Saturday, July 3, 2021

అగ్నిహోత్రుడి వృత్తాంతం, కుమారస్వామి అవతారం-పరాక్రమ ప్రాభవాలు ...... ఆస్వాదన-27 : వనం జ్వాలా నరసింహారావు

అగ్నిహోత్రుడి వృత్తాంతం, కుమారస్వామి అవతారం-పరాక్రమ ప్రాభవాలు

 ఆస్వాదన-27

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధమ్ (04-07-2021)

ఒక పర్యాయం అగ్నిదేవుడికి దేవతల మీద కోపం వచ్చింది. హోమద్రవ్యాలు మోయడానికి ఇష్టపడక అడవికి పోయి కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. క్రమేపీ అతడి శరీరం తపస్సు వల్ల చిక్కిపోయింది. దానికి చింతించిన అగ్నిదేవుడు స్వస్థానానికి తిరిగిపోవాలనుకున్నాడు. ఎక్కువ కాలం అడవిలో వుంటే తన స్థానంలో బ్రహ్మదేవుడు మరెవ్వరినైనా తన కర్తవ్యం నిర్వహించడానికి నియమించే అవకాశాలున్నాయని కూడా భయపడ్డాడు. అలా అనుకుని తపస్సు విరమించి స్వస్థానానికి చేరాడు. కాని, అంతకుముందే, బ్రహ్మదేవుడు అగ్నిదేవుడి పదవిలో అంగిరసుడు అనే మునీశ్వరుడిని నియోగించాడు. ఇది గమనించిన అగ్నిదేవుడు వెనక్కు వెళ్లిపోసాగాడు. అప్పుడు అంగిరసుడు అగ్నుదేవుడిని గుర్తించి అతడి దగ్గరికి వెళ్లాడు. వెళ్లి, ఆయన పదవిని ఆయన్నే తీసుకొమ్మని కోరాడు.

అగ్నిహోత్రుడు మొదలు ఒప్పుకోలేదు. అంగిరసుడినే కొనసాగామన్నాడు. చివరకు ప్రథమాగ్నిహోత్ర పదవిని అగ్నిహోత్రుడు చేపట్టి, ఆయన అనుగు పుత్రుడిగా అంగిరసుడు వుండడానికి అంగీకారం కుదిరింది. అలా అంగిరసుడు, అగ్నిహోత్రుడికి మొదటి కొడుకయ్యాడు. అంగిరసుడికి శివ అనే భార్యవల్ల ఏడుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు కలిగారు. అంగిరసుడి కొడుకుల్లో బృహస్పతికి శంయుడు, అతడికి భరద్వాజుడు, భరతుడు అనే ఇద్దరు కొడుకులు జన్మించారు. భరతుడుకి ఇద్దరు సంతానం, భరద్వాజుడికి వీరుడు అనే ఒక కొడుకు కలిగారు. వీరుడికి తేజస్వి, అతడికి భానుడు, అతడికి నిశ్చయవనుడు, అతడికి నిష్కృతి అనేవారు పుట్టారు. నిష్కృతికి రుజస్కరుడు, అతడికి క్రోధుడు, అతడికి రసుడు, అతడికి కాముడు, అతడికి అమోఘడు, అతడికి ఉక్థుండు పుట్టారు.

ఇదిలా వుండగా కాశ్యపుడు, వాసిష్టుడు, ప్రానుడు, ఆంగిరసుడు, చ్యవనుడు అనే ఐదుగురు ఋషులు తేజస్వి అయిన కొడుకును పొందడానికి కఠోరమైన తపస్సు చేశారు. వారికి జగాలన్నీ ఆశ్చర్పపడే విధంగా ఒక కొడుకు జన్మించాడు. అలా పుట్టిన అగ్నిదేవుడిని అయిదుగురు తండ్రులకు పుట్టినవాడు అయినందున ‘పాంచజన్యుడు అని పిలిచారు. అతడు 10 వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి శిరస్సు నుండి బృహద్రథంతరులు, మొగం నుండి విష్ణువు, నాభి నుండి శివుడు, వీర్యం నుండి ఇంద్రుడు, ప్రాణాల నుండి వాయువు, అగ్ని, చేతుల నుండి, దంతాల నుండి సమస్త భూతాలూ ఆవిర్భవించారు. తపుడు అనే పేరుకల ఆ అగ్నిహోత్రుడు పదిహేను మంది మోసపూరితులైన కొడుకులను కన్నాడు.

తపుడికి పుట్టిన పదిహేనుమంది కొడుకులు మూడు వర్గాలుగా చీలిపోయారు. వీరంతా యజ్ఞయాగాదులు చేసేవారిని బాధించి వారి నుండి యజ్ఞఫలాలను దొంగిలిస్తుంటే వారిని అదుపులో వుంచడానికి అగ్నికి సంస్కారం చేయాల్సిన అవసరం వచ్చింది. తపుడు ఈ పదిహేనుమంది మోసగాళ్లను మాత్రమే కాకుండా యజ్ఞభాగభోక్తలైన ఐదుగురు కొడుకులను కన్నాడు. వారిలో మొదటివాడు ‘వైశ్వానరుడు. బ్రాహ్మణుల చేత పూజించబడే వాడు. రెండవవాడు ‘విశ్వపతి. సార్థక నామధేయుడు. అతడు సమస్త సృష్టికి ప్రభువు. మూడోవాడు ‘విశ్వకుడు. అతడు విశ్వానికి అంతర్యామి. నాల్గవవాడు ‘విశ్వభుక్కు. అతడు భూతాల తినుబండారాలను పక్వం చేసేవాడు. ఐదోవాడి పేరు ‘గోపతి. అతడు సర్వ ధర్మ క్రియలకు హేతుభూతుడు. ఇలా పెక్కుమంది వహ్నులు ధర్మక్రియలకు హేతు భూతులయ్యారు.

ఇదిలా వుండగా ఆపుడు అనే వహ్నికి, అతిలోక సౌందర్యవతైన ముదితకు అచ్చెరువు గొలిపే పేరుకల అగ్ని ముద్దు బిడ్డ అయ్యాడు. ముల్లోకాల వ్యవహారాలను దీక్షగా అగ్ని నిర్వహిస్తున్నాడు. ఇంద్రాది దేవతలకు యజ్ఞాలలో సమర్పించే హోమద్రవ్యాలను మోసి వారికి సమర్పించి సంతృప్తి పరుస్తున్నాడు. కొన్నాళ్లకు అలసిపోయిన అగ్ని, అధర్వుడు అనేవాడిని పిలచి, హోమద్రవ్యాలను మోసుకుపోయే పనికి అతడిని నియమించాడు. ఆ తరువాత అగ్నిదేవుడు సముద్రంలో దాగాడు. సముద్రంలో వున్న చేపలు అగ్నిదేవుడి ఉనికిని దేవతలకు చెప్పాయి. చేపల మీద ఆగ్రహించిన అగ్ని వాటిని శపిస్తూ, ప్రజలు నిర్దయగా వాటిని చంపుతారని అన్నాడు. మళ్లీ హోమద్రవ్యాలను మోసే పనికి రమ్మని దేవతలు కోరినా ఒప్పుకోక అగ్ని తన దేహాన్ని త్యజించి, భూమిలోకి ప్రవేశించాడు. ఆయన వదిలిన కళేబరం నుండి అనేక పదార్థాలు ఆవిర్భవించాయి.

అప్పుడు మునిగణాలు అగ్నిని వదిలి తమ విద్యుక్త ధర్మాలను నిర్వహించడానికి అధర్వుడిని అర్చించడం మొదలుపెట్టారు. ఇది సహించని అగ్నిహోత్రుడు సముద్రం నుండి బయటకొచ్చాడు. యధాప్రకారం హోమద్రవ్యాలను వహించడానికి సమ్మతించాడు.

ఇదిలా వుండగా పూర్వకాలంలో ఒకసారి రాక్షసులతో యుద్ధం చేసి ఇంద్రుడు ఓటమి పాలయ్యాడు. ఒకనాడు, ఏం చేయాల్నా అని ఇంద్రుడు ఏకాంతంగా ఆలోచిస్తున్న సమయంలో, కేశి అనే రాక్షసుడు ఒక కన్యను చెరబట్టి ఆకాశంలో పరుగెత్తడం చూశాడు. ఆ కన్యను వదిలిపెట్టమని బెదిరించాడు ఇంద్రుడు కేశిని. రాక్షసుడు తిరగబడ్డాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించడంతో భయపడ్డ రాక్షసుడు కన్యను వదిలి పారిపోయాడు. ఆ కన్య ఎవరని ప్రశ్నించాడు ఇంద్రుడు. తన పేరు దేవసేన అని, అరిష్టనేమి అనే ప్రజాపతి కూతురినని, తన అక్క పేరు దైత్యసేన అని, కేశి అనే రాక్షసుడు తన అక్కను వశపరచుకుని తనను కూడా లొంగదీసుకోవడానికి ఈ అఘాయిత్యం చేశాడని చెప్పింది. దేవసేన తనకు వరుసకు చెల్లెలవుతుందని, అందుకే ఏదైనా వరాన్ని కోరుకొమ్మని చెప్పాడు ఇంద్రుడు. మహాపరాక్రమశాలి, ఇంద్రుడికి మిత్రుడు అయినవాడు, తనకు భర్త కావాలని వరం కోరుకుంది దేవసేన.

ఇంద్రుడు ఆమెను వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లాడు. ఆమెకు యోగ్యుడైన భర్తను ప్రసాదించమని అడిగాడు బ్రహ్మను. దేవసేనకు భవిష్యత్తులో గొప్పవీరుడు భర్త అవుతాడని, అతడు ముల్లోకాలను కాపాడగల సామర్థ్యం కలవాడని, దేవసైన్యాలకు అతడు సేనాపతి కాగలడని బ్రహ్మ చెప్పాడు. సంతృప్తి చెందిన ఇంద్రుడు ఆమెను తనతోపాటు తీసుకుని వెళ్ళిపోయాడు. తనదగ్గరే వుంచుకున్నాడు.

ఇదిలా వుండగా సప్తర్షులు అమావాస్యా హోమం చేయడానికి ఉద్యమించారు. ఆ సమయంలో భర్తలకు శుశ్రూస చేస్తున్న సప్తర్షుల భార్యల సౌందర్యాన్ని చూసి అగ్నిహోత్రుడు చలించాడు. ఆ మునుల భార్యలు తన దరికి చేరాలని అగ్ని పరితపించసాగాడు. మన్మథ వికారానికి లోనైనాడు. హోమం అయిపోయిన తరువాత చింతాక్రాంతుడై వున్న అగ్ని దేహాన్ని త్యజించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన భార్య స్వాహాదేవి తన భర్తకు ప్రీతి కలిగించడానికి, అరుంధతి రూపాన్ని తప్ప, ఇతర మునుల భార్యల రూపంలో అగ్నిహోత్రుడి దగ్గరికెళ్లి అతడిని శృంగారభాగాలలో తేల్చి సంతుష్టి పరిచింది. అలా చేసిన ప్రతిపర్యాయం గరుడపక్షి రూపంలో ఆకాశానికి ఎగిరి, శ్వేత పర్వతాన్ని చేరి, అక్కడ ఒక చోట రెల్లుగడ్డి కాడలతో చుట్టుకొనబడివున్న ఒక బంగారు కుండలో తన భర్త వీర్యాన్ని కూర్చి పెట్టి వచ్చేది.

ఈ విధంగా ఆరుసార్లు స్రవింప చేయడం ద్వారా సేకరించబడిన అగ్నిహోత్రుడి వీర్యం నుండి సూర్యసమానుడైన కుమారస్వామి జన్మించి, దినదినాభివృద్ధి చెందాడు. ఐదో రోజు వయసుకల్లా మహావీరుడయ్యాడు. జన్మతః సంక్రమించిన ‘శక్తి’ అనే తన ఆయుధాన్ని ధరించి క్రౌంచ పర్వతాన్ని బద్దలుకొట్టాడు. ఆయన చేస్తున్న అలజడికి అనేక ఉపద్రవాలు కలిగాయి. కులపర్వతాలు కదిలాయి. ఈ ఉపద్రవాలకు కారణం సప్తర్షుల భార్యలకు, అగ్నిదేవుడికి జన్మించిన బాలకుడని వదంతులు పుట్టాయి. ఈ నిందలు వినలేక, వసిష్ఠుడు తప్ప మిగిలిన ఋషులు తమ భార్యలను వదిలేశారు. అప్పుడు అగ్నిదేవుడి భార్య మునులదగ్గరికి వెళ్లి వాస్తవం చెప్పింది. అయినా ఆ ఋషులు సమ్మతించలేదు. ఇంతలో సప్తమాతృకలకోపం నందు ఉద్భవించిన లోహితాస్య అనే స్త్రీ కుమారస్వామికి మాతృస్థానీయ దాది అయి గారాబంగా అతడికి పెంచసాగింది.

అతడి పెరుగుదలకు భయపడ్డ దేవేంద్రుడు కుమారస్వామి మీదకు యుద్ధానికి వచ్చి తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది విఫలం కావడంతో ఇంద్రుడు కుమారస్వామి శరణు కోరాడు. ఇంతలో కుమారస్వామికి ఆరవ దినం వయస్సు వచ్చింది. ఋషులంతా అతడిని ఇంద్రపదవి తీసుకోమన్నారు. ఇంద్రుడు కూడా ఋషుల అభ్యర్థనకు మద్దతిచ్చాడు. అయితే, కుమారస్వామి దానికి అంగీకరించక, అనుభవజ్ఞుడైన ఇంద్రుడు, పాలనలో సామర్థ్యం వున్న ఇంద్రుడు ఆ పదవిలో కొనసాగాలని, తాను అతడికి అండగా నిలిచి తన పరాక్రమం ప్రదర్శించి, ఆయన పనులను నిర్వహిస్తానని చెప్పాడు. వెంటనే ఇంద్రుడు కుమారస్వామిని దేవతా సైన్యానికి నాయకుడిగా, సర్వసేనాపతిగా నియమించాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి సర్వసేనాపతిగా తనకు పట్టం కట్టమని చెప్పాడు.

తక్షణమే ఇంద్రుడు మహర్షులతో కూడి కుమారస్వామిని సర్వసైన్యాధిపతిగా నియమించి అభిషేకించాడు. అప్పుడు ఈశ్వరుడు పార్వతీసమేతుడై తన కుమారుడిని చూడడానికి అక్కడికి వచ్చాడు. (కుమారస్వామి శివుడి కుమారుడనడానికి కారణం: పూర్వం శివుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రుడిలో నిక్షిప్తం చేశాడు. ఆ శివశుక్లం వల్ల అగ్నిహోత్రుడు కుమారస్వామిని కన్నాడు. అదీ కాకుండా అగ్నిని రుద్రుడని కూడా అంటారు. అందువల్ల కుమారస్వామి అగ్నిహోత్రుడికి, శివుడికి కొడుకని చెప్పవచ్చు. కుమారస్వామికి కార్తికేయుడన్న పేరు కూడా వున్నది). అదే సమయంలో ఇంద్రుడు తాను కాపాడుతున్న దేవసేన అన్న కన్యను అక్కడికి తెమ్మన్నాడు. ఆ సుందరిని బ్రహ్మ ప్రత్యేకంగా కుమారస్వామి కొరకే సృష్టించాడని చెప్పిన ఇంద్రుడు, ఆమెను వివాహమాడమని కోరాడు కుమారస్వామిని. ఆయన కోరిక మేరకు కుమారస్వామి దేవసేనని పాణిగ్రహణం చేసుకున్నాడు.

కుమారస్వామి-దేవసేనల వివాహం జరిగిన రోజైన షష్టి, అంతక్రితం రోజైన పంచమి పూజనీయమైన రోజులయ్యాయి. ఇంతలో నిందల పాలైన మునుల భార్యలు అక్కడికి వచ్చి తమను కాపాడామని కుమారస్వామిని ప్రార్థించారు. తనకు మాతృసమానులైన మునులభార్యలైన కృత్తికలకు గౌరవ స్థానం ఇవ్వమని ఇంద్రుడికి చెప్పాడు కుమారస్వామి. అప్పుడు ఇంద్రుడు కృత్తికలకు గగనంలో రోహిణి పొరుపున నిల్పాడు. అప్పటి నుండి కృత్తికలు ఆర్గురు నక్షత్ర కూటమిగా ఏర్పడి ఆకాశంలో వెలుగొందారు.

(ఈ సందర్భంగా డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు విశ్లేషిస్తూ ఇలా రాశారు: కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. మహాభారతంలో ద్రోణుడు కూడా ‘కలశజుడు’. అనేకమైన శాస్త్ర సాంకేతిక శక్తి యుక్తులతో మాతృగర్భంలో కాకుండా శోధనాళికలో అపాకృత సంతానం ఉద్భావింప చేయడానికి ఆధునిక శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు. దాన్నే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నాం)

ఈశ్వరుడు పార్వతీసమేతుడై వచ్చిన సందర్భంలోనే బ్రహ్మదేవుడు కూడా వచ్చి కుమారస్వామిని అభినందించాడు. శివుడు కుమారస్వామికి ఏవిధంగా తండ్రి అవుతాడో బ్రహ్మ దేవుడు వివరించాడు. బ్రహ్మదేవుడి మాటలకు కుమారస్వామి అమితంగా ఆనందించి మాతాపితలైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి వారిని పూజించాడు. పార్వతీసమేతుడైన ఈశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామిని కౌగలించుకుని వాత్సల్యంతో లాలించి, అతడిని వెంటబెట్టుకుని, ‘భద్రవటం’ అనే పేరుకల పుణ్యక్షేత్రానికి చేరాడు.

కొంతకాలానికి దేవతలమీదకు రాక్షసుల సైన్యం దండెత్తి వచ్చింది. రాక్షసనాయకుడు మహిషాసురుడు విజృంభించి పోరాడాడు. వాడిని చంపమని శివుడు కుమారస్వామికి చెప్పాడు. కుమారస్వామి శక్తి అనే తన ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహిషాసురుడిని సంహరించింది. ఇలా కుమారస్వామి దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించి ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కాడు. ఈ కథను విన్నవారెవరైనా, చదివినవారెవరైనా శుభాలను పొందుతారని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

1 comment: