Saturday, July 10, 2021

శకుని, కర్ణుడి సలహాతో ఘోషయాత్రకు పోయి పరాభవం పాలైన దుర్యోధనుడు ..... ఆస్వాదన-28 : వనం జ్వాలా నరసింహారావు

 శకుని, కర్ణుడి సలహాతో ఘోషయాత్రకు పోయి

పరాభవం పాలైన దుర్యోధనుడు

ఆస్వాదన-28

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (11-07-2021)

పాండవులు కొంతకాలం కామ్యకవనంలో నివసించి అక్కడి నుండి ద్వైతవనానికి తమ ఆవాసాన్ని మార్చారు. అప్పుడు ఒకనాడు హస్తినాపుర నగర వాసైన ఒక బ్రాహ్మణుడు పాండవులను దర్శించి తిరిగి హస్తినకు వెళ్లాడు. ఆ విప్రుడుని పాండవుల యోగక్షేమాలను గురించి అడిగాడు ధృతరాష్ట్రుడు. వారు చాలా ఇక్కట్లు పడుతున్నారని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఇదంతా తన కొడుకు దుర్యోధనుడి అజ్ఞానం వల్ల కలిగిందని, ఇది తాను చేసిన అపరాధమని చింతించాడు ధృతరాష్ట్రుడు. ఒకవైపు చింతిస్తూనే మరోవైపు దుర్యోధనుడి తప్పిదంవల్ల జరగబోయే పరిణామాలను, భీమార్జున నకులసహదేవుల పరాక్రమాలను గురించిన ఆలోచనలో పడ్డాడు. శకుని మాయాద్యూతంలో చేసిన మోసం, దుశ్శాసనుడు నిండు సభలో చేసిన ద్రౌపదీ వస్త్రాపహరణం అనే చెడ్డపని, కౌరవులను సమర్థిస్తూ పాల్పడిన కర్ణుడి నీచత్వం, దుర్యోధనుడి చెడ్డ నాయకత్వం తలచుకుని దుఃఖించాడు. తన మనసులోని భావాలను దుర్యోధనుడికి చెప్పాడు.

దుర్యోధనుడప్పుడు శకునితో రాజెందుకు అలా పిరికి మాటలు మాట్లాడుతున్నాడని, ఎందుకాయనకు అంత భయం కలుగుతున్నదని అడిగాడు. ఆ తరువాత దుర్యోధనుడు శకుని, కర్ణులతో కలిసి ఏకాంత ప్రదేశానికి పోయి మంత్రాలోచనకు పూనుకున్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, ఆయన పాలనలో రాజులంతా ఆయన ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నారని, సామంతులుగా వున్నారని, సువిశాలమైన భూమండలానికంతటికీ ఆయనే సార్వభౌముడనీ, అన్ని వర్గాల ప్రజలు ఆయన అభ్యుదయాన్ని కోరుతున్నారని అన్నాడు. ద్వైతవనంలో కష్టాలనుభవిస్తున్న పాండవులున్న చోటుకు దుర్యోధనుడిని సపరివారంగా వెళ్లి, వారికి తన తేజస్సును చాటమని ఉచిత సలహా ఇచ్చాడు కర్ణుడు. కర్ణుడి సూచనకు అంగీకరిస్తూనే, దుర్యోధనుడు, ద్వైతవనానికి పోవడానికి ధృతరాష్ట్రుడు ఆమోదించడని అనుమానం వెలిబుచ్చాడు.

ఏదేమైనా ద్వైతవనానికి పోవడానికే నిశ్చయించుకున్న దుర్యోధనుడు, దానికి సరైన ఉపాయాన్ని ఆలోచించమని శకునికి, కర్ణుడికి చెప్పాడు. ద్వైతవనంలో వున్న కౌరవుల ఆవుల మందలను చూడడానికై విహారయాత్రకు వెళ్లుతున్నట్లు చెప్పితే ధృతరాష్ట్ర మహారాజు అంగీకరిస్తాడని కర్ణుడు ఉపాయం చెప్పాడు. శకుని కూడా ఆ ప్రతిపాదనకు మద్దతు పలికాడు. దుర్యోధనుడికి కూడా ఆ ఉపాయం నచ్చింది. వెంటనే సుమంగుడనే ఒక గొల్లవాడిని రప్పించి వాడికి ధృతరాష్ట్రుడికి ఏంచెప్పాలో చక్కగా నేర్పారు. అంతా కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయారు. ద్వైతవనంలో వున్న ఆవుల మందకు అడవి మృగాల నుండి తక్షణమే రక్షణ కావాలని, వాటిని కాపాడడానికి చర్యలు చేపట్టమని సుమంగుడు ధృతరాష్ట్రుడికి విన్నవించుకున్నాడు. కర్ణుడు, శకుని వాడికి వంతపాడారు. దైన్యంతో జీవిస్తున్న పాండవులున్న ద్వైతవనానికి దుర్యోధనాదులు వెళ్లడానికి తొలుత రాజు విముఖత వ్యక్తపరిచాడు. పాండవులకు కోపం వస్తే దుర్యోధనాదులను దహించి వేస్తారని అన్నాడు.

పాండవులకు కీడు తలపోయమని, తమ మాటలు విశ్వసించమని, ఆవులను రక్షించడమే ఏకైక ధ్యేయంగా అడవికి పోతున్నామని, తమకు అనుమతి ఇవ్వమని శకుని, కర్ణుడు నివేదించారు. ధృతరాష్ట్రుడు కొంతసేపు ఆలోచించి, గోవులను కాపాడి ఆలస్యం చేయకుండా మరలి రమ్మని చెప్పి అనుమతి ఇచ్చాడు దుర్యోధనాదులకు. వెంటనే దుర్యోధనుడు బంధుమిత్ర సపరివారంగా ఘోషయాత్రకు ఉపక్రమించాడు. ఘోషయాత్ర అమితమైన కోలాహలంగా కొనసాగింది. మర్నాటికల్లా అవులున్న అడవిలో ప్రవేశించారు. ఆ వనంలో ఒక అందమైన ప్రదేశంలో శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కనులపండువుగా తిరుగాడుతున్న ఆవుల మందలను దుర్యోధనుడు సందర్శించాడక్కడ. గోవుల సంరక్షణకు చేపట్తున్న చర్యలను సమీక్షించాడు. సంతృప్తి చెందాడు. గోరక్షణకు ఇంకా అవసరమైన పటిష్టమైన ఏర్పాట్లను చేశాడు.

ఆ తరువాత దుర్యోధనుడు వేటకు ఉపక్రమించాడు. అనేక రకాల అడవి జంతువులను వేటాడసాగాడు. అడవిలో విహరించాడు. విహరిస్తూనే ద్వైతవనంలోని ఒక సరస్సు చేరాడు. అక్కడ ధర్మరాజు సద్యస్కందం అనే క్రతువు చేస్తూ వున్నాడప్పుడు. దానికి సమీపంలోనే వినోదం కొరకు క్రీడా గృహాలను నిర్మించమని సేవకులను దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. వారలాగే నిర్మించసాగారు. అప్పుడా భటులను గంధర్వులు అడ్డగించారు. ఆ సరోవరం చిత్రసేనుడు అనే గంధర్వ రాజుదని, వారాకొలను దగ్గరికి రాకూడదని, వెంటనే వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ విషయాన్ని సేవకులు దుర్యోధనుడికి చెప్పారు. గంధర్వులతో మాట్లాడడానికి దుర్యోధనుడు పంపిన కౌరవ భటులు తమరాజు గురించి చెప్పి, ఆయనక్కడికి జలక్రీడలకు వచ్చాడని, అడ్డం రావద్దని అన్నారు. గంధర్వుల స్థావరమైన ఆ సరోవర తీరాన దుర్యోధనుడు వుండడానికి వీల్లేదని స్పష్టం చేశారు గంధర్వ భటులు.

         ఈ మాటలు తనకు చేరగానే కోపగించిన దుర్యోధనుడు సరోవరాన్ని ఆక్రమించమని, సేనలతో దండెత్తమని తన తమ్ములను, సామంత ప్రభువులను, సేనానాయకులను ఆదేశించాడు. వారు ఆయన చెప్పినట్లే గంధర్వుల మీదికి దండెత్తి వెళ్లారు. గంధర్వుల మీద శస్త్రాస్త్రాలను ప్రయోగించారు. ఆ విషయాన్ని గంధర్వులు వెళ్లి తమ ప్రభువైన చిత్రసేనుడికి నివేదించారు. అతడు వెంటనే, కౌరవులను చుట్టుముట్టి సంహరించమని ఆజ్ఞాపించాడు. గంధర్వ సేనలు, కౌరవ సేనలను డీకొన్నారు. అప్పుడు గంధర్వుల ధాటికి తట్టుకోలేక దుశ్శాసనుడితో సహా అంతా దుర్యోధనుడి సమక్షానికి పారిపోయారు. కర్ణుడు ఒక్కడు మాత్రం యుద్ధం కొనసాగించాడు. దుర్యోధనుడు కర్ణుడికి సహాయంగా యుద్ధానికి వెళ్లాడు. అప్పుడు జగద్భయంకరమైన ఘోరయుద్ధం కౌరవులకూ, గంధర్వులకూ జరిగింది.

         ఇంతలో చిత్రసేనుడు కూడా యుద్ధానికి వచ్చి కౌరవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. తీవ్రమైన, భీకరమైన యుద్ధం సాగింది చాలాసేపు. గంధర్వ భటులు కొందరు కర్ణుడి రథాన్ని ముక్కలు ముక్కలు చేశారు. కర్ణుడు దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడి రథం ఎక్కి యుద్ధం కొనసాగించాడు. కాసేపటికి చిత్రసేనుడు దుర్యోధనుడితో తలపడి అతడి రథాన్ని విరగ్గొట్టాడు. రథాన్ని కోల్పోయిన దుర్యోధనుడిని చిత్రసేనుడు జుట్టుపట్టుకొని ఈడ్చి, నేలమీద పడేసి, అతడి చేతులు వెనక్కు కట్టి, సింహనాదం చేశాడు. ఆ దృశ్యాన్ని చూసి మిగిలిన గంధర్వులు దుశ్శాసనుడితో యావన్మంది కౌరవ పరివారాన్ని చిత్రసేనుడికి అప్పగించారు. అంతట మిగిలిన భటులు ధర్మరాజు దగ్గరికి పోయి ఆయన శరణు కోరారు. దుర్యోధనుడిని, అతడి పరివారాన్ని గంధర్వ రాజు చిత్రసేనుడు చెరబట్టి తీసుకుపోతున్న సంగతి వివరించారు. దుర్యోధనుడిని కాపాడమని, విడిపించమని ప్రార్థించారు.

         ఇది వినగానే భీమసేనుడు ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడి మీద దయ చూపకూడదన్నాడు. దుర్యోధనుడు చెడ్డవాడైనా అతడు మనజ్ఞాతుడని అతడిని రక్షించాల్సిన బాధ్యత తమమీద వున్నదని ధర్మరాజు భీముడికి నచ్చచెప్పాడు. అతడిని బంధవిముక్తిడిని చేయమని భీమార్జునలకు చెప్పాడు ధర్మరాజు. భీమార్జున నకుల సహదేవులు వెంటనే కవచాలు ధరించారు. ధనుస్సు చేతబట్టారు. గంధర్వ సైన్యాన్ని సమీపించారు. వారిని ఎదుర్కొన్నారు. తాము దుర్యోధనుడిని విడిపించడానికి వచ్చామని, స్నేహపూర్వకంగా వారిని వదలమని, ఇది ధర్మారాజు ఆజ్ఞ అని చెప్పారు. గంధర్వులు వినకపోయేసరికి వారిమీద వాడి బాణాలను ప్రయోగించాడు అర్జునుడు. భయంకర పోరాటం జరిగింది ఇరుపక్షాలకు. చిత్రసేనుడు కూడా తీవ్రంగా యుద్ధం చేశాడు. చివరకు విజయం ఆర్జునుడిని వరించే సమయానికి చిత్రసేనుడు వచ్చి నిజరూపంలో కనిపించాడు. స్నేహితుడిని చూడగానే అర్జునుడు యుద్ధాన్ని విరమించాడు.

         దుర్యోధనుడిని విడుదల చేయమని కోరిన అర్జునిడికి, అతడి దుష్ట పన్నాగాలను వివరించాడు చిత్రసేనుడు. అడవిలో పాండవుల పాట్లు చూసి ఎగతాళి చేయడానికి వచ్చాడని, ఘోషయాత్ర ఒక సాకు మాత్రమే అని, అందుకే ఇంద్రుడు అతడిని బంధించమని చెప్పాడని అన్నాడు. దుర్యోధనుడు ఎలాంటివాడైనా తన సహోదరుడని అందుకే విడిచి పెట్టమని కోరాడు అర్జునుడు. అంతా కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్లారు. ధర్మరాజు చిత్రసేనుడిని స్వాగత మర్యాదలతో ఆహ్వానించాడు. దుర్యోధనుడి అపచారాన్ని మన్నించి విడిచిపెట్టమని ధర్మరాజు చిత్రసేనుడిని కోరాడు. చిత్రసేనుడు అలాగే చేసి స్వర్గానికి పోయాడు. ఆ విధంగా ద్వైతవనంలో బంధమోక్షణం చేసి, ధర్మరాజు దుర్యోధనుడికి చెప్పిన మాటలు తిక్కన పద్యంలో:

         ఉ:       ఎన్నడు నిట్టి సాహసము లింక నొనర్పకుమయ్య! దుర్జనుం

డన్నున సాహసక్రియల యందు గడంగి నశించు గావునం

గ్రన్నన తమ్ములన్ దొరల గైకొని యిమ్ముల బొమ్ము వీటికిన్

సన్నుత! దీనికొండొక విషాదము బొందకుమీ మనంబునన్

         (నాయనా! దుర్యోధనా! ఎప్పుడైనా సరే ఇలాంటి పరాభవాన్ని కలిగించే సాహస కృత్యాలకు ఒడిగట్టవద్దు. ఇప్పుడు జరిగిందేదో జరిగి పోయింది. ఇకమీద భవిషత్కాలంలోనైనా బుద్ధి కలిగి ప్రవర్తించు. దుర్జనుడు దురభిమానంతో తన అంతరం ఎదుటివాడి గొప్పతనం తెలియక కన్నుమిన్నుకానక నశిస్తాడు. జాగ్రత్త సుమా! ఇక శీఘ్రంగా తమ్ములను, దొరలను తీసుకొని నీ రాజధానికి వెళ్లు. ఇలాంటి అవమానం జరిగినందుకు ఎలాంటి దుఃఖాన్ని నీ మనసులో అనుభవించవద్దు).

         ఈ సందర్భంగా విశ్లేసిస్తూ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు ఇలా రాశారు: ‘ఎర్రన మహాకవి రాసిన పద్యాలలో ఇది తలమానికం. ఎర్రాప్రగడ కవితాశిల్పానికి ఈ పద్యం సమ్యగుదాహరణంగా ఎన్నదగింది. ఈ పద్యం ఒక్కటే ఒక మాహాకావ్యం. ఇందులో నన్నయను తలపించే ప్రసన్నకథా కవితార్త యుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థ సూక్తులు వున్నాయి. తిక్కన మహాకవిని తలపింప చేసే సంభాషణ చారిమ, సజీవ పాత్ర చిత్రణం వున్నాయి. రసభావ నిరంతరాలైన వాక్యాల సంపుటం ఈ పద్యం. ఈ పద్యంలో వ్యంగ్యగర్భితంగా స్ఫురించే అంతరార్థాలు హృదయంగమాలు.

         ధర్మరాజు దుర్యోధనుడిని ఆ విధంగా మందలించి, హితోపదేశం చేసి, వీడ్కోలు పలికాడు. దుర్యోధనుడు దర్పం తరిగి, తేజోహీనుడై ముఖం వంచుకుని వెళ్లిపోయాడు.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

                   

      

No comments:

Post a Comment