ధర్మమార్గానువర్తనం, ఉపేక్ష అనే ఐదో ఉపాయం,
యుద్ధనీతి గురించి చెప్పిన భీష్ముడు
ఆస్వాదన-100
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (19-12-2022)
మాంధాత అనే
మహారాజు ఏవిధంగానైతే జ్ఞానవంతుడై ధర్మాసక్తితో నడచుకొని సమస్త సంపదలతో వర్దిల్లాడో, అదే రీతిలో, ధర్మరాజు సహితం ప్రసిద్ధి పొందాలని భీష్ముడు ధర్మరాజుకు
ఉపదేశించాడు. అది విన్న ధర్మరాజు, ధర్మమార్గానువర్తనంతో ఏరీతిగా
ప్రఖ్యాతి పొందవచ్చో చెప్పమని భీష్ముడిని కోరాడు. ధన సంపాదనకంటే ధర్మాన్ని
సిద్ధింపచేసుకోవడం శ్రేష్టమని, ధర్మసిద్ధివల్ల సమస్త ప్రయోజనాలు
సిద్ధిస్తాయని, శాశ్వత కీర్తితో పాటు ఇహపర లోకాలలో సిద్ధి
కలుగుతుందని, ధనం కూడబెట్టడమే లక్ష్యంగా, ధ్యేయంగా భావించి ధర్మాన్ని
లెక్కచేయకపోతే, సంపాదించిన ధనం నాశనం కావడం కాకుండా రాజుకు దుష్కీర్తి, నరకప్రాప్తి లభిస్తాయని భీష్ముడు అన్నాడు. ఈ
విషయాన్ని అన్వయిస్తూ వసుమనుడు అనేరాజుకు,
వామదేవుడు అనే మహర్షికి మధ్య జరిగిన ప్రశ్నోత్తరాలను ఉదాహరించాడు.
ఈ సందర్భంగా
భీష్ముడు శుక్రాచార్యుడి అభిప్రాయం ఉదాహరిస్తూ,
సామ, దాన,
భేద, దండోపాయాలనే నాలుగు ఉపాయేలే కాకుండా ఉపేక్షా
భావమనే ఐదో ఉపాయాన్ని చెప్పి దాన్ని ప్రయోగించే తీరుతెన్నులను వివరించాడు.
ముల్లును ముల్లుతో తీసే తీరులోనే చూడాలని,
రాజులు తమకు ఆపదలు కలిగించే మంత్రుల అతిశయాన్ని తన నేర్పరితనంతో, ఆధిక్యంతో తొలగించాల్సి వుంటుందని, ఇదే సామ,
దాన, భేద,
దండోపాయాలనే నాలుగు కాకుండా ఉపేక్ష అనే ఐదో ఉపాయమని, ఇది శుక్రనీతి ప్రకారం కొనసాగిందని అన్నాడు భీష్ముడు. ధర్మరాజు కూడా
ఉపేక్షాభావం వహించే తీరును అనుసరించి రాజ్యపాలన చేయమని హితవు పలికాడు. అప్పుడు
ధర్మరాజు, శత్రువులను జయించే సందర్భంలో యుద్ధనీతి ఎలా
వుంటుందో చెప్పమని కోరాడు భీష్ముడిని.
ధర్మరాజు
సందేహానికి స్పందిస్తూ భీష్ముడు యుద్ధనీతిని ఉపదేశించాడు ఆయనకు ఇలా: ‘యుద్ధంలో
శత్రువు సైన్యాలతో సిద్ధమై ఎదుర్కొంటే నువ్వూ సైన్యంతో ఎదిరించాలి. శత్రువు
కయ్యానికి సిద్దమైతే నువ్వూ అసహాయ శూరుడిలాగా యుద్ధం చెయ్యాలి. మాయోపాయాలతో
శత్రువు యుద్ధం మొదలుపెట్టితే నువ్వూ కపటోపాయంతో ఎదిరించి విజయాన్ని సాధించాలి.
వెన్నిచ్చి పారిపోయే శత్రువును, శరణన్న వాడిని, వేరేవారితో యుద్ధం చేస్తున్నవాడిని చంపకూడదు.
అధర్మంగా శత్రువును చంపడం కంటే ధర్మయుద్ధవిహారంలో చావడం మంచిది. యుద్ధంలో
ఓడిపోకుండా జాగ్రత్త పడాలి. విషం పూసిన ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగిస్తే నరక
ప్రాప్తి కలుగుతుంది’.
భీష్ముడి పలుకులు
విన్న ధర్మరాజు, రాజధర్మం కంటే మరొక పాపకార్యం లేదని, ఏవిధంగా చూసినా రాజుకు నరక ప్రాప్తి తప్పడం
లేదని అనగా భీష్ముడు దానికి వివరణ ఇచ్చాడు. శరణాగతులను సంరక్షించి, యుద్ధంలో శత్రువుల బాధలకు గురైనవారిని తెచ్చి, వారికి తగిన సేవచేసి, బ్రాహ్మణులను పోషించి, అనేక యజ్ఞాలను నిర్వహించి, రాజు పాపాలను పరిహరించుకొనవచ్చునని చెప్పాడు.
రాజ ధర్మాన్ని అనుసరించి ప్రజాసంరక్షణ చేస్తే ఉత్తమ గతులు కలుగుతాయని అన్నాడు.
యుద్ధంలో వెనుదీయకుండా, పరాక్రమాన్ని ప్రదర్శించి ప్రాణాలు కోల్పోయినవారికి ఎలాంటి
ఉత్తమ లోకాలు కలుగుతాయో చెప్పమని అడిగాడు ధర్మరాజు. సమాధానంగా ఇంద్ర-అంబరీష సంవాదం
ఉదహరించాడు.
ఎన్ని
యజ్ఞయాగాలైనా యుద్ధయజ్ఞానికి సమానం కావని, పుణ్యాత్ముడు
కావడానికి శరీరం వదలిపెట్టాలని లేదని,
యుద్ధంలో సాహసోపేతంగా వెనుదీయకుండా పోరాడడమే చాలని, ఇది యుద్ధాచరణం వల్ల కలిగే పుణ్యమని, అనేక రాక్షస సమూహాలను చంపడం వల్లే ఇంద్రుడికి ఆ పదవి వచ్చిందని
అన్నాడు భీష్ముడు. వీరుడు మిక్కిలి పుణ్యవంతుడని చెప్పాడు. శూరులు ఏవిధంగా
పుణ్యాత్ములో భీష్ముడి ద్వారా విన్న ధర్మరాజు, పోరుకు పోవడానికి వీలైన కాల నిరూపణం
మొదలైన ఉపాయాలను తెలియచేయమని అడిగాడు.
జవాబుగా
భీష్ముడు ఇలా అన్నాడు: ‘వానలు పడేటప్పుడు, చలితో
వణికేటప్పుడు, బాగా ఎండలు కాసేటప్పుడు కాకుండా పంటలు పండే కాలంలో పగవారి మీదకు
దండెత్తిపోవాలి. పచ్చికా, కట్టెలు, నీరు దొరికే తోవలో దండును తీసుకుపోవడం మంచిది.
శత్రువులు కలవరపడే విధంగా జెండాలు,
కవచాలు, ఆయుధాలు అమర్చుకోవాలి. హోరెత్తించే శంఖాలు
వుండాలి. మంచి చర్మవాద్యాలు వుండడం ఉపయోగకరం. సైన్యం బసచేసే ప్రదేశం చదునైనదిగా
వుండాలి. వేగులవారిని పంపించి విరోధుల మార్గాలను గురించి తెలుసుకోవాలి. వారు
ముందుగా దండెత్తి వస్తుంటే ఎలాగైనా వారిని చంపేయాలి. నిద్రపోతున్నప్పుడూ, నీరు దగ్గరలో దొరక్క తపిస్తున్నప్పుడు, తినడానికి తిండి లేక అలసి పోయినప్పుడు, సైన్యం అంతా చెల్లా చెదరైనప్పుడు విరోధులను
మట్టుబెట్టడం అతి సులభం. ఎండ, చలిగాలి తక్కువగా వున్న రోజుల్లో
దండెత్తితే జయం తప్పక కలుగుతుంది’.
యుద్ధభటులు
ఎలాంటి వారైతే మంచిదని ప్రశ్నించాడు ధర్మరాజు. ఏనుగు వంటి బలం, పులి సింహాల లాంటి భీకరత్వం, చాకచక్యం కలవారు యుద్ధ భటులుగా వుండాలని, ఆయా దేశాలకు చెందిన వీరుల ప్రత్యేకతలను,
నేర్పులను బట్టి వారిని సేనలో చేర్చుకొని ఆయా రంగాలలో ఉపయోగించుకోవాలని
జవాబిచ్చాడు భీష్ముడు. అలాంటప్పుడు జయం సాధించే సేన లక్షణాలు ఏమిటని అడిగాడు
ధర్మరాజు. విజయం సాధించే సేన ఎప్పుడూ మంచి ఉత్సాహంగా వుంటుందని, వారి గుర్రాలు, ఏనుగులు విజృంభిస్తాయని,
ఇవే విజయ సూచకాలని అన్నాడు భీష్ముడు. విరోధుల విషయంలో ఎలా ప్రవర్తించాలని
అడిగినప్పుడు, పగవాడిని తుదముట్టించడానికి అదను కొరకు వేచి
వుండాలని చెప్పాడు.
సొంత బలగం
వల్లనో, ఇతరుల వల్లనో, రాజ్యం కూలిపోయి అగచాట్లు పడే రాజు తన బాధను ఎలా దిగమింగాలో
చెప్పమని ధర్మరాజు అడిగాడు భీష్ముడిని. రాజు ఎంతో శాంతంగా తన తక్కువ తనాన్ని
ఓర్చుకుంటూ పగవాడితో కలిసి, మెలిసి బతకాలని, సామంతరాజుల బలగాన్ని సంతరించుకొని, వాళ్ల ద్వారా శత్రువు మీద దండెత్తాలని, బలవంతులను కొలిచి వారి అండతో శత్రు స్థావరాలను
ఆక్రమించుకోవాలని, విషం పెట్టయినా, గారడీ చేసైనా. కయ్యానికి కాలు
దువ్వైనా సరే పగవాడిని దుంపనాశనం చెయ్యాలని,
ఎన్ని రకాల ఉపాయాలు ఆలోచించైనా శత్రువును పడగొట్టాలని భీష్ముడు అన్నాడు. ఇదంతా
జరిగిన తరువాత, అయిపోయిన దానిని గురించి విచారించి ప్రయోజనం
లేదని, కాబోయే వాటిని గురించి అమితంగా ఆశ పడకూడదని, దైన్యాన్ని దరిదాపులకు కూడా రానీయకూడదని, దైవం ఎలా నడిపిస్తే అలా నడవక తప్పదనే
నిర్ణయానికి రావాలని, రాజులకు జయాపజయాలు అనుభావ్యాలని, మద విషాదాలు అనాదరణీయాలని చెప్పాడు భీష్ముడు.
పరిజనంలోని
గణజనులను ఎలా ఏలుకోవాలో చెప్పమని కోరాడు ధర్మరాజు భీష్ముడిని. కోశాగారం నింపే
కోశాధికారులు, చాకచక్యంగా పనులను చక్కబెట్టే అమాత్యులు, ఆయుధధారులైన సైనికులు, మిగతా పనులు చేసే పరిజనం గణజనులవుతారని, పరిజనులు ఒకే తరగతికి చెందిన సామాన్యులని, రాజు
వీరితో కలసి మెలగుతున్నట్లు వుండాలని, వారికి శుభం కలిగించే ఉపాయాన్ని సిద్ధింపచేయడానికై
వారి తీరుతెన్నులను తెలుసుకోవాలని అన్నాడు భీష్ముడు.
‘ఈ గణం జనులు ఒక
తెగకు చెందిన వారైనప్పటికీ మంచి-చెడ్డలు లేనివారై, వారి-వారి తెలివిని పౌరుషాన్ని, గొప్పతనాన్ని లెక్కచేయరు. అందువల్ల ఎలాంటి
వారితోనైనా విరోధం పెట్టుకుంటారు. ఈ కారణంగా లోపల-లోపల విభేదాలు వస్తాయి. ఇది ఆసరా
చేసుకొని శత్రువులు చేరదీస్తారు. గణజనంలో ఇట్లాంటి మనస్పర్థలు ఏర్పడితే మూలగద్దెకే
ముప్పు వస్తుంది. కాబట్టి ఇదంతా రాకముందే వారందరినీ రాజు మంచి మాటలు చెప్పి,
దానధర్మాలు చేసి, గౌరవించి, ఆదరించాలి. వారిలో వారికి భేదం లేకుండా చూసి పనులు చక్కదిద్దుకోవాలి.
చీలికలు వస్తే మాత్రం మొదటికే మోసం వచ్చి రాజ్యం కుప్పకూలిపోతుంది. ప్రతి పనిలోనూ
గణజనులంతా ఒక్కటిగా వుంటే ఆ రాజు రాజ్యంలో సిరి తాండవిస్తుంది. కాబట్టి
గణవిధానాన్ని పని పెట్టుకొని శ్రద్ధగా పరిశీలించుకొంటూ వుండాలి.’ అని చెప్పాడు
భీష్ముడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయ-తృతీయాశ్వాసాలు
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment