మార్కండేయుడు చెప్పిన పతివ్రత మహాత్మ్యం,
కౌశికుడి, ధర్మవ్యాధుడి వృత్తాంతం
ఆస్వాదన-26
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (27-06-2021)
అరణ్యపర్వంలో
పలుసందర్భాలలో మార్కండేయ మహర్షి అనేక పుణ్యకథలను ధర్మరాజుకు చెప్పాడు. అందులో
భాగంగా ఒకనాడు ధర్మరాజు తనకు పతివ్రతల మహాత్మ్యాలను గురించిన కథలు చెప్పమని, ఆ
కథల్లోని పతివ్రతల నడవడిలోగల ధర్మసూక్ష్మాలను వివరించమని కోరాడు మార్కండేయుడిని. జవాబుగా
మార్కండేయుడు, భర్తకు శుశ్రూష చేసి ధన్యత్వం చెందిన పతివ్రత మహిమ, తల్లిదండ్రులకు పరిచర్య చేయడంలోని విశేషం, తక్కువ కులంలో పుట్టినవాడు ధర్మాత్ముడై
వెలుగొందే విధానం గురించి ధర్మరాజుకు సోదాహరణంగా వివరించాడు.
పూర్వం కౌశికుడు
అనే ఒక బ్రాహ్మణుడు ఒక పల్లెటూరిలో నివసిస్తుండేవాడు. అతడు ధర్మాత్ముడు. తపస్వి.
ఎప్పుడూ వేదాలను చదువుతుండేవాడు. ఒకరోజున అతడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాలు
చదువుతుంటే, చెట్టు కొమ్మమీద వాలిన కొంగ కింద వున్న కౌశికుడి
మీద రెట్ట వేసింది. కోపం వచ్చిన కౌశికుడు ఆగ్రహంతో ఆ పక్షిని చూడగానే అది ప్రాణాలు
కోల్పోయింది. అది చూసి అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తాను ఘోర పాపానికి ఒడిగట్టానని, తనకెలా శాంతి లభించగలదని కలత చెందాడు. ఇంతలో
మిట్ట మధ్యాహ్నం కావడంతో ఆ సమయానికి చేయాల్సిన సంధ్యావందనం కానిచ్చి, సమీప గ్రామంలోని ఒక బ్రాహ్మణ గృహానికి పోయి
‘భిక్షాం దేహి’ అన్నాడు. కౌశికుడికి బిక్ష వేయడానికి ఆ ఇంటి
ఇల్లాలు పాత్ర శుభ్రం చేయసాగింది.
ఇంతలో ఆ ఇల్లాలి
భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. భర్తను చూడగానే ఆమె ఎదురేగి కాళ్లు కడుక్కోవడానికి
నీళ్లిచ్చి, అతడికి తలంటు స్నానం చేయించి,
అనురాగంతో మంచి మాటలు చెప్పి, అన్నం వడ్డించింది. పానీయాలు
ఇచ్చింది. భర్తకు సంపూర్ణ సంతుష్టిని కలిగించింది. ఆ తరువాత అతడు శయనించే ముందర
సరైన పాన్పును ఏర్పాటు చేసి, తాంబూలం ఇచ్చి, కాళ్లు పిసికి, సమస్త సపర్యలు చేసింది. అప్పుడు వాకిలి ముందర నిలుచుని ‘భిక్షాం
దేహి’ అన్న బ్రాహ్మణుడు గుర్తుకొచ్చాడు. వెంటనే
పాత్రలో అన్నం నింపుకొని అతడికి వేయడానికి వెళ్లగానే ఆలస్యం అయినందుకు
కోపగించుకున్నాడు కౌశికుడు. తనను చాలాసేపు నిలబెట్టి అవమానం చేశావని అన్నాడు. తన
భర్త ఆకలితో వచ్చిన విషయం, అతడికి సపర్యలు ముగించుకుని వెంటనే
బిక్ష వేయడానికి వచ్చిన విషయం చెప్పి,
దాన్ని అపరాధంగా గ్రహించవద్దని, సహనంగా ఓర్చుకొమ్మని ప్రార్థించింది.
వెంటనే కౌశికుడు, ఆ ఇల్లాలికి భర్తే అంత గొప్పవాడా అనీ, బ్రాహ్మణులు తక్కువా అనీ, దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను భక్తితో
ఆరాధిస్తాడు కదా అనీ, ఆమె మాత్రం తనను చులకన చేసిందనీ, ఇది
చాలా ఆశ్చర్యకరమనీ ఆక్షేపించాడు. బ్రాహ్మణులను అవమానిస్తే దాని ఫలితం
అనుభవించాల్సి వస్తుందని కూడా అన్నాడు. బ్రాహ్మణుల మహిమలు తనకు తెలుసని అంటూ పలు
ఉదాహరణలు చెప్పిందా ఇల్లాలు. ఏదేమైనా తన దృష్టిలో తన పాలిటి గొప్ప దేవుడు తన భర్త
మాత్రమే అనీ, తాను త్రికరణశుద్ధిగా తన పతి శ్రేయస్సునే
కాంక్షిస్తానని, అంతకంటే గొప్ప ధర్మాలు తనకు కనిపించడం లేదని అన్నది ఇల్లాలు. అంతేకాకుండా
కౌశికుడి తీవ్ర కోపం గురించి, దాని వల్ల కొంగ చనిపోయిన విషయం
గురించి, ఆ విషయాలను తన పాతివ్రత్య మహిమవల్ల
తెలుసుకున్న సంగతి చెప్పి, కోపం మంచిది కాదని సలహా ఇచ్చింది.
ఇంకా ఇలా అన్నదా
ఇల్లాలు: “మానవుల హృదయాలలో కోపం, మోహం అనే భయంకర శత్రువులు నివసిస్తుంటారు, వారిని
అణచివేయకపోతే బ్రాహ్మణులకు నిజమైన గొప్పతనం రాదు. ఎవరు బ్రాహ్మణుడు? ఎవడికి బ్రాహ్మణ్య గౌరవం చెందుతుంది? సత్యాన్ని ఎల్లప్పుడూ పలికేవాడు, ఎవరినీ ఎప్పుడూ పీడించని వాడు, ఎప్పుడూ తల్లిదండ్రులకు, గురువులకు మేలు చేసేవాడు, సర్వభూతాల మీద దయకలవాడు, కోరికలను విస్మరించినవాడు, షట్కర్మలను ఆచరించే అనుష్టాన వేదాంతి మాత్రమే
నిజమైన బ్రాహ్మణుడు. అలాంటి మహానుభావుడినే అసలైన బ్రాహ్మణుడిగా దేవతలు కొలుస్తారు.
ఇంద్రియనిగ్రహం, వేదాధ్యయనం బ్రాహ్మణుడికి నిజమైన గొప్ప ధనం.
ధర్మపథానికి ఇలాంటి సద్గుణాలే సాధనాలు. ఇవే వేదాలు నిర్దేశించిన కర్తవ్యాలు”.
ఇలా చెప్పిన ఆ
ఇల్లాలు, కౌశికుడితో, అతడు వేదాలు వల్లెవేయడానికి
మాత్రమే నిష్ఠ చూపుతాడని, ధర్మసూక్ష్మత గుర్తించగల విచక్షణ లేదని అన్నది. అతడిని
మిథిలానగరానికి పోయి అక్కడున్న ‘ధర్మవ్యాధుడు’
అనే బోయవాడిని కలసి, ఆ జితేంద్రియుడి దగ్గర, ఆ ధర్మసూక్ష్మవేత్త దగ్గర సంశయాలను
తీర్చుకొని విచక్షణా జ్ఞానం పొందమని చెప్పింది. అజ్ఞానంలో వున్న తనలాంటి
ఆడువారిమీద కోపం తెచ్చుకోకుండా క్షమించమని కోరింది. ఆ ఇల్లాలు కేవలం ఒక ఆడుది
మాత్రమే కాదని, ఒక కర్మయోగి అని, ఆమె మూలాన తనకు జ్ఞానోదయం కలిగిందని, తన మనస్సుకు ప్రశాంతత కలిగిందని, ఆమె ఆదేశానుసారం మిథిలానగరానికి వెళ్లి
‘ధర్మవ్యాధుడు’ ని కలుస్తానని అన్నాడు. అలా చెప్పి ఆ గృహిణిని
వీడ్కొని వెళ్లాడు. ఆ పతివ్రత జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు.
కౌశికుడు మిథిలానగరానికి పోయి ధర్మవ్యాధుడు
వుండే చోటుకు చేరుకున్నాడు. ఆ సమయంలో ధర్మవ్యాధుడు మాంసాన్ని ముక్కలు చేసి
అమ్ముతున్నాడు. అంగడి జనాలతో కిక్కిరిసి వున్నది. ఆ సన్నివేశం చూడలేక బ్రాహ్మణుడైన
కౌశికుడు ఒక పక్క నిలుచున్నాడు. కౌశికుడు వచ్చిన సంగతి తన మనశ్శక్తి వల్ల
తెలుసుకున్న ధర్మవ్యాధుడు అతడిని పలకరించాడు. తన దగ్గరికి కౌశికుడిని పతివ్రత
పంపిన విషయాన్ని చెప్పగానే కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ధర్మవ్యాధుడి ఆహ్వానం మేరకు
కౌశికుడు అతడి వెంట ఆయన ఇంటికి వెళ్లాడు. ధర్మమార్గం తెలిసిన ధర్మవ్యాధుడు
జీవహింసను బ్రతుకు తెరువుగా చేసుకోవడం న్యాయమా అని ప్రశ్నించాడు కౌశికుడు.
జవాబుగా
ధర్మవ్యాధుడు, ఎవరి ధర్మాలు వారు ఆచరించాలని; బ్రాహ్మణుల ధర్మాలు తపస్సు, వేదాల అధ్యయనం, పరిశుభ్రంగా వుండడం,
ఇంద్రియనిగ్రహం, జ్ఞానసముపార్జన అనీ; క్షత్రియ ధర్మం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణతో కూడిన పాలన అనీ; వైశ్యుల ధర్మం, వ్యవసాయం, వ్యాపారం, పాడిపంటల అభివృద్ధి అనీ; శూద్రుల ధర్మం పరిచర్య అనీ అన్నాడు. తనకు
వంశక్రమంగా సంక్రమించిన ఆచారం మాంస విక్రయం అనీ అందువల్ల తాను తన స్వధర్మమైన మాంస
విక్రయాన్ని చేపట్టాననీ చెప్పాడు. అయితే తానెప్పుడూ జీవహింస చేయనని, ఇతరులు మృగాలను చంపి తెచ్చి ఇచ్చిన మాంసాన్ని
కొని కొద్ది లాభానికి అమ్ముకుంటానని అన్నాడు. ఆ వచ్చిన ధనంతో జీవిస్తానని
చెప్పాడు. అదే తన పరమార్థం అన్నాడు. తాను అణకువతో గురువులను, పెద్దలను,
అతిథులను, బ్రాహ్మణులను, దేవతలను పూజిస్తానని, సత్యవ్రతం పాటిస్తానని, పరిశుభ్రంగా వుంటానని, సత్యవ్రతాన్ని పాటిస్తానని, ఓర్పుతో వుంటానని, అసూయ చెందనని చెప్పాడు ధర్మవ్యాధుడు. అందువల్ల
తాను తక్కువ కులంలో పుట్టినా మంచి శీలం ఏర్పరుచుకున్నానని అన్నాడు.
ఆ తరువాత
కౌశికుడికి ధర్మవ్యాధుడు అనేక రకాలైన ధర్మ విశేషాలను వివరంగా చెప్పాడు.
ఇంద్రియసుఖాలమీద కోరికను వీడడం, వేదప్రామాణాన్ని అంగీకరించడం, కోపాన్ని జయించడం, కపట ధర్మాలను త్యజించడం,
శిష్టాచారాలను స్వీకరించి ఆచరించడం ధర్మలక్షణం అని చెప్పాడు. శిష్టాచారాల గురించి
చెప్పినప్పుడు తిక్కన ఈ పద్యం రాశారు.
సీ:
దానంబు, సత్యంబు, దపము, యజ్ఞము, నార్జవము, గామలోభాది వర్జనంబు
గురుజన శుశ్రూష, క్రోధరాహిత్యంబు, దమము సంతోష
మధ్యయననిరతి,
దాంబికత్వములేమి, దైన్యంబువొరయమి, యనసూయ యనహంక్రియాభియుక్తి,
తలపంగ నాద్యమై తనరు ధర్మమ యప్డు గొనియాట,
నాస్తికగోష్టి జనమి,
తే: శీలసంరక్ష, తీర్థసంసేవ శౌచ, మఖిలభూతంబులందు దయార్ద్రుడగుట
మితహితోక్తులు సంశ్రిత మిత్రగుప్తి
ఇన్నియును శిష్టచరితంబు లిద్ధ చరిత!
(ఈ
సందర్భంగా డాక్టర్ నండూరి రామకృష్ణాచార్యులు గారు విశ్లేషిస్తూ, ఈ పద్యంలో ఇంచుమించుగా సనాతన భారతీయ సంస్కృతి
అంతా వివరించబడి ఉన్నదన్నారు).
ఆ
తరువాత ధర్మవ్యాధుడు కౌశికుడికి అహింసా స్వరూపాన్ని తెలియచేశాడు. అందులో భాగంగా
శిబి చక్రవర్తి కథ, రంతిదేవుడి వృత్తాంతం వివరించాడు. ఈ
లోకంలో హింస చేయనివాడు ఒక్కడైనా వుండడని చెప్పాడు. అయినప్పటికీ వీలైనంతవరకు హింస
చేయకుండా జీవయాత్ర సాగించాలన్నాడు. కులవృత్తిని వీడకూదదన్న విషయాన్నీ చెప్పాడు. తదనంతరం
ధర్మవ్యాధుడు కౌశికుడికి జీవ లక్షణాల గురించి వివరించాడు. బ్రహ్మ విద్యా ప్రపంచం
గురించీ తెలియచేశాడు. సత్త్వ రజస్తమో గుణాల గురించి చెప్పాడు. వేదాంతజ్ఞానం మహిమ
ఆచరణలో ఎలా వెలువడుతుందో తెలియచెప్పాడు.
ఇవన్నీ
చెప్పిన ధర్మవ్యాధుడు కౌశికుడిని తన జననీ జనకులకు పరిచయం చేశాడు. తన
తల్లిదండ్రులకు పరిచర్య చేయడం వల్లే తనకీ పరిజ్ఞానం లభించింది అని చెప్పాడు. తనకు
ప్రత్యక్ష దేవతలు తన తల్లిదండ్రులే అని అన్నాడు. వారికి ఎల్లప్పుడూ సేవచేస్తానని
చెప్పాడు. పుణ్యంకోరే గృహమేధి, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని అర్చించి
సంతోషపర్చాలి అని అన్నాడు. కౌశికుడు వెంటనే గుడ్డివారైన అయన తల్లి, తండ్రుల వద్దకు వెళ్లి వారికి శుశ్రూష చేసి
వారి శోకాగ్ని ఆర్పాలని సలహా ఇచ్చాడు ధర్మవ్యాధుడు. ధర్మవ్యాధుడు చెప్పిన విధంగా
నడుచుకుంటానని, తన తల్లిదండ్రులకు సపర్యలు చేసి తన జన్మ ధన్యం చేసుకుంటానని
అన్నాడు కౌశికుడు.
కౌశికుడి
కోరిక ప్రకారం ధర్మవ్యాధుడు తన పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు అతడికి. గత
జన్మలో తాను చేసిన పొరపాటుకు బ్రాహ్మణ ముని శాపానికి గురై ఈ జన్మలో శూద్రుడిగా
జన్మించానని చెప్పాడు. అయినా తనకు పూర్వ జన్మ పరిజ్ఞానం వున్నదని, తల్లితండ్రుల సేవ చేయడం వల్ల మరు జన్మలో
బ్రాహ్మణుడిగా పుట్టుతానని అన్నాడు. చెడు ప్రవర్తన కలవాడు బ్రాహ్మణ కులంలో
పుట్టినప్పటికీ శూద్రుడికంటే అధముడే అనీ,
సత్యాన్ని పలికే ధర్మాత్ముడు శూద్రకులంలో పుట్టినప్పటికీ అతడు సద్బ్రాహ్మణుడే అని
అన్నాడు కౌశికుడు. ఆ తరువాత కౌశికుడు ధర్మవ్యాధుడికి ప్రదక్షిణ నమస్కారం చేసి అతడి
వీడ్కోలు తీసుకుని తన స్వస్థానానికి వెళ్లాడు. తన తల్లిదండ్రులకు శుశ్రూష చేసి
తరించాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అరణ్యపర్వం, పంచమాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment