లక్ష్యం ఏమిటో ఇలా ఎన్నో విషయాలను
తెలుపుతాయి. ఈ మధ్యకాలంలో ఎందరో ఉపనిషత్తులని వ్రాస్తున్నారు. అట్లాంటివి
ఉపనిషత్తులు అని అనబడవు. ఉపనిషత్తులు అనేవి వేదంలోని భాగమే.
ఉపనిషత్తులు
ప్రతి వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ప్రధానంగా ఒక పది, మరొక నాలుగు ఉపనిషత్తులు
కలిపి మొత్తం పద్నాలుగు ఉపనిషత్తులని వేదాంతం అని చెప్పవచ్చు. ఇవన్నీ మన పూర్వ
ఆచార్యులైన ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మద్వాచార్యులచే
అంగీకరించబడినవి. అందుకే వారు అందించిన దర్శనాలను వేదాంత సిద్దాంతాలు అని
చెబుతారు.
ఉపనిషత్తులు
వరుసగా: ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, మాండూక్యోపనిషత్,
తైత్తిరీయ ఉపనిషత్, చాందోగ్య ఉపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ఐతరేయ ఉపనిషత్, స్వేతాస్వేతర
ఉపనిషత్, కౌషీతకీ ఉపనిషత్ లేదా కౌషీతక్యుపనిషత్, మహోపనిషత్, సుబాలోపనిషత్.
ఈశావాస్యము
శుక్ల యజుస్ అనే యజుర్వేదంలోనిది. ఇందులో పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి. శుక్ల యజుర్వేదం లోనే రెండు శాఖలు ఉన్నాయి. కాన్వ, మాధ్యందిన
అని. కాన్వలో పదిహేడు శ్లోకాలతో మాధ్యందినలో పద్దెనిమిది శ్లోకాలతో
కనిపిస్తుంటుంది. ఏది ఏమైనా మనం అర్చించాలిన అర్చా మూర్తి వైభవాన్ని స్పష్టం
చేస్తుంది.
కేనోపనిషద్
సామవేదంలోని తలవకారం అనే శాఖలోనిది. మనకందరికి వెనకాతల ఉన్న కారణమేమిటి ? దాన్ని గుర్తించకపోవడానికి మనలోఉన్న అడ్డేమిటి ? దాన్ని
ఎలా తొలగించుకోవాలో తెలుపుతుంది.
కఠోపనిషద్
అనేది యజుర్వేదంలోనిది. యముడికి నచికేతస్సుకి మధ్య జరిగే సంవాదంగా సాగుతూ అన్ని
విషయాలని సమగ్రంగా అందిస్తుంది. జీవుడు దేహాన్ని త్యాగంచేసిన తరువాత చేరుకొనే
స్థానమేది, అక్కడ భగవంతుని సాయుజ్యం ఎట్లా ఉంటుంది
అనేదాన్ని స్పష్టం చేస్తుంది.
ప్రశ్నోపనిషద్
అదర్వ వేదంలోనిది. ఆరుగురు మహనీయుల ప్రశ్నలు వాటి సమాధానాలు అందులో కనిపిస్తాయి.
ముండకోపనిషద్
అదర్వ వేదంలోనిది. సమగ్రంగా అన్ని విషయాలని స్పష్టం చేస్తుంది.
తైత్తిరీయము
అనేది కృష్ణ యజుర్వేదంలోనిది, ఒక ఐదు భాగాలు ఉంటాయి.
సృష్టి జరిగే క్రమం నుంది, సృష్టి జరిపే తత్త్వాన్ని
నిరూపిస్తూ ఆతత్త్వంయొక్క కల్యాణ గుణాలని ఆవిష్కరణం చేస్తుంది.
ఛాందోగ్యం
అనేది సామవేదంలోనిది. చాలా పెద్దది. బ్రహ్మ విద్యల్ని వివరిస్తుంది.
బృహదారణ్యకం
అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించిన మరో పెద్ద ఉపనిషద్. పేరునుండే 'బృహద్' ఆరణ్యకం అని తెలుస్తుంది. ఇందులో కూడా అన్ని
విషయాలని స్పృషిస్తుంది. సామాన్యంగా ఋషుల
సంవాదాలుగా, పరిపాలకుల ద్వారా ఋషులకు నిగూఢమైన విషయాల్ని
గ్రహించి అందించినవిగా తెలుస్తుంది.
ఐతరేయము,
కౌషీతకీ అనేవి ఋగ్వేదంలోనివి. సుభాల అథర్వ వేదానికి సంబంధించినది. స్వేతాస్వేతర
యజుర్వేదానికి సంబంధించినది. ఇక్కడ మనం ప్రస్థావించినవి కాని ఉపనిషత్తులు ఏవైనా
ఉంటే అవి తత్త్వ నిర్ణయాన్ని అంత స్పష్టంగా కలిగించేవి కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే
ఏది ప్రధానమో దాన్ని మనకు అందించగలిగేదాన్ని మనం గుర్తిస్తే చాలు.
ఉపనిషత్తులు
మంత్ర రూపంలో ఉంటాయి.
(శ్రీశ్రీశ్రీ
త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ ప్రవచనం ఆధారంగా)
No comments:
Post a Comment