Monday, November 21, 2022

ఓనమాలు, వంట్లు, ఎక్కాలు, పెద్దబాలశిక్ష (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 ఓనమాలు, వంట్లు, ఎక్కాలు, పెద్దబాలశిక్ష

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (22-11-2022)   

        తెలంగాణ సాయుధ పోరాటం నేపధ్యంలో, ఆగస్ట్ 8, 1948 న పుట్టిన నేను, బాల్యం, ఐదో తరగతి వరకూ చదువు అంతా స్వగ్రామంలోనే. హయ్యర్ సెకండరీ (11 వ తరగతిని హెచ్ఎస్సీ అనేవారు) చదువు జిల్లా కేంద్రమైన ఖమ్మంలో. నా మూడో ఏట చదువు ప్రారంభమైంది. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో (70 సంవత్సరాల క్రితం) గ్రామాలలో ఖాన్గీ బడులుండేవి. ఎర్ర శేషయ్య (పంతులు) గారి ఖాన్గీ బడి (పాశాల) లో చేర్పించారు నన్ను. ఉదయాన్నే బడికి పంపేవారు. అందరికంటే ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద ‘శ్రీ’ అని పంతులు గారు రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన ‘ఒక చుక్క’ పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. ‘శ్రీ’ పెట్టించు కోవడం కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వాళ్లం. సమయానికి స్కూల్ కు వెళ్లడానికి అదొక రకమైన క్రమశిక్షణ అనాలి.

ఇప్పటిలాగా ‘ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ కాట్....’ కాకుండా, ఆ బడిలోనే ‘ఓనమాలు’ (, , , , , ...), ‘వంట్లు’ (1,2,3,4,5...), ‘ఎక్కాలు’ (ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక మూడు మూడు....), ‘కూడికలు, తీసివేతలు’ (1+1=2, 2+2=4, 4+3=7.....1-1=0, 2-1=1…), ‘తెలుగు వారాలు’, ‘తెలుగు మాసాలు’, ‘తెలుగు సంవత్సరాలు’ లాంటివి నేర్పారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. ‘పెద్ద బాల శిక్ష’ లోని వివిధాంశాలను చాలావరకు నేర్చుకున్నదక్కడే. ‘విశ్వక్సేనుడు’, ‘జంబీర బీజం’, ‘మందార దామం’ లాంటి కఠిన (గొట్టు) పదాలను ఎలా పలకాలో నేర్చేవారు పంతులు గారు. అలా, ఒక ఏడాది గడిచి పోయింది.

గ్రామంలో కొఠాయి (రచ్చబండ) దగ్గర ఒక పూరి పాకలో వున్న ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు నాన్న గారు. చేరడానికి కనీస వయసు ఐదేళ్లయినందున నా పుట్టిన తేదీని మార్పించి, పాఠశాల రికార్డులలో జులై 1, 1947 గా రాయించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు, అది ఏకోపాధ్యాయ పాఠశాల. ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. ఒకరిని ‘పాత పంతులు గారు’ అని, మరొకరిని ‘కొత్త పంతులు గారు’ అని గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిని అత్యంత గౌరవంగా సంబోధించే వారు. ఉపాధ్యాయుడు అంటే గ్రామస్తులకు అప్పట్లో వున్న గౌరవ, మర్యాదలు క్రమేపీ క్షీణించడానికి కొంత పంతుళ్లు కారణమైతే, కొంత గ్రామస్తులు కారణం. 

గ్రామంలో క్రమేపీ కొత్త పాఠశాల భవనం (చిన్నది) తయారైంది. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ భట్ సమక్షంలో, అప్పట్లో జిల్లా-రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మాజీ మధిర ఎమ్మెల్యే బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి చేతుల మీదుగా,  పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడైన మా నాన్న గారు వనం శ్రీనివాస రావు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది (బహుశా 1954 లో కావచ్చు). ఇటీవలి కాలం వరకూ ఆ నాటి ప్రశంసా పత్రం పాఠశాల గోడకు వేలాడుతూనే వుంది. ఈ మధ్యన నేను చూడడం తటస్థించలేదు. పాఠశాల ఆ భవనంలోకి మారిన తరువాత మరో ఉపాధ్యాయుడు చేరారు. మరి కొంతకాలానికి ఒక తెలుగు మాస్టారు కూడా చేరారు. అలా, అలా అభివృద్ధి చెందిన అ పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి దాకా ఉన్నప్పటికీ రూపురేఖలు చూడ సొంపుగా మాత్రం లేవు. బాగుచేయడానికి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి, అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వాళ్లం. ఇప్పుడైతే మూడో ఏటనుంచే బాల్ పాయింట్ పెన్నులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇలా ఎన్నో పిల్లలకు అందుబాటులో వున్నాయి. వాటి ఉపయోగం పెద్దల కంటే వారికే ఎక్కువ తెలుసంటే ఆశ్చర్యపడక్కరలేదు.

ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున ఖమ్మం మామిళ్లగూడెంలో, మా ఇంటికి అతి సమీపంలో వున్న రికాబ్-బజార్ పాఠశాలలో చేరి అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.

సినిమా రీళ్లలాగా మా రికాబ్ బజార్ స్కూల్ విషయాలు కొన్ని గుర్తుకు వచ్చాయి. ఆరవ తరగతిలో నన్ను చేర్పించిన మర్నాడు నాన్న గారు ఆ ఏడాదికి కావాల్సిన పుస్తకాలు కొన్నారు. అన్ని పుస్తకాలు (వాస్తవానికి ఇప్పటికంటే చాలా తక్కువ) చూడగానే, ఇన్ని చదవాల్నా అని ఏడుపొచ్చింది. కొన్నాళ్లకు అలవాటై పోయింది. చరిత్ర, భూగోళం సబ్జెక్ట్ బోధించే సార్ చాలా స్ట్రిక్ట్. ఈనాడు చెప్పిన పాఠాన్ని మర్నాడు అప్ప చెప్పని విద్యార్థులను తీవ్రంగా దండించేవాడు. చేయిపై ‘పేను బెత్తం’ తో కొట్టడంతో సహా, ఒక్కోసారి ‘కోదండం’ కూడా వేయించేవాడు. ఇప్పుడు అలా దండించడం జరగదు. తెలుగు బోధించే మాస్టారు విద్యార్థులతో  పాఠశాల క్లాసులు ముగిసిన తరువాత రిహార్సల్స్ చేయించి నాటకాలు వేయించే వారు.

          హిందీ బోధించే ఇద్దరు సార్లు చక్కగా అది మన మాతృభాషా అన్నరీతిలో బోధించేవారు. రసూల్ సార్ అనే ముస్లిం మాస్టారు చదువుకుంది కేవలం హెచ్.ఎస్.సీ వరకు మాత్రమే అయినా బోధించని సబ్జెక్ట్ లేదు. లెక్కలు బోధిస్తుంటే అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుండేది. అలాగే సైన్స్ బోధించే మాస్టారు, లెక్కలు చెప్పే మరొక మాస్టారు. అందరిలోకి చాలా చక్కగా, ఆంగ్లాన్ని మాతృభాషంత సులభంగా బోధించే ఒక మాస్టారు ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్’ బ్రహ్మాండంగా చెప్పేవాడు. అది నేర్చుకున్నందువల్లే బహుశా ఇవ్వాళ ఇంగ్లీష్ లో మేం అంతో-ఇంతో మంచిగా రాయగలుగుతున్నాం. ఇదంతా ఆయన పుణ్యమే! ఇటీవల కాలంలో ఎవరైనా విద్యార్థిని ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్’ గురించి అడుగుతే ఏమీ తెలియదని , అదేంటో చెప్పిన తరువాత, కంప్యూటర్లో గ్రామర్ చెక్, స్పెల్ చెక్ వుంది కదా, ఇదెందుకు నేర్చుకోవాలని జవాబిచ్చారు!!!.

అప్పటికీ, ఇప్పటికీ చదువుల్లో తేడా కనిపిస్తూనే వున్నది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివినా రెండు ముక్కలు రాయలేరు, మాట్లాడలేరు. ఇక మాతృభాష తెలుగు మాకు రాదనేవారి సంఖ్యే ఎక్కువ!!!.

1 comment:

  1. వనం.వారూ, విశ్వక్సేనుడు కాదండీ విష్వక్సేనుడు.

    ReplyDelete