Sunday, June 27, 2021

వేదవ్యాసుడి నాలుగు వేదాలు, పద్దెనిమిది పురాణాలు : వనం జ్వాలా నరసింహారావు

 వేదవ్యాసుడి నాలుగు వేదాలు, పద్దెనిమిది పురాణాలు

వనం జ్వాలా నరసింహారావు

బ్రహ్మదేవుడు తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించాడు. వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ సంహిత అనేవారు. దానిని సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. క్రమేపీ శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆరుగురు వేదాంగవేత్తలు సూతుడి తండ్రి రోమహర్షుడి దగ్గర పురాణాలను నేర్చుకున్నారు. సూతుడు వారి దగ్గర శిష్యరికం చేసి పురాణ సంహిత మొత్తాన్నీ అభ్యసించాడు. కశ్యపుడు, సూతుడు, సావర్ణి, అకృతవ్రణుడు, రోమహర్షుడి దగ్గర మూల సంహితలు నాలుగూ నేర్చుకున్నారు.

పద్దెనిమిది మహాపురాణాలు: బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ పురాణాలు. ఇవి కాకుండా ఉపపురాణాలు కూడా వున్నాయి.

పద్దెనిమిది మహా పురాణాల పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో కూడి వున్న గ్రంథం. పద్మ పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం 15400, భవిష్యోత్తర పురాణం 14500, బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల శ్లోకాలు వుంటాయి.

బ్రహ్మ పురాణంలో విశేషముగా పుణ్య క్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్య తీర్ధముల గురించి చెప్పబడింది. గౌతమీ మాహాత్మ్యములో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రము గురించి చెప్పబడింది. బ్రహ్మ పురాణం విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్ధములకు పొందడానికి సర్వ శాస్త్రాలకంటే విశేషము కలది. నక్షత్రముల జన్మము, వివాహము; చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట; దేవ, రాక్షస, మానవ గణములు; వివాహ సమయంలో చేసే ప్రమాణములు; చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము; చంద్రుని క్షయరోగ విముక్తి; మహా పాతకము, పుణ్యములో పాపము; గోవు పుట్టుక; గాయత్రి ఉత్పత్తి ఇందులోని ముఖ్యాంశాలు.

పద్మ పురాణంలో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి వున్నది. ఇందులో సృష్టి నిర్మాణం, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలు, వాల్మీకి రామాయణంలోని సీతా రాముల కథ కన్నా భిన్నమైన కథనం, పండగలు, ఎక్కువగా విష్ణువును కీర్తించే, కొంచెం శివుని కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగా, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతం, మోక్షం లాంటి అంశాలను స్పృశించారు. 

విష్ణు పురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మాలు తెలుసుకునేందుకు వజ్రుడు అర్హుడని భావించి వైష్ణవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది. జంబుద్వీప వర్ణన, భారత వర్షం విశేషాలు ఇందులో వున్నాయి.

శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు. శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు: సృష్టి ప్రశంస అజిత; తరణోపాయము; శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము; శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక; శివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము; అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము; నంది, భృంగుల జన్మ వృత్తాంతము; పరశురామోపాఖ్యానము; కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము; పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట; పరశురామ కార్తవీర్యుల యుద్ధము; సుచంద్రుని యుద్ధము; పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట; ముక్తి సాధనములు; పిండోత్పత్తి విధానము; బృహస్పత్యోపాఖ్యానము.

లింగ పురాణంలో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది. లింగపురాణంలో ప్రధానంగా పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు విభాగాలున్నాయి. ఇందులో ఉత్తరభాగం కన్నా పూర్వభాగం పెద్దది. సృష్టి నిర్మాణ శాస్త్త్రం, ఖగోళ శాస్త్త్రం, భూగోళ శాస్త్త్రం దీనిలో వివరించడం జరిగింది.

గరుడ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.

నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది. నారద పురాణంలో విశేషంగా జ్యోతిఃశాస్త్ర విశేషాలు, మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డాయి. నారద పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు. ఇందులో ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, నవగ్రహ మంత్రములు, కార్తవీర్య మంత్రం, హయగ్రీవ మంత్రోపాసన, హనుమాన్ మంత్రం సంగ్రహించబడ్డాయి. ఉత్తరభాగంలో వివిధ పుణ్యక్షేత్రాల గూర్చి చెప్పబడింది. కాశి, గయ, ప్రయాగ, పురుషోత్తమక్షేత్ర, పుష్కర క్షేత్రం, గోకర్ణ క్షేత్రం, రామ సేతు, అవంతి తీర్థం, ద్వాదశి, ఏకాదశి వ్రత విధానం గురించి చెప్పబడింది.


భాగవత పురాణం హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంథస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు భాగవతంలో పొందుపరచబడినాయి. భగవంతుడి లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము.

అగ్ని పురాణంలో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. ఇందులో విష్ణువు అవతారాల గురించి, విశేషించి రామావతార౦, కృష్ణావతారాలగురించి, పృథ్వి గురించి ఉంది. యాగ పూజావిధానాలు, జ్యోతిశ్శాస్త్ర విషయాలు, చరిత్ర, యుద్ధము, సంస్కృత వ్యాకరణము, ఛందస్సు, న్యాయం, వైద్యం, యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకొన్నాయి.

స్కంద పురాణంలో అరుణాచల మహత్మ్యం; వేంకటాచల మాహాత్మ్యం; కార్తీకమాస మహత్మ్యం; మార్గశీర్ష మాస మహత్మ్యం; భాగవత మహత్మ్యం; వైశాఖమాస మహత్మ్యం; ద్వారక మహత్మ్యం లాంటివి ఇందులో వున్నాయి.

భవిష్య పురాణంలో మొత్తం 5 భాగాలున్నాయి. మొదటి భాగంలో విష్ణువు, శివుడు, సూర్య భగవానుని జననం వర్ణించ బడింది. రెండవ, మూడవ, నాల్గవ భాగాలలో ఆ దేవతల గొప్పతనం వర్ణించ బడింది. ఐదవ భాగంలో స్వర్గలోక వర్ణన ఉంది. భవిష్య మహాపురాణంలో రాబోవు కాలము యొక్క చరిత్ర గురించి వర్ణించ బడింది. ఇందులో బ్రహ్మ పర్వము, మధ్యమ పర్వము, ప్రతిసర్గ పర్వము, ఉత్తర పర్వము అను నాలుగు పర్వములు ఉన్నాయి.

బ్రహ్మవైవర్త పురాణం పరబ్రహ్మ వ్యాప్తము గురించి వివరిస్తుంది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణం అన్నారు. ఈ పురాణం నాలుగు భాగాలుగా విభజింపబడింది. బ్రహ్మ ఖండము-బ్రహ్మాండోత్పత్తి గురించి; సృష్టి గురించి; ప్రకృతి ఖండము-ఆదిశక్తి గురించి; ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి; గణేశ ఖండము-గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము; శ్రీకృష్ణ ఖండము-పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు. ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్యాసమహర్షి వర్ణించాడు.

మార్కండేయ పురాణం శివుడికి, విష్ణువుకూ, వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉంది. ఈ గ్రంథం మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. మన్యంతరాల గురించిన వివరాలు,  దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి), పౌరణిక వంశాల గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి.

శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది వామన పురాణం. బ్రహ్మ వామనుని స్తుతించుట, బలి యజ్ఞం మొదలుపెట్టడం, ప్రహ్లాదుడి తీర్ధయాత్ర, బలిచక్రవర్తి ఆదర్శ పాలన, శివకేశవుల అభేధం శివుడే తెలియజేయుట, కుమారస్వామి జననం, దేవసేనాధిపతిగా పట్టాభిషేకం, శివపార్వతుల కల్యాణం, కురుక్షేత్రం, ధరక్షేత్రం, జంబుద్వీపం, భారతవర్షం, ప్రహ్లాద నరనారాయణుల యుద్ధం, మహాకాల రూపం, 12 రాశులవర్ణన మొదలైన అంశాలు వున్నాయిందులో.

వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. ప్రియవతోపాఖ్యానం, ధర్మవ్యాధోపాఖ్యానము, శ్రాద్ధ వర్ణనము, శ్రాద్ధ విధి, ద్వాదశివ్రతము, నారాయణార్చన విధానం మొదలైన అంశాలున్నాయి ఇందులో.

మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు. సృష్టిక్రమం, మొదటి సృష్టి, బ్రహ్మాదుల సృష్టి ఇందులో తెల్సుకోవచ్చు.

శ్రీ కూర్మ మహాపురాణం మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం.  ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. కుర్మ అంటే, అత్యంత ఆసక్తికరమైన మతం-నేపథ్యం కలిగిన పురాణాంశం. ఎందుకంటే దీనికి విష్ణు అవతారంలో ఒకదాని పేరు పెట్టబడినప్పటికీ వాస్తవానికి ఇది విష్ణు, శివులకు సంబంధించిన ఇతిహాసాలు, తీర్థ (తీర్థయాత్ర), వేదాంతశాస్త్రాల కలయికను కలిగి ఉంది. ఈ కథలు ఇతర పురాణాలలో కనిపించే కథల మాదిరిగానే ఉంటాయి. ఎక్కువగా శైవ ప్రదేశాల గురించి వివరించబడింది. ఇతర పంచరాత్ర కథలు, విష్ణువు గాథలను ప్రముఖంగా వివరిస్తుంది. అందరికీ శక్తిని అందించే అత్యున్నత శక్తి మూలంగా భావించబడుతూ విష్ణు, శివ, బ్రహ్మాది దేవతలు దేవతలుగా ఉంటారని భావించబడుతుంది.

బ్రహ్మాండ పురాణము ముఖ్యమైన పురాణాలలో ఒకటి. బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంథమని చెబుతారు.యుగములు, వాని ప్రమాణములు; యుగ ధర్మములు; వాలి వృత్తాంతము; శ్రాద్ధక్రియ, విమర్శనదినము; జల స్థల విభాగము; స్వాయంభువు మనువు సంతతి; విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు; వైవస్వత మనువు; ధన్వంతరి కాశీపుర నిర్మాణము మొదలైన అంశాలున్నాయి ఇందులో.

అష్టాదశ పురాణాలలో భాగవత పురాణం శ్రేష్టమైనది. సర్వ పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవారు, వినిపించేవారు, చదివేవారు, వ్రాసేవారు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమహా విష్ణువుతో సాయుజ్యం పొందుతారు. ఆసక్తితో ఆదివారం నాడు భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని అవలీలగా దాటుతాడు.

1 comment:

  1. నమస్కారమండి!! "విష్ణు పురాణం" పరాశర మహర్షి, తన శిష్యుడైన మైత్రేయ మహర్షి సంవాద రూపంలో ఉంటుండండి. ఒకసారి పరిశీలించండి.

    ReplyDelete