Monday, November 7, 2022

పానీపూరి..మిర్చిబజ్జీ 5 పైసలు ..... హైదరాబాద్ అప్పుడు...ఇప్పుడు (గుర్తుకొస్తున్నాయి...) : వనం జ్వాలా నరసింహారావు

 పానీపూరి..మిర్చిబజ్జీ 5 పైసలు

హైదరాబాద్ అప్పుడు...ఇప్పుడు (గుర్తుకొస్తున్నాయి...)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (08-11-2022)

ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకుని, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో పూర్తిచేయడానికి 1964 లో హైదరాబాద్ వచ్చి, గత ఏబై ఎనిమిది సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్న నాకు, ఆరుదశాబ్దాల క్రితం నాటి ఈ నగరం జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి.  ఖమ్మం నుండి హైదరాబాద్ చేరుకోవడానికి అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అప్పట్లో వున్న ఏకైక ఫాస్ట్ పాసింజర్ బస్సెక్కితే గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. చార్జీ కేవలం ఆరు రూపాయలు మాత్రమే. ఇప్పుడైతే లెక్కలేనన్ని బస్సులు, చార్జీ రు. 300 పైనే. చిక్కడపల్లి వెళ్లడానికి రిక్షా వాడిని మొదలు ‘చల్తే క్యా’ అని హింది-ఉర్దు కలిసిన భాషలో అడగడం, ‘కహా జానా సాబ్’ అని వాడు ప్రశ్నించడం, మేం చిక్కడపల్లి ‘దేవల్ కి బాజు గల్లీ’ అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు ‘బారానా’ కిరాయి అడుగుతే, మేం ‘ఛె ఆనా’ ఇస్తామనడం, చివరకు ‘ఆఠానా’ కు కుదరడం జరిగిపోయింది. ఇప్పుడైతే ఊబర్ రేటు రు 400 పైమాటే. చిక్కడపల్లి చేరడానికి సుమారు గంట పట్టింది. అప్పట్లో ఆటోలు, టాక్సీలు తక్కువ.

నారాయణగూడాలో వున్న న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్పీ రెండో సంవత్సరంలో చేరడం జరిగింది. ఒకనాటి నూతన విద్యా సమితి స్థాపించిన ఆ కాలేజీ యాజమాన్య బాధ్యతలను, దరిమిలా భారతీయ విద్యా భవన్ చేపట్టింది. అప్పట్లో కాలేజీలు ఎక్కువ లేవు. విద్యా నగర్ అడ్డీకమేట్ లో నెలకు పది రూపాయలకంటే తక్కువకు ఒక గది అద్దెకు తీసుకున్నాను. కొన్నాళ్లకు హిమాయత్ నగర్ లో పది రూపాయల అద్దెకు నా కజిన్ తో కలిసి చెరి ఐదు రూపాయల చొప్పున,  ఆ తరువాత మరొకరితో కలసి రెడ్డి మహిళా కాలేజీ పక్క సందులో, గదిలాంటి ఒక ‘గారేజ్’ 15 రూపాయల అద్దెకు తీసుకున్నాం. ఇప్పటిలా వేలల్లో అద్దెలు లేవు.

అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపితే, ఫీజులకు, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను రూపాయలు మిగిలేవి. ఆ పైకంతో శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు మిగిలేవి. ఇప్పుడైతే కిండర్ గార్డెన్ స్కూళ్లకు కూడా వేలల్లో ఫీజులు, లక్షల్లో డొనేషన్లు వున్నాయి.

తొడుక్కోవడానికి పాంటు-షర్ట్ గుడ్దలు కొని, నారాయణ గుడాలోని ‘యాక్స్’ టైలర్ దగ్గర కాని, ‘పారగాన్’ టైలర్ దగ్గర కాని కుట్టించుకుంటే, కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. అప్పట్లో ‘రెడీ మేడ్’ దుస్తులు ధరించడం అరుదు. మొదట్లో ‘బాటం వెడల్పు’ పాంట్లు, తరువాత ‘గొట్టం’ పాంట్ల ఫాషన్, అవి పోయి ‘బెల్ బాటం’ వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది. ఇప్పుడైతే టైలర్ దొరకడమే కష్టం. అంతా రెడీమేడ్! ఒకవేళ టైలర్ దొరికినా వేలల్లో కుట్టు కూలీలే కాకుండా, కుట్టడానికి కనీసం పక్షం రోజులపైనే సమయం పటుతుంది. కొందరి దగ్గరైతే ముందుగా అప్పాయింట్మెంట్ కూడా తీసుకోవాలి. వారిష్టమొచ్చినట్లు కుట్టడమే కాని మన మాట వినిపించుకోరు. 

విద్యా నగర్ నుండి కాలేజీకి వెళ్లడానికి ‘3-డి’ బస్సు ఎక్కి, నారాయణగుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి ‘చారనా’ బాడుగ ఇచ్చి ‘చార్మీనార్ చౌ రాస్తా’ (ఇప్పటి ఆర్ టి సి క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి ‘7-సి’ బస్సెక్కి, వైఎంసిఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ కర్మాగారం (నీలం రంగు పాకెట్ లో వచ్చే) అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ నుండి జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి ‘రామ్ నగర్ గుండు’ (ఇప్పుడు మాయమైంది) మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ రాస్తా (ఆర్టిసి క్రాస్ రోడ్స్) నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక ‘కల్లు కాంపౌండ్’ వుండేది. ఇందిరా పార్క్ లేదు. ధర్నాచౌక్ ఊసే లేదు.  

సిటీ బస్సుల్లో ప్రయాణం హాయిగా, ఆహ్లాదంగా వుండేది. ‘ఆగే బడో’ అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక ‘అణా’ లేదా ఆరు ‘నయాపైసలు’ వున్నట్లు గుర్తు.

అప్పట్లో ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. ‘దశాంశ’ తరహా నాణాలు రాలేదు. రూపాయను పదహారు ‘అణా’లుగా, ఎనిమిది ‘బేడ’లుగా, నాలుగు ‘పావలా’లుగా, రెండు ‘అర్థరూపాయ’ లుగా విభజించి చలామణిలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా, పచ్చ రంగులో వుండేవి. 1957 లో ‘డెసిమల్’ పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. కొంతకాలం నాన్-డెసిమల్, డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. ఆ తరువాత నాన్-డెసిమల్  నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో ‘నయా పైస’ లుగా పిలిచేవారు.

న్యూసైన్స్ కాలేజీకి వెళ్లే దారిలో వైఎంసిఏ కి ఎదురుగా ‘ఇంద్ర భవన్’ (ఇప్పుడు లేదు) ఇరానీ రెస్టారెంటులోనో లేదా కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) ‘సెంటర్ కెఫే’ లోనో ఇరానీ ‘చాయ్’ కాని ‘పౌనా’ కాని 10-15 పైసలిచ్చి తాగే వాళ్లం. అలాగే 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో ‘పానీ పురి’ ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి ‘సాయిబాబా మిఠాయి భండార్’ లో ‘గులాబ్ జామూన్, ‘కలకంద’ తిని, కబుర్లు చెప్పుకుంటూ, తియ్యగా వుండే ‘హైదరాబాద్ మౌజ్’ కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు పొడుగ్గా, అర డజన్ హైదరాబాద్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. ఇప్పుడు అవేవీ లేవు. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

నారాయణ గుడా తాజ్ మహల్ కు టిఫిన్ కు,  రెండు పూటలా భోజనానికి వెళ్లేవాళ్లం. అప్పట్లో తాజ్ మహల్ లో (రెండు విడతలుగా) 36 రూపాయలిస్తే 60 (నెలకు రెండు పూటలా సరిపోయే) భోజనం కూపన్లు ఇచ్చేవారు. నెలకు నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లదానికి అదనంగా నాలుగు టికెట్లుండేవి. భోజనంలో చిన్న సైజు పూరీలు ‘అన్ లిమిటెడ్’ ఇచ్చేవారు. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో పరిశుభ్రంగా పెట్టేవారు భోజనం. ఇప్పుడు 36 రూపాయలకు ప్లేట్ ఇడ్లీ కాని, కప్పు కాఫీ కాని కూడా రాని పరిస్థితి! కాలేజీ క్లాసులు ముగిసిన తరువాత సాయంత్రం మళ్లీ తాజ్ మహల్ హోటల్లో స్నేహితులం కలిసి కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ ‘ముర్కు’ లేదా ‘మైసూరు బజ్జీ’  తిని, ‘వన్ బై టు’ లేదా ‘వన్ బై త్రీ’ కాఫీ తాగి (అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు!) బయట పడే వాళ్లం.  

హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకానన్నా, లేదా నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వైఎంసిఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి హాయిగా తిరిగి వచ్చే వాళ్లం. హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న ‘బ్రిడ్జ్’ అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న ‘హనుమాన్’ గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో, కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక పెద్ద కల్లు కాంపౌండ్ వుండేది.

హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. ఆబిడ్స్ లో వున్న ‘జమ్రూద్’ టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వివి కాలేజీ పక్కనున్న ‘నవరంగ్’ థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో ‘దీపక్ మహల్’, హిమాయత్ నగర్ లో ‘లిబర్టీ’, సికిందరాబాద్ లో ‘పారడైజ్’, ‘తివోలీ థియేటర్లుండేవి. ముషీరాబాద్‌లో ‘రహమత్ మహల్’ టాకీసుండేది. ఇప్పుడు ఎన్ని టాకీసులున్నాయో బహుశా లెక్కకూడా లేదేమో!

నారాయణ గుడా దీపక్ మహల్ పక్కన ‘రాజ్ కమల్’ బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. హైదరాబాద్ మొత్తంలో బహుశా ఒక అరడజన్ కంటే ఎక్కువ బార్లు వుండేవి కావు. నాకు గుర్తున్నంతవరకు ఆబిడ్స్ లో ‘త్రీ ఏసెస్’, లిబర్టీ దగ్గర ‘మహారాజా, సికిందరాబాద్ లో ‘క్వాలిటీ, బాంక్ స్త్రీటులో ‘రుస్తుంజీ లాంటివి వుండేవి. అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి పోయింది. అప్పట్లో కేవలం గోల్డెన్‌ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని వున్నాయి!

బహుళ అంతస్తుల భవనాలు అసలే లేవు. లిఫ్టులున్న ఇల్లు లేనే లేవు. ఒకవైపు సంజీవరెడ్డి నగర్, మరోవైపు పంజాగుట్ట, ఇంకోవైపు మలక్పేట, ఇంకోవైపు సికిందరాబాద్ క్లబ్ బహుశా నగరం చివరేమో కావచ్చు. భవన నిర్మాణ కారణాన ఇప్పటిలా రేడియేషన్ ఏమాత్రం లేకపోయేది. సాయింత్రం నాలుగయ్యేసరికి చిన్నపాటి గాలి, చిరుజల్లులు, చల్లదనం నగరానికి ఆహ్లాదం తెచ్చిపెట్టేవి. అవన్నీ కరువే ఇప్పుడు. అరవై ఏళ్ల క్రితం నాటి హైదరాబాద్ గురించి ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో!

1 comment:

  1. చిన్ననాటి ముచ్చట్లు ఎప్పుడూ అందంగా గుర్తొస్తూనే ఉంటాయి.

    ReplyDelete