Sunday, July 4, 2021

బల-అతిబల విద్యలను రాముడికి నేర్పిన విశ్వామిత్రుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-63 : వనం జ్వాలా నరసింహారావు

 బల-అతిబల విద్యలను రాముడికి నేర్పిన విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-63

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (05-07-2021)

విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులను తీసుకొని ఒకటిన్నర ఆమడ దూరంపోయి, సరయూ నదిని దాటి, దాని దక్షిణంవైపున్న ఒడ్డుకు చేరి, "రామచంద్రా! రఘురామా! నాయనా! నీచేత్తో ఆలస్యం చేయకుండా నీళ్ళు తీసుకొని రా. అస్తమానం కావచ్చింది. నీకు బల-అతిబల అనే రెండు మంత్రాలను శీఘ్రంగా ఉపదేశిస్తాను. అవి నువ్వు పఠిస్తే, దారిలో బడలిక - ఆకలిదప్పులు వుండవు. ఈమంత్రాలవల్ల కలిగే ఫలమింత అని చెప్పలేం. నువ్వు నిద్రపోతున్నా, హెచ్చరికతప్పి పరధ్యానంగా వున్నా, రాక్షసులు నిన్నేం చేయలేరు. భుజబలంలో నీకెవరూ సమానులుండరు. సౌందర్యంలో-వీర్యంలో అసమానుడవవుతావు. నీ కీర్తి లోకంలో పెరిగిపోతుంది. ఈమంత్రాలు బ్రహ్మ సృష్టించినవి కానందున సామాన్యమైనవని అనుకోవద్దు. వీటివల్ల బుద్ధిబలం, యుక్తి, చాతుర్యం లోకోత్తరమై-జ్ఞానాన్ని కలిగిస్తాయి. మహామంత్రాలు జపించేవారికుండాల్సిన బ్రహ్మచర్యం, ధర్మబుద్ధి లాంటి సద్గుణాలు నీలోవున్నాయి. అందుకేనీకిస్తున్నాను. నువ్వనుకున్న పనులన్నీ ఫలవంతమవుతాయి. సందేహం లేదు. వీటిని నేను నీకిస్తున్నానంటే, పాత్రుడికి దానంచేసేవాడికెలాంటి ఉత్తమగతులు కలుగుతాయో, అలాంటివే నాకూ నీవలన కలుగుతాయి." అని రాముడితో తియ్యట మాటలతో అంటాడు. 

(యోజనం, క్రోసెడు, ఆమడ అనే దూరాలు ఒక్కొక్కరోవీధంగా-భిన్నంగా, చెప్తుంటారు. ఒకటిన్నర ఆమడ-ఆరు క్రోసుల దూరమంటే వారు చేరింది ’గోప్రతారతీర్థం రేవు’ అని అనుకోవాలి. సరయూనదీ తీరంలోనే అయోధ్య వుంది. విశ్వామిత్రుడు పోయిన రేవు దూరంలో వుందనే అనుకోవాలి కాని ఒకటిన్నర ఆమడను దగ్గర లోనే వుందని భావించకూడదు. ఆలస్యం చేయకుండా నీళ్ళు తీసుకొని రమ్మనడమంటే, చీకటిపడేసమయం అయిందనీ, రాత్రివేళల్లో మంత్రాలుపదేశించకూడదనీ అనుకోవాలి. వాళ్ళు అభిజిల్లగ్నంలో బయలుదేరారు కాబట్టి, బాలురు కాబట్టి, 15 మైళ్లు నడిచేందుకు 5 గంటల సమయం పట్టుండవచ్చు. మరో విషయం ఇక్కడ తెలుసుకోవాలి. మంత్రోపదేశం పొందేవాడు శుచిగా-ఆచమించి-ఏకాగ్రచిత్తంతో గ్రహించాలి. మంత్రాలను పాత్రుడికే ఉపదేశించాలి).

విశ్వామిత్రుడి మాటలువిన్న శ్రీరామచంద్రమూర్తి, ఆచమించి, శుచిగా ఆరెండు మంత్రాలను గ్రహించాడు. వెంటనే రాముడి తేజం శరత్కాల సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆ తర్వాత గురువుచెప్పినవిధంగా మిగిలిన తతంగమంతా పూర్తిచేసాడు. ఆరాత్రికి ముగ్గురు ఆనదీతీరంలోనే సుఖంగా గడిపారు. దశరథమహారజు కొడుకులైనందువల్ల వారు ఆగర్భశ్రీమంతులు - సుకుమారులు - కష్టమంటే తెలియనివారు. అయినప్పటికీ, వారికి వీలుపడని పచ్చి గడ్డిపైన పండుకొని, విశ్వామిత్రుడి బుజ్జగింపు మాటలు వింటూ, హాయిగా నిద్రపోయారు రామలక్ష్మణులు.

బల-అతిబల మంత్రం

బలాతిబలయోః  విరాట్పురుష ఋషిః  గాయత్రీ దేవతా గాయత్రీ ఛందః

అకారో  కారమకారా బీజాద్యాః  క్షుధాది నిరసనే వినియోగః

క్లామిత్యాది షడంగన్యాసః  ధ్యానమ్

అమృతకరతలార్ద్రౌ సర్వసంజీవనాఢ్యావఘహరణసుదక్షౌ  వేదసారేమయూఖే

ప్రణవమయవికారౌ భాస్కరాకారదేహౌ సతత మనుభవే  హం  తౌ  బలాతిబలేశౌ

ఓం  హ్రీం  బలే మహాదేవి  హ్రీం  మహాబలే  క్లీం చతుర్విధపురుషార్థసిద్ధిప్రదే

తత్స వితుర్వరదాత్మికే హ్రీం   వరేణ్యం భర్గో దేవస్య వరదాత్మికే_అతిబలే

సర్వదయామూర్తే బలేసర్వక్షుద్భ్రమోపనాశిని  ధీమహి ధియోయోనర్జాతే

ప్రచుర్యాప్రచోదయాత్మికే ప్రణవశిరస్కాత్మికే హుం ఫట్ స్వాహా

ఏవం విద్వాన్ కృతకృత్యో  భవతి   సావిత్ర్యా  ఏవ   సలోకతాం జయతి

ఇత్యుపనిషత్  ఆప్యాయన్తితి  శాంతిః

No comments:

Post a Comment