పారిజాతాపహరణం కథా సంగ్రహం
వనం
జ్వాలా నరసింహారావు
(బాలాంత్రపు
వేంకట రమణ పుస్తక పరిచయం ఆధారంగా)
ప్రథమాశ్వాసం
శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన తరువాత అతడి చెరలో వున్న పదహారు
వేలమంది అప్సరసల కులానికి చెందిన లలనామణులను వివాహం చేసుకున్నాడు. ఆయనకు అప్పటికే
ఎనిమిదిమంది పట్టపురాణులున్నారు. శ్రీకృష్ణుడు అందరు భార్యలను సమానంగా
చూసుకుంటున్నప్పటికీ వారందరిలోకి రుక్మిణి, సత్యభామలకు
ఎక్కువ చనువు ఇచ్చి ఆదరిస్తున్నాడు.
ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో
పాచికలాడుతున్నప్పుడు కలహప్రియుడైన నారదుడు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆయనకు
ఎదురేగి అతిథి సత్కారాలు చేశాడు. నారదుడు సాక్షాత్తు విష్ణుమూర్తైన శ్రీకృష్ణుడిని
అనేక విధాల ప్రశంసించాడు. ఆ తరువాత తన దగ్గరున్న పారిజాత పుష్పాన్ని పైకి తీశాడు.
అది బయటకు రాగానే తుమ్మెదలు దాని చుట్టూ మూగసాగాయి. ఆ పుష్పాన్ని ఒక బంగారు
తామరాకులో చుట్టి శ్రీకృష్ణుడికి సమర్పించాడు నారదుడు. శ్రీకృష్ణుడు
రుక్మిణీదేవికి ఆ పుష్పాన్ని ఇచ్చాడు. ఆమె దాన్ని తన కొప్పులో ముడుచుకున్నది.
దానితో ఆమె అందం ఇనుమడించింది. ఆ తరువాత నారదుడు ఆ పుష్పం మహిమను రుక్మిణికి
వివరించాడు. దాని మహిమ వల్ల సవతులంతా ఆమెకు దాసోహం అవుతారని చెప్పాడు. భర్త కూడా
ఆమె మాట జవదాటడని అన్నాడు. రుక్మిణీదేవిని అమితంగా పొగిడి ప్రత్యేకంగా సత్యభామ
పేరెత్తి దూషించాడు.
రుక్మిణీదేవి అంతఃపురంలో జరిగిన సంగతి
పూసగుచ్చినట్లుగా సత్యభామ చెలికత్తె తన యజమానురాలికి వివరించింది. సత్యభామకు ఆగ్రహం
కలిగేలా చెప్పింది చెలికత్తె. చెలికత్తె మాటలు విన్న సత్యభామ కోపంతో
రెచ్చిపోయింది. కోపంతో పాటు దుఃఖం పెల్లుబికింది. తప్పంతా కృష్ణుడిదే అని అన్నది. సత్యభామ
కోప గృహంలోకి ప్రవేశించింది. మాసిన చీరె కట్టుకుంది. మౌనంగా వున్నది. ఆభరణాలన్నీ
తీసేసింది. తలకు వాసెనకట్టు కట్టింది. కస్తూరి పట్టి నుదుటికి వేయించుకున్నది. ఒక
మంచం మీద పొర్లింది. జుట్టు విరబోసుకున్నది.
ఈ నేపధ్యంలో శ్రీకృష్ణుడు సత్యభామ వుండే
బంగారు సౌధానికి బయల్దేరాడు. సౌధం ముందు రథం దిగి లోపలి వెళ్లాడు. అంతా
నిశ్శబ్దంగా వున్నదక్కడ. ఎవరైనా సత్యభామకు పారిజాత వృత్తాంతం చెప్పారేమో అని
అనుమానిస్తూ కోపగృహంలోకి వెళ్లాడు. సత్యభామను చూసి ఆశ్చర్యపోయాడు. చెలికత్తె
దగ్గరున్న విసనకర్రను తీసుకుని కృష్ణుడు
తానే విసరసాగాడు. శ్రీకృష్ణుడిని చూడగానే సత్యభామ కనుల వెంట నీటి బిందువులు
ఒలికాయి. సత్యభామను ఎన్నో విధాలుగా అనునయించాడు శ్రీకృష్ణుడు. సత్యభామ
పాదయుగ్మమునకు నమస్కరించాడు. మహాకోపంతో వున్న సత్యభామ తన పాదాల వద్ద వున్న
శ్రీకృష్ణుడి తలను తన ఎడమ కాలితో తన్నింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు:
చ: నను
భవదీయదాసుని మనంబున నెయ్యపుగిన్క బూని తా
చినయది నాకు మన్ననయె చెల్వగు నీ పదపల్ల వంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చు నంచు
నే
ననియెద నల్క మానవుగదా యికనైక నరాళకుంతలా!
శ్రీకృష్ణుడి
మాటలకు సత్యభామ చర్రున లేచింది. ఆయన కల్లబొల్లి కబుర్లు కట్టిబెట్టమన్నది. ఇక
ఆయన్ను నమ్మనన్నది. పారిజాత పుష్పం రుక్మిణికి ఇచ్చి తనను పరిహాసం చేశాడని అన్నది.
తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నది. ఆమె గొంతు బొంగురు పోయింది. మాట పెగల్లేదు.
అపురూపమైన పారిజాత పుష్పాన్ని నారదుడు స్వర్గలోకం నుండి తెస్తే దాన్ని తనకు
ఇవ్వకుండా రుక్మిణికి ఇచ్చాడన్న ఈర్ష్య బయటపడింది.
సత్యభామను
అనునయించడానికి శ్రీకృష్ణుడు, తాను దేవతల విహారమైన నందనంలోకి వెళ్లి యుద్ధానికి
ఎవరొచ్చినా ఎదిరించి, పారద్రోలి, ఏకంగా పారిజాత వృక్షాన్నే తీసుకువచ్చి
సత్యభామకు ఇస్తానని అన్నాడు.
ద్వితీయాశ్వాసం
ఈ
నేపధ్యంలో అక్కడికి నారదుడు వచ్చాడు. ముగ్గురూ కలిసి భోజనశాలకు వెళ్లి భోజనం
చేశారు. భోజనానంతరం శ్రీకృష్ణుడు చెలికత్తెలతో బంధువులందరికీ కర్పూర తాంబూలాలు
ఇప్పించాడు. ఆ తరువాత సత్యభామ నారద,
కృష్ణులు వున్న చోటుకు వచ్చింది. సత్యభామను దీవిస్తూ నారదుడు, ఆమె భర్త ఆమె కోరిన కోరికలన్నీ ఎంత
కష్టసాధ్యమైనా తీర్చుగాక అని అన్నాడు. నారదుడు వెళ్లిపోవడానికి సిద్ధం కాగానే
ఆయనతో శ్రీకృష్ణుడు, అదితిని మోసగించి నరకాసురుడు
దొంగిలించిన కుండలాలను తానే త్వరలో వచ్చి ఇంద్రుడికి అందచేస్తానని ఆయనతో చెప్పమని
అన్నాడు. నారదుడు వెళ్లిపోయిన తరువాత సూర్యుడు అస్తమించాడు. క్రమక్రమంగా చీకట్లు
వ్యాపించాయి. అంధకారం జగమంతటా ఆక్రమించింది. ఆ తరువాత చంద్రుడు ఉదయించాడు.
తెల్లవారు జామున శ్రీకృష్ణుడికి మేలుకొలుపు పాడారు వైతాళికులు. ఆయన మేల్కొన్నాడు.
మేల్కొన్న
శ్రీకృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకొని సభ తీర్చి, గరుత్మంతుడిని తలచుకున్నాడు. ఆయన వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి
వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. నారదుడు వచ్చి పారిజాత పుష్పం
ఇవ్వడం దగ్గర నుండి, తాను పారిజాత వృక్షాన్ని తీసుకు వస్తానని ప్రతిజ్ఞ చేయడం వరకు
అన్ని విషయాలను గరుత్మంతుడికి చెప్పాడు. తరువాత సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు గరుడ
వాహనాన్ని అధిరోహించాడు. ఆయన వెంట శ్రీకృష్ణుడి ఆయుధాలు కూడా బయల్దేరి వెళ్లాయి. మార్గమధ్యంలో
కనిపించిన విశేషాలను సత్యభామకు వివరించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అలా
వివరిస్తూ సంతోషంగా మేరుపర్వత శిఖర ప్రదేశంలో దిగాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు సత్యా
సమేతుడై ఆనందంగా స్వర్గలోకానికి వచ్చాడు.
తృతీయాశ్వాసం
అంతకుముందే
నారద ముని ద్వారా శ్రీకృష్ణుడి రాక గురించి తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుడికి
ఎదురు వచ్చాడు. రాగానే శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మాదులకు కూడా అతి
కష్టం మీద దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు తనంతట తానే రావడం, తనకు దర్శనం ఇవ్వడంతో ఇంద్రుడు ఆనందభరితుడైపోయాడు.
తన పాదాల మీద వాలిన ఇంద్రుడిని లేపి శ్రీకృష్ణుడు కౌగలించుకున్నాడు. ఇంద్రుడు
మొక్కిన తరువాత అష్టదిక్పాలకులు కూడా శ్రీకృష్ణుడికి మొక్కారు. అంతా కలిసి
బయల్దేరారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవమాత అయిన అదితిని దర్శించాడు. తన బంగారుబట్ట
చెరగులో దాచి తెచ్చిన, నరకాసురుడు అపహరించిన ఆమె కుండలాలను తీసి అదితికి ఇచ్చాడు
శ్రీకృష్ణుడు. అదితి శ్రీకృష్ణుడిని తన పక్కనే కూచోబెట్టుకొని శ్రీమహావిష్ణువు
అవతారాలను (మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, బుద్ధావతారం) వర్ణించింది. ఆ తరువాత ఆయన్ను పలు రకాలుగా
స్తుతించింది.
ఆ
తరువాత అదితి శ్రీకృష్ణుడితో సత్యభామా సహితంగా తన ఆతిథ్యం స్వీకరించాలని కోరింది. ఇంద్రుడు
వైజయంతం అనే పేరుకల తన నివాసానికి రమ్మని అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ
సత్యాసమేతుడై వైజయంతానికి బయల్దేరాడు. అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు దానిలోనే
అంతర్భాగంగా వున్న నందన వనాన్ని చూద్దామా అని సత్యభామను అడిగాడు. ఆ తరువాత
ఇంద్రుడి నందనవనం దగ్గరికి శ్రీకృష్ణుడు,
సత్యభామ మెల్లగా వెళ్లారు. అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలను సత్యభామకు చూపిస్తూ
శ్రీకృష్ణుడు నందనవనమంతా సంచరించాడు.
చతుర్థాశ్వాసం
శ్రీకృష్ణుడు
సత్యభామతో నందనవనంలో సంచరిస్తూ స్వర్గలోకాన్ని అలంకరించే పారిజాతవృక్షాన్ని
చూపించాడు. పారిజాతవృక్షం ప్రాశస్త్యాన్ని గురించి పలువిధాలుగా వర్ణించి చెప్పాడు.
ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన చేసిన శపథం నెరవేర్చే విధంగా ఆ దేవతా వృక్షాన్ని
పెకలించి తన క్రీడా వనంలో నాటమని సత్యభామ శ్రీకృష్ణుడిని కోరింది. అలాగే చేస్తానని
అంటూ ఆ కల్పవృక్ష పూలగుత్తిని ఆమె చెవికి అలంకారంగా పెట్టాడు. ఇంతలో మధ్యాహ్నం
అయింది. ఆ తరువాత సూర్యాస్తమయం, చంద్రోదయం, సూర్యోదయం అయ్యాయి.
అప్పుడు
శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి పారిజాత వృక్షాన్ని అపహరించే ప్రయత్నంలో గరుత్మంతుడి
వీపుమీద ఎక్కి నందనవనంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఆ కల్పవృక్షాన్ని పెకలించి
గరుడుడి వీపుమీద పెట్టి సత్యభామకు సంతోషం కలిగించాడు. వనపాలకులు ఇది చూసి
శ్రీకృష్ణుడిని అడ్డగించారు. వారికి పౌరుషం వుంటే శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి విడిపించుకొమ్మని
ఇంద్రుడికి చెప్పమని అంటుంది సత్యభామ. అదే విషయాన్ని శచీదేవితో కలిసి వున్న
ఇంద్రుడికి చెప్పారు వనపాలకులు.
దేవేంద్రుడి
ఆస్థానం ముందు యుద్ధభేరి మోగింది. దేవతా వీరులంతా ప్రగల్బాలు పలుకుతూ ఆయుధాలను
ధరించి యుద్ధానికి బయల్దేరారు ఇంద్రుడితో సహా. అష్ట దిక్పాలకులు కూడా యుద్ధానికి
బయల్దేరారు.
పంచమాశ్వాసం
యుద్ధం
మొదలైంది. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడి బాణాలకు దేవతల శరీరాలు కూలుతున్నాయి. అష్ట
దిక్పాలకులు పలాయనం చిత్తగించారు. దేవసైన్యం అంతా శ్రీకృష్ణుడి ధాటికి యుద్ధరంగం
విడిచి పారిపోగా, ఇంద్రుడు ఐరావతాన్ని శ్రీకృష్ణుడి మీదికి
పురిగొల్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బాణాన్ని దేవేంద్రుడి రొమ్మున నాటేలాగ
వేశాడు. ఇరువురూ తీవ్రంగా యుద్ధం చేశారు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా శ్రీకృష్ణుడిని
ఏమీ చేయలేక పోయింది. ఆ వెంటనే తన అపరాధాన్ని మన్నింపంమని వేడుకుంటూ ఇంద్రుడు
శ్రీకృష్ణుడికి సాష్టాంగనమస్కారం చేశాడు. ఇంద్రుడి తప్పు ఏమీ లేదని అంటూ
వజ్రాయుధాన్ని ఇచ్చేశాడు. కల్పవృక్షాన్ని కూడా ఇవ్వబోగా దాన్ని ఆయన వద్దనే
వుంచుకొమ్మని వేడుకున్నాడు ఇంద్రుడు. ఆ తరువాత ఇంద్రుడి వద్ద సెలవు తీసుకున్నాడు
శ్రీకృష్ణుడు.
సత్యాసమేతుడై
శ్రీకృష్ణుడు పారిజాతంతో నగర ప్రవేశం చేశాడు. యాదవకుల రాజులంతా సేనలతో ఎదురెల్లి
వారిని ఆహ్వానించారు. వారు నగరంలోకి ప్రవేశించగానే పారిజాతవృక్ష సువాసనలు
విస్తారంగా వ్యాపించాయి. శ్రీకృష్ణుడు స్వయంగా తన చేతులతో పారిజాతవృక్షాన్ని
స్వత్యభామ చేతికి అందించాడు. సత్యభామ ఆ దివ్య వృక్షాన్ని తన మందిర ఉద్యానవన
మధ్యప్రదేశంలో నాటి, దానికి ప్రతిదినం పూజలు చేస్తూ
వుండేది. పారిజాత వృక్షం మనస్సులో కోరుకున్న కోరికలన్నీ తీరుస్తున్నది.
ఇదిలావుండగా
ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చాడు. సత్యాకృష్ణులు చేసిన సత్కారాన్ని ఆనందంగా స్వీకరించాడు.
సత్యభామను, ఆమె అదృష్టాన్ని పొగిడాడు. ఆమెను ‘పుణ్యకవ్రతం’ చేయమని సలహా ఇచ్చాడు.
వ్రతం చేసే విధానం వివరించాడు. ఉదయమే నదికి వెళ్లి స్నానం చేయాలని, నవరత్నాభరణాలను ధరించాలని, సవతులందరినీ ఆ క్రితం రోజునే వ్రతానికి
ఆహ్వానించాలని, వ్రతదీక్షను ఒక నెలరోజులు ఆచరించాలని, ఒక బ్రాహ్మణోత్తముడిని ఆచార్యుడిగా
నియమించాలని, ఆయనకు విరివిగా దానాలని ఇవ్వాలని, వాటితో పాటు కల్పవృక్షంతో సహా భర్తను తగిన
విధంగా ధారాదత్తం చేసి, మళ్లీ భర్తను స్వీకరించాలని, ఇలా చేస్తే ఇతరులెవరికీ సాధ్యం కాని సుఖాలను
పొందవచ్చని నారదుడు చెప్పాడు. నారదుడి మాటలు విన్న సత్యభామకు ఆ వ్రతం చేయాలన్న
కోరిక కలిగింది. భర్త శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని వ్రతం ఆరంభించింది.
బంధువులు, స్నేహితులు, హితులు అంతా పుణ్యకవ్రతానికి వచ్చారు. విశ్వకర్మ రైవతక పర్వతం దగ్గర
ఒక దాన మంటపాన్ని నిర్మించాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ
సమయోచితంగా మంగళస్నానాలు చేసి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించి, వ్రతదీక్షను పూనారు. దానం స్వీకరించడానికి
నారద మహర్షిని ఎంచుకున్నారు. సత్యభామ నారద మహర్షికి యథోచితమైన పూజలు చేసింది. సత్యభామ
భర్త అనుమతి తీసుకొని నారదుడి ఆజ్ఞప్రకారం కల్పవృక్షంతో, బంగారు వస్త్రాలతో ఒక మాలతో శ్రీకృష్ణుడిని
చుట్టేసింది. భర్తను నారదుడికి దానంగా ఇచ్చింది. దానం స్వీకరించిన నారదుడు
కల్పవృక్షానికి కట్టేసిన శ్రీకృష్ణుడి చెంగును విప్పేశాడు. ఇక తనకిష్టమైన పనులను
చెయ్యమని ఆదేశించాడు. బ్రహ్మాది దేవతల పూజలను అందుకునే దేవాదిదేవుడు ఇప్పుడు
నారదుడి వశం అయ్యాడు. నారదుడి జన్మ ధన్యమైంది. శ్రీకృష్ణుడితో పరిహాసానికి పనులు
చేయించుకున్నాడు నారదుడు. తన వీణను మోయించాడు. అటూ-ఇటూ నడవమన్నాడు. శ్రీకృష్ణుడు ఆ
పనులన్నీ నవ్వుతూ, ఆదరిస్తూ చేశాడు.
ఆ
తరువాత పతిని స్వీకరించమని, ఇస్తానని నారదుడు సత్యభామతో అన్నాడు.
ఎంతో సంతోషించిన సత్యభామ నారద మహర్షికి తన ఆభరణాలన్నీ మూల్యంగా ఇచ్చింది. పారిజాత
కల్పవృక్ష పుష్పాలను బంగారు పళ్ళాలలో వుంచి రుక్మిణి మొదలైన పదహారువేలమంది సవతులకు
వాయనాలు ఇచ్చింది సత్యభామ. సగర్వంగా సత్యభామ తన వైభవాన్ని ప్రకటించింది. నారదుడు
శ్రీకృష్ణుడిని పరిపరి విధాల, చిత్ర విచిత్రంగా స్తుతించాడు. పుణ్యకవ్రతం
ముల్లోకాలు మెచ్చుకునే విధంగా పరిసమాప్తం అయింది. నారదుడు వెళ్లిపోయాడు.
శ్రీకృష్ణుడు కూడా తన వారితో కలిసి దానమంటపం వద్ద నుండి ద్వారకా పట్టణానికి
వెళ్లాడు.
తన
ఎనిమిదిమంది పట్టపు రాణులతోనూ, పదహారువేలమంది భార్యలతోనూ
శ్రీకృష్ణుడు ఆనందంగా గడిపాడు.
No comments:
Post a Comment