Sunday, November 6, 2022

ధర్మరాజు పట్టాభిషేకం, యువరాజుగా భీముడు, ధృతరాష్ట్రుడి పెద్దరికం పునరుద్ఘాటన ..... ఆస్వాదన-94 : వనం జ్వాలా నరసింహారావు

 ధర్మరాజు పట్టాభిషేకం, యువరాజుగా భీముడు,

ధృతరాష్ట్రుడి పెద్దరికం పునరుద్ఘాటన

ఆస్వాదన-94

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-11-2022)

వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, శ్రీకృష్ణుడు మొదలైన అనేక మంది పెద్దలు అనేక విధాలుగా బోధించడంతో ధర్మరాజుకు కలతపాటు పోయి రాజ్యపాలన చేయాలనే ఆసక్తి మొదలైంది. ఇలా అంతా చెప్పిన మాటలు విన్న ధర్మరాజు వైరాగ్యం తొలగించుకొని పట్టాభిషేకానికి సుముఖుడయ్యాడు. వ్యాసుడు మొదలైన మునులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, వారి నుండి భూభార నిర్వహణకు అనుమతిని, ఆశీస్సులను తీసుకుని తరువాత కార్యక్రమానికి సన్నద్ధమయ్యాడు. యుద్ధంలో పాల్గొనకుండా తప్పించుకొన్న రాజులు తన దర్శనార్ధమై రాగా వారిని కలుసుకున్నాడు. మర్నాడు వేకువనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తన కోసం సిద్ధం చేసిన ప్రత్యేక రథాన్ని అధిరోహించాడు.    

ధర్మరాజు అధిరోహించిన రథానికి భీముడు సారథ్యం వహించాడు. అర్జునుడు వెల్లగొడుగు పట్టాడు. నకుల సహదేవులు వింజామరలు పట్టుకొని వీయసాగారు. మంగళ వాద్యాలు మోగాయి. ఆ విధంగా ధర్మరాజు హస్తినాపుర ప్రవేశ యాత్ర మొదలైంది. ఆ యాత్రలో గాంధారీ, ధృతరాష్ట్రులు ఒక పల్లకీలో కూచొని ముందుగా బయల్దేరారు. ఆ వెనుక ధర్మరాజు, తరువాత శ్రీకృష్ణ, సాత్యకులు రథంలో పోసాగారు. పక్కనే మరొక రథంలో యుయుత్సుడు, మరో వాహనంలో కుంతి, విదురుడు పయనమయ్యారు. రాజులంతా అన్ని వైపులా సైన్యాలతో సహా యాత్రలో పాల్గొన్నారు. హస్తినాపురం శోభాయమానంగా అలంకరించబడింది. ధర్మరాజును పురజనులు దారిపొడుగూతా పలురకాలుగా కీర్తించారు. ద్రౌపదీదేవిని పొగిడారు.

ధర్మరాజు రాజప్రాసాదం వాకిలిని సమీపించగానే బ్రాహ్మణులు, స్త్రీలు మంగళద్రవ్యాలను సమర్పించగా వాటిని ధర్మరాజు ఆమోదించాడు. ముఖశాల దగ్గర దిగి ధౌమ్య ధృతరాష్ట్రులు ముందు నడుస్తుండగా అంతఃపుర ప్రవేశానికి ఉపక్రమించాడు. ఇలవేల్పులను ముందుగా పూజించాడు. నగర దేవతలను అర్చించడానికి ఏర్పాట్లు చేశాడు. విరివిగా దానధర్మాలు చేశాడు. బ్రాహ్మణ ఆశీస్సులు తీసుకున్నాడు.

ఆ సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన చార్వాకుడు బ్రాహ్మణుల మధ్యనుండి లేచి ధర్మరాజును నిందించసాగాడు. బ్రాహ్మణులంతా కలిసి తనను పంపారని, ఘోరపాపం చేసిన ధర్మరాజు ఒక రాజా? అని అన్నారని, యుద్ధంలో శత్రువులను చంపే సమయంలో తండ్రి అని కాని, కొడుకని కాని, సోదరుడని కాని, గురువని కాని, స్నేహితుడని కాని జంకలేదని అన్నారని, అతడిని తగలబెట్టినా తప్పులేదని వారంతా అన్నారని చెప్పాడు. ఇలా ఇంతమంది మంచివారు ఏవగించుకునే ఆ రాజ్యం చేయడం ఎందుకని ప్రశ్నించాడు. బందువధ చేసి ఎటువంటి భోగాలు అనుభవిస్తావని, ధర్మరాజు మహాపాపి అని దూషించాడు చార్వాకుడు.

ఆ మాటలు విన్న బ్రాహ్మణులు కలవరపడ్డారు. ధర్మరాజు సిగ్గుతో తలవంచుకున్నాడు. తాను మునులందరి ఆజ్ఞానుసారం రాజ్యభారం మోయడానికి సిద్ధ పడ్డానని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణులంతా చార్వాకుడు తమ ప్రతినిధి కాడని పేర్కొన్నారు. ధర్మార్జితమైన రాజ్యాన్ని ధర్మరాజు కలకాలం అనుభవించాలని దీవించారు వారంతా. దివ్యదృష్టితో అతడు దుర్యోధనుడి స్నేహితుడిగా గుర్తించారు. కంటి మంటలతో అతడిని నేలగూల్చారు. శ్రీకృష్ణుడు చార్వాకుడి శాప వృత్తాంతాన్ని చెప్పి, బ్రాహ్మణులను ప్రశంసించాడు. ధర్మరాజును పట్టాభిషేకానికి సిద్ధం కమ్మని పలికాడు.

పట్టాభిషేకానికి కావాల్సినవన్నీ సమాయత్తం చేయించారు. ఆరుబయట పెద్ద కొలువు తీర్చారు. ధర్మరాజుకు ఎత్తైన బంగారపు సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. మిగిలినవారికి వారివారికి తగిన విధంగా ఆసనాలను ఏర్పాటుచేశారు. ధర్మరాజు మనస్సులో వున్న బాధను దిగమింగి సింహాసనం మీద తూర్పు ముఖంగా ఆసీనుడయ్యాడు. ఆయనకు ఎదురుగా సాత్యకిని కూడిన శ్రీకృష్ణుడు బంగారు గద్దె మీద కూచున్నాడు. భీమార్జునుల రత్న సింహాసనాల మీద కుడి ఎడమలా కూర్చోగా, నకుల సహదేవులు వెనుక పక్క వున్నారు. మిగిలిన వారు సముచిత స్థలాలలో, సముచిత ఆసనలాలో కూర్చున్నారు. పురప్రముఖులు కొలువు తీరారు. సభ చాలా బాగా ప్రకాశించింది.

ధౌమ్యుడు ఈశాన్య దిక్కున పల్లంగా వున్న ప్రదేశంలో వేదికను సిద్ధం చేశాడు. దానిమీద రత్నభద్ర పీఠాన్ని స్థాపించాడు. దానిమీద పులితోలు కప్పాడు. బంగారు దండలతో కూడుకున్న శంఖాన్ని పవిత్ర స్థలంలో నిలిపి పూజించాడు. దాని చుట్టూ మట్టి, బంగారు, వెండి, మణి కలశాలలో గంగాజలం నింపి, శుభ ద్రవ్యాలను అందులో వుంచారు. మంత్రాలను పఠిస్తూ ధర్మరాజును భద్ర పీఠంమీద కూర్చుండబెట్టారు. మంగళాలంకార శోభిత అయిన ద్రౌపదీదేవిని అతడికి ఎడమ పక్కగా కూచోబెట్టారు. ముందుంచిన అగ్నిలో దేవయజ్ఞ తంత్రం పూర్తి చేశారు. శుభ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ పూజలో వున్న శంఖాన్ని తీసి ‘ఈ భూమికి రాజువు కమ్ము అని అంటూ ప్రీతితో ధర్మరాజును అభిషిక్తుడిని చేశాడు.

అప్పుడు ధృతరాష్ట్రాది ప్రముఖులంతా ఆయా కలశాలలోని పవిత్ర జలాలతో ధర్మరాజును అభిషేకించారు. ధర్మరాజు చక్రవర్తి పదవిని స్వీకరించి యోగ్యులైన వారికి దానాలు చేశాడు. ద్రోణుడికి, ద్రుపదుడికి, అతడి బంధువులకు, విరాటరాజుకు, అతడి జ్ఞాతులకు, కర్ణాభిమన్యులకు శ్రాద్ధ కర్మలు జరిపించాడు. ఉత్తర లోక క్రియలు జరిపించాడు. దుర్యోధనాదులకు అంతకన్నా గొప్ప వైభవంగా ధృతరాష్ట్రుడితో పరలోక క్రియలు చేయించాడు. ఉత్తర క్రియలు చేయడానికి తగిన వారసులు లేని రాజులందరికీ పరలోక క్రియలు జరిపించడానికి తన పురోహితుడైన ధౌమ్యుడిని నియోగించాడు. ధర్మరాజు అనేకమైన చలివేంద్రాలు, చెరువులు, దేవాలయాలు నిర్మాణం చేశాడు.  

ప్రజల ప్రశంసలకు కృతజ్ఞతలు చెప్పి ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని పునరుద్ఘాటించాడు. ప్రజలను, ధృతరాష్ట్రాదులను సముచిత స్థలాలకు పంపాడు. భీముడిని యువరాజుగా, వివేకానికి విదురుడిని, ఆదాయ వ్యయాలు తెలపడానికి సంజయుడిని, సైన్య వ్యవహారాలు, జీతభత్యాలు చూడడానికి నకులుడిని, శత్రు రాజ్యాలను ఆక్రమించడానికి అర్జునుడిని, పురోహిత కార్యాలకు ధౌమ్యుడిని, రాజ్య రక్షకుడిగా సహదేవుడిని నియమించాడు. ధర్మరాజు దుర్యోధనుడి భవనం భీముడికి, దుశ్శాసనుడి మందిరం అర్జునుడికి, దుర్మర్శణుడిది నివాసం నకులుడికి, దుర్ముఖుడి భవనం సహదేవుడికి కేటాయించాడు. ప్రధాన ప్రాసాదంలో ధృతరాష్ట్రుడు ఇంతకు ముందున్న ఇంట్లోనే అతడిని వుంచాడు. కృష్ణుడిని, సాత్యకిని అర్జునుడి ఇంట్లో వుండమని ఏర్పాటు చేశాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment