Sunday, July 18, 2021

సరయూ వృత్తాంతాన్ని రాముడికి చెప్పిన విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-65 : వనం జ్వాలా నరసింహారావు

 సరయూ వృత్తాంతాన్ని రాముడికి చెప్పిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-65

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-07-2021)

శ్రీరామచంద్ర చరణారవింద పరాగంద్వారా కామాశ్రమాన్ని పవిత్రం చేయించి, ఇక తాటకాశ్రమాన్నిపవిత్రం చేయించాలన్న తలంపుతో రామ లక్ష్మణులను తీసుకుపోబోతున్నాడు విశ్వామిత్రుడు. ఉదయమే రామ లక్ష్మణులు ప్రాత సంధ్యావందనాది కార్యక్రమాలను తీర్చుకుని, పయనమై, ముందు విశ్వామిత్రుడు నడుస్తుంటే ఆయనవెంబడి వీరు నడస్తూ పోయి, గంగాతీరాన్ని చేరారు. అక్కడున్న మునులు వీరు రాబోతున్న సంగతి ముందే తెలుసుకుని, నావను సిద్ధంగా వుంచి, విశ్వామిత్రుడి కెదురుగావచ్చి, నావ అమర్చామని - రాజకుమారులతో సహా గంగానదిని ఆలస్యంకాకుండా దాటమని ప్రార్థిస్తారు. అంగీకరించిన ఆయన నావనెక్కి, నదిని దాటుతుండగా అలలు ఒకదానితో మరోటి కొట్టుకుంటున్నప్పుడు ప్రబలిన ధ్వనిని విన్న రామచంద్రమూర్తి, "మునీంద్రా! నది నీటిలో గొప్ప ధ్వని వస్తుంది. ఇది అలల రాపిడివల్ల వస్తున్న ధ్వనేనా? లేక మరెందుకైనా వస్తుందా? సందేహం తీర్పు" మని విశ్వామిత్రుడిని అడుగుతాడు. శ్రీరామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు, ప్రేమతో సరయూనది చరిత్రను - దాని పుట్టు పూర్వోత్తరాలను ఆరంభంనుంచి చెప్పాడు.

"బ్రహ్మ దేవుడు తన సంకల్పంతో కైలాసంలో ఒక చెరువును సృష్టించాడు. తన మానసంతో సృష్టించాడు కనుక దానికి ’మానస సరస్సు’ అనీ, దానినుండి వెడలివచ్చిన ఈ నదికి ’సరయు’ అని పేర్లు వచ్చాయి. సరయూ నది అయోధ్యా నగరాన్ని తాకుతూ ప్రవహించి, ఈ ప్రదేశంలో గంగానదిలో కలుస్తుంది. సరయూ నది నీళ్లు ఎత్తునుండి గంగలో పడడం వల్ల, రెండు నదుల నీళ్లు రాసుకుని ఈ శబ్దం వస్తున్నది. దీన్నందుకే గంగా సరయూ సంగమం అంటారు. (సరయూ నది అయోధ్యకు పడమటి భాగంలో ఆరంభమై, ఉత్తరంగా పారి, తూర్పువైపుకొచ్చి, అంగ దేశంలో నుండి ప్రవహించి గంగలో కలుస్తుంది). ఇదొక పుణ్య తీర్థం కాబట్టి దీనిని శ్రద్ధతో నమస్కరించ" మని విశ్వామిత్రుడనగానే రామ లక్ష్మణులు ముని చెప్పినట్లే చేసి, నది దక్షిణపు వొడ్డుకు చేరారు. అక్కడ నావ దిగి, ముగ్గురూ కాలినడకన ప్రయాణమై పోతుండగా, దారిలో భయంకరమైన అడవిని చేరుతారు. మనుష్య సంచారం లేని  కారడవిని చూసిన రామ లక్ష్మణులు, భయంకరంగా కనిపిస్తుండే ఆ కారడవిలో వుండేదెవరని ప్రశ్నిస్తారు. గంగానదికి దక్షిణపు వొడ్డున వున్న ఆ అడవే తాటకారణ్యం. తుమ్మిక చెట్లతో, పాది చెట్లతో, చండ్రలతో, కాకి తుమ్మికలతో, ఏరు మద్దల చెట్లతో, బోలు వెదరు పొదలతో, రేగు చెట్లతో, ఇతర రకాలైన మరెన్నో వృక్షాలతో - ఖడ్గ మృగాలతో, కణుదురీగలతో, ఎలుగు గొడ్లతో, అడవి దున్నలతో - వీటన్నిటి కలయికతో కలిగే భయంకర ధ్వనులు పది దిక్కుల వరకూ వ్యాపిస్తుండడంతో చూచేవారికి దిగులు పుట్టిస్తూ అందులోకి చొరబడ్డానికి కష్టంగా వుంది. 

మలద-కరూశల వృత్తాంతాన్ని రాముడికి చెప్పిన విశ్వామిత్రుడు

"ఈ వనాన్ని పూర్వకాలంలో దేవతలవంటి వారు ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతమంతా ధన ధాన్య సమృద్ధి కలిగి, లోకులందరి చే గౌరవించబడేది. మలద మని, కరూశ మని ఈ వూళ్ల పేర్లు. పూర్వం ఈ స్థలంలో ఇంద్రుడు కశ్యపుడి కొడుకైన వృత్రాసురుడిని చంపినందువల్ల అతడికి బ్రహ్మ హత్యా పాతకం తగిలింది. ఆ దోషం వల్ల ఇంద్రుడికి ఆకలి-మలం విడవడం జరిగింది. ఇంద్రుడికి కలిగిన బాధను-దోషాన్ని తొలగించేందుకు దేవతలు ఆయనతో దివ్య తీర్థాల్లో స్నానం చేయించారు. దాంతో ఆయనకు బ్రహ్మ హత్యా పాతకం తొలగిపోయింది. ఆకలి, మలం-రెండూ ఇక్కడే పోవడం వల్ల, ఇక్కడున్న ఒక ప్రదేశానికి మలద మని-మరో ప్రదేశానికి కరూశ మని ఇంద్రుడు పేర్లు పెట్టాడు. ఈ దేశాలు సౌఖ్యాతిశయంతో అలరారుతుంటే, ప్రజలు ధన ధాన్యాలతో సమృద్ధిగా వుండేవారు” అని చెప్పాడు విశ్వామిత్రుడు.

రాముడికి తాటక వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు

"కొంతకాలం గడిచిన తర్వాత, ఈ ప్రాంతానికి, కోరిన రూపం ధరించగల శక్తి వున్న-వెయ్యేనుగుల బలంగల, తాటక అనే ఒక యక్ష స్త్రీ వచ్చింది. తాటక, సుందుడు అనే వాడికి భార్యై, ఇంద్రుడితో సమానమైన బల పరాక్రమాలు - గుండు బాహువులు కలిగి, లోక విరుద్ధ చర్యలు చేస్తూ - కుత్థ్సితుడై - దేవతలకు భయంకరుడై - మునీశ్వరులను, బాటసారులను, సాదువులను తింటుండె- మారీచుడు అనే నీచ రాక్షస కొడుకును కనింది. వాడు ప్రతిరోజు ఈ ప్రాంతంలో కనిపించిన ప్రతివాడినీ తినడంతో, ఇదొక శ్మశానంగా మారిపోయింది. మలద, కరూశాలు రూపురేఖలు మారిపోయి, భయంకరమైన కారడవిగా తయారయింది రామా" అని అంటాడు విశ్వామిత్రుడు. అలా ఆ దేశం ఏ విధంగా పాడుకాబడ్డదో వివరించి, తాటక నివసించే స్థలం అక్కడికి ఒక ఆమడ దూరంలోనే వుందనీ, తన భుజ బలంతో తాటకను చంపి, ఆ ప్రదేశాన్ని ఖేదంలేనిదానిగా, తన ఆజ్ఞానుసారం చేయాలని రాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు. (మంత్రం ఉపదేశించినవాడు గురువైనందున, అతడికి, ఆజ్ఞాపించే అధికారం వుంది). బ్రతుకుపై ఆశ వున్న వారెవరూ తమలాగా అక్కడకు రారని -  రావడానికి భయపడుతారని, తాటకకు భయపడి పారిపోయిన వారెవరూ తిరిగి అక్కడికి రాలేదనీ విశ్వామిత్రుడంటాడు.

No comments:

Post a Comment