Tuesday, November 1, 2022

కాలం కోరుతున్న వామపక్షాల ఏకీకరణ : వనం జ్వాలా నరసింహారావు

 కాలం కోరుతున్న వామపక్షాల ఏకీకరణ

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-11-2022)

ఇటీవల విజయవాడలో ముగిసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలు, దేశానికి ఒక దశ, దిశా నిర్దేశంగా నిలుస్తాయని, ఆ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను, లౌకికవాదాన్ని కాపాడడం వామపక్ష పార్టీల తక్షణ కర్తవ్యమని, వీటిలో పాల్గొన్న పలువురు పార్టీ నాయకులన్నారు. బీజేపీ దుష్పరిపాలన దేశాన్ని లోతైన సంక్షోభంలోకి నెట్టిందని, దేశ ప్రజలపై మతోన్మాద ఫాసిస్టు దాడులు దేశ లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థను, స్వేచ్చ, ఐక్యతలను తీవ్రంగా బలహీనపరుస్తున్నదని, దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చి పెట్టుతున్నదని, అందుకే సెక్యులర్, ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల సువిశాల కూటమిని నిర్మించడం, కమ్యూనిస్టుల ఏకీకరణ జరగడం అవశ్యమని రాజకీయ తీర్మానం పేర్కొన్నది. ఇతర వామపక్ష, లౌకికవాద, ప్రజాతంత్ర పార్టీలతో కలిసి బిజెపిపై పోరాటం చేస్తుందని సీపీఐ నాయకులు స్పష్టం చేశారు. దేశ-విదేశాల నుండి వివిధ వామపక్ష పార్టీల నాయకులు సభలకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘బీజేపీ ముక్త్ భారత్’ పిలుపు, జాతీయ అభివృద్ధి ప్రత్యామ్నాయ అజెండా ఆవశ్యకత నేపధ్యంలో, ఇదొక కీలక మలుపు, ఆశించదగ్గ పరిణామం, అత్యంత అవశ్యం.      

క్రమానుక్రమంగా కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యాన్ని అధ్యయనం చేస్తే, 2004 లోక్‌సభ ఎన్నికలలో 43 స్థానాలు గెలుచుకున్న సీపీఐ(ఎం), 10 స్థానాలు గెల్చుకున్న సీపీఐ, కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించి, అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ 1952 రోజుల నాటి ప్రాధాన్యాన్ని గుర్తుకు తెచ్చేవిధంగా ఉండేవి. అలాంటిది, 2019 సార్వత్రక ఎన్నికల్లో సీపీఐ రెండంటే రెండు స్థానాలతో, సీపీఐ(ఎం) మూడంటే మూడు లోక్‌సభ స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలకు అత్యంత బలీయమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా రాలేదు.    

ఇంత భారీ స్థాయిలో బలీయమైన, ప్రజాబలమున్న వామపక్షాల ప్రాబల్యం పడిపోతే దానివల్ల లాభపడేది దినదిన ప్రవర్ధమానమౌతున్న మతతత్వ అతివాదమే. ఇది దేశానికి, భారత జాతికి ఏమాత్రం అభిలషణీయం కాదు. ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందు వరుసలో ఉండే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకింత వెనుకంజలో వుండడమే దీనికి కారణం. సీపీఐ జాతీయ మహాసభలు జరిగిన తీరుతెన్నులు, కలిసి పోరాడడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన సీపీఐ(ఎం) తీరు, విశ్లేషించి చూస్తుంటే, ఆద్యతన భవిష్యత్తులో దేశస్థాయి రాజకీయరంగంలో పెనుమార్పులకు అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన, డిసెంబర్ 26, 1925న కాన్పూర్ వేదికగా, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, జ్ఞప్తికి వస్తాయి. ఆ రెండు కూడా భారతదేశ పరంగా చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న అద్భుత సందర్భాలు. అలాగే, అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలో సాగిన ప్రపంచ ప్రఖ్యాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దరిమిలా 72 ఏళ్ల క్రితం, 1951 అక్టోబర్‌లో సందర్భోచిత ఉపసంహరణ, స్వాతంత్ర్యానంతరం పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ కాలానుగుణంగా చోటుచేసుకున్న మార్పుల కారణాన అతివాద, మితవాద వర్గాలుగా, నక్సలైట్లుగా, మావోయిస్టులుగా, మధ్యలో మితవాద వర్గం వారు డాంగేయులుగా, మోహిత్ సేన్ పక్షం వారిగా, చీలిపోవడం భారతదేశ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టాలు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమంలో భాగంగా, ప్రథమ పార్టీ మహాసభలో (1943 మే నెల) పీసీ జోషి సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కావడం, ఐదేళ్ల తర్వాత జరిగిన రెండవ మహాసభలో (మార్చ్ 1948) ఆయన స్థానంలో రణదివే రావడం, రణదివే స్థానంలో 1950 జూన్ నెలలో చండ్ర రాజేశ్వరరావును ఎన్నుకోవడం ఆసక్తి రేకెత్తించే అంశాలు. మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగిన వీరోచిత తెలంగాణ సాయుధ ప్రతిఘటనను సవివరంగా, ‘వీర తెలంగాణా విప్లవ పోరాటం గుణపాఠాలు’ పేరుతో పుస్తకం రాసిన పుచ్చలపల్లి సుందరయ్య, ఆ పోరాటాన్ని ఉపసంహరించుకుంటూ చేసిన నిర్ణయం నేపథ్యం డాక్యుమెంట్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీలో భవిష్యత్ చీలికకు పునాదులు పడ్డ వివరాలు అందులో ఉన్నాయి.

అంతర్గతంగా ఉండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత–చైనా యుద్ధం జరిగినప్పుడు, నెహ్రూకు మద్దతు ఇచ్చే విషయంలో బాహాటంగా బహిర్గతమయ్యాయి. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్‌గా, మితవాద–అతివాద వర్గాలకు సమాన దూరంలో ఉన్న ఇఎంఎస్ నంబూద్రిపాద్‌ను సెక్రెటరీ జనరల్‌గా నియమించింది.

తదనంతర పరిణామాల కారణాన పార్టీలో చీలిక అనివార్యమయింది. ఏప్రిల్ 11, 1964న నంబూద్రిపాద్, జ్యోతిబసులతో సహా 32 మంది డాంగే విధానాలను వ్యతిరేకిస్తూ, జాతీయ కౌన్సిల్ సమావేశాలనుంచి నిష్క్రమించడంతో, వారందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో బహిష్కృత అతివాద వర్గం సమావేశమవడం, 1964 అక్టోబర్–నవంబర్‌లో కలకత్తా కాంగ్రెస్ పేరుతో అతివాద వర్గం, సమాంతరంగా బాంబేలో డాంగే నాయకత్వంలోని మితవాద వర్గం సమావేశం కావడం జరిగింది. కలకత్తాలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)గా అవతరించగా, బాంబేలో సమావేశమైన వారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఉండిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడంతో, కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనపడింది అనేది నిస్సందేహం.

కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక తరువాత మూడు రాష్ట్రాలలో వామ పక్ష ఐక్య సంఘటన ప్రభుత్వాలకు సారధ్యం వహించే స్థాయికి ఎదిగిన సీపీఐ (ఎం) ప్రస్తుతం ఒకే ఒక రాష్ట్రానికి పరిమితమైపోయింది. సీపీఐ విషయానికొస్తే ఒక్క రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అధికారంలో లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోని ఒకప్పటి కమ్యూనిస్టుల ప్రాబల్యం ప్రస్తుతానికైతే ఒక్క కేరళ రాష్ట్రానికే పరిమితమైపోయింది. 34 సంవత్సరాలు అవిచ్చిన్నంగా ప్రభుత్వం నడిపిన (ప్రపంచ రికార్డ్) పశ్చిమ బెంగాల్ లో కాని, 30 సంవత్సరాలు అధికారంలో వున్న త్రిపురలో కాని ప్రస్తుతం వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మిగిలింది.

క్రమేపీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక కారణాల వల్ల బలహీనపడ సాగాయి. దీనికి దేశీయ కారణాలతో పాటు అంతర్జాతీయ కారణాలు కూడా లేకపోలేదు. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్ పతనం, 1978 తరువాత చైనా అవలంబిస్తున్న నూతన ఆర్థిక విధానం దీనికి కొంత కారణం అనాలి. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా బలంగా ఉన్నప్పటికీ, అలనాటి మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంలో మార్పు కొట్టొచ్చినట్లు కనపడ సాగింది. సామ్యవాదం చివరి మెట్టు అనేది, నూతన ప్రజాస్వామ్యం మధ్యే విడత అన్న నినాదంతో ఆర్థిక విధానంలో మార్పులు తెచ్చింది చైనా ప్రభుత్వం. ‘సామ్యవాద మార్కెట్ ఎకానమీ’ అన్న నినాదం కూడా తెచ్చారు. కమ్యూనిజాన్ని వీడడం వల్లనే చైనా విజయాలను సాధిస్తోందని కూడా అనడం మొదలైంది. ఈ నేపథ్యంలో మన దేశ వామపక్ష ఉద్యమం కూడా కొంత దెబ్బ తినింది.

1991 తరువాత భారత్‌లో అమల్లోకి వచ్చిన నూతన ఆర్థిక విధానం కూడా వామపక్షాల బలాన్ని దెబ్బ తీసిందని చెప్పుకోవచ్చు. దినదినం బలపడుతున్న ఎగువ, దిగువ మధ్యతరగతి వర్గానికి జనాన్ని నూతన ఆర్థిక విధానాలవైపు మళ్లించగల వనరులున్నాయి. ఆ వర్గాలను ఎలా ప్రభావితులను చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేని వామ పక్షాలు బలహీన పడసాగాయి. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత వామపక్షాలపైన వుంది. అది విడి–విడి పోరాటాలతో కుదరదు. చీలిపోయిన వామపక్షాలకు ఇది సాధ్యపడని విషయం. సైద్ధాంతిక పరంగా, ఆర్థిక అంశాల పరంగా ఎదుర్కోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో వామపక్షాలు కలిసి పనిచేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకమే! సెక్యులరిజం, ప్రజాస్వామ్య మనుగడకు నిబద్ధ కేడర్ కలిగి ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత అత్యంత అవశ్యం. ఆ దిశగా సీపీఐ జాతీయ మహాసభల నిర్వహణ జరగడం విశేషం.

ప్రస్తుతం పెచ్చరిల్లుతోన్న మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే నైతిక శక్తి వామపక్షాలకే ఉన్నది. విలీనం సాధ్యం కాదు కాబట్టి ఐక్యత అత్యంత అవసరం. కేవలం అవి మాత్రమే ఐక్యం అయినంత మాత్రాన సరిపోదు. భారత్ రాష్ట్ర సమితి లాంటి పార్టీలతో కలిసి–మెలిసి జాతీయ స్థాయిలో ముందుకు సాగాలి. అప్పుడే ‘బీజేపీ ముక్త్ భారత్’ సాధ్యమౌతుంది.

ఈ నేపధ్యంలో, జాతీయ మతతత్వ అతివాదం, మితవాద అతివాదం మరింతగా ప్రబలిపోయి ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం వున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన జాతీయ ప్రత్యామ్నాయ అభివృద్ధి అజెండాకు, ఆద్యతన భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో ఆయన నాయకత్వంలో కీలక పాత్ర పోషించనున్న భారత్ రాష్ట్ర సమితికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు పలకడం వర్తమాన రాజకీయాలలో ఆశించదగ్గ చారిత్రాత్మక పరిణామం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఐక్యత, అదేవిధంగా వామపక్షాల ఐక్యత కూడా అభిలషణీయం.

No comments:

Post a Comment