హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రినా?
వనం జ్వాలా నరసింహారావు
శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం
తిరుమలలోని అంజనాద్రి అని అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు పురాణాల, ఇతిహాసాల ఆధారంగా, భౌగోళిక ప్రామాణికంగా సోదాహరణంగా
నిరూపించే ప్రయత్నం చేయడం హర్షించాల్సిన విషయం. కీర్తి శేషులు శ్రీమాన్
వావిలికొలను సుబ్బారావు గారు (వాసుదాసుగారు) వాల్మీకి రామాయణాన్ని యథా వాల్మీకంగా
తెనిగిస్తూ మందరం అనే పేరుతొ గొప్ప వ్యాఖ్యానం వ్రాసారు. ఆ వ్యాఖ్యానంలో అంజనాపర్వతం
గురించిన ప్రస్తావన కిష్కింధకాండ కాండలో వున్నది. అలాగే హనుమంతుడి జన్మ వృత్తాంతం
గురించిన ప్రస్తావన అదే కాండలోను, సుందర కాండలోను వుంది. హనుంతుడు రామాయణంలో మొట్టమొదటిసారిగా సగం కథ అయిపోయిన
తరువాత కిష్కింధకాండలో దర్శనం ఇస్తాడు. ఇక ఆ తరువాత సుందరకాండ మొత్తం హనుమత్కాండే
అనాలి! కిష్కింధకాండ, యుద్ధ కాండలలో దాదాపు ఆయనే కథానాయకుడు.
రాముడు, లక్ష్మణుడు
ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, సుగ్రీవుడు చూసి
భయంతో వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. ఎటు పరుగెత్తాల్నా
అని ఆలోచించసాగాడు. ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర రాజా! ఎందుకు
నీకు భయం వేస్తున్నది?
వాలి భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యమూకం
కదా! ఇక్కడ వాలివల్ల భయం లేదుకదా? ఒకవేళ భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు
తొట్రుపాటు పడుతున్నావు?” అని అడిగాడు. తన భయానికి కారణం చెప్పాడు సుగ్రీవుడు.
"ఆంజనేయా!నువ్వు పో. మాటలవల్ల, ఆకారాల వల్ల, పలురకాలైన
ముఖకవళికల వల్ల, వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో, వారి మనస్సు
శుద్ధమైందా? వంచనతో కూడిందా?
ఇది వున్నది వున్నట్లుగా తెలుసుకో” అని ఆంజనేయుడికి
చెప్పాడు సుగ్రీవుడు. హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశానికి వానర రూపం వదిలి, సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి,
వారిదగ్గరికి పోయి ఏకాగ్రచిత్తంతో,
వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు. సుమనోజ్ఞంగా,
సౌమ్యంగా, వంచనలేని మాటలు చెప్పి, రాజకుమారులను తృప్తికావించి, సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని
చెప్పాడు హనుమంతుడు రాముడితో.
“మీ స్నేహం కోరి ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ
దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని. వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను
వానరుడిని. కోరిన రూపం ధరించి, కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి
సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు. దీంతో
రామలక్ష్మణుల సందేహం తీరింది. తమ వివరాలు చెప్పారు.
ఆ తరువాత ఆంజనేయుడు తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. ఇద్దరినీ
భుజాలమీద ఎక్కించుకుని, తాను వచ్చిన సుగ్రీవుడి కార్యం నెరవేరిందికదా అనుకుని, సంతోషంగా, నిర్మలమైన మనస్సుతో
మహావేగంగా తీసుకునిపోయి, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు. సుగ్రీవుడు తనకు
రామచంద్రుడి వల్ల కలిగిన భయాన్ని వదిలి సంతోషంగా మనుష్య రూపాన్ని ధరించి
త్వరత్వరగా వారి దగ్గరికి వచ్చాడు. వారిని సమీపించి, అనురాగంగా పూజించి, రామచంద్రమూర్తిని చూసి
ఇలా అన్నాడు.
“రామా!
నువ్వు నాతో స్నేహం చేస్తే, రాముడి స్నేహితుడు సుగ్రీవుడు అని గౌరవ లాభం నాకే కాని, నావల్ల నీకు గౌరవలాభాలు
కలగవు. ఆ కారణాన నేనే ధన్యుడిని. నా జన్మే సార్థకం”. సుగ్రీవుడు తనకు అన్న వాలి
చేసిన అపకారాన్ని గురించి చెప్పాడు. వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు. సుగ్రీవుడితో
వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు రాముడు.
“రామచంద్రా! నీకు నీ భార్యను ఎడబాయడం వల్ల కలిగిన దుఃఖాన్ని
నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రతైన సీతాదేవిని నీచుడైన రావణుడు ఏ
ప్రదేశంలో దాచినప్పటికీ, నేను తెస్తాను. సీతాదేవి పాతాళంలో వున్నా సరే, ఆకాశాన వున్నా సరే, రామచంద్రా! ఆమెను నేను
తేగలను. నువ్వు బాధపడవద్దు”.
వాలి, సుగ్రీవుల ద్వంద్వ యుద్ధంలో శ్రీరాముడు, వాలిని చంపగల భయంకర
బాణాన్ని తీసి వాలికి గురిచూసి వదిలాడు. వజ్రాయుధంలాగా, వేగంగా, పిడుగులాగా, రామచంద్రమూర్తి విల్లు
నుండి వెలువడిన బాణం వాలి రొమ్మును తాకింది. ఆ బాణం తాకగానే ఇద్రధ్వజంలాగా బలం
క్షీణించి, వాలి
నేలకూలాడు.
సుగ్రీవుడిని
మంత్రులంతా సేవించారు. రామచంద్రమూర్తి ఆజ్ఞానుసారం సుగ్రీవుడు కిష్కింధకు పోయాడు. సుగ్రీవుడు
సంతోషంగా పట్టాభిషిక్తుడై ఆ తరువాత రామచంద్రమూర్తి చెప్పిన విధంగా అంగదుడిని
యువరాజుగా అభిషేకించగా అందరూ సంతోషించారు. సుగ్రీవుడిని పొగిడారు. సుగ్రీవుడికి
పట్టాభిషేకం, అంగదుడికి
యౌవరాజ్యం ఇచ్చినందుకు అందరూ రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని
మెచ్చుకున్నారు.
కొన్నాళ్ళ
తరువాత రామచంద్రమూర్తి కార్యం నెరవేర్చాల్సిన కాలం సమీపించిందని హనుమంతుడు
భావించాడు. సీతను వెతకడానికి వానరులను పంపమన్నాడు. హనుమంతుడు చెప్పగా కాలానికి
ఉచితమైన ఆయన మాటలు విని సుగ్రీవుడు వానర సేనానాయకుడైన నీలుడిని చూసి, వానరయూధ
నాయకులందరూ పదిహేను రోజుల్లో తమ సేనలతో తన దగ్గరికి రావాలనీ, రానివారి ప్రాణాలు
తీయబడుతాయనీ అంటాడు. ఆ విధంగా ప్రకటించమని నీలుడిని ఆజ్ఞాపించాడు. అంగదుడితో కలిసి
నీలుడు ఆ పని చేయాలని చెప్పాడు.
కోపంతో సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన లక్ష్మణుడికి సుగ్రీవుడు
కపిసేనలను రప్పించిన వార్త చెప్పింది తార. “నూర్లకొలది కొండముచ్చులు, ఎలుగులు, కోతులు, మహాబలపరాక్రమ సంపన్నులు
కోట్లకొలది నీ సేవ చేయకలవారిని చూస్తావు”. అని అన్నది.
అప్పుడు సుగ్రీవుడు తన సమీపంలో వున్న హనుమంతుడితో
“హిమవత్పర్వతంలో, మహేంద్ర, వింధ్య, కైలాస, మందర పర్వతాలలో, బాలసూర్య కాంతికల సముద్ర తీర పర్వతాలలో, పడమటి కొండల్లో, సంధ్యాకాల మేఘం లాంటి
ఉదయ పర్వతంలో తిరిగే కోతులను, పద్మతాల వనంలో వున్న వానరులను, నల్లటి మేఘాలతో సమానమై
ఏనుగు బలం కలవారైన “అంజనాపర్వత” వానరులను, మనిషిల విశేషంగా వుండే
గుహలల్లో ఉన్నవారిని, మునీశ్వరుల ఆశ్రమాలలో వున్నవారిని, ఇంకా భూమ్మీద
ఎక్కడెక్కడో వున్నవారందరినీ, భయంకర వానరులందరినీ పిలిపించు” అని చెప్పాడు. (ఇది వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 37 వ
సర్గలో వున్నది)
లక్ష్మణుడు, సుగ్రీవుడితో కలిసి రామచంద్రమూర్తిని చూడడానికి
ఆయన వున్న చోటుకు పోయారు. “రామచంద్రా! భూమండలంలోకల కోతులను, కొండముచ్చులను, ఎలుగులను, బలవంతులను పిలిపించాను. తమతమ
సేనలతో వందలు, వందవేలు, వంద లక్షలు, అయుతాలు, శంకువులు, అర్భుదాలు, ఖర్వాలు, మధ్యములు, అంతములు, సాగరములు, పరార్తాలుగా
వస్తున్నారు. ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలవారు. మేరు, మందర పర్వతాలతో సమానమైన
వారు. వింధ్యాద్రిలో, అంజనాద్రిలో వుండేవారు వస్తున్నారు. దుష్టుడైన
రావణుడిని చంపి వీరు నీ భార్యను తెచ్చి నీకు సమర్పిస్తారు” అని అన్నాడు సుగ్రీవుడు
శ్రీరాముడితో.
శతవలి, సుషేషణుడు, తారుడు, కేసరి, గవాక్షుడు, ధూమ్రుడు, పనసుడు, నీలుడు, గవయుడు, దరీముఖుడు, గజుడు, అశ్వినీ దేవతలా కుమారులు
ద్వివిదుడు, మైందుడు, జాంబవంతుడు, రుమన్వంతుడు,
గంధమాదనుడు, తార కొడుకు అంగదుడు, ఇంద్రజాను
శూరుడు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, నలుడు, దదిముఖుడు,
వహ్నికుముదుడు, రంహుడు, ఉగ్ర శరభుడు మొదలైన వానర
సమూహాలు సుగ్రీవుడి ఆజ్ఞానుసారం ర్రామచంద్రుడి దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరినీ
సుగ్రీవుడు వాళ్ల గురించి రామచంద్రుడికి తెలియచెప్పి, వారి క్షేమ సమాచారాలను
విచారించాడు. వారిని వాళ్ల సేనలతో అడవుల్లో, కొండల్లో వుండమని
ఆదేశించాడు.
సీతాదేవిని
వెతకడానికి నలుదిక్కులకూ ఒక్కొక్క వానర నాయకుడి నేతృత్వంలో కోటానుకోట్ల వానర
వీరులను పంపించే ముందర వాళ్ళు వెళ్లే దిక్కులో వున్న ప్రదేశాలను వివరంగా చెప్పాడు
వాళ్లకు సుగ్రీవుడు. ఒక విధంగా ఆయన మాటల్లో అది సమస్త భూమండలమే!
సీతను వెతకడానికి ముందుగా తూర్పు దిశకు వినతుడిని
పొమ్మన్నాడు. ఆ దిక్కున వున్న ప్రదేశాలను వివరించాడు. దక్షిణ దిక్కుకు నీలుడిని, హనుమంతుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను
పొమ్మన్నాడు. వీళ్లందరికీ దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి చెప్పాడు.
అలా చెప్పిన వాటిలో అంజనాద్రి కూడా వున్నది. ఆ తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, పశ్చిమంగా
పొమ్మంటాడు. ఆ తరువాత సుగ్రీవుడు మహాబలవంతుడైన శతవలి అనే వాడిని ఉత్తర దిక్కుకు
పొమ్మంటాడు.
దక్షిణ
దిక్కుకు పోయిన హనుమదాదులకు, రావణుడు వుండే స్థలాన్ని సంపాతి చెప్పడంతో, సీతను
చూడాలన్న కోరికతో సముద్ర తీరాన్ని చేరారు. వానరులు ఒక్కచోట కూర్చుండి సముద్రాన్ని
తేరిపార చూశారు. “ఈ సముద్రాన్ని దాటేవారెవరు? ఈ వానరసేనను
కాపాడడం అంగద, హనుమంతులకు
ఎవరికి సాధ్యం” అని అనుకుంటారు.
అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడిని
కార్యోన్ముఖుడిని చేయడానికి ప్రోత్సహించసాగాడు. ఇలా అన్నాడు: “నువ్వు బలంలో, పరాక్రమంలో, తేజంలో, రామలక్ష్మణ సుగ్రీవులు
ముగ్గురికీ సమానమైనవాడివి కదా? ఆ ముగ్గురు ఒక ఎత్తు, నువ్వొక్కడివే ఒక ఎత్తు
కదా! నీ శక్తి సామర్థ్యాలు నువ్వేల తెలుసుకోలేవు? దానికి కారణం ఏమిటో
ఆలోచించు”.
“అప్సరసలలో
శ్రేష్టురాలైన పుంజికస్థల అనే ఒక ప్రసిద్ధ సుందరి శాపవశం వల్ల వానరస్త్రీగా అంజనాదేవి
అనే పేరుతో కుంజరుడనే వానర ప్రభువుకు
కూతురుగా పుట్టింది. ఆమె కేసరి అనే వానర వల్లభుడికి భార్య అయింది. ఆ వానర
స్త్రీ ఒకానొక రోజున సంతోషంగా మనుష్యస్త్రీ
స్వరూపం ధరించి, మేఘవర్ణం కల పర్వత ప్రదేశంలో తిరుగుతున్నది. అప్పుడామె కట్టుకున్న ఎర్రటి అంచుకల
పచ్చని దువ్వలువ కొండగాలికి మెల్లగా జారిపోయింది. ఆమె ఉబ్బిన స్తనాలు, బలిసిన తొడలు, సన్నటి నడుము, అందమైన ముఖం, పిరుదుల అందమైన ఆకారం
చూసిన వాయుదేవుడు, మోహంతో, మన్మథ బాణాలకు గురై, ఆమె భుజాలను పట్టుకుని
గట్టిగా కౌగలించుకున్నాడు”.
“ఆమె అప్పుడు భయపడి ‘ఎవ్వడు నా పాతివ్రత్యానికి
హానికలిగించాలని చూస్తున్నాడు?’ అని అంది. వాయుదేవుడప్పుడు ‘నువ్వు భయపడవద్దు. నేను నిన్ను
ఎప్పుడూ తాకే వాయుదేవుడిని. నీకు దీనివల్ల కీర్తి కలుగుతుంది. ఈదడంలో, దాటడంలో నాకు సమానమైన
కొడుకు, మిక్కిలి
వేగంగా పోయేవాడు, పరాక్రమవంతుడు, బుద్ధిబలం కలవాడు నీకు పుట్టుతాడు’. అని చెప్పగా నీ తల్లి
మనసులో సంతోషించి అక్కడినుండి వెళ్లిపోయి, ఒక కొండ
గుహలో వానర శ్రేష్టుడివైన నిన్ను కనింది”. జాంబవంతుడు ఇలా ప్రోత్సహించగా, ప్రేరేపించగా
ఆ క్షణంలోనే హనుమంతుడు విజృంభించాడు. వానరులు సంతోషంగా చూస్తుంటే తన దేహాన్ని
పెంచాడు.
లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన తరువాత, తన జన్మ
వృత్తాంతాన్ని చెప్పుతాడు సీతాదేవితో. రామాయణంలో, అందునా వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఫలానా ప్రదేశమే
హనుమంతుడి జన్మస్థలం అని చెప్పలేదు కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉదాహరించిన ప్రమాణాలే
ఆధారంగా తీసుకుని ఆయన జన్మస్థలం అంజనాద్రి అని నిర్ణయించడం భావ్యం.
No comments:
Post a Comment