Saturday, June 19, 2021

మార్కండేయుడు చెప్పిన ఇంద్రద్యుమ్నుడి కథ, కువలాశ్వుడి వృత్తాంతం ..... ఆస్వాదన-25 : వనం జ్వాలా నరసింహారావు

మార్కండేయుడు చెప్పిన ఇంద్రద్యుమ్నుడి కథ, కువలాశ్వుడి వృత్తాంతం

ఆస్వాదన-25

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (20-06-2021)

బ్రాహ్మణ ప్రభావం గురించి సోదాహరణంగా ధర్మరాజుకు వివరించిన మార్కండేయుడిని, అతడికంటే వయస్సులో పెద్దవారైనవారెవరైనా లోకంలో వున్నారా అని ప్రశ్నించాడు ధర్మరాజు. జవాబుగా ఇంద్రద్యుమ్నుడి కథ చెప్పాడు మార్కండేయుడు.

   ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు చిరకాలం స్వర్గలోకంలో తన కీర్తి మాయమయ్యేదాకా నివసించాడు. ఆ తరువాత దేవతలు అతడి పుణ్యం తగ్గిపోయిందని చెప్పి భూలోకంలోకి నెట్టారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు భూలోకంలో మార్కండేయుడున్న చోటుకు వచ్చాడు. వచ్చి, తానాయనకు తెలుసా అని అడిగాడు. తెలియదని అన్న మార్కండేయుడు, బహుశా తనకంటే పెద్దదైన ప్రావారకర్ణుడు అనే గుడ్లగూబకు తెలిసే అవకాశం వున్నదని చెప్పి, ఇద్దరూ కలిసి హిమాలయ పర్వత శిఖరం మీద వున్న గుడ్లగూబ దగ్గరికి వెళ్లారు. ముసలితనం వల్ల కదలలేనన్న మార్కండేయుడిని గుర్రం రూపం ధరించి ఇంద్రద్యుమ్నుడు తన వీపుమీద వుంచుకొని తీసుకుపోయాడక్కడికి.

గుడ్లగూబ కూడా తనకు ఇంద్రద్యుమ్నుడు ఎవరో తెలియదని చెప్పి, ఇంద్రద్యుమ్నం అన్న సరోవరంలో నివసించే నాళీకజంఘుడు అనే కొంగ వయస్సులో తనకంటే పెద్దదని, బహుశా ఆ కొంగకు తెలియవచ్చని అన్నది. ముగ్గురూ కలిసి కొంగ దగ్గరికి వెళ్లారు. కొంగ తనకూ తెలియదని చెప్పి అదే సరోవరంలో వున్న తాబేలును అడగమన్నది. తాబేలును స్మరించగానే అది నీళ్లలో నుండి బయటకొచ్చింది. ‘ఇంద్రద్యుమ్న మహారాజు నీకు తెలుసా?’ అని ముగ్గురూ తాబేలును ప్రశ్నించారు. అది కాసేపు ఆలోచించి, జ్ఞాపకం తెచ్చుకుని, కన్నీరు కారుస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసనీ, అతడిని ఎలా మరిచిపోతానని, అతడు మహాత్ముడని, పలుమార్లు ఆ మహనీయుడు తనను ఆపదల నుండి కాపాడాడని, అతడికి తాను సదా కృతజ్ఞతో వుండాలని, అతడెన్నో యజ్ఞాలు చేశాడని, అనేక గోవులను దానం చేశాడని, తానున్న మడుగు ఏర్పడడానికి కారణం అయన దానం చేసిన ఆవుల గిట్టల రాపిడేనని అన్నది.

తాబేలు ఆ మాటలు చెప్పగానే దేవతల ప్రతినిధులు విమానాన్ని తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని శాశ్వతంగా స్వర్గలోకంలో వుండడానికి, స్వర్గ సౌఖ్యం అనుభవించడానికి అక్కడికి రమ్మని ప్రార్థించారు. తన వెంట వచ్చిన మార్కండేయ మహర్షిని, ముసలి పక్షి ప్రావారకర్ణుడిని వారి-వారి నెలవులలో దింపి విమానం ఎక్కి స్వర్గలోకం పోయాడు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుడి కంటే వయసులో పెద్ద.

ఆ తరువాత ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలాశ్వుడి వృత్తాంతాన్ని చెప్పాడు మార్కండేయుడు ధర్మరాజుకు ఆయన కోరిక మీద.

ఉదంకుడు అనే మహాముని విష్ణుమూర్తి గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించాడు. ఉదంకుడు ఆయన్ను అనేక విధాల స్తుతించాడు. విష్ణుమూర్తి ఉదంకుడిని వరం కోరుకొమ్మన్నాడు. తన మనస్సు ఎప్పుడూ సత్యం మీద, ధర్మం మీద, ఇంద్రియ నిగ్రహం మీద ప్రసరించి, ఎల్లప్పుడూ విష్ణుమూర్తి మీద లగ్నం అయ్యేట్లు వరం ఇవ్వమన్నాడు ఉదంకుడు. ఆయన కోరిన వరాలతో పాటు, ఉద్డంకుడికి గొప్ప జ్ఞానం కూడా సిద్ధించగలదని విష్ణువు చెప్పాడు.

వరాలివ్వడంతో పాటు ఒక పని అప్పగించాడు విష్ణుమూర్తి ఉదంకుడికి. ధుంధుడు అనే రాక్షసుడిని సంహరించడానికి, ఉదంకుడు బృహదశ్వుడి కుమారుడైన కువలాశ్వుడిని సన్నద్ధం చేయాలని ఆదేశించి ఆదృశ్యమయ్యాడు. ఉదంకుడు వెనుకటి లాగానే తపస్సు కొనసాగించాడు. ఇదిలా వుండగా, ఇక్ష్వాకుడి వంశక్రమంలో బృహదశ్వుడికి కువలాశ్వుడు అనే కొడుకు పుట్టాడు. ఆయనకు 21 వేలమంది విలువిద్యలలో ఆరితేరిన కుమారులు జన్మించారు. బృహదశ్వుడు కొడుక్కు పట్టం కట్టి అడవులకు పోవడానికి సిద్ధం కాగానే, ఆ విషయం తెలుసుకున్న ఉదంకుడు బృహదశ్వుడి దగ్గరికి వచ్చాడు. అడవులకు పోయి తపస్సు చేయడం కన్నా ప్రజల రక్షణ గొప్పదని చెప్పాడు. ఆ తరువాత మధుకైటభుల కుమారుడైన ధుంధుభి అనే రాక్షసుడి గురించి చెప్పాడు. ఆ రాక్షసుడు తన ఆశ్రమానికి సమీపంలో ఒక ఇసుక మేటలో పెద్ద సొరంగం ఏర్పాటు చేసుకుని హాయిగా నిద్రపోతున్న సంగతి, అతడి శరీరం నుండి వదలబడ్డ గాలి పరిసరాలను తీవ్రంగా కలుషితం చేస్తున్న సంగతి, దానివల్ల తమకు కలుగుతున్న కష్టాల గురించి చెప్పి, ఆ రాక్షసుడిని సంహరించమని కోరాడు ఉదంకుడు.

తాను అస్త్రసన్యాసం చేశానని, ఆయుధాలు ముట్టనని, తపస్సు చేయడానికి పోతున్నానని, తన కుమారుడు కువలాశ్వుడు ధైర్యసాహసాలు కలవాడని, ఆయన కుమారులు కూడా శౌర్యసంపద కలవారేనని, వారంతా ఉదంకుడి అభీష్టాన్ని నెరవేర్చగలరని చెప్పాడు బృహదశ్వుడు. ఇలా చెప్పి తన కుమారుడిని అప్పగించాడు మహర్షికి. ఆ విధంగా బృహదశ్వుడి కుమారుడు కువలాశ్వుడు తండ్రి ఆదేశానుసారం ఉదంకమహాముని వెంట ధుంధుభి మీదికి దండయాత్రకు బయల్దేరాడు. రాక్షసులకు శత్రువైన విష్ణుమూర్తి కువలాశ్వుడికి తన శక్తిని ప్రసాదించాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు ఆశీస్సులు ఇచ్చారు. స్వర్గంలో మంగళ వాద్యాలు వినిపించాయి.

కువలాశ్వుడి కొడుకులు ఏడురోజులపాటు శ్రమించి ఇసుక తిన్నెలను సొరంగంగా తవ్వారు. అక్కడ సొరంగంలో నిద్రిస్తున్న రాక్షసుడిని చూశారు. వాడి నోటి నుండి వేడి నిట్టూర్పులు అగ్నిజ్వాలలలాగా రాసాగాయి. అవి ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. కువలాశ్వుడి కుమారులు ఆయుధాలతో రక్కసుడిని చుట్టుముట్టారు. చాలాసేపు వాడిని ఆయుధాలతో కొట్టగా వాడి శరీరం కొద్దిగా కదిలింది. అప్పుడు వాడు నోరు భయంకరంగా తెరిచి ఆవులించాడు. నోట్లో నుండి అగ్నికణాలతో జ్వాలలు బయల్దేరాయి. ఆ అగ్నిజ్వాలలలో కువలాశ్వుడి కొడుకులంతా నశించారు. కొడుకుల్లో దృడాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురు తప్ప మిగతావారంతా మరణించారు.

అప్పుడు కువలాశ్వుడు విజృంభించి రాక్షసుడిని చుట్టుముట్టి యుద్ధం చేశాడు. రాక్షసుడి మీద బ్రహ్మాస్త్రం వేశాడు. ఆ బ్రహ్మాస్త్రం క్షణంలో రాక్షసుడిని సంహరించింది. ధుంధుభిని చంపిన కువలాశ్వుడిని ‘ధుంధుమారుడు అని వ్యవహరించమని దేవతలన్నారు. వరం కోరుకొమ్మని దేవతలు చెప్పగా, తనకు విష్ణుభక్తి వుండేలా వరం ఇవ్వమన్నాడు కువలాశ్వుడు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

       

 

   

          

                   

No comments:

Post a Comment