Saturday, July 17, 2021

ప్రాయోపవేశం చేయాలన్న దుర్యోధనుడి ఆలోచన, వైష్ణవ యాగ నిర్వహణ ..... ఆస్వాదన-29 వనం జ్వాలా నరసింహారావు

 ప్రాయోపవేశం చేయాలన్న దుర్యోధనుడి ఆలోచన, వైష్ణవ యాగ నిర్వహణ

ఆస్వాదన-29

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-07-2021)

ఘోషయాత్ర నెపంతో పాండవులను ఎగతాళి చేద్దామని పోయిన దుర్యోధనుడు గంధర్వులతో ఓడిపోవడం ఒక పరాభవం. తానెప్పుడూ అపకారం తలపెట్టే పాండవుల దయవల్ల గంధర్వుల నుండి బంధమోక్షణం పొందడం ద్వితీయ పరాభవం. తనకు జరిగిన పరాభవాన్ని ఎలా దిగమింగాలని, ఎలా మళ్లీ  రాజధానికి పోవాలని పరితపించ సాగాడు. అవమాన భారంతో వున్న దుర్యోధనుడు తన సేనలతో కొంతదూరం ప్రయాణం చేసి, ఒక స్థలంలో కుటీరాలు నిర్మించుకుని విడిది చేశాడు. ఒక గదిలో ఏకాంతంగా మంచమీద పవళించి పరితపించసాగాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు.

కర్ణుడికి ఇంకా దుర్యోధనుడి ఓటమి సంగతి, గంధర్వులు ఆయన్ను బంధించిన సంగతి, ధర్మరాజు బంధవిముక్తిడిని చేసిన సంగతి సరిగా తెలిసినట్లు లేదు. గంధర్వులతో దుర్యోధనుడు పోరాడిన విధానాన్ని, గంధర్వులను నిర్మూలించి గెలుపొందిన విధానాన్ని పేర్కొని దుర్యోధనుడిని పొగడసాగాడు. తాను గొప్పగా పోరాడిన విషయాన్ని కూడా వివరించాడు. తాను యుద్ధభూమి నుండి తొలగి పోయిన విషయాన్ని చెప్పి, దుర్యోధనుడు ప్రదర్శించిన బలపరాక్రమాలను కొనియాడాడు. అప్పుడు అనుకున్నాడు దుర్యోధనుడు తన మనస్సులో, ‘ఈ కర్ణుడికి తనకు జరిగిన పరాభవం తెలిసినట్లు లేదు అని. అప్పుడు వాస్తవంగా జరిగిన సంగతి యావత్తూ వివరించాడు.

తాను గంధర్వులను ఎదిరించి పోరాడిన సంగతి, తనకూ గంధర్వ రాజు చిత్రసేనుడికి ద్వంద్వయుద్ధం జరిగిన సంగతి, తాను ఓటమిపాలైన సంగతి, అతడు తనను బంధుమిత్రులతో సహా బంధించి ఆకాశానికి ఎగిరిన సంగతి, తన సేనలు ధర్మరాజు శరణు కోరిన సంగతి, ధర్మరాజు తన తమ్ములను గంధర్వులమీదికి యుద్ధానికి పంపిన సంగతి, వారు మొదలు సామవాక్యాలతో తనను బంధవిముక్తిడిని చేయమని గంధర్వులను ప్రార్థించిన సంగతి, వారు సమ్మతించకపోవడం సంగతి, అప్పుడు భీమార్జున నకుల సహదేవులు గంధర్వులమీద యుద్ధం చేసి గెల్చిన సంగతి, అర్జునుడి దగ్గరికి వచ్చిన చిత్రసేనుడు తన చెడు పన్నాగాన్ని గురించి చెప్పిన సంగతి, అంతా ధర్మరాజు దగ్గరికి పోయిన సంగతి, ధర్మరాజు తనను విడిపించిన సంగతి వివరంగా చెప్పాడు దుర్యోధనుడు కర్ణుడికి.

ఇదంతా చెప్పి, ఇంత పరాభవం పొందిన తాను ఇక భూమిని ఎలా పరిపాలిస్తానని, ఎలా తలెత్తి తిరగ్గలనని అన్నాడు దుర్యోధనుడు. గంధర్వులతో యుద్ధంలో వీరమరణం పొందినా బాగుండేది కదా అని వాపోయాడు. ఇంత జరిగాక ఇక జీవించడం వృధా అని, తాను నిరశన వ్రతం పూని, ప్రాయోపవేశ దీక్షచేపట్టి మరణిస్తానని అన్నాడు. ఇక ముందు దుశ్శాసనుడిని నాయకుడిగా భావించి హస్తినాపురానికి పొమ్మన్నాడు. ఇదంతా తన స్వయంకృతాపరాధం అని, పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తానికి పూనుకొన్నానని, కర్మవిపరిపాకం తాను అనుభవించక తప్పదని అన్నాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడిని చూసి, అతడిని రాజువు కమ్మని చెప్పాడు. అప్పుడు ఆ మాటలు భరించలేని దుశ్శాసనుడు అన్న కాళ్లమీద పడి ఏడుస్తూ, దుర్యోధనుడే తమ అధిపతి అనీ, ఆయన నిరశన వ్రతం విరమించమనీ వేడుకున్నాడు.

అప్పుడు కర్ణుడు దుర్యోధనుడిని ఓదారుస్తూ, పాండవులు దుర్యోధనుడి రాజ్యంలో పౌరులనీ, రాజుకు ఆపద వచ్చినప్పుడు కాపాడాల్సిన బాధ్యత వారికి వుందనీ, పాండవులు ఆయన సేవకులనీ, దుర్యోధనుడు పాండవులకు ఏలికైన సార్వభౌముడనీ, కాబట్టి వారు తమ ప్రభువు ఋణం తీర్చుకున్నారనీ, కాబట్టి ప్రాయోపవేశ దీక్షను విరమించుకోవాలనీ హితబోధ చేశాడు. కాని దుర్యోధనుడు తన పట్టుదల వదలక నిరసనవ్రత దీక్షను పూనడానికి స్థిరసంకల్పం కలవాడయ్యాడు. పాండవులు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యమని, వారిని సత్కరించమని, వారితో స్నేహం చేయమని, అంతేకాని ఇలా దుఃఖపడడం సరైనది కాదని అన్నాడు శకుని. దుర్యోధనుడు శకుని మాటలు కూడా వినలేదు.

నిరాహార దీక్షను పూనిన దుర్యోధనుడు సమాది స్థితిలోకి పోయాడు. ఆ సమయంలో దేవేంద్రుడి చేతిలో ఓడిపోయిన రాక్షసనాయకులు దుర్యోధనుడి నిరాహార దీక్షను విరమింపచేయాలని సంకల్పించుకున్నారు. వెంటనే వారు పాతాళ హోమాన్ని చేయగా అభిచారహోమకుండం నుండి ఒక కృత్య భయంకర రూపంతో ఆవిర్భవించింది. ఆమరణ దీక్షలో వున్న దుర్యోధనుడిని పాతాళ లోకానికి తెమ్మని కృత్యను ఆదేశించారు రాక్షసనాయకులు. కృత్య వెంటనే భూలోకానికి పోయి దుర్యోధనుడిని పాతాళ లోకానికి తెచ్చింది. దుర్యోధనుడు లాంటి మహావీరుడు ఆత్మహత్యకు పూనుకోవడం సమంజసం కాదని, ఆ దురాలోచనను వదిలిపెట్టమని, ధైర్యంతో విజృంభించి శత్రువులను నాశనం చేయమని వారు దుర్యోధనుడికి చెప్పి, ఆయన సాధారణ మనుష్యుడు కాదని ఆయన పూర్వజన్మ వృత్తాంతం వివరించారు.

‘పూర్వం రాక్షసుల తపస్సుకు మెచ్చి దుర్యోధనుడిని సృష్టించి వారికి అధినేతగా ప్రసాదించాడు పరమేశ్వరుడు. అమానుషమైన అతడి శరీరాన్ని పరమశివుడు పార్వతీదేవి సహితంగా ప్రత్యేక లక్షణాలతో నిర్మించాడు. అస్త్రశస్త్రాలు అతడి శరీరాన్ని ఖండించలేవు. మానవ, దేవతాస్త్రీలకు ఉల్లాసం కలిగించే శరీరం ఆయనది. కారణ జన్ముడై భూలోకంలో అవతరించడం వల్ల ఆయనకు సహాయం చేయడానికి రాక్షసులు క్షత్రియ వంశాలలో జన్మించారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు దేవతల మహిమలను పంచుకుని జన్మించిన వారైనప్పటికీ, వారిమీద రాక్షస ప్రభావం పడడం వల్ల పాండవులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. వారి సేనలను నాశనం చేస్తారు. పాండవులు యుద్ధం చేసి మరణిస్తారు. నరకాసురుడి అంశ కర్ణుడిలో ప్రవేశించి, కృష్ణార్జులను దహించి వేస్తుంది. సంశపంక్తుల చేతిలో అర్జునుడు ఓడిపోతాడు. దుర్యోధనుడికి విజయం సిద్ధిస్తుంది. ఈ భూమండలం సమస్తం దుర్యోధనుడి చేతిలోకి వస్తుంది’.

ఇలా చెప్పి, దుర్యోధనుడిని సన్మానించి, ఆమరణ దీక్ష ఆలోచన మానుకొమ్మని సలాహా ఇచ్చి, అతడికి వీడ్కోలు పలికారు రాక్షస నాయకులు. కృత్య దుర్యోధనుడిని భూలోకంలో వదిలింది. దుర్యోధనుడు మనసులో ఆశ్చర్యపడ్డాడు. యుద్ధంలో పాండవులను సంహరించగలనని ఉవ్విళ్ళూరాడు. ఆనాడు జరిగిన వృత్తాంతాన్ని ఎవరికీ చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు దుర్యోధనుడు. మర్నాడు యథాప్రకారం కర్ణుడు వచ్చాడు ఆయన దగ్గరికి. ఆర్జునుడిని చంపుతానని దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు. శపథం చేశాడు.

వీటన్నిటి నేపధ్యంలో దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని మానడానికి కృత నిశ్చయుడై, మంత్రులను పిలిచి హస్తినాపురానికి పోవడానికి ప్రయాణ సన్నాహాలు చేయమన్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని ప్రయాణం ప్రారంభించాడు. శకునితో, కర్ణుడితో, దుశ్శాసనుడితో , ఇతర తమ్ములతో, మంత్రులతో కలిసి హస్తినాపురం చేరాడు. చేసిన పనికి భీష్ముడు దుర్యోధనుడిని మందలించాడు. ఇకముందైనా పాండవులతో నెయ్యం నెరపి సుఖంగా బ్రతకమని హితబోధ చేశాడు. భీష్ముడి మాటలను దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదు.

మర్నాడు దుర్యోధనుడు తన సన్నిహితులతో మాట్లాడుతూ తనకు రాజసూయ యాగం చేయాలని కోరికగా వున్నట్లు వెల్లడించాడు. తనతో ఆ మహాయాగాన్ని చేయించి పుణ్యం కట్టుకోమని కర్ణుడిని ప్రార్థించాడు. అతడికి ఆ యాగం మీద అంత మక్కువ వుంటే వెంటనే ప్రారంభించమని కర్ణుడు అన్నాడు. అయితే పురోహితులు పండితులతో సంప్రదించి వేరేవిధంగా సలాహ ఇచ్చారు. శత్రురాజులను అందరినీ నిశ్శేషంగా జయించిన పిమ్మటే రాజసూయ యాగం చేయడం ధర్మసమ్మతమని, పాండవులను యుద్ధంలో జయించాలని, అప్పుడే ఆ అర్హత లభిస్తుందని, అందుకే రాజసూయ యాగంలాంటి వైష్ణవ యాగం చెయ్యమని వారు చెప్పారు. ఇదే దుర్యోధనుడికి ప్రస్తుతానికి తగిన యజ్ఞం అని అన్నారు.

దుర్యోధనుడు వెంటనే పెద్దలైన భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి, తండ్రైన ధృతరాష్ట్రుడికి యజ్ఞం విషయం చెప్పి వారి అనుమతి తీసుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించి, సమస్త దేశాల రాజులను ఆహ్వానించసాగాడు. ద్వైతవనానికి పోయి పాండవులను ఆహ్వానించమని ఒక ప్రత్యేక దూతను పంపాడు. తమ శపథం (అరణ్యవాసం, అజ్ఞాత వాసం) పూర్తికాకముందే యజ్ఞాన్ని సందర్శించడం సరైన పధ్ధతి కాదని రావడానికి అంగీకరించలేదు ధర్మరాజు. భీముడు కొంచెం పరుషంగా జవాబిచ్చాడు. అదే సంగతి రాజుకు తెలియచేశాడు దూత.

దుర్యోధనుడి శాసనం మేరకు అందరు రాజులు, ఋషులు అతడు చేస్తున్న యజ్ఞం చూడడానికి వచ్చారు. వైష్ణవ యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసింది. యజ్ఞానికి వచ్చిన రాజులను, బ్రాహ్మణులను దుర్యోధనుడు సన్మానించాడు. సగౌరవంగా సాగనంపాడు. అంతా ఆయన్ను ప్రస్తుతించారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment