రామలక్ష్మణులను విశ్వామిత్రుడి వెంట పంపిన దశరథుడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-62
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-06-2021)
తనకిష్ఠం లేకున్నా, తన హితులు చెప్పినట్లు చేస్తే శ్రేయస్కరమని భావించాడు దశరథుడు. వశిష్ఠుడు చెప్పిందంతా
విన్న దశరథుడు,
సంతోషించి, మునివెంట పంపేందుకై, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని నిండు మనస్సుతో పిలిచాడు.
(రామలక్ష్మణులిద్దరిదీ అవినాభావ సంబంధం కాబట్టే, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని పిలిచాడు అని అనటం జరిగింది). తండ్రి పిలవగానే
కులోచితమైన ధర్మకార్యనిర్వహణకు తమను ఉపయోగించ బోతున్నాడు కదాననీ- సాధువర్తనులైన
ఋషులను రక్షించేందుకు,
వారికి కీడు కలిగించనున్న అధర్మవర్తనులను శిక్షించే సమయం
వచ్చింది కదా ననీ-అవతార ప్రయోజనం సమకూరడం ప్రారంభమయిందికదాననీ -మనస్సులో సంతోషం
ఉప్పొంగుతుండగా వచ్చిన కొడుకులకు తొలుత తల్లితండ్రులు మంగళా శాసనం కావించారు.
(తల్లితండ్రులు దీవించారనడం సమాసంకొరకు కాదు. శ్రేష్ఠత్వాన్ని బట్టి తల్లి ముందు
చెప్పబడింది. మహాకార్యార్థమై పంపేటప్పుడు తల్లితండ్రులు దీవించి పంపాలి. అయితే
తల్లి దీవనే ప్రధానం). తరువాత పురోహితుడు శుభమైన మాటలతో వారి హితం కోరి-వారికి
రాక్షసులవల్ల బాధలుకలుగకుండా మంత్రించారు. దశరథుడు శ్రీరామచంద్రుడిని తన దగ్గరకు
పిల్చి, శిరం వాసనచూచి,
మీద చేయి వేసి, మహా ప్రీతితో అంతరాత్మ
సంతోషిస్తుండగా,
బ్రహ్మ సమానుడైన విశ్వామిత్రుడికి రామలక్ష్మణులను
అప్పగించాడు.
’కౌసల్యా నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి అవతార ప్రయోజనానికి అంకురార్పణ
చేయబోతున్నాడు కాబట్టి,
దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు. (దశరథ నందనుడు
అనకుండా-కౌసల్యా నందనుడు అనడానికి కారణముంది. దశరథుడిలాగా కౌసల్య ఎదురు
మాట్లాడకుండా,
తన కొడుకుకు - చిన్ననాడైనప్పటికీ, ఘనకార్యం చేసే అవకాశం వచ్చిందికదానని సంతోషంతో అనుమతించింది కనుక అలా
సంబోధించి వుండవచ్చు). భవిష్యత్ లో ఈయనను ఆశ్రయించి, తన కుమారుడైన హనుమంతుడు ధన్యుడై తనకూ కీర్తికలిగించబోతున్నాడన్న సంతోషంతో
వాయుదేవుడు ఆయనకు (రాముడికి) మార్గంలో ఆయాసం కలగకుండా, తనకు చేతనైన విధంగా,
సువాసనలతో మెల్లమెల్లగా సుఖం కలిగేటట్లు వీచాడు. ఇక తమకు
రాక్షసులవల్ల భయం లేదనీ-జయమేనని, ధైర్యంతో, దేవతలు బహిరంగంగా దుందుభులు మోగించారు. భూజాతలు (వృక్షాలు - భూజాతంటే సీత)
తలంబ్రాలు పోయబోతున్నట్లుగా పూలవాన కురిపించాయి. సూర్యకిరణాలు వేడి సోకకుండా సన్న
తుంపర వాన కురిసింది. దేవతలు కనబర్చిన శుభశకునాలను చూసిన అయోధ్యాపురవాసులు, బ్రహ్మ కుమారుడు - కౌశికనందనుడైన విశ్వామిత్రుడివెంట శుభంగా శ్రీరామచంద్రుడు
వెళుతుంటే,
శంఖాలను - నగారాలను సంకులంగా మోగించారు.
ముందు తోవ చూపిస్తూ విశ్వామిత్రుడు
పోతుంటే,
తన వెనుక లక్ష్మణుడు నడుస్తుంటే, ఎడమచేతితో విల్లు ధరించి - సొమ్ములపై సొమ్ములు పెట్టుకున్న విధంగా ముద్దైన
జుట్టు కనిపిస్తుంటే - చూసేవారికి సంతోషం కలిగించే విధంగా భూషణాలు మెరుస్తుంటే -
తన ప్రకాశంతో దిక్కులన్నీ వెలుగుతుంటే - పురంలో వున్న స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు
మాట్లాడుకోకుండా ఏకాగ్రతతో తననే చూస్తుంటే - కొందరు స్త్రీలు పుష్పాంజలులు
చల్లుతుంటే - దిక్కులు పిక్కటిల్లేటట్లు వాద్యాలు మోగుతుంటే - మూడువందల ఏభైమంది
తల్లులు వారివారి మేడలమీద నిలబడి కిటికీలనుండి కనబడే వరకూ పరవశలై తొంగి,నిక్కి చూస్తుంటే,
శ్రీరామచంద్రమూర్తి వెళ్తున్నాడు. చేతుల్లో విల్లంబులు
ధరించి - తలకు ఇరువైపుల రెండు మూపులమీద రెండంబులపొదలు బిగించి - మూడుతలల పాములలాగా
కనిపిస్తూ - వేళ్ళకు దెబ్బలు తగులకుండా తిత్తులు తొడుక్కొని - తమదేహకాంతులు
పదిదిక్కులవరకూ వ్యాపిస్తుంటే - దేహం నిండా ఆభరణాలు ధరించి - సౌందర్యంలో
మన్మధుడిని మించి - నడి కట్టుల్లో ఖడ్గాలనుంచి - బ్రహ్మదేవుడి వెంటపోయే అశ్వినీ
దేవతలలాగా,
శివుడి వెనుక వెళ్ళే కుమారస్వామిలాగా, శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తోడుకొని పోయాడు.
No comments:
Post a Comment