Saturday, June 12, 2021

మార్కండేయుడు చెప్పిన బ్రాహ్మణ ప్రభావం, మహర్షి వామదేవుడి మహిమ .... ఆస్వాదన-24 : వనం జ్వాలా నరసింహారావు

మార్కండేయుడు చెప్పిన బ్రాహ్మణ ప్రభావం, మహర్షి వామదేవుడి మహిమ

 ఆస్వాదన-24

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (13-06-2021)

బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పమని ధర్మరాజు మార్కండేయ మహర్షిని ప్రార్థించగా, పరీక్షిత్ మహారాజు కథ చెప్పాడు. పూర్వకాలంలో అయోధ్యను పాలిస్తున్న పరీక్షితుడు అనే మహారాజు ఒకనాడు అడవికి వెళ్లి సంతృప్తిగా వేటాడసాగాడు. అలా వేటాడుతున్న సమయంలో అడవిలో ఒక అందగత్తెను చూశాడు. ఆమె అడవిలో పూలు కోస్తూ మహారాజు కంటబడింది. ఆమె మీద ప్రేమపడ్డాడు పరీక్షిత్. ఆమె కూడా మహారాజును ఓరచూపులతో చూసి మాట్లాడడానికి సిద్ధపడింది. ఆమె ఎవరని, అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నదని మహారాజు ఆమెను ప్రశ్నించాడు. తాను పెండ్లికాని పిల్లనని, తన తండ్రి అనుమతితో అడవిలో మంచి పెండ్లి కొడుకు కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నానని జవాబిచ్చింది.

రాజు ఆమె వాక్చాతుర్యానికి, తెలివితేటలకు ముగ్దుడయ్యాడు. ఆమెకు తన వలపును, తలపును వెల్లడి చేశాడు. ఆమె తన సమ్మతి తెలుపుతూ ఒక నిబంధన విధించింది. రాజు తననెప్పుడూ జలవిహారానికి నియోగించరాదని అన్నది. దానికి అంగీకరించిన మహారాజు ఆమెను తనతోపాటు వెంటబెట్టుకుని రాజధానికి చేరి, ఆమెతో కోరిన సుఖాలను అనుభవించాడు. ఇంతలో కొంతకాలానికి శరదృతువు వచ్చింది. ఆ సందర్భంగా రాజు తన దేవేరితో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో సరస్సు సరసున విహరించాడు. ఒకనాడు అలా విహరిస్తుంటే పరీక్షిన్మహారాజుకు శరీరం అంతా చెమట పట్టింది. తన ప్రియురాలిని సమీపంలోని కొలను గట్టున వుంచి మహారాజు నీళ్లలోకి దిగాడు. కాసేపటికి గతంలో కుదిరిన ఒప్పందాన్ని మరిచిపోయి, తన ప్రేయసిని కూడా నీళ్లలోకి రమ్మని కోరాడు మహారాజు. ఆమె చిరునవ్వు నవ్వుకుంటూ సరోవరంలోకి ప్రవేశించి వెంటనే అదృశ్యమైపోయింది. రాజు ఆ కొలనంతా గాలించినా ఫలితం కలగలేదు. ఆమె కనిపించలేదు. రాజు ఆ కొలనులోని నీరంతా తోడించాడు.

సరోవరంలోని నీరంతా బయటికి చిమ్మిన తరువాత అందులోని కప్పలు బయటపడ్డాయి. ఆ కప్పలే తన ప్రేయసిని మింగాయని భావించిన రాజు తన సేవకులను పిలిచి భూమ్మీద వున్న కప్పలన్నిటినీ సంహరించమని ఆజ్ఞాపించాడు. రాజభటులు అలాగే కనిపించిన కప్పనల్లా చంపసాగారు. అప్పుడు కప్పల నాయకుడు ఒక మహర్షి రూపం దాల్చి రాజుదగ్గరికి వచ్చాడు. కప్పలను అలా సంహరించడం అన్యాయం అన్నాడు రాజుతో. ఆయన ఆగ్రహాన్ని తగ్గించుకొమ్మనీ, కప్పలమీద జాలిచూపమనీ అడిగాడు. తన ప్రేయసికి కీడుచేసిన కప్పల మీద కసి తీర్చుకుంటున్నానని, అది న్యాయమే అని చెప్పాడు రాజు. 

తాను కప్పల దొరనని, తన పేరు ఆయువని, రాజు ప్రేయసి తన కూతురని, ఆమె మోసకత్తెని చెప్పాడు మహర్షి వేషంలో వున్న కప్పల నాయకుడు. అయితే తనకు తన ప్రేయసి కావాలని, ఆమెను రప్పించమని అన్నాడు రాజు. ఆయువు అలానే అని ఆమెను అక్కడ ప్రత్యక్షం కావించాడు. ఆమె చెడ్డదని ఆరోపిస్తూ ఆమెకు పుట్టబోయే కొడుకులు మోసగాళ్లు అవుతారని శపిస్తూ ఆమెనక్కడ వదిలి ఆయువు వెళ్లిపోయాడు. మహారాజు ఆమెను స్వీకరించి, ఆమెతో సుఖాలను అనుభవించాడు. వారికి శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. పెద్దవాడైన శలుడికి పట్టం కట్టి రాజు అరణ్యాలకు పోయాడు.

ఒకనాడు శలుడు అడవికి వేటకు పోయి ఒక జంతువు మీద బాణం వేయగా అది తప్పించుకుని పోయింది. దాన్ని వెంటాడిన రాజుకు రథసారథి ఆ మృగం వేగంతో సమానమైన వేగంగా పోవాలంటే ‘వామ్యజాతి’ గుర్రాలు కావాలని, అవి సమీపంలోనే వున్న వామదేవుడు అనే ఋషి దగ్గర వున్నాయని చెప్పాడు. రాజు తక్షణమే వామదేవుడి దగ్గరికి పోయి ఆయన గుర్రాలను ఇమ్మని కోరాడు. తన పని అయినతరువాత తిరిగి ఇచ్చే ఒప్పందం మీద ఋషి తన గుర్రాలను ఇచ్చాడు. రాజు తాను కొట్టిన జంతువును చేరుకొని మళ్ళీ మరో బాణం వేసి దాన్ని చంపాడు. తరువాత గుర్రాలను ఋషికి ఇవ్వకుండా రాజధానికి చేరుకున్నాడు. దురహంకారంతో వాటిని తన దగ్గరే వుంచమని రథసారథికి చెప్పాడు. వాటిని అంతఃపురంలో కట్టేశాడు.  

వామదేవుడు తన శిష్యుడైన ఆత్రేయుడిని అయోధ్యానగరంలోని రాజు దగ్గరికి పోయి గుర్రాలను అడిగి తీసుకురమ్మన్నాడు. తాను మహారాజునని గుర్రాలను ఇవ్వనని చెప్పి పంపాడు రాజు ఆత్రేయుడిని. వామదేవుడికి కోపం వచ్చింది. శలుడి దగ్గరికి వెళ్ళాడు ఆగ్రహంగా. పోయి, ఇతరుల సొత్తు, అందునా బ్రాహ్మణుల సొత్తు అపహరించడం తప్పని, మహాపాపమని, తన గుర్రాలను వెనక్కు ఇవ్వమని అడిగాడు రాజుని. గుర్రాలను ఇవ్వకపోతే రాజు నరకంలోని అగ్నిజ్వాలలలో పడిపోతాడని హెచ్చరిక చేశాడు. వ్యర్తమైన కోరికలు కోరకుండా వెనక్కు పొమ్మని ఋషికి చెప్పాడు రాజు నిర్లక్ష్యంగా. ఇది అన్యాయమన్న ఋషిని పట్టి బంధించమని, శూలాలతో పొడిచి చంపమని భటులను ఆజ్ఞాపించాడు రాజు.

ఋషి వామదేవుడి ముఖం కోపంతో భయంకరంగా కనపడింది. ఆ క్షణంలోనే అనేకమంది రక్కసులు ఆయన ముఖంలో నుండి ఉద్భవించి, రాజును శూలాలతో పొడిచి చంపారు. వామదేవుడు వెళ్లిపోయాడు. శలుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. కొన్నాళ్లకు వామదేవుడు వచ్చి నలుడిని కూడా తన గుర్రాలను ఇవ్వమని అడిగాడు. రాజు నలుడికి కూడా కోపం వచ్చింది. బాణం తెమ్మని ఋషిని చంపుతానని తన పక్కనున్న సారథికి చెప్పాడు. ఇంతలో ఋషి మహిమ వల్ల అతడిని సంహరించడానికి ఉద్దేశించిన బాణం రాజు కొడుకును అంతఃపురంలో చంపింది. ఆ బాలుడి మృతదేహాన్ని సభకు తెచ్చారు పరిచారకులు. ఆగ్రహించిన రాజు మరో బాణం సంధించి బ్రాహ్మణుడిని చంపడానికి పూనుకున్నాడు. ఋషి మహిమ వల్ల రాజు రెండు చేతులు స్తంబించిపోయాయి. రాజు ఆశ్చర్యపడ్డాడు.

పశ్చాత్తాప పడ్డ రాజు అందరూ వింటుండగా, తన ఆయుధాల శక్తి చెడిందని, బ్రాహ్మణుల శక్తి గొప్పదని, ఇది తన స్వానుభవంతో తెలుసుకున్నానని, తాను ఓడిపోయానని అన్నాడు. వామదేవ మహర్షి గెలుపొందాడని, ఆయన శరణు వేడుతానని చెప్పాడు. అలా అంటూ, గర్వాన్ని వదిలి, మునికి నమస్కరించాడు. ముని ప్రసన్నుడై స్తంబించిన రాజు రెండు చేతులను సరిచేశాడు. చనిపోయిన రాజు కొడుకును బతికించాడు. రాజు అంతఃపురం నుండి గుర్రాలను తెప్పించి మునీశ్వరుడికి అప్పచెప్పాడు.

ఇదీ బ్రాహ్మణ ప్రభావం అని మార్కండేయ మహర్షి ధర్మరాజుకు వివరించాడు.    

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

        

                              

No comments:

Post a Comment