బ్రహ్మ నీతి శాస్త్రం, వైన్యుడి దండనీతి, భీష్ముడు వివరించిన వర్ణాశ్రమ ధర్మాలు
ఆస్వాదన-97
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-11-2022)
మూడవ రోజున
ధర్మరాజాదులు వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లారు.
అంతకు ముందే అక్కడికి మహర్షులు వచ్చారు. కుశల ప్రశ్నల అనంతరం ధర్మరాజు భీష్ముడిని
బుద్ధిమంతులైన ప్రజలను రాజు ఏవిధంగా తన వశం చేసుకుంటాడని, సంరక్షిస్తాడని, నాశనం చేస్తాడని, ఏవిధంగా భగవంతుడితో సమానంగా
పూజార్హుడు అవుతాడని ప్రశ్నించాడు. జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు:
‘పూర్వం ఇలాంటి
విషయాలను ప్రత్యేకించి పరిశీలించినవాడు ఎవరూ లేరు. పరస్పరం ఒకరినొకరు రక్షకులై
వుంటూ వచ్చారు. ధర్మం వినాశనమై పోయింది. ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. యథేచ్చగా
దుర్మార్గ ప్రవర్తనలతో వేద వినాశకులయ్యారు. ఇది చూసి భయపడి దేవతలప్పుడు తమను
కాపాడమని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. లోకంలో రక్షాస్థితిని ఏర్పాటు చేయడానికి
బ్రహ్మ సప్త సోపానాలు, దండనీతి, ద్వాదశరాజ మండలాలు,
పంచోపాయాలు మొదలుగాగల లక్ష అధ్యాయాల నీతిశాస్త్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత
బ్రహ్మ నొసటి నుండి ఆవిర్భవించిన విరూపాక్షుడు,
విశాలాక్షుడనే పేరుతో దాన్ని సంక్షిప్తీకరించి ‘వైశాలాక్షం’ అనే పేరుతో పదివేల
అధ్యాయాలగా కుదించాడు. దరిమిలా ఇంద్రుడు ఐదువేల అధ్యాయాలకు, బృహస్పతి మూడు వేల అధ్యాయాలకు తగ్గించి
అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేశారు’.
‘ఆ నీతి
శాస్త్రాన్ని శుక్రాచార్యుడు వేయి అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల
శక్తికి అనుకూలంగా, అనుగుణంగా సంక్షిప్తం చేశారు. దానిని
అభ్యసించి, ఆచరణలో పెట్టి, ఇతరులతో పెట్టించగల మానస పుత్రుడిని విరజుడు అనే పేరుతో విష్ణువు
సృష్టించాడు. అతడు దండనీతిని పాటించడానికి భయపడ్డాడు. అతడి మనుమడు అనంగుడు దాన్ని
అమలు చేశాడు. అలా, అలా రాజులలో కొందరు దండనీతిని పాటించక
అసమర్థులయ్యారు. పాటించిన వారు విష్ణు తేజులయ్యారు. అతడి వంశంలోని వేనుడి చరిత్ర
ప్రసిద్దమైనది. వేనుడు రాగద్వేషాల కారణంగా ప్రజా విరుద్ధుడయ్యాడు. అప్పుడు
మహర్షులు వచ్చి మంత్రాలతో పవిత్రీకరించిన దర్భలతో అతడిని ఉపశమింపచేసి అతడి కుడి
తొడను మథించారు. అలా చేయడం వల్ల అశుచి అయిన ఒకడు పుట్టాడు. అతడి సంతతి జాతులు
నిషాదులై దండనీతి విరహితులయ్యారు. మహర్షులు మళ్లీ కుడి బాహువును మథించారు. వైన్యుడు
అనే మహాపురుషుడు పుట్టాడు. అతడిని దండనీతి ఆశ్రయించింది’.
‘వైన్యుడు మునుల
బోధ విన్నాడు. దురహంకారం, లోభం, కామక్రోధాలు అనే దుర్గుణాలను వదలి సమస్త ప్రాణుల పట్ల సముడివై,
శాస్త్ర విహితంగా రాజ ధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించమని మునులు
వైన్యుడికి చెప్పారు. ఇష్టానిష్టాలను లెక్క చేయకుండా, నిర్లిప్తుడిగా కర్తవ్యాన్ని యథావిధిగా
నిర్వర్తించాలని, దండనీతిని అనుసరించిన ధర్మ రక్షణమే తన దైనందిన
విధిగా భావించాలని, వేద సంరక్షణ చేయాలని, వర్ణసాంకర్యం
పరిహరించి దయాంతఃకరణంతో ప్రజలను పాలించాలని మునులు ఆయన్ను ఆదేశించారు. బ్రాహ్మణుల
సహాయ సహకారాలు వుంటే వారు చెప్పినట్లే ప్రవర్తిస్తానని వైన్యుడు హామీ ఇచ్చాడు. మహర్షులు
వైన్యుడికి బ్రాహ్మణులను సహాయకులుగా అనుమతిచ్చారు. సమస్త భూమికి వైన్యుడిని రాజుగా
అభిషేకించారు. అతడికి శుక్రాచార్యుడు పురోహితుడిగా, సారస్వతగణం మంత్రులుగా,
గర్గుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకు ముందు మిట్ట పల్లాలుగా వున్న భూమిని
వైన్యుడు సమతలం చేశాడు. భూమి, సప్తసముద్రాలు, కులపర్వతాలు వైన్యుడిని సేవించాయి’.
‘అధికార పదవిని
అలంకరించిన వైన్యుడు శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై, సత్యవ్రతుడై పరిపాలన చేశాడు. వైన్యుడి సంతానం
కూడా అతడితో సమానంగా దండనీతిని అనుసరించి రాజ్యపాలన చేశారు. శ్రీమహావిష్ణువు
ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి, ధర్మదేవుడికి భార్యయై అర్థమనే
కొడుకును పొందింది. లక్ష్మి, ధర్మదేవత, అర్థమనే కొడుకు, ముగ్గురూ కలిసి దృఢంగా రాజును
ఆశ్రయిస్తారు. అందువల్ల రాజు, ఇతరుల లాంటివాడు కాకుండా విష్ణు
సన్నిభుడుగా పరిగణించబడ్డాడు. వేదాలు,
పురాణాలు, ఇతిహాసాలు,
చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వాటి రక్షణ రాజాజ్ఞకు లోనై వుంటాయి. అందుకే రాజులు దేవతలతో సమానమని
అంటారు’.
ఇంకా అడగాల్సిన
విషయాలేమన్నా వుంటే అడగమని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు నాలుగు వర్ణాల గురించి, నాలుగు ఆశ్రమాల గురించి వివరించమని కోరాడు
తాతను. ఆ వివరాలను తన మాటల్లో ఇలా చెప్పాడు భీష్ముడు:
‘ఎట్లాంటి
పరిస్థితులలోనైనా కోపం లేకుండా శాంతంగా వుండడం,
సత్యాన్నే చెప్పడం, స్వభార్య అంటే ఆసక్తిగా వుండడం, పరిశుద్ధతతో కూడిన రహస్య రక్షణం, ద్రోహ చింతన లేకుండా వుండడం అనే ఉత్తమ గుణాలను
నాలుగు వర్ణాల వారు విధిగా పాటించాలి. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం శ్రేష్ఠ
ధర్మం. వేదాధ్యయనం నిత్యకృత్యం. వేద విహిత కర్మలు సదా నిష్టతో నిర్వహించాలి.
సన్మార్గవర్తనం, దయాంతఃకరణం, శాంత స్వభావం, అధిక ధనం లభిస్తే తన సంతానానికి కాకుండా
అర్హులైన వారికి పంచిపెట్టడం బ్రాహ్మణుడికి అర్హ లక్షణాలు. ఆజ్ఞాచారణం, దానకర్మ,
వేదాధ్యయనం, నేరగాళ్లను శిక్షించడం,
ప్రజానురాగంతో పాలన చేయడం, యుద్ధంలో ఓటమికి వెరువకుండా
పరాక్రమించడం మొదలైనవి రాజ, క్షత్రియ ధర్మాలు. వీటన్నిటిలో యుద్ధం
అనేది అత్యుత్తమ ధర్మం. వైశ్యుడికి వేదాధ్యయనం, దాన యజ్ఞాచరణం, న్యాయార్జనం, పశుపాలనం పరమ ధర్మాలు. ఇక శూద్ర లక్షణం: బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ వుండడం,
రాజాజ్ఞతో ధనధాన్యాలు సమకూర్చుకోవడం, దానధర్మాలు నిర్వహించడం మొదలైనవి’.
‘చతురాశ్రమ
లక్షణాలు ఇలా వున్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో గురుసేవ, వేదాధ్యయనం, గోష్టుల పట్ల,
అలంకారాల పట్ల అనాసక్తి, బిక్షాన్నంతో జీవించడం, రాగద్వేషాలకు దూరమై సమభావంలో వుండడం లాంటివి
ధర్మాలు. స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ఠ, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల సమర్చనం, సమస్తాశ్రమ నిర్వాహకులను శక్త్యనుసారం
పోషించడం గృహస్తాశ్రమ ధర్మాలు. సంతానం పట్ల మమకారం వదలడం, ఒక్కడుకానీ, భార్యా సమేతంగా కానీ ఘోరమైన అరణ్యాలలోకి పోవడం, అభిమాన అహంకారాలను వదిలిపెట్టడం, జడలు ధరించి ఇంద్రియ నిగ్రహం పాటించడం, శాస్త్రాధ్యయనం చేయడం, జ్ఞానుల గోష్టులలో పాల్గొనడం వానప్రస్థ ఆశ్రమ
ధర్మాలు. ఇక సన్న్యాసాశ్రమ ధర్మాలు ఇలా వుంటాయి: మమకార విరహితుడై ఎక్కడో ఒక్క చోట
వుంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ
రాత్రి అవుతే అక్కడే పడుకుంటూ, అగ్నికార్యాలను త్యజించి నడుచుకుంటూ, తనంతట తాను ఏదీ కోరకుండా వుంటూ, ఇంద్రియ నిగ్రహంతో వుంటూ, నమస్కారాలను అంగీకరించకుండా జీవితం గడపాలి’.
‘చతుర్వర్ణాలవారెవరైనా
ఈ నాలుగు ఆశ్రమాలను చేపట్టవచ్చు. ఆశ్రమ లక్షణాలకు అనుగుణంగా వర్తించవచ్చు. అయితే, శూద్రుడు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమాలను
స్వీకరించవచ్చు కాని సన్న్యాసాశ్రమాన్ని మాత్రం స్వీకరించ కూడదు. ధర్మాలు
అన్నిటిలో రాజ ధర్మం శ్రేష్టమైనది. రాజు అంటే ధర్మ దేవతే కాని వేరే కాదు. పూర్వం
మాంధాత అనే రాజు తపస్సు చేసి, తనకు సంసార జీవితాన్ని తొలగించి, బిచ్చం ఎత్తుకుని
జీవించే ఆసక్తిని కలిగించమని ఇంద్రుడిని కోరాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రాజుతో, పాలకులకు బిక్షాచరణం తగదని, ప్రజారక్షణం, యుద్ధంలో శరీర త్యాగం వారికి శుభప్రదమని, వారి స్థానం చాలా గొప్పదని చెప్పాడు. ఆశ్రమ
ధర్మాలను రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం చేయడం మంచిదన్నాడు’.
ఆ తరువాత ప్రశ్న
వేయడానికి ధర్మరాజు సిద్ధమయ్యాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment