Saturday, July 24, 2021

వేదవ్యాసుడు చెప్పిన వ్రీహిద్రోణాఖ్యానం, ముద్గల మహర్షి వృత్తాంతం ..... ఆస్వాదన-30 : వనం జ్వాలా నరసింహారావు

 వేదవ్యాసుడు చెప్పిన వ్రీహిద్రోణాఖ్యానం, ముద్గల మహర్షి వృత్తాంతం

ఆస్వాదన-30

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (25-07-2021)

దుర్యోధనుడు వైష్ణవ యాగం చేయడం పూర్తిచేసిన తరువాత, తాను దేవేంద్రుడి కొడుకైన ఆర్జునుడిని సంహరిస్తానని, అంతదాకా తన కాళ్లగోళ్లు కడుక్కోనని శపథం చేశాడు కర్ణుడు. తనకు కర్ణుడి సహాయం ఉన్నంతవరకు పాండవులను జయించడం ఏమంత కష్టమైన కార్యం కాదని దుర్యోధనుడు అంటాడు. ఈ విషయాలను తెలుసుకున్న ధర్మరాజు, కర్ణుడి సహజ కవచ కుండలాలను, అభేద్య కవచాన్ని, అతడి పరాక్రమాన్ని స్మరించి కలతచెందాడు.

ఇదిలా వుండగా ఒకనాడు ధర్మరాజు నిద్రిస్తుండగా అతడికి స్వప్నంలో అడవి జంతువులు కనిపించి, తమను వేటాడడం ఆపి, వేరే ప్రదేశానికి పొమ్మని వేడుకున్నాయి. ధర్మరాజు అలాగే అని వాటికి అభయమిచ్చాడు. తాము ద్వైతవనానికి వచ్చి 20 నెలలు గడిచాయని, అక్కడి నుండి వేరేచోటుకు పోదామని తమ్ములకు చెప్పాడు. కామ్యకవనానికి పోయి అక్కడ తృణబిందు మహర్షి ఆశ్రమంలో వుండడం మంచిదని నిర్ణయించుకున్నారు. అంతా బయల్దేరి కామ్యకవనానికి వెళ్లారు.

కామ్యకవనానికి ఒకనాడు వేదవ్యాస మహర్షి వచ్చాడు. మాటల మధ్యలో దానం, ధర్మం, తపస్సు, త్యాగం లాంటి విషయాల ప్రస్తావన వచ్చింది. అలాగే ముద్గలుడు అనే బ్రాహ్మణుడి ప్రస్తావన, అతడు కైవల్యాన్ని పొందిన విషయం, వ్రీహిద్రోణాఖ్యానం, వ్యాసమహర్షి చెప్పాడు. ఆ వివరాలను పూర్తిగా వినిపించమని కోరాడు ధర్మరాజు.

ముద్గలుడు మహానుభావుడు. తన గృహానికి వచ్చేవారినందరినీ ఆదరించేవాడు. అతిథులను, అభ్యాగతులను సేవించేవాడు. నిత్య సత్యవచనుడు. వైరాగ్యం కలవాడు. ఇంద్రియాలను జయించినవాడు. భార్యాపుత్రులతో కురుక్షేత్రంలో నివసిస్తూ, పొలాలలో రాలిన ధాన్యాన్ని ఏరుకోవడం (ఉంఛవృత్తి) జీవనోపాధిగా ఎంచుకుని బతుకుతూ, నెలకు పదిహేను రోజులు నిరాహార దీక్షతో వుండేవాడు. పాడ్యమి నుండి చతుర్దశి వరకు వడ్లగింజలను ఏరి, ఒక్కొక్క వరిగింజ చొప్పున తూమెడు (నాలుగు కుంచాలు) ధాన్యం పోగు చేసేవారు. ఆ పద్నాలుగు రోజులు ఉపవాసం వుండేవారు. మర్నాడు, అంటే, అమావాస్యనాడు లేదా పౌర్ణమి నాడు వంట చేయించేవాడు. అలా వండిన అన్నంలో పితృ దేవతలకు నివేదనం చేసి, అతిథులకు పెట్టి, మిగిలినదానిని ఆయన, భార్యా పిల్లలు తినేవారు. ఈ విధంగా శరీర ధారణ కొరకు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ, పక్షోపవాస వ్రతాన్ని నిర్వహించేవారు.

ఇలా వుండగా ఒకనాడు ముద్గలుడి దగ్గరికి పిచ్చివాడి ఆకారంలో, అనాగరికుడికా కనిపిస్తూ, దుర్వాసుడు వచ్చాడు. వచ్చి నోటికి ఇష్టమైన రీతిలో మాట్లాడ సాగాడు. అతడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించాడు ముద్గలుడు. అతిథి సత్కారం నిర్వహించాడు. తరువాత దుర్వాసుడికి భోజనం పెట్టాడు. దుర్వాసుడు ఆ అన్నాన్ని తిని, మిగిలిన అన్నాన్ని తన శరీరం నిండా పూసుకుని, తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథులనాడు రావడం కొనసాగించాడు. ముద్గల మహర్షి తాను నిరాహారుడైనప్పటికీ, దుర్వాసుడికి అతిథి మర్యాదలలో ఏలోపం రాకుండా చూశాడు. ఇలా ఆరు పర్వదినాలు దుర్వాసుడు వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. అతడిలో ఏలోపం కనిపించలేక పోవడంతో దుర్వాసుడు ఆశ్చర్యం చెందాడు.

ముద్గలుడి లాంటి దానశీలుడిని తాను ఈ పృథివిలో ఎక్కడా చూడలేదని అన్నాడు దుర్వాసుడు. ఆయన గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేనన్నాడు. ముద్గలుడు మహానుభావుడనీ, అన్నదానం చేయడంలో ఆయన నిష్ఠ సాటిలేనిదనీ, ఆయన మనస్సు పవిత్రమైనదనీ, అతిథి పూజను స్వచ్చమైన భక్తితో నిర్వహించాడనీ, ఆయన్ను ఎంతని పొగడాలనీ అన్నాడు దుర్వాసుడు. ముద్గల మహాముని వల్ల తాను మిక్కిలి సంతోషం చెందానని, గొప్ప కీర్తితో స్వర్గానికి మానవ శరీరంతోనే వెళ్లగలడని చెప్పాడు. ఇలా చెప్పి దుర్వాసుడు వెళ్లిపోయాడు.

ఆ తరువాత దేవదూతలు ముద్గలుడి దగ్గరకు కోరిన చోటుకు పోగల దివ్య విమానం తెచ్చారు. మహానుభావుడైన ముద్గలముని చేసిన పుణ్య కర్మల వల్ల స్వర్గలోకం సిద్ధించిందని, అక్కడికి రమ్మని, విమానం ఎక్కమని చెప్పారు వారు. స్వర్గలోకం ఎలా వుంటుందో తెలుసుకోవాలని వుందని, దానిని గురించి వివరించమని, అక్కడి మంచి-చెడులను గురించి చెప్పమని అడిగాడు ముద్గలుడు దేవదూతలను. జవాబుగా దేవదూత ఇలా చెప్పాడు.

‘స్వర్గలోకం భూలోకానికి పైన వుంటుంది. నిత్యం ప్రకాశిస్తూ వుంటుంది. దేవతలు నడయాడే స్థలం స్వర్గలోకం. తపస్సులో సిద్ధిపొందిన మహర్షులు, గొప్ప యజ్ఞాలను చేసినవారు, సత్యం పాటించి కృతకృత్యులైనవారు, దానధర్మాలు చేసినవారు, యుద్ధాలలో గొప్ప పరాక్రమం ప్రదర్శించినవారు స్వర్గలోకంలో సంతోషాన్ని అనుభవిస్తూ వుంటారు. అక్కడ అప్సరసలు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు నివసిస్తూ వుంటారు. స్వర్గలోకంలో 33 వేల ఆమడల వైశాల్యం కల మేరు పర్వత శిఖరం వున్నది. ఇక్కడ దాహం కాని, వేడికాని, చలికాని, ముసలితనం కాని, వ్యాధులు కాని కలగవు. స్వర్గలోకంలో ఉన్నవారికి ఎలాంటి దుఃఖాలు కలగవు. అలసట వుండదు. నిరంతర సౌఖ్యాలు అనుభవిస్తారు.

స్వర్గలోకం పైన బ్రహ్మలోకం వున్నది. మానవుడు తాను చేసిన పుణ్యాన్ని అనుభవించిన తరువాత స్వర్గలోకంలో వుండడానికి వీల్లేదు. అతడిని తిరిగి భూలోకంలో పడవేస్తారు. పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గ లోకం నుండి తోసివేయబడిన వాడే తిరిగి భూలోకంలో సౌఖ్యాలను అనుభవించే స్వభావం కలవాడిగా జన్మిస్తాడు. భూలోకం ‘కర్మభూమి’. భూలోకంలో చేసిన కర్మవల్ల పుణ్యపాపాలు కలుగుతాయి.

ఇదంతా చెప్పిన దేవదూత, ముద్గలుడి మీద వున్న అభిమానం కొద్దీ ఈ విషయాలను చెప్పానని, ఆలస్యం చేయకుండా స్వర్గలోకానికి రమ్మని అన్నాడు. ముద్గలుడు కొంచెంసేపు ఆలోచించాడు. ఎక్కడికి చేరితే జీవుడు శాశ్వతంగా భూలోకానికి రాకుండా వుండగలడో, అలాంటి గొప్ప స్థాయికి చేరడానికి తాను చిత్తశుద్ధితో, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని అన్నాడు ముద్గలుడు. అలా చెప్పి స్వర్గానికి రానని అంటూ, దేవదూతను పంపించి వేశాడు. ఆ తరువాత ముద్గలుడు ఉంఛవృత్తిని విడిచి గొప్ప జ్ఞానయోగి, జీవన్ముక్తుడు అయ్యాడు.                  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, షష్ఠాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment